శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనోద్ధరణ సందర్భముగా
‘బాలుం డీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా
జాలండో యని దీని క్రింద నిలువన్ శంకింపగా బోల దీ
శైలాంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పై బడ్డ నా
కేలల్లాడదు బంధులార నిలు డీ క్రిందం బ్రమోదంబునన్’ అంటూ ఒక్కచేతి మీదుగా గోవర్ధన పర్వతాన్ని లీలగా అవలీలగా ధరించి బంధుమిత్రులు గోవులు గోపబాలురు అందరికీ వారం రోజులపాటు ఆశ్రయమిచ్చి ఆదుకున్నాడు. –
ఆ విధంగా లోక కళ్యాణ కారకములైన అవతారమూర్తుల చేతలు మహిమాన్వితములు, అగ్రాహ్యములు. ఆ అద్భుత సన్నివేశాలు లీలలుగా జనావళిని ఆనంద ఆశ్చర్యాలతో మైమరపిస్తాయి. కాగా వాటి అర్థం, పరమార్థం తెలియదు. జగజ్జననిగా సర్వారాధ్య అయిన అమ్మ పరంగా చూస్తే –
అమ్మ దర్శనం ఇస్తోంది; అనంతశక్తి పరిమిత రూపంగా కట్టెదుట నిలిచింది. ఆ భాగ్యాన్ని పొంది అవ్యక్తానంద సాగరంలో ఓలలాడుతాము. అంతకు మించి తత్వతః అర్థం కాదు కదా! అమ్మలోని అలౌకిక అవ్యాజ మాతృప్రేమే దైవత్వం అని అర్థం కావటం లేదు. చరాచరాత్మకమైన – నిఖిల జగత్తుకు మాతృమూర్తి అమ్మ – అని మాటలలో అంటాం, కానీ త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తున్నామా? ‘భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమ’- అంటూ ఈ వాస్తవాన్నే వేదం అభివర్ణిస్తోంది.
15-8-58 న గాడిపొయ్యిని రాజేసి అన్నపూరాలయాన్ని స్థాపించింది. ప్రపంచంలో ఏ ఒక్కడూ ఆకలితో ఉండరాదు అనే మహత్సంకల్పం దాని ప్రాదుర్భావానికి మూలం. ఆ సంగతి అమ్మ చెపితే కానీ తెలియదు కదా మనకి!
అసలు అమ్మ ఎవరు? అమ్మ లక్ష్యం, అమ్మ తత్త్వం ఏమిటి? మనం తెలుసుకోలేమని స్వయంగా కృపతో వివరించింది. తను “రాగ ద్వేషాసూయలను పారద్రోలే అనసూయ” ననీ; “తరింపజేసే తల్లి” – ననీ సూటిగా స్పష్టం చేసింది. ఇంతకంటె గొప్ప వరాన్ని, ఆశీస్సుల్ని ఏ అవతారమూర్తి వర్షించినట్లు కనిపించదు. తీవ్రమైన తపస్సు, కఠోరమైన జపతపాదులు సాధ్యం కాని దీనులపై కనికరించి అరిషడ్వర్గాలని రూపుమాపి, మనో మాలిన్యాలను క్షాళనం చేసి, జనన మరణ భయ దుఃఖ నివృత్తి చేసి, దాటిస్తాను – శాంతిని హాయిని ప్రసాదిస్తానని చాటింది. ఆ తత్త్వం అక్షరశః బోధ పడుతోందా?
“సృష్టిలో జడం అన్నది లేదు; అంతా చైతన్యమే, సజీవమే” అని అద్భుతంగా ఒక వాస్తవాన్ని చాటింది. ఈ సత్యాన్ని Modern Physics అంగీకరించింది. అలా మన కళ్ళకి కనబడుతోందా? ఒక క్షణం ఔనని, మరుక్షణం కాదని అనిపిస్తుంది.
అమ్మ శరీరం పాంచ భౌతికమైనది కాదు, పంచభూతాలను జయించినది. అమ్మ దృష్టి అసంఖ్యాక Galaxy లు Milky way లను దాటి ప్రసరిస్తుంది; భూతభవిష్యద్వర్తమానాలను ఏకకాలంగా ఏక సమయంలో దర్శిస్తుంది. అమ్మ మనలాంటిదే అనిపిస్తుంది కానీ ‘కాలాతీత మహాశక్తి’ అని తెలుస్తోందా?
అమ్మ మాటలు వేద సారాలు. అమ్మ ఘటనా ఘటన సమర్థ. అమ్మ సంకల్పం అమోఘం. అమ్మ చేతలు విధి-విధానాన్ని అతిక్రమించి, విధాత రాతను తిరగ రాసినట్లు అవగత మైన సందర్భాలెన్నో ఉన్నాయి – అనేది సోదరీసోదరులు అనుభవం, ప్రగాఢ విశ్వాసం. అమ్మ ఒక సామాన్య వ్యక్తి కాదు, మహోన్నత శక్తి. కాని, మనకు తెలియదు. ఉగ్గుగిన్నె వంటి మనస్సులో మహెూదధి ఎలా ఇముడుతుంది?
భ్రుకుటి భేదనం, కపాల భేదనం వంటి యోగ పరాకాష్ఠస్థితులు (సిద్ధులు) అమ్మకు సహజంగా ప్రాప్తించాయి. గ్రంథాల్లో చదువుకోవటమే కానీ అనుభవంలో పొందిన వారు అరుదు.
“హైమకు నేను దైవత్వాన్ని ఇచ్చాను” అని అమ్మ దయతో వివరించింది. దైవత్వాన్ని ప్రసాదించే శక్తి ఎంతటి శక్తికి ఉంటుందో! ఊహకి కూడా అందదు కదా! అంతేకాదు. సకల సంపదలకు నిలయమైన మహాలక్ష్మీదేవి, సకల విద్యాధిదేవత మహాసరస్వతీదేవి, గజముఖుడు, షణ్ముఖుడు… దేవీ దేవతలు అందరూ మన తోడబుట్టిన వారేనట. అది నిజం అని కలలోనైనా అనిపించదు కదా! ‘ఠక్కుర ప్రకరాగమ్య మహా మహిమ శోభిత’ (దేవతా సమూహానికి సైతం అమ్మ మహిమ అర్థం కాదు).
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థిని “నువ్వు స్త్రీలకు ప్రత్యేకంగా ఇచ్చే సందేశం ఏమిటి?” అని అమ్మను ప్రశ్నించింది. అందుకు అమ్మ “ప్రత్యేకించి స్త్రీలకి అంటూ ఏముంది? ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించటమే” అన్నది. అది సనాతన ధర్మ దివ్య ప్రబోధసారం.
అమ్మ కృపతో భౌతిక నేత్రాలతో మనం అమ్మలోని అలౌకిక శక్తి విశేషాన్ని గమనించిన సందర్భాలూ ఉన్నాయి. ఒకసారి అమ్మ విజయవాడలో P.W.D. Grounds లో దర్శనం ఇస్తోంది. లక్ష మంది ఆ భాగ్యాన్ని పొందుతున్నారు. ఆ సమూహంలో ప్రతి ఒక్కరూ అమ్మ తననే పలకరిస్తున్నదని, అనుగ్రహిస్తున్నదని పరవశిస్తున్నారు. ఆ సమయంలో గ్రీష్మ తాపాన్ని అమ్మ భరించలేదని ఒక సోదరుడు అమ్మకు గొడుగు పట్ట బోయాడు. వెంటనే చిరునవ్వుతో అమ్మ “నాన్నా! లక్ష గొడుగులు (బిడ్డల కోసం) తెప్పించగలవా?” అని అడిగింది. కోటీశ్వరుడు సైతం ఆ పని చేయలేడు. అమ్మతెప్పించింది; క్షణాల్లో ఆకాశం మేఘావృతమైంది. మలయ మారుతం వీచింది.
అమ్మను, అమ్మ తత్త్వాన్ని, అమ్మ చేతల్ని, అమ్మ ఆప్తవాక్కుని ఎందుకు అర్థం చేసుకోలేము? దీనికి సమాధానం తైత్తిరీయోపనిషత్ వివరించింది – ‘యతోవాచో నివర్తనేI అప్రాప్య మనసా సహ’ అని. ‘సంకల్ప వికల్పాత్మకం మనః” అన్నారు శంకరులు. సందేహం, అనుమానం, అస్థిరత, చాంచల్యం మనస్సులక్షణాలు. అట్టి నిలకడలేని మనస్సు, నిలబడలేని మాటలు పరదేవతా స్వరూపిణి ‘అమ్మ’ను పొందలేక వెనుకకు మరలిపోతాయి.
అవాజ్మానస గోచరమైన అమ్మ మహత్తత్త్వానికి శత సహస్రాధిక నమస్సుమాంజలులు.
– ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం