“నవ్వవోయి ఒరులు నవ్వనియట్లు, భా
షింప వోయి ఒరులకించునట్లు
బ్రదుకవోయి కీర్తి పొదలు నట్టులు, తుద
గిట్టవోయి మరల పుట్టనటులు”
ఎప్పుడూ మంచిపనులు చేస్తూ, సత్కార్యా చరణను ప్రోత్సహిస్తూ, ఒక్క క్షణమైనా వృథా కాల యాపన చేయకుండా బ్రతుకంతా సార్థకంగా గడిపిన మహనీయులు శ్రీ పి.యస్. ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారు.
ఎప్పుడూ ఉత్సాహంగా క్రియాశీలకంగా ఉంటూ నవ్వుతూ ఆనందంగా ఉండేవారు. వారు ఏ పని చేసినా ఎవ్వరూ వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకుండా, సకాలంలో సక్రమంగా ఆ పనిని నిర్వహించేవారు. పని సభానిర్వహణం కావచ్చు, పుస్తక ప్రచురణం కావచ్చు. పత్రికా సంపాదకత్వం కావచ్చు.
ఏ సభ నిర్వహించినా కవితలతో పద్యాలతో అలరిస్తూ, సమయ పాలనం చేస్తూ, సమున్నత స్థాయిలో తీర్చి దిద్దేవారు. అటు కుర్తాళం పీఠానికీ, అర్కపురి పరిషత్తులకూ, ఎన్నెన్నో సాహిత్య సంస్థలకూ అవ్యాజమైన సేవలు అందించి, అజరామరమైన కీర్తి గడించారు. అమ్మ చింతనతోనే శరీర పరిత్యాగం చేసి, మోక్ష పదవిని సాధించుకున్నారు.
ఈ పద్యం వారికి ముమ్మూర్తులా సరిపోతుంది.
“పురుషోత్తమ పుత్ర భార్గవ” కలం పేరుతో పద్య, గద్య, గేయ రచనలెన్నో చేసిన ప్రసిద్ధ సాహితీవేత్త శ్రీ పోతరాజు సీతారామాంజనేయప్రసాద్.
ప్రచలిత నామధేయం
పి యస్. ఆర్.. చిన్ననాటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యులుగా క్రమ శిక్షణనూ దేశ భక్తినీ దైవ భక్తినీ సేవా తత్పరతనూ పుణికి పుచ్చుకొని, ఆదర్శ జీవనం సాగించిన మహనీయులు పి.యస్.ఆర్.
ప్రస్తుత కుర్తాళం సిద్ధేశ్వరీ వీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి(పూర్వాశ్రమ ‘ఆశుకవి సమ్రాట్’ డా.ప్రసాదరాయ కులపతి)కి సోదరుడు శ్రీ పి.యస్.ఆర్.
తండ్రి, తాత, ముత్తాతలు పద్యరచనలో ఆరితేరిన కవులు. వారసత్వంగా లభించిన కవితారచన చేపట్టి అన్నగారి సాహిత్య మార్గ దర్శకత్వంలో ఎన్నో రచనలు చేశారు శ్రీ పి.యస్.ఆర్.
1939 ఏప్రిల్ 30వ తేదీన ప్రకాశం జిల్లా ఏల్చూరులో జన్మించిన శ్రీ ఆంజనేయ ప్రసాద్ గుంటూరు హిందూ కళాశాలలో ఉన్నత విద్యాభ్యాసం చేసి, ఆ సంస్థలోనే హైస్కూలులో సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు.
13 సంవత్సరాల వయస్సులోనే కలం చేత పట్టి రచనా వ్యాసంగం ప్రారంభించారు.
సంక్రాంతి, విజయ విపంచి, అనుభవాల మూట అమ్మ మాట, ఆనంద నందనం, తులసీ దళాలు, గిరిబాల గీతాలు, వివేకానంద, త్యాగరాజు బుర్రకథలు, ఆధ్యాత్మిక వ్యాసలహరి, శ్రీ రాధా ప్రణామవల్లరి, విశ్వజనని జీవేశ్వర వైభవం, ఆనందలహరి, అనసూయా వ్రతకల్పం, హైమవతీ వ్రతకల్పం, శ్రీ విశ్వ జననీ వీక్షణం, మాతృశ్రీ దర్పణం మొదలైన ఎన్నో రచనలు చేశారు.
పద్యం, వచన కవిత, గేయం, వ్యాస రచన మొదలైన అన్ని ప్రక్రియలలోనూ అఖండ విజయం సాధించారు.
జిల్లా రచయితలసంఘం, శ్రీనాథపీఠం మొదలైన సంస్థలకు సంచాలకులుగా, ఆంధ్రప్రదేశ్ ఎయిడెడ్ సెకండరీ పాఠశాలల నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ కు అధ్యక్షులుగా శ్రీ పి.యస్.ఆర్. అందించిన సేవలు సాటి లేనివి.
అవతారమూర్తి జిల్లెళ్ళమూడి అమ్మపట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలతో అమ్మ సంస్థలకు వారు వివిధ హెూదాలలో చిరస్మరణీయమైన సేవలు అందించారు. మాతృశ్రీ, విశ్వజనని మాస పత్రికల సంపాదకులుగా రెండు దశాబ్దాలకు పైగా అమ్మ సంస్థలకు- భక్తులకు వారధిగా పని చేశారు శ్రీ పి. యస్. ఆర్. వారి సంపాదకీయాలు అమ్మ తత్త్వాన్ని అనుసరించే సాధకులకు కరదీపికలు.
శ్రీ సిద్ధేశ్వరీ పీఠంలో మౌనప్రభ పత్రికా సంపాదకులుగా, కుర్తాళం పీఠ కార్యక్రమాల నిర్వాహకులుగా శ్రీ పి.యస్.ఆర్. సేవలు అసాధారణ మైనవి.
కవిగా, రచయితగా, వక్తగా, విమర్శకులుగా వ్యాఖ్యాతగా, సభా నిర్వాహకులుగా, అవధాన సభల సంచాలకులుగా, భువన విజయ సభల ప్రయోక్తగా పి యస్.ఆర్. కొన్ని వేల సభలను రక్తి కట్టించారు.
దేశ భక్తి, జాతీయతా భావం, సంప్రదాయ ప్రియత్వం, ఆధ్యాత్మిక చింతనలతో సమాజానికి విశేష సేవలు అందించిన శ్రీ పి. యస్. ఆర్. 2022 ఫిబ్రవరి 13వ తేదీన పరమపదం చేరుకున్నారు.
నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా నిస్వార్థ సేవలు జాతికి బహు ముఖాలుగా అందించిన శ్రీ పి.యస్. ఆర్. భౌతికంగా మన మధ్య లేకపోయినా వారందించిన స్ఫూర్తి శాశ్వతం. చిర స్మరణీయం.
“శ్రీ వాణీ గిరిజాస్వరూపమయి, రాశీభూత మాతృత్వమై
