శరన్నవరాత్రులలో లలితాదేవిని త్రికాల సంధ్యలలో అర్చించుకోవటం ఈ జాతిలో చిరకాలంగా వస్తున్న సంప్రదాయం. జిల్లెళ్ళమూడిలో కొలువుతీరిన అమ్మను లలితాస్వరూపంగా దసరాలలో అర్చించుకోవటం అందరింటి సోదరీ సోదరులకు దక్కిన మహదవకాశం.
లలితాదేవి “పంచకృత్య పరాయణ” అని వ్యాసులవారు పేర్కొన్నారు. సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము అనే ఐదు పనులు నిరంతరం నిర్వహిస్తోందని వివరించారు వ్యాస మహర్షి.
మన కంటికి కనిపించే ఈ ప్రపంచాన్ని ఒక చెట్టుతో పోల్చి చూసుకుంటే, విత్తనంలోనుంచి మొలక రావటం సృష్టి. ఆ మొలక మొక్కై, కొమ్మలు రెమ్మలతో, పుష్పఫలాలతో విస్తరించి మహావృక్షం కావటం స్థితి. కాలాంతరంలో క్రమంగా చెట్టు ఎండి మ్రోడయి, కనిపించకుండా పోవటం లయం. ఆ చెట్టు సారమంతా ఆ పండులోని విత్తనంలోకి చేరి ఉండటం తిరోధానం. మళ్ళీ కొత్త మొలక రావటానికి అనువుగా ఈ ప్రక్రియ అంతా జరగటం అనుగ్రహం అని అర్ధం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా లయం అంటే నశించటం కాదు, లీనం కావటం, కలసి పోవటం, కరిగిపోవటం అని మనం గుర్తించాలి. చిటికెడు ఉప్పు గ్లాసుడు నీళ్ళలో వేస్తే, కొద్దిసేపటికి ఉప్పునీరే కాని, ఉప్పు వేరుగా కనిపించదు. ఉప్పు లేకుండాపోలేదు. కనిపించకుండా పోయింది. ఉప్పులోని అణువణువూ నీటిలోని ప్రతి కణంలో కలసిపోయి కరిగిపోయింది. మళ్ళీ ఆ ఉప్పునీటిని వేడిచేస్తే, పైమూతమీద ఆ ఉప్పు స్పటికాలు స్పటికాలుగా పేరుకుంటుంది. ఈ విధంగా లయ కార్యక్రమాన్ని మనం అర్థం చేసుకోవాలి.
సృష్టి స్థితి లయాలు నిరంతరాయంగా సాగుతూ ఉంటాయి. ‘అనునిత్యం శరీరంలో వేలాది జీవకణాలు పుడుతూ, మనుగడసాగిస్తూ, సమసిపోతూ ఉంటాయి’ అని వైద్యశాస్త్రం తెలియచేస్తోంది. ఈ సంగతినే రుద్ర నమకం “సద్యోజాతం ప్రపద్యామి”- అనే ప్రార్ధనలో వివరిస్తోంది. ఆ ‘శక్తి’ నిత్యనూతనం.
‘సృష్టి’ని నిర్వచిస్తూ అమ్మ “రూపంలేనిది రూపం ధరించటమే సృష్టి”-అన్నది. అంటే నిరాకారమైన శక్తి సాకారం కావటమే సృష్టి కనుకనే “సృష్టికి రూపాంతరమే కానీ వినాశం లేద”ని అమ్మ స్పష్టం చేసింది. లయం: ‘చివరకు ఇదంతా ఏమవుతుందమ్మా?’ అని ఒకరు ప్రశ్నించారు. అందుకు పరమాద్భుతంగా అమ్మ- “దేనికి చివర? ఎక్కడికి చివర? సృష్టికి ఆద్యంతాలు లేవు” అని వివరించింది. అంతేకాదు.
‘లయ, ప్రళయం’ అనే పదాల్లో ‘ప్రళయం’ పరంగా చోటుచేసుకున్న అపార్థాలనూ మూఢనమ్మకాలనూ ఖండించి సత్యసందర్శనం ప్రసాదించింది.
“ప్రళయం అంటే ఏమీ లేకుండా పోవటం కాదు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కచోట మార్పు. అందరూ లేకుండా పోరు, అంతా ఒక్కసారిగా ఎప్పుడూ పోదు. ప్రళయ మంటే పరిణామమే”- అని.
అమ్మ స్థాపించిన ప్రజాహిత సంస్థలు సంజ్ఞాత్మకంగా సారభూతంగా పంచకృత్యాలను సుబోధకం చేస్తాయి:
- సృష్టి:- శ్రీ అనసూయేశ్వరాలయంలో గర్భాలయ కుడ్యాలపై ‘మాతృగర్భస్థ శిశురూపాల’ను దర్శిస్తే- సూక్ష్మరూప బీజం మార్పులు చెంది శిశువుగా పెరగటం – గోచరిస్తుంది. నిజానికి అక్కడే స్థితి(పోషణ) కృత్యం మొదలు అవుతోంది
- స్థితి:- అన్నపూర్ణాలయం. విద్యాలయం, వైద్యాలయం, ఆదరణాలయాలు వ్యక్తి వికాసానికి మూలాలు.
- లయం:- సుగతిపథం, “సముద్రంలో అలలేచి మళ్ళీ కలిసిపోయినట్లే మీ జన్మలూను. నా సంకల్పంతో మీరు జన్మఎత్తి నాలోనే లయం అవుతారు.”- అనే అమ్మ ప్రకటనకు అది సాకారరూపం,
- తిరోధానం, అనుగ్రహం: ఇవి భౌతిక నేత్రాలకి కనుపించవు. హైమాలయం, అనసూయేశ్వరాలయాలు ఈ కృత్యాలకు నిలువెత్తు రూపాలు.
“నేను సర్వ సృష్టి కారిణిని” – అన్నది అమ్మ.
ఒకనాడు అమ్మ తాను ‘విశ్వరూప’, ‘బ్రహ్మాండ భాండోదరి’ అని చెప్పకనే చెప్పింది. తన పొట్టను ఆయా ప్రదేశాల్లో చేతితో సూచిస్తూ సోదరులు రాచర్ల లక్ష్మీ నారాయణగారితో ఇది ఆఫ్రికా, ఇది ఆస్ట్రేలియా, ఇది అమెరికా….” అంటూ గ్లోబులో చూపిస్తున్నట్లు వలె వివరించింది.
మరొక్క మాట, అవతారమూర్తి అమ్మ ఆవిర్భావాన్ని సూత్రప్రాయంగా అధ్యయనం చేస్తే- అనంతశక్తి పరిమితరూపంలో దిగిరావటం సృష్టి పరిమితరూపాన్ని త్యజించి అనంతశక్తిగా మహాభినిష్క్రమణం చేయటం- తిరోధానం అనిపిస్తుంది.
సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలను నిర్వహించే లలితాదేవి ఈ యుగంలో అర్కపురిలో అమ్మగా అవతరించిందని, మనను చరితార్థులను చేస్తోందని మనందరి విశ్వాసం. ఎందరికో అనుభవం.