సాధారణంగా దేవాలయాల్లో జలాభిషేకం, క్షీరాభిషేకం, ఫలరసాదులతో అభిషేకం, పంచా మృతాలతో అభిషేకం జరుగుతూ ఉంటుంది. కొన్నిచోట్ల అన్నాభిషేకం జరగడం కూడ ఉన్నది. కానీ ఇంతవరకు కనీవినీ ఎరుగని వినూత్నమైన విశిష్టమైన కార్యక్రమం జిల్లెళ్ళమూడిలో జరిగే ధాన్యాభిషేకం. ఇది ప్రత్యేకమైనదే కాదు, అమ్మ అన్నావతారానికి సంబంధించి ఔచిత్య సుందరమైనది కూడ. ఎందుకంటే అమ్మ అవతార కార్యక్రమం అంతా ధాన్యంతో మడిపడి ఉన్నది. ‘నీ రాశి ఏమిటమ్మా?’ అంటే ‘బియ్యపురాశి’ అన్నది అమ్మ. బియ్యానికి మూలం ధాన్యమే కదా! అలా చూసినా అమ్మకు ధాన్యానికి అవినాభావ సంబంధమే కన్పిస్తుంది. అమ్మకు ఆరాధ్య దైవం అయిన నాన్నగారి ఆరాధనోత్సవం నాడు ఫిబ్రవరి 17 న జరిగే ధాన్యాభిషేకం అమ్మ ఆశయానికి ఆచరణరూపం అయిన అన్నపూర్ణాలయ నిర్వహణకు ప్రధాన భూమిక అయింది.
తన బిడ్డలకు కడుపునిండా తృప్తిగా అన్నం పెట్టుకోవడం అమ్మకు ఇష్టమైన కార్యక్రమం. దానికి మాతృయాగం అని పేరు పెట్టింది. “నేను ఏం వెయ్యవలసి వచ్చినా గాడిపొయ్యిలోనే వేస్తాను” అన్న అమ్మ దృష్టిలో అన్నపూర్ణాలయ నిర్వహణే మహాయజ్ఞం. దానికి కావలసిన సామగ్రి ధాన్యం- హవిస్సులు. ఆ సామగ్రిని ఆ యజ్ఞానికి సమర్పించే సందర్భమే ధాన్యాభిషేకం. “నేనేం చేసినా మీ కోసమే” అని ప్రకటించిన అమ్మ తన బిడ్డల్ని ఉద్దరించటం కోసమే ఈ కార్యక్రమానికి ప్రేరణ ఇచ్చిందేమో అన్పిస్తుంది. ఒక విత్తనం భూమిపై చల్లితే ఎన్నో బస్తాల పంట చేతికి వస్తుంది. ఆ నేలతల్లికి బిడ్డలమీద అంత మమకారం. అడగకుండానే అన్నీ ఇవ్వడం తల్లి లక్షణం కదా!
ఆ భూమాతను నమ్ముకుంటే మనకు ధాన్యవృద్ధి కలిగినట్లుగా అవనియే అయిన అమ్మ పాదాలను ఆశ్రయిస్తే ‘భయా త్రాతుం దాతుం ఫలమపిచ వాంఛా సమధికం’ అని శ్రీ శంకరాచార్యులు స్తుతించినట్లుగా సర్వసంపదలు సిద్ధిస్తాయి. అమ్మ జీవిత చరిత్రను అవగాహన చేసుకున్న శ్రీ మన్నవ బుచ్చిరాజు శర్మగారు ‘అమ్మ కథే అవని గాధా! అవనే అనసూయమ్మ కాదా!’ అంటూ అమ్మకు అవనికీ అభేదాన్ని వర్ణించారు.
అమ్మ బాల్యంలో బాపట్లలో ఉన్నపుడు భావనారాయణస్వామి ఆలయంలో భూమిని గురించి తత్త్వ విచారణచేసి ఒక వివరణ ఇచ్చింది. “దేవునికి పూజచేసే కుంకుమ, పెట్టే సొమ్ములు, కట్టే బట్టలు, పెట్టే నివేదనలు వీటి పుట్టుక ఎక్కడ? అని ప్రశ్నించుకుని అన్నీ భూమినుండే, భూమే అన్నింటికీ ఆధారం అంటూ అవనియే ఆరాధ్యదైవం అన్న సమన్వయానికి వచ్చింది. మంచి, చెడు అన్నింటినీ భరిస్తూ అగ్ని పర్వతాలు తన గుండెల్లో దాచుకుని పైకి నిశ్చలంగా కనిపిస్తూ ఈ సర్వజగత్తుకూ ఆహారమిచ్చి పోషిస్తూన్న నిస్వార్థమూ పవిత్రమూ అయిన దివ్య జీవితం గల భూమిని ఆరాధించాలనీ, ఈ సృష్టిలోని అన్నింటికీ ఆధారం భూమి మాత్రమే అనే మౌలిక సత్యాన్ని తార్కికంగా వివరించింది అమ్మ. అంతేకాదు. తన గురించి కూడ ‘అమ్మ అంటే జిల్లెళ్ళమూడిలో మంచం మీద కూర్చున్న రూపమే కాదు. అంతులేనిది, అడ్డులేనిది, అన్నింటికీ ఆధారమైనది’ అని అన్నింటికీ మూలం తానే అన్న సత్యాన్ని ప్రకటించిన అమ్మయే అవని, అవనియే అమ్మ అనిపిస్తుంది. ఈ విధంగా భూదేవి స్వరూపిణి, ధనధాన్య వివర్ధినీ అయిన అమ్మ మనం ఏది సమర్పిస్తే దానికి ఇంతలంతలుగా ప్రసాదిస్తుంది అన్నది ఎందరికో అనుభవ సత్యం.
‘దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిం
గొలిచిన జనులర్పించిన నెలమిన్ రుచిరాన్నముగని యేను భుజింతున్’
అని అది ఏమయినప్పటికీ ఏ మాత్రం అయినప్పటికీ భక్తితో సమర్పిస్తే నేను స్వీకరిస్తాను అంటూ కుచేలుడు తెచ్చిన పిడికెడు అటుకులను అడ్డుపెట్టుకుని సకల సంపదలను ప్రసాదించాడు. శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, జ్ఞాన సంపద. తద్వారా మోక్ష సంపద కూడ ఇచ్చేది ఆ దైవమే.
ఆలయానికి వెళ్ళి ఏవో లౌకికమైన కోరికలు కోరి అవి నెరవేరితే మ్రొక్కుబడులు చెల్లించడం మానవ నైజం. ఇది స్వార్థదృష్టి. కానీ పదిమందికీ ఉపయోగ పడాలని ఏ కోరిక లేకుండా ధాన్యాభిషేకానికి సమర్పించడం పరమార్థ దృష్టి. ఈ యజ్ఞంలో మనలను భాగస్వాములను చేసి పరమార్థ దృష్టి అలవరచాలని అమ్మ ఆలోచన. ‘పంచనికి ఉండడం దేనికి?’ “నేను మీకు పెట్టడం మీచేత పెట్టించడం కోసమే” అంటూ దాతృత్వాన్నీ త్యాగగుణాన్నీ సంస్కారాన్నీ ధైర్యాన్నీ తృప్తినీ పెంపొందించి తన బిడ్డలందరూ పరిపూర్ణ మానవులుగా ఎదగాలని అమ్మ ఆకాంక్ష.
ఒక విధంగా ఆలోచిస్తే ‘ఏక క్రియా ద్వ్యర్థి కరీ’ అన్నట్లుగా మానవసేవ, మాధవసేవ సమ్మిళితమైన కార్యక్రమం ఇది. సాధారణంగా ఏ అన్నదానమో చేస్తే మానవసేవ అని అంటాం. వాస్తవానికి అది మాధవ సేవే అవుతుంది. అమ్మ నాన్నగార్లకు ధాన్యంతో అభిషేకం మాధవసేవ. ఆ ధాన్యాన్ని అన్నపూర్ణా లయంలో అన్న ప్రసాద వితరణకు వినియోగించడం మానవసేవ. అమ్మ దృష్టిలో లౌకికం వేరు, ఆధ్యాత్మికం వేరు కాదు. కనుక మానవసేవ మాధవసేవ వేరు కాదని ఈ ఉత్సవం ద్వారా అమ్మ తెలియపరుస్తోంది.
అందరి చేతులూ, అందరి చేతలూ ఇందులో ఈ పవిత్ర కార్యక్రమంలో మేమూ కలిస్తే సమర్పిస్తున్న ధాన్యపుగింజ ఉన్నది – అన్న సంతృప్తి కలుగుతుంది. ఆ తృప్తే ముక్తి. అది మనకు ప్రసాదించాలనేదే అమ్మ భావన.
కానీ తత్త్వార్థ దృష్టితో ఆలోచిస్తే అసలు ఇదంతా ఇచ్చింది ఎవరు? “ఎప్పుడయినా ఎవరికయినా ఏమయినా ఇవ్వవలసినదానిని నేనే” అని ప్రకటించిన అమ్మేకదా మనకు అనుగ్రహించింది – అన్నదా అమ్మే, వసుధా అమ్మే.
‘స్వకీయై రంభోభి స్సలిల నిథి సాహిత్య కరణం’ అని స్తుతించినట్లుగా సముద్రజలంలో నిలిచి ఆ నీటితోనే సముద్రునికి తర్పణం వదలినట్లుగా పంచదార గణపతిని చేసి బొజ్జగిల్లి ఆయనకి నివేదన చేసినట్లుగా అమ్మ ప్రసాదించిన దానినుంచి కృతజ్ఞతగా అమ్మకు సమర్పిద్దాం. నిరతాన్నదాన మహాయజ్ఞంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని అమ్మసేవలో చరితార్థుల మవుదాం.