1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సంపాదకీయం.. (మాతృవేదం – 2)

సంపాదకీయం.. (మాతృవేదం – 2)

Magazine : Viswajanani
Language :
Volume Number :
Month :
Issue Number :
Year :

వేదం అంటే ఏమిటో, మాతృవేదం అంటే ఏమిటో క్రితం నెల సంపాదకీయంలో సూక్ష్మంగా తెలుసుకున్నాం. లక్ష్యలక్షణ సమన్వయం చేసుకున్నాం కొంతవరకు. మనకోసం, మన యోగక్షేమాల కోసం భగవంతుని అనుగ్రహంతో అందిన అలౌకిక శబ్దరాశియే ద అని సాయణ్యాచార్యులవారు వివరించారు.

మనకు ఇష్టమైన విషయాన్ని సాధించటం, ఇష్టం లేని లేదా మనకు నష్టాన్ని కలిగించే విషయాలను తొలగించుకోవటం కోసం అలౌకికమైన ఉపాయాన్ని తెలియచేసే అక్షరరాశిని వేదం అన్నారు. లౌకికమైన నష్టాలు కావచ్చు, పారలౌకికమైన ఇబ్బందులు కావచ్చు, దేనికైనా పరిష్కారం వేదం చెబుతున్నది.

‘అనుభవ వేదాంతనిధులు మాతృశ్రీ సూక్తి సుధలు’ అని చిన్నప్పుడు వ్రాసుకున్నాను అమ్మ చెప్పిన మాటలు చూచి- ‘అమ్మ చెప్పిన ఇచ్చిన శబ్ద ప్రసాదం విన్నా తిన్నా అవి వేదంలోని ఒక్కొక్కపన్నా’ అని ఇంకొక చోట చెప్పుకొన్నాను. అమ్మ తన అనుభవంలో నుండి సందర్భవశాన మనకు చెప్పినవి మన అనుభవంలోకి వచ్చేసరికి ఎంతలోతులకు వెళ్ళి చెప్పిందబ్బా అని ఆశ్చర్యపోతున్నాం, దిమ్మెరపోతున్నాం.

భగవంతుని నిశ్వాసగ వెలువడిన వేదరాశిలాగానే అమ్మ వాక్యాలరాశి అమ్మ నిశ్వాసంలోంచి వెలువడ్డవేగాక అనుభవంలో నుండి వచ్చినవి, వచ్చేవి. మేమడిగే ప్రశ్నలకు నీకు సమాధానాలు ఎట్లా తోస్తయ్యమ్మా ? నీవేం చదువుకోలేదు కదా ? అంటే మీరడిగిన ప్రశ్నలో నుండే సమాధానం వస్తుంది. అని అసంకల్పితంగా వాటికి సమాధానాలు చెప్పేది.

వేదమే ప్రమాణం అన్నింటికీ. ప్రమ అంటే యథార్ధజ్ఞానము. తనకు తానే ప్రమాణం వేదం. ఇక్కడ అమ్మ చెప్పే మాటలకు కూడా తానే ప్రమాణం. తన అనుభవంలో నుండే ఆ వాక్యం ఎలా ఎప్పుడు ప్రభవించిందో చెప్పేది. వేదంలో చెప్పబడ్డవి తమకు తామే ప్రమాణం కనుక వానిని ప్రశ్నించరాదు. అవి ఆజ్ఞాపించటమే. ఇక్కడ అమ్మ వద్ద అలాకాదు, తర్కానికి నిలబడతవి. వేదంలో నుండి కొంతనేర్చుకున్నా ఋణవిముక్తుల మౌతాము. వేదాన్ని అధ్యయనం చేయటం స్వభావశిక్షణం. వేదంలో చెప్పింది చేయటం స్వభావ రక్షణం. వేదంలో ప్రజల కుపయోగించే చాలా సేవా కార్యక్రమాలు చెప్పబడ్డాయి. అలా చేస్తే ఋషి ఋణం వేదఋణం తీర్చుకొన్నట్లే. మనం పుడుతూనే మూడు ఋణాలతో పుడుతామని యజుర్వేదం చెప్పింది. ఋషిఋణం, దేవ ఋణం, పితృఋణం అని ఉన్నాయి. బ్రహ్మచర్యం ద్వారా ఋషిఋణమూ, యజ్ఞం చేయటం ద్వారా దేవ ఋణమూ, సంతానాన్ని కనటం ద్వారా పితృ ఋణమూ, తీరుతాయిట.

