“ఈశావాస్య మిదగ్ం సర్వం
యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుంజీథా
మా గృధః కస్య స్విద్ధనమ్”
అనే ఈశావాస్యోపనిషత్తులోని ప్రప్రథమ ఋక్కు భారతీయ సంస్కృతిని ఆధ్యాత్మికతను సనాతన ధర్మాన్ని వేనోళ్ళ చాటుతుంది. ‘ఈ ప్రపంచమంతా ఈశ్వరుడే. ఇందు త్యాగబుద్ధితో జీవించాలి. సృష్టిలోని సంపద యావత్తూ ఈశ్వరునిదే; వేరెవరిదీ కాదు. కావున పరధనమును ఆశింపకుము” అని అర్థం.
కాళిదాస మహాకవి రఘువంశ కావ్యంలో “త్యాగాయ సంభృతార్థానాం” అని శ్లాఘించారు; రఘువంశ చక్రవర్తులు రాజ్యపాలన, రాజ్య సంపదలను త్యాగబుద్ధితో నిర్వహించారు – అని.
శంకర భగవత్పాదులు ‘సౌందర్యలహరి’లో
“స్వకీయై రంభోభి స్సలిల నిథి సాహిత్యకరణం
త్వదీయాభి ర్వాగ్భిస్తవ జనని! వాచాం స్తుతి రియమ్”
“విశ్వజననీ! సాగర జలముతోనే సముద్రునికి తర్పణము విడిచినట్లు, నువ్వు ప్రసాదించిన వాక్కుతోనే నిన్ను స్తుతిస్తున్నాను” అని అదే సత్యాన్ని వివరించారు.
సృష్టిలోని సమస్త సంపద, శక్తి, తెలివి, ప్రయోజకత్వం, సాధన … సర్వం దైవానివే. వ్యక్తిగత సముపార్జిత ప్రజ్ఞ, ఆస్తి, ఐశ్వర్యం అనేది లేదు. అందరూ అన్నీ భగవద్దత్తమైన ఐశ్వర్యాన్ని, విభూతిని అనుభవిస్తున్నవారే – అనేది సారాంశం, పారమార్థిక సత్యం.
కాగా, అమ్మ కొంత వెసులుబాటు కల్పిస్తూ “నీకున్నది తృప్తిగా తిని, ఇతరులకు ఆదరంగా పెట్టుకో. అంతా ఆ శక్తి చేయిస్తున్నది అని నమ్ము” – అంటూ మూడు సూత్రాలను నిర్దేశించింది – ఏతదనుశాసనం అన్నట్లుగా. మాన్య సో॥ శ్రీ విఠాల రామచంద్రమూర్తి గారు ‘నీకున్నది’ అనే అమ్మ పదాన్ని ‘నీ కిచ్చింది’ అని అద్భుతంగా వివరించారు. అదే సబబు, అదే నిజం కూడా.
సకల సంపద భగవంతునిదీ, భగవద్దత్తమైనదీ అనే వాస్తవాన్ని విస్మరించి ‘నా కష్టార్జితం, నా స్వార్జితం’ అనే భ్రమలో పడ్డపుడు ఆత్మ విమర్శదిశగా ఒక ప్రశ్నవేసుకోవాలి – “ఇదే తెలివి, ఇదే ప్రజ్ఞ, ఇదే ఐశ్వర్యం సాటివారికి ఎందుకు లేవు?” అని. మూలానికిపోతే అద్వైతాన్ని మించిన కమ్యూనిజం లేదు.
