ఒకనాటి సాయంత్రంవేళ గుంటూరునుంచి సాహితీవేత్త శ్రీ జె.బాపురెడ్డి(ఐ.ఏ ఎస్.) గారు జిల్లెళ్ళమూడి వచ్చారు. వారి నుదుట కుంకుమతిలకం దిద్ది, నూతన వస్త్రాలు ఇచ్చి, అరటిపండు ఆప్యాయంగా నోటికి అందించింది అమ్మ. ప్రేమగా తల నిమిరింది. బాపురెడ్డిగారి కన్నుల నుండి జాలువారుతున్న ఆనంద బాష్పాలతో అమ్మఒడి తడిసిపోయింది. “మాత అంటే మేత” అన్నారు బాపురెడ్డిగారు గద్గద స్వరంతో.
అమ్మకు ఎవరిని చూసినా బిడ్డే అనిపిస్తుంది. తన బిడ్డకు ఏదో ఒకటి తినిపించనిదే తనివితీరదు అమ్మకు. ఈ స్వభావం అమ్మకు పుట్టుకతోనే వచ్చింది. అమ్మ చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో ఇంటిలో అందరూ భోజనం చేసినా, బయటికి వెళ్ళిన రాఘవరావుమామయ్య (అమ్మకు అన్నయ్య) అన్నానికి రాలేదని అమ్మ ఎంతో బాధ పడింది. “తల్లికి ఒక్కబిడ్డ (అన్నానికి) రాకపోయినా దిగులే” అన్నది అమ్మ.
చిన్ననాటి నుంచీ అమ్మ ఆలోచన తన చుట్టూ ఉన్న వారి ఆకలిని గురించే. బాల్యంలో ఇంటిలో తనకు పెట్టిన ఆహారం తాను తినకుండా వీధిచివర బిచ్చగాళ్ళకు పెట్టి తృప్తిగా త్రేన్చేది అమ్మ. “మీరు తింటే నేను తిన్నట్టే”. “మీరు తినకపోతే చిక్కిపోతారు, నేను పెట్టుకోకపోతే చిక్కిపోతాను”, “అడగకుండా పెట్టేడే అమ్మ”, “మనిషికి అన్ని బాధలకంటే ఆకలిబాధే ఎక్కువ అనిపిస్తుంది నాకు” అని స్పష్టంగా ప్రకటించింది అమ్మ. “మీరు దేన్ని గురించి ఆలోచిస్తారు?” అని విలేఖరులు అడిగితే, “భోజనాన్ని గురించే” అని సమాధానం చెప్పింది అమ్మ.
“ఈ ప్రపంచంలో ఆకలిబాధ లేకుండా పోయే రోజు ఎప్పుడు వస్తుంది నాన్నా!” అని జ్యోతిష శాస్త్రవేత్తను అడిగినా, లక్షమంది తిని వెళ్లినా, “ఒక్కడు చాలదూ, తినకుండా వెళితే…” అని ఆవేదన చెందినా బిడ్డల ఆకలి తీర్చాలని నిరంతరం పరితపించే అమ్మస్వభావమే ఆ సన్నివేశాలలో కనిపిస్తుంది.
“ఆశ, అసంతృప్తుల కలయికే జీవితం” అని అమ్మ ఇచ్చిన నిర్వచనం చూసి, “ఆశ, అసంతృప్తి మీకూ ఉన్నాయా?” అని ఎవరో అడిగితే, “ఇంకా బాగా పెట్టుకోవాలనే ఆశ, పెట్టుకోలేక పోతున్నాననే అసంతృప్తి నాకూ ఉన్నాయి నాన్నా!” అని తన అంతరంగాన్ని ఆవిష్కరించింది అమ్మ.
బాల్యంనుంచీ అమ్మలో వ్యక్తమైన విశ్వమాతృత్వాన్ని దర్శించ గలిగితే, 1958 ఆగస్టు 15వ తేదీన అమ్మ “అన్నపూర్ణాలయం” ప్రారంభించటం హఠాత్సంఘటన కాదనిపిస్తుంది. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాలని పరితపించే అమ్మ ఆశయమే పరిణామ క్రమంలో “అన్నపూర్ణాలయం”గా రూపు దిద్దుకున్నదని తెలుస్తుంది. అంతరంగంలోని ప్రేమ ఆచరణలో సేవగా వ్యక్తం కావటానికే “అన్నపూర్ణాలయం” నెలకొల్పింది అమ్మ ఆ సుముహూర్తంలో.
“ఇది ప్రపంచానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు” అనీ
“ఇక్కడ అన్నం తినటానికి ఆకలే అర్హత” అనీ
“డ్రస్సుతో అడ్రస్సుతో నిమిత్తం లేదు” అనీ
అమ్మ చేసిన ప్రకటనలు సంచలనాత్మకమైనవే కాదు. సంస్కరణాత్మకమైనవి కూడా. కుల మత వర్ణ వర్గ విచక్షణ లేకుండా, ఏ హెూదాల భేదాలూ లేకుండా, ఆకలిగొన్న వారెవరైనా ఇక్కడ అన్నం తినవచ్చునన్న అమ్మ ఆశయం ఎంత విశాలమైనదో, అంత విశిష్టమైనది కూడా,
‘అందరింటి’ ని అతలాకుతలం చేసిన నక్సలైట్లను ఆకతాయి పిల్లలుగా దర్శించి ‘వారికి ముందు అన్నం ‘పెట్టండి’ అని చెప్పిన అమ్మ హృదయం మన అంచనాలకు అందుతుందా? గుణ భేదం కూడా లేని, అవధు లెఱుగని అమ్మప్రేమ అపూర్వం, అనన్యం కదా! ఈ ప్రేమ ఆచరణ రూపంలో వ్యక్త మయ్యే పుణ్యప్రదేశం
సర్వ సాధారణంగా ఆలయం అంటే ప్రతిష్ట చేసిన విగ్రహం, నిత్యమూ ధూప దీప నైవేద్యాలతో అర్చనలు ఉండాలి కదా! కోదండ రామాలయంలో కోదండ రాముడి విగ్రహం, వేణుగోపాల స్వామి ఆలయంలో వేణు గోపాలుడి విగ్రహం ఉన్నట్లుగా అన్నపూర్ణాలయంలో అన్నపూర్ణ విగ్రహం ఉండాలి కదా! కాని అటువంటి విగ్రహ ప్రతిష్ట ఏదీ చేయకుండానే “ఇది అన్నపూర్ణాలయం” అన్నది అమ్మ. అలా అనటంలోనే అమ్మ ఆశయం సుస్పష్టమవుతోంది. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టటమే అన్నపూర్ణాదేవికి అసలైన అర్చన అని చెప్పకనే చెప్పింది అమ్మ. పైగా ఆలయాలలో అర్చనలకు నిర్ణీతమైన వేళలు ఉంటాయి. కాని అన్నపూర్ణాలయంలో ఏ వేళలో అయినా అన్నం పెట్టాలనేది అమ్మ ఇచ్చిన సూచన.
“నిత్యాన్నదానం కాదు, నిరతాన్నదానం” అని అమ్మ చేసిన ప్రకటన మన కర్తవ్యానికి కరదీపిక. ఆకలే అర్హతగా అందరికీ అన్నం పెట్టే మహత్తర మైన అవకాశం మనకు అమ్మ ప్రసాదించింది. అన్నపూర్ణాలయంలో నిరంతరం సార్ధకమైన ఈ “అర్చన” జరగటానికి మనం పునరంకిత మవుదాం.
ఆశయమే ఆలయమైతే, ఆచరణే అర్చన కదా!
- మల్లాప్రగడ శ్రీమన్నారాయణ