బ్రహ్మచర్యమంటే పెళ్ళి చేసుకోకుండా ఉండటం అంటారు కొందరు. వైదిక సాహిత్య అధ్యయనం చేయటం అంటారు శాస్త్రజ్ఞులు. కాని అమ్మ చెప్పింది “బ్రహ్మచర్య మంటే కేవలం పెండ్లిచేసుకోకపోవడం కాదు, లింగభేదము, రూపభేదము, స్పర్శభేదము లేకుండా ఉండటం. అయినా, పురుషుడయినా ఏది జరిగినా చలించని స్థితి ఉండాలి. బెల్లంతింటున్నా ఆ రుచి జిహ్వ గ్రహిస్తున్నా చలించని స్థితిలా ఉండాలి. శరీరం అంటుకోకుండా ఉండటమే ప్రధానమా ? మనస్సుకంటుకోవటం కాదా ? మనస్సులో బ్రహ్మచర్య స్థితి ఏర్పడనిది, మనస్సు క్షాళనం కానిదీ, శరీరాన్ని జాగ్రత్త పెట్టినంత మాత్రాన బ్రహ్మచర్య మౌతుందా? అన్నది. కనుక బ్రహ్మచర్యం అంటే నిరంతరం, బ్రహ్మయందు చరించడం అంటే జాగృతుడై ఉండటమే. అప్పుడే ఋషి ఋణం తీరుతుంది.

ఇక దేవ ఋణం. యాగాలరూపంలో చేసే దేవతారాధాన భగవదారాధన ద్వారా దేవ ఋణాన్ని తీర్చుకోవచ్చు. భగవత్సేవ అంటే జీవకారుణ్యంతో, దానధర్మాలను ఆచరించడం ద్వారా ఋణవిముక్తులు కావచ్చు. ఈ సమాజం – సృష్టి భగవత్స్వరూపమే గదా! సమాజసేవద్వారా దేవఋణం తీర్చుకోవచ్చు. అసలు యజ్ఞము అంటే ఏమిటి? ఏదైనా శ్రద్ధతో చేసేది. దేవయజ్ఞమే. నామయజ్ఞము, భాగవత యజ్ఞము, సత్రయాగము ఇలాంటివన్నీ ఆ కోవకు చెందినవే. అమ్మ అన్నయజ్ఞం ప్రారంభించింది. జిల్లెళ్ళమూడిలో గాయత్రీ యాగం జరుపుతూ పూర్ణాహుతి సమయానికి అమ్మను రమ్మన్నారు. అమ్మ నేనేం వేసినా గాడిపోయిలోనే వేస్తాను అన్నది. అంటే ఆకలిగొన్న బిడ్డలకు అన్నం పెట్టుకోవటమే అమ్మ చేసిన మాతృయజ్ఞం. ఈ యజ్ఞంలో మనందరినీ భాగస్వామ్యులను చేసింది ఆ రకంగా మనమందరం దేవ ఋణం తీర్చుకున్నట్లే.

ఇక పితృఋణం. కేవలం సంతతి కనడం ద్వారానే పితృఋణం తీరదు. తన ధర్మాన్నీ, సంప్రదాయాన్నీ తన తదనంతరం కూడా కొనసాగించే సంతానాన్ని జాతికి అందించటం వల్లనే పితృఋణం తీరుతుంది. అంతేకాదు, “తల్లి దండ్రి మీద దయలేని పుత్రుండు – పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా ! గిట్టవా! విశ్వదాభిరామ వినురవేమ!” అన్నాడు వేమన్న. అందుకే అమ్మ – తల్లీ తండ్రిని మించిన దైవాలు లేవన్నది. ఇంకాస్త ముందుకు పోయి భార్యకు భర్తే దైవం. ఆయనను ఆరాధిస్తే చాలన్నది. అంతేకాదు భార్య కూడా భర్తకు దేవతే నన్నది. రోగికి వైద్యుడు నారాయణుడైతే వైద్యుడికి రోగి కూడా నారాయణుడే నన్నది. చివరకు మీరంతా దేవతలే నన్నది. దైవం కానిది ఏదీ లేదు అన్నది. ఉన్నదంతా అదే అన్నది. అంటే ఆ స్థితినే అమ్మ మనలో పాదుకొల్పటానికి ప్రయత్నించింది.

ఈ పై మూడు ఋణాల నుండి విముక్తులు కావడం అంటే కర్మబంధం నుండి విడుదల కావడమే. అమ్మ-తృప్తే ముక్తి అన్నది. భ్రమ వదిలితే బ్రహ్మమేనన్నది. స్వస్వరూప సంధానం అని శాస్త్రాలలో చెప్పేది ఇదే – మనకింత విజ్ఞాన సంపద నిచ్చిన పూర్వుల పట్ల కృతఘ్నులం కాకుండా కృతజ్ఞులమై ఉంటే చాలు. అపుడు లక్షణశుద్ధి లక్ష్యశుద్ధి ఏర్పడి ఋణవిముక్తులమౌతాము.

మనం మంత్రపుష్పం చదువుతూ ‘య ఏవంవేద’ అని పదేపదే పలుకుతుంటాం అంటే ఏమిటి ? ఎవడైతే ఇలా తెలుసుకుంటాడో అని అర్థం. అంటే వేదంలో చెప్పింది తెలుసుకున్నవాడు అని అర్థం. వేదం అంటే పూర్వం తెలిసింది. తెలుసుకొన్నాం కొంత. ఉనికి, జ్ఞానము, విచారణ, లాభములను ప్రసాదించేది వేదము. మన ఉనికిని తెలియచేసేది. అమ్మ మీరు కానిది నేనేమీ కాదు. మీరు నా అవయవాలు అన్నది. అంటే అమ్మ శాశ్వతము, మనమూ శాశ్వతము. సృష్టిలో పరిణామమే కాని నాశనం లేదన్నది అందుకే – అంటే మనలో భగవంతుడున్నాడు, మనం భగవంతునిలో ఉన్నాము. భగవంతుడు మనమూ వేరు కాదు. అమ్మ చెప్పిన మాట పాలలో నుండి పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి వేరుగా కనిపించినట్లు మాత్రమే అంటే మన ఉనికి శాశ్వతము – ఇక జ్ఞానము – సత్యం. జ్ఞాన మనంతం బ్రహ్మ అని వింటుంటాం. జ్ఞానము అంటే పరమాత్మలక్షణము. బ్రహ్మ యొక్క సత్తను చెప్పేది జ్ఞానము, అమ్మ రెండుగా కనబడటం అజ్ఞానం భిన్నత్వం లేనిది ఏకత్వం. నేను చేస్తున్నాననుకొనేది మానవత్వము. వాడు ఇస్తున్నాడనేది జ్ఞానం అన్నీ తానైనది దైవం. సర్వమూ ఏదో ఒక శక్తి నడిపిస్తున్నది మనం కాదు కర్తలం అనుకున్నది జ్ఞానం. సర్వాన్నీ తెలుసుకున్న తెలివే జ్ఞానం. కనిపించేదంతా దైవం అనుకోవటమే జ్ఞానం. ఉన్నది ఉన్నట్టుగా అర్ధం చేసుకోవటమే జ్ఞానం. సార్వకాలికమైన కాలదేశాలను బట్టి మార్పు చెందే విధినిషేధాలను విచారించి కర్తవ్యాన్ని ఉపదేశించడం వేదజ్ఞానం. అందువల్లనే క్రియాత్మకమైన ధర్మాన్నీ, జ్ఞానాత్మకమైన బ్రహ్మనీ బోధిస్తుంది విచారణే – ఇక చివరికి.

అమ్మ ప్రతిదీ విచారిస్తుంది. ఒక చొక్కా ధోవతి ఆలోచన వస్తే, చొక్కా దారం నుండి, దారం పత్తి నుండి, పత్తి భూమి నుండి ఇలా దాని మూలాలకి వెళ్ళి విచారిస్తుంది. ఏదైనా అమ్మ చేసే విచారధార గ్రహిస్తే ‘అసలు’ తెలిసినట్లే – ఇక చివరిది లాభము. స్వస్వరూప లాభాన్ని పొందించేది వేదం. ఆత్మను తెలుసుకొనే తనకంటే భిన్నంగా ఏదీ లేదు అని తెలుసుకొనే జ్ఞాన లాభాన్ని  ప్రసాదించేది వేదం.

మానవుడు వేదాలలో చెప్పిన ఋషి ఋణం, దేవ ఋణం, పితృఋణం ఎలా తీర్చుకోవచ్చో వేదం ఉనికి, జ్ఞానము, విచారణ, లాభములను ఎలా మనకు ప్రసాదిస్తుందో ఈ చెప్పిన వానిని అమ్మ తన అనుభవంతో ఎలా మనల్ని అతితేలికగా సులువుగా తీర్చిదిద్దిందో మనకు తెలిసింది. 

ధర్మార్థ కామమోక్షాలనే నాలుగు పురుషార్థాలను కూడా ఇచ్చేది వేదమే. పురుషార్థాలను ప్రతిమానవుడు సాధించాల్సిందే. పురి శేతే ఇతి పురుషః అని శాస్త్రం చెపుతున్నది. పురుషుడు అంటే పురి = శరీరమునందు శేతే అంటే నివసించేవాడు. విచిత్రమేమిటంటే ధర్మార్థాలు – కామమోక్షాలు అని రెండు జంటలు. అర్థం మొదటిదైన ధర్మాన్ని అనుసరించి, కామం తరువాతి దైన మోక్షాన్ని అనుసరించి ఉండాలి. ఇక పురుషుడు అనేది మనం మామూలుగా అనుకొనే మగవాడు అని అర్థం కాదు. ఇక్కడ లింగవివక్షలేదు. స్త్రీ పుం విభేదం లేకుండా అందరూ పురుషులే. అందరిలో ఉన్నది జీవుడే – దేవుడే – అందుకే అమ్మఅన్నది. “నాకన్నా పురుషుడెవరురా?” అని. నిజం. అందరిలో ఉన్నది తానే అన్న విషయం అమ్మకు తెలుసు. మనకు తెలియదు. అందువల్ల ఆమె దేవుడు మనం జీవులము అయ్యాం. 

ధర్మం ఆచరించాలి ? ఏది ధర్మం? ఎట్లా ఆచరించాలి, అమ్మను అడిగితే, అమ్మ “మన శాస్త్రాల్లో ధర్మాలన్నీ చెప్పబడే ఉన్నాయ్ నాన్నా ! అవి ప్రతి మానవునకూ కొన్ని పనులు నిషేధించాయి. కొన్నింటిని శాసించాయి. కాని ఎవరూ నిషేధించిన వాటిని మాను కున్నది లేదు. శాసించిన వాటిని ఆచరిస్తున్నదీ లేదు. అంటే విధి నిషేధాలను పట్టికాదు మానవుడు ఆచరి స్తున్నది. ఏది అవసరమో అది ఆచరిస్తున్నాడు. అంటే మనిషిని అవసరమే నడుపుతున్నది. అవసరమే విలువైనదని పిస్తున్నది నాకు” అని చెప్పింది. అర్థం అంటే ధనం. ధనం ధర్మమార్గంలో సంపాదించాలి ధర్మమార్గంలో ఖర్చు పెట్టాలి. తినేవాడు లేకపోతే ఎవరికి పెడతావురా ? అన్నది అమ్మ. కామం అంటే ఏమిటి ? ఇది కావాలనే కోరిక. అది ముదిరితే ఆశ. ఆశ జీవితమనే పుష్పానికి మొగ్గలాంటి అన్నది అమ్మ. కోరికలేని స్థితి రావటం అంటే మనస్సు ఆ స్థితికి వస్తే అంతకంటే కావల్సిందేముంది? ఆ ఒక యువకుడు ఒక యువతితో పిచ్చిప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయికి జబ్బు చేసింది. వైద్యుడు తల్లి గుండె తెమ్మంటే తీసుకొని వెళ్ళుతూ ఎదురురాయి తగిలి బోర్లా పడ్డాడు. భద్రం బాబూ! అన్నది తల్లి గుండెకాయ. తల్లి కొడుకు కోసం తనను సమర్పించుకొన్నది. కొడుకు కామానికి లొంగిపోయాడు. తల్లిధర్మంతో మోక్షాన్ని సాధించింది. కొడుకుకు ఆ స్థితి ఎప్పటికో – అమ్మ తృప్తే ముక్తి అన్నది. అంటే ఇంక ఇది కావాలనే కోరిక లేకపోవటమే ఏది చేస్తున్నా  అన్నింటిలో తృప్తి కలిగితే ముక్తి.

భగవంతునికి సమర్పణ భావంతో చేసేదంతా యజ్ఞమే నన్నది అమ్మ. “పూర్వం చెప్పనిదీ నేను కొత్తగా చెపుతున్నదీ వేరుగాలేదు. చెపుతున్న తీరువేరుగా ఉండవచ్చు. అంటూ “శాస్త్రవిధితో చేస్తేనే యజ్ఞమవుతుందా? మనస్సు ప్రధానం కాదా? షోడశోపచారాలు చేస్తూ మనస్సును ఇంకొక చోట అమ్ముకొని ఉంటే శాస్త్రవిధ్యుక్తమైన యజ్ఞం ఔతుందా? బొట్టు పెట్టుకొని విభూతి పూసుకొని అందరూ ఒకేసారి స్తోత్రం చేయకపోవచ్చు. శేషయ్యగారు, భాస్కరరావు, తాతయ్య అమ్మపై మనసు పెట్టుకొనే పనుల చేసేది. వీరు మనసు అర్పించి చేస్తున్నారని ఇతరుల కెల్లా తెలుస్తుంది? గజేంద్రమ్మ హోటలులో ఉన్నా మనస్సు ఇక్కడే. వసుంధర కాఫీ కప్పులు కడగడం తెలుస్తుంది. కాని మనస్సు అర్పించిందని తెలియదు కదా! సాధారణంగా అందరి దృష్టికీ చేసే పనిని బట్టి ఉద్దేశాన్ని భావిస్తారు. భక్తి ఉండబట్టే చెయ్యటం. ఏది చేసేవాడి కదే సుప్రభాతం. శారదాంబ 24 గంటలూ నీళ్ళు కాస్తూనే ఉంటుంది. చూచేవాళ్ళు విధి నిషేధాలు ఇక్కడలేవు అనుకుంటారు. ఇక్కడ ఉండేవారికి ఇది నాది అని అందరికీ లేకపోవచ్చు. 1.11.62న వచ్చిన రామకృష్ణ నాది అని దిగాడు. వాడికి సహజంగా ఉంది ఆ భావం. విసుగు ప్రతి మనిషికీ రావచ్చు. దీన్ని మనం వదలి వెళ్ళకూడదు అనిపించడమే మనస్సును అర్పించటానికి గుర్తు” … పైవాళ్ళంతా యజ్ఞం చేసిన వారే. 

అమ్మ చెప్పినట్లు “మీరు రావటం కాదు నేను రప్పించుకోవటమే. తల్లిధర్మం కాదు. ధర్మమే తల్లి. సర్వత్రా ఉన్న తల్లిని తెలియచేయటానికే ఈ తల్లి రాక” అని అమ్మ తన వేదమాతృత్వాన్ని స్పష్టంగా చేసి చెప్పింది. మనల్ని దగ్గరకు తీసుకొన్నది. ఈ సంస్థ నాది అని మనందరం అనుకుందాం. మన తను మన ధనాలను సమర్పిద్దాం..

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!