ఇతః పూర్వం చర్చించుకున్న సంగతులకు ఒక ఉదాహరణాత్మక సందర్భం – ఒకసారి అమ్మ బంధువుల ఇంటికి చీరాల వెళ్ళింది. వెంట సో॥ రహి కూడా వెళ్ళాడు. అది చాల పెద్ద లోగిలి; విశాలంగా అందంగా అనేదే లేదు. ఉంది. తిరిగి వచ్చిన తర్వాత రహి అమ్మతో అదేమాట అన్నాడు, “అమ్మా! ఆ లోగిలి చాల బాగుంది. మనకి కూడా అంత పెద్దలోగిలి ఉంటే బాగుంటుంది” అని. అందుకు అమ్మ, “నాన్నా! అదేమిటి? అంత చిన్న కోరిక కోరావు. ఈ ప్రపంచమంతా మనదే. మనమే వాళ్ళందరికీ తలా కాస్త ఇచ్చాము; వాడుకోమని” అన్నది. ఇటువంటి సత్య స్ఫోరక వాక్యమే “నేనే మిమ్మల్నందరినీ కన్నాను; మీమీ తల్లులకు పెంపు డిచ్చాను” అన్న అమ్మ మహత్వ వాక్కు. “ఈశావాస్య మిదగ్ం సర్వం” అనే ఉపనిషద్వాక్యానికి అది సాకార రూపం కదా!
ఇపుడు ‘తేన త్యక్తేన భుంజీధా’ అనే వాక్యాన్ని తీసుకుందాం. కట్టెదుట ప్రకృతిలో “అసహాయ శూరులు – నిస్సహాయులు, అదృష్టవంతులు – దైవోపహతులు” అనే ఒక వైవిధ్యం గోచరిస్తుంది. వేదవాఙ్మయం, స్వామి, వివేకానంద, జగన్మాత అమ్మ… అందరూ ఆ అభాగ్యుల్ని “అమృతస్య పుత్రాః” అని సమ్మానించారు. (ఆస్తిక్య భావం) ఉన్నవాడు లేనివాడు, ప్రయోజకుడు అప్రయోజకుడు అనే జంటలు పరాత్పరి కవలపిల్లలే. దీనత్వం హీనత్వం కాదు, దైవత్వ రూపాంతరం అనే తాత్పర్యంతో వారిని యధాశక్తి అర్చించమని ఆర్షధర్మం శాసిస్తోంది. ‘నారాయణ స్వరూపాయ తుభ్య మిదం సంప్రదదే న మమ’ అంటూ దానం చేయాలట. వాస్తవానికి ‘దానం’ అనే పదం అర్థ (పరమార్థ) రహితమే. “అది దానం కాదు, వారి వస్తువుని వారికి ఇవ్వటమే” అని అమ్మ తేటతెల్లం చేసింది.
చివరిమాట. ‘యత్కించ జగత్యాం జగత్’ అనే వాక్యానికి ఒక ఉదాహరణ ఒకనాడు శ్రీ విఠాల రామచంద్రమూర్తి గారు “అమ్మా! నీకు కొంత డబ్బు ఇద్దామనుకుంటున్నాను” అన్నారు. అందుకు అమ్మ “ఇప్పుడు వద్దులే. నేను అడుగుతాను” అన్నది. అందుకు వారు “నువ్వు అడిగినప్పుడు నా దగ్గర ఉండాలి కదా!” అన్నారు. వెంటనే సర్వార్థసంధాత్రి అమ్మ “నీకు ఇచ్చే తీసుకుంటాను, నాన్నా!” అన్నది. అదే ఉన్నమాట, అసలు మాట. “ఎప్పుడైనా నేనే మీకు ఇవ్వవలసిన దాన్ని” అనే అమ్మ వాక్యం పై మాటకి వివరణ, ఈశావాస్యోపనిషత్సారం.
కావున సౌభాగ్యదేవత అమ్మ మనకి ప్రసాదించిన సంపద, జ్ఞానం, శక్తి సర్వస్వంలో కొంతభాగాన్ని ఒక పూజా పుష్పంగా అమ్మ శ్రీచరణాల మ్రోల సమర్పించి, అమ్మ ఆశయ సిద్ధికి – అమ్మ స్థాపించిన సేవా సంస్థల అభివృద్ధికి యథాశక్తి తోడ్పడదాం, కృతార్థులవుదాం. లక్ష్యంగా అమ్మ శతజయంతి ఉత్సవాలని వైభవంగా నిర్వహించుకుందాం.
– ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం