స్వర్గం అంటే అక్కడ ఉండేవాళ్ళంతా దేవతలనీ, అక్కడ ఏ రకమైన ఎక్కువ తక్కువలుండవనీ, హాయిగా ఆనందంగా అందరూ ఉంటారనీ మన విశ్వాసం. అందుకే పుణ్యం చేసి స్వర్గానికి పోవడానికే అందరూ కోరుకుంటారు. పాపం చేసి నరకానికి పోవటానికి ఎవరూ కోరుకోరు. అంతేకాదు స్వర్గంలోనూ చావు పుట్టుకలున్నాయి. స్వర్గం కన్నా పై లోకంలో ఉన్న బృహస్పతి కుమారుడు కచుడు శుక్రాచార్యుల వద్ద మృతసంజీవిని విద్య నేర్చుకోవటానికి వచ్చాడు. దేవతలలో చనిపోయినవారిని బ్రతికించటానికి, అంటే దేవతలకు కూడా చావు పుట్టుకలున్నట్టే కదా ! ఒక అమ్మ మాత్రమే జన్మకర్మసిద్ధాంతం లేదన్నది. అందరికీ సుగతేనన్నది.
విచిత్రం ఏమిటంటే మన మనుకునే స్వర్గమర్త్య పాతాళలోని స్వర్గంలో ఎన్నో వర్గాలున్నట్లు కనిపిస్తున్నది. “అమరా నిర్జరా దేవాః త్రిదశా విబుధాః సురాః సుపర్వాణః సుమనసః త్రిదేవేశా దివౌకసః ॥ విద్యాధరోప్సరోయక్షరక్షో గంధర్వ కిన్నరా. పిశాచోగుహ్యక సిద్ధా భూతోమీ దేవ యోనయః” అంటూ పెద్ద వరుస ఉన్నది. స్వర్గంలో కూడా ఇన్ని వర్గాలున్నాయా అని ఆశ్చర్యపోతాం. ఆఖరికి రాక్షసులు, పిశాచాలు కూడా దేవయోనులేనట.
జిల్లెళ్ళమూడి అమ్మ అలా వర్గాలున్న స్వర్గాన్ని గూర్చి చెప్పలేదు. ఆపాతమధురమైన ప్రేమతో, స్పపర భేదం లేకుండా అందరూ ఒక తల్లి బిడ్డల మనేభావంతో, ఒకరిమాటను ఒకరు మన్నిస్తూ ఒకరి కష్టాల్లో ఇతరులు పాలుపంచుకుంటూ వర్గ – వర్ణ విభేదం లేకుండా సోదరీ సోదరులుగా కలిసి మెలసి జీవించే సువ్యవస్థను అమ్మ స్వర్గంగా భావించిందేమో అనిపిస్తుంది. విశ్వజననిగా ఒక విశ్వకుటుంబాన్ని నిర్మాణం చేయటానికి ప్రయత్నించింది. దానికి ‘అందరిల్లు’ అని నామకరణం చేసింది. సర్వులకూ స్వతంత్రమైనదది. ఎవరైనా, ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు.
అక్కడొక అన్నపూర్ణాలయాన్ని ఏర్పాటు చేసింది. ఎప్పుడు వచ్చినా ఎందరు వచ్చినా అన్నం పెట్టబడుతుంది. అక్కడ భోజనం చేయటానికి ఆకలే అర్హత. డ్రస్సు అడ్రస్సును బట్టి కాక ఆకలిని బట్టే అన్నం పెడతారు. ఆకలితో రావచ్చుకాని ఆకలితో ఎవరూ వెళ్ళకూడదనేది అమ్మ సిద్ధాంతం. అందరూ ఒకే పంక్తిలో కుల, మత, జాతి, పేద, ధనిక, మంచీ, చెడు వ్యత్యాసం లేకుండా అన్నం పెట్టుతారు. వర్గ రహిత సమాజానికి అది ఒక గుర్తు.
అక్కడొక సంస్కృత పాఠశాల ఉన్నది. ఒక కళాశాల ఉన్నది. విద్యార్థులకు ఉచిత భోజన వసతి సౌకర్యా లున్నాయి. అది కేవలం మామూలు విద్యాలయమే కాదు. ఉత్తమ మానవులుగా తీర్చేదిద్దే ఆదర్శ సంస్థ. ఉచిత వైద్యాలయాలు, ఆదరణాలయము ఎన్నో ఎన్నో ఉన్నాయి. వృద్ధులకూ, వికలాంగులకూ, అనాథలకూ ఆశ్రయం కల్పించటం ఉద్దేశం. ఎన్నో జగద్ధితమైన కార్యక్రమాలతో మతోద్ధరణకు కాక మానవోద్ధరణకు ఏర్పరచిన ఒకమహాదర్శ స్వర్గం అది ! అక్కడ దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇంతగా జనహితం కోరే నీవు దేవతవమ్మా! అంటే మీరు కానిది నేనేదీ కాదు నాన్నా ! మీరే నాకు దేవతలు. మీరు నా అవయవాలు కూడా. అంటూ బిడ్డలను దేవతలుగా భావించే విశ్వమాతృత్వ మమకారం చూపించే అపూర్వశక్తి జిల్లెళ్ళమూడి అమ్మ – సృష్టి సర్వమూ దైవ స్వరూపమే. కనుక అర్చనీయమే – అర్చించటమంటే ప్రేమించటమే అంటుంది.
కూతురునీ కోడలినీ ఒకటిగా చూడటమే అద్వైతమనీ, వైద్యునికి రోగులూ దైవస్వరూపులేననీ, గురువుకు శిష్యుడు భగవంతుడేనని, భార్యకు భర్త దేవుడైతే – భర్తకు భార్య దేవతేననీ, భగవంతుడు సర్వాంతర్యామి కాదు, సర్వమూ తానైనవాడనీ మహోన్నత భావాలు ప్రకటించింది. లోకేశుడంటూ వేరే ఎవరూ లేరు. లోకాన్ని ఆరాధించండి, లోకంలోని ప్రత్యణువునూ ప్రేమించండి. అని చెప్పింది.
కనుక అమ్మ చెప్పిన వర్గ రహితమైన స్వర్గం ఈలాంటి వారితో కూడినది. అందుకే అమ్మ వర్గం లేనిది స్వర్గం, వైకల్యం లేనిది కైవల్యం అని చెప్పింది. ఆచార్య శంకరులు కూడా “చండాలోస్తు స తు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ” అని చెప్పారు. ఏదైనా అమ్మ చెప్పటం కాదు – చేసి చూపించింది. అమ్మ దృష్టిలో అందరూ ఒకటే. పక్షులూ, పశువులూ, శిశువులూ-వృద్ధులూ, చీమలూ-దోమలూ, ఒకటేమిటి ప్రాణం లేని వస్తువంటూ సృష్టిలో లేదనీ సృష్టి మొత్తాన్నీ ప్రేమించింది. అదీ నిజమైన విశ్వజనని లక్షణం, అదే నిజమైన విశ్వజనీన లక్షణం, అదే నిజమైన స్వర్గం యొక్క లక్షణం. ఏదైనా ఒక మహాకార్యం జరిగిందనుకోండి. ఎవరైనా ఏదైనా తన కళ్ళతో తాను చూడనంత వరకు విమర్శిస్తూనే ఉంటారు. శ్రీరాముడు సముద్రంపై వారధి కట్టి లంక కెళ్ళాడు అంటే అది నమ్మదగిందిగా ఉన్నదా ? అక్కడ రామేశ్వరంలో నీళ్ళపై తేలుతున్న రాళ్ళను చూచి నిజమే రాళ్ళు తేలుతున్నయ్యే నీళ్ళల్లో అని ఆశ్చర్య పోతాం. వారధిని కూడా కట్టి ఉంటాడనే నమ్ముతాం. రామాయణంలో చదివితే నమ్మలేకపోవచ్చు కాని చూచింతర్వాత నమ్ముతాం నేను చూచాను సత్యమే అని వివరిస్తాం. ఇది సత్యం. అలాగే జిల్లెళ్ళమూడి వచ్చి ప్రత్యక్షంగా చూచినవాళ్ళు కూడా. ఇక్కడ సర్వసమానత్వమూ ప్రేమ చూచినవాళ్ళు ఇది స్వర్గమే. ఇంతకు మించిన స్వర్గ అన్నవారున్నారు.
శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు భౌతికశాస్త్రంలో డాక్టరేట్ డిగ్రీ సాధించినవారు. అంతే కాదు సాహిత్యంలో, సంగీతంలో, శిల్పకలలో, చారిత్రక పరిశోధనలో ఆరితేరిన వారు. బాటప్ల కాలేజిలో ప్రిన్సిపాల్గా ఉన్న రోజుల్లో వారి స్నేహితులు శ్రీ పద్మాజీ ప్రోత్సాహంతో అమ్మ అంటే ఎవరో ఏమిటో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో జిల్లెళ్ళమూడి వచ్చారు. అమ్మలో అంతకు ముందు తాను ఎవరిలో చూడని ప్రశాంతిని చూచారు. అయితే ఒక వ్యక్తి దైవంగా పూజలందుకోవడమేమిటి ? అనే సందేహం కలిగింది. ఆ విషయమే వారి స్నేహితునికి ఉత్తరం వ్రాస్తుండగా “ఆ ఏమంటున్నావ్?” అనే మాటలు వినిపించాయి. తనలో నుండే అది వినిపించిందో బయట నుండి వినిపించిందో చెప్పలేకపోయారు. తన టేబుల్పై చూచేసరికి టేబులపై ఉన్న గుడ్డపై సిరా ఒలికి అమ్మ రూపం చిత్రంగా ఏర్పడి కనిపించింది. ఆశ్చర్యపోయారు. అమ్మే ముందు తన ఇంటికి వచ్చి జిల్లెళ్ళమూడి తీసుకెళ్ళింది అనుకున్నారు. ఆ తర్వాత ఆయన అనుమానం తీరింది. అమ్మ ఎవరేది చేసినా అంగీకరిస్తుందనీ, సర్వులనూ బిడ్డలుగా చూస్తుందనీ, అక్కడ వర్గ వర్ణ పేద ధనిక తేడాలు లేని ఒక స్వర్గంగా భాసిస్తుందనీ తెలుసుకున్నారు. అనుభవిస్తేనే కదా ఏదైనా తెలిసేది.
అలాగే వీరమాచనేని ప్రసాదరావుగారు కమ్యూనిష్టుపార్టీ పార్లమెంటు మెంబరు. సామాన్యంగా మహాత్యాలను, అతిలోకశక్తులను నమ్మే మనస్తత్వం కాదు. హేతవాద దృక్పథం కలవారు. వారూ శ్రీపాదవారు అమ్మతో ఎన్నో విషయాలు చర్చించారు. ఒకసారి సికిందరాబాదులో వారి కొడుకూ కోడలూ ఒక జీపులో ప్రయాణిస్తుండగా లారీ ఢీకొని ప్రమాదం జరిగింది. కోడలికి పాలభాగంలో ఎముకలు విరిగిపోయాయి. మెదడు దెబ్బతిన్నది. స్పృహతప్పింది. హాస్పిటల్లో చేర్చారు. డాక్టర్లు ప్రాణాపాయం నుండి గట్టెక్కుతుందని నమ్మకం చెప్పలేకపోయారు. ఆ సమయంలో ఒక మిత్రుడు అమ్మ ప్రసాదమూ తీర్థమూ తీసుకొని వెళ్ళి ఇచ్చాడు. అమ్మ తీర్ధం ఆ కోడలి నోటిలో వేశారు. ఆమె గుటకవేసింది. అప్పుడు ప్రసాదరావుగారికి ఆశ కలిగింది. డాక్టర్లు ఆపరేషను చేయటానికి నిశ్చయించారు. అమ్మే ఆపరేషన్ చేస్తున్నట్లుగా ప్రసాదరావుగారికి కనిపించింది. ఆపరేషన్ జయ ప్రదమైంది. బంధువులే కాదు డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఆమె త్వరగా కోలుకుంది. మెదడు సరిగా పనిచేస్తున్నది. ఈ విషయం ప్రసాదరావుగారు మరొక కమ్యూనిష్టు మాజీపార్లమెంట్ మెంబరుకు చెప్పగా అతడు ఇదేమిటి ఇట్లా మారిపోయావు ? అన్నాడు. అపుడు ప్రసాదరావు గారు పూర్వం ఏ అనుభవమూ దర్శనమూ లేదు. ఏమీ నమ్మలేదు. ప్రస్తుతం ఎన్నో అనుభవాలు, నిదర్శనాలు, నిరూపణలు మరి నమ్మకపోతే ఎట్లా ? ఏమీ లేక నమ్మితే ఎంత మూఢత్వమో, అన్నీ చూస్తూ అనుభవిస్తూ నమ్మకపోతే అంతే మూర్ఖత్వం అనుకుంటాను అన్నారుట.
అందుకే విన్నవాడు విమర్శిస్తాడు. కన్నవాడు వివరిస్తాడు అని అమ్మ చెప్పిన సూక్తి అనుభవ వేదాంత నిధి. దీనివల్ల మనం గమనించాల్సిందీ, నిజానిజాలు తెలియాలంటే విన్న వెంటనే విమర్శించకూడదు. స్వయంగా మనమే తెలుసుకొని మాట్లాడాలి అనేది అర్థమౌతున్నది. అమ్మ చెప్పినట్లు వర్గ రహితమైనది స్వర్గమే అయితే మనం పురాణాలలో చదువుకున్న స్వర్గం కంటే ఇదే నిజమైన స్వర్గం. ఎందుకంటే పురాణాలలో వర్గాలున్నాయని వారే చెపుతున్నారు. దేవతలలోనూ అన్ని వర్గాలున్నాయి కదా! ఒకే తండ్రికి పుట్టిన అన్నదమ్ములు దైత్యులు – ఆదిత్యులు. అయినా కొట్టుకుంటున్నారు మన కే బాధలేదు. అందరింట్లో – అందరం సోదరీసోదరులమే. అభిప్రాయబేధాలుండవచ్చు గాని అందరం ఒకే తల్లి పిల్లల మనే భావం మనలో జాగృతమయ్యే ఉంటుంది. అందరం కలిసి మెలిసే భోజనం చేస్తాం. కలసి మెలిసే జీవిస్తాం. అమ్మ చెప్పిన చేసిన స్వర్గంలోనే జీవిస్తాం. అమ్మలోనే ఐక్యమౌతాం. ఎక్కడా తేడాల్లేవు. అందుకే అమ్మ “వర్గంలేనిది స్వర్గం” అన్నది.