దేవతల మొరలు ఆలకించి, రాక్షసుల బారినుండి వారిని రక్షించటానికి లలితాదేవి అవతరించిందని పురాణాలు చెప్తున్నాయి. రాక్షస సంహారం సాగించి, దేవతలపని చక్కబెట్టిన లలితా దేవిని “దేవకార్య సముద్యతా” అని కీర్తించారు వ్యాస మహర్షి. ఆ తల్లినే శరన్నవ రాత్రులలో దుర్గ, కాళి, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, అన్నపూర్ణ, బాల, రాజరాజేశ్వరి వంటి పేర్లతో వివిధ రూపాలలో ఆరాధిస్తున్నాం మనం.
కశ్యప ప్రజాపతికి దితి, అదితి అని ఇద్దరు భార్యలు. దితికి పుట్టిన వారు రాక్షసులు. అదితికి జన్మించినవారు దేవతలు. వేర్వేరు తల్లులకు పుట్టిన ఒకే తండ్రిసంతానం దేవతలూ రాక్షసులూ.
ఏ పురాణం పుటలు తెరిచినా దేవతలకూ రాక్షసులకూ ఎప్పుడూ యుద్ధమే.
దేవతలూ రాక్షసులూ ఒకేతండ్రి బిడ్డలు అనేది ఒక సంకేతం. కోరలూ కొమ్ములూ కలిగినవారు రాక్షసులనీ, కిరీటాలూ భుజకీర్తులూ ధరించిన వారు దేవతలనీ అనుకోవటం ఏదో గుర్తుకోసం మనం ఏర్పాటు చేసుకున్న ఒక రూపకల్పన మాత్రమే. నిజానికి దేవతలూ రాక్షసులూ వేరువేరుగా లేరు. ఒకే వ్యక్తిలో భిన్న ప్రవృత్తుల రూపంలో దేవతా గుణాలూ రాక్షస గుణాలూ ఉంటాయి. అవి నిరంతరం సంఘర్షించు కుంటూ ఉంటాయి.
దైవారాధనతో మనలోని కూడని గుణాలను తొలగించు కోవాలని, మనలో దాగిఉన్న మంచి గుణాలను మనం పెంపొందించు కోవాలనీ మనకు చెప్పటానికే ఈ పురాణ కథలన్నీ.
అహింస, సత్యము, త్యాగము, కరుణ, సహనం, మృదు స్వభావం మొదలైన మంచి గుణాలను ‘దైవీ సంపద’గా, దర్పం, క్రోధం, మొండి పట్టుదల, పరుషత్వం మొదలైన కూడని లక్షణాలను ‘అసుర సంపద’గా వర్ణించటంలో ‘గీతా చార్యుని ఆంతర్యం కూడ ఇదే.
జిల్లెళ్ళమూడిలో ‘అమ్మ’ను లలితా స్వరూపంగా నమ్మి, విశేషంగా దసరాలలో ఇన్ని పేర్లతో పిలుస్తూ, ఇన్ని రూపాలలో కొలుస్తున్నాం మనం.
అమ్మ “దేవకార్య సముద్యత”. అయితే రాక్షస సంహారం అమ్మ కార్యక్రమం కాదు. మనలో దాగి ఉన్న రాక్షసత్వాన్ని రూపుమాపి, దివ్యత్వాన్ని మేలుకొల్పటమే అమ్మ అవతార ప్రణాళిక.
ఈ లక్ష్య సాధనకు అమ్మ ఎంచుకున్న ఉపకరణం ప్రేమ. ధర్మ విరుద్ధంకాని ప్రేమ అది. ‘తనది ప్రేమతత్త్వ మని పలికిన ఒక సోదరికి “నీది ప్రేమ తత్త్వ మయితే ధర్మాన్ని ప్రేమించు” అని ఉపదేశించింది అమ్మ.
“ప్రేమకంటే ధర్మం గొప్పది” అని నిష్కర్షగా నిర్ణయించింది.
“దైవత్వం అంటే నాలుగు చేతులూ కిరీటమూ కాదు”, “భిన్నత్వంలేని మనస్తత్వమే దైవత్వం” అని ప్రకటించింది అమ్మ. ఈ దివ్యత్వాన్ని తన బిడ్డల హృదయాలలో నెలకొల్పటం కోసమే అమ్మ అవతరించింది.
అమ్మ జీవిత సన్నివేశాలను పరిశీలిస్తే, బాల్యం నుంచే అమ్మలో ఈ స్వభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తన పులిగోరుగొలుసును అపహరించాలనుకున్న పోలీసులో పరివర్తన కలిగించినా,
తన నగలన్నీ అపహరించి, తనను సముద్రంలోకి విసిరి వేయా లనుకున్న జాలరికి పశ్చాత్తాపం కలిగించినా,
అదుపు తప్పిన ఒక ఎద్దు పాకీ పిల్లవాణ్ణి తొక్కివేయకుండా అతివేగంగా పరుగెత్తి, వాణ్ణి భుజాన వేసుకుని కాపాడి, అలాంటి భావనే ‘బ్రాహ్మణత్వ’మని పెద్దల ఆలోచనా లోచనాలను వికసింప చేసినా,
‘మెస్మరిజం’తో బాధలు పోగొడతానని చెప్పుకుంటూ కూడని విధంగా ప్రవర్తించే ఒక సోదరుణ్ణి “ఉపాసన ఇదేనా?” అని కాఠిన్యం ధ్వనించే గొంతుతో నిలదీసి, అతడి అంతరంగాన్ని మధించి, మంచిదారికి మళ్ళించినా,
పుట్టినింట ఉన్న భార్యకన్నుగప్పి దారితప్ప బోయిన అందరింటి ఉద్యోగి అయిన ఒక సోదరుణ్ణి మందలించి, అతణ్ణి సత్ప్రవర్తన దిశగా నడిపించినా,
తనను మోసగించి, తన సొమ్మంతా అపహరించిన లారీ డ్రైవరును క్షమించి, అతడికి కోర్టు విధించిన రుసుమును కూడా తానే చెల్లించి అతణ్ణి విడిపించే దివ్యగుణాన్ని సాధకుడైన ఒక సోదరునికి ప్రసాదించినా….. ఇవన్నీ ఎదుటి వారిలోని దుష్టత్వాన్ని సంహరించి, వారిలో దివ్యత్వాన్ని ప్రచోదనం చేసిన మహత్తర సంఘటనలే.
అమ్మ “జీవిత మహెూదధి”లో ఇలాంటి దివ్య ప్రేమ “తరంగాలు” ఎన్నో, ఎన్నెన్నో. అందరినీ తన ప్రేమామృత వాహినిలో ఓలలాడించి, వారిలో మానవత్వాన్ని నింపి చైతన్య వంతులను చేస్తోంది అమ్మ.
“శిక్ష అంటే క్రమశిక్షణలో పెట్టటమే” అనీ, మనిషిని కాక అతడిలోని కూడని “గుణాన్ని సంహరించటమే” ననీ, “దుష్టత్వ శిక్షణే గాని దుష్ట శిక్షణ కాద”నీ స్పష్టం చేసింది అమ్మ.
మనలో మసక బారుతున్న దివ్యత్వాన్ని ఉద్దీపింప చేసి, రాక్షస గుణాలను నిర్మూలించి, ఉదాత్త మానవులుగా మనను తీర్చిదిద్దటానికి అవతరించిన “దేవకార్య సముద్యత” అమ్మ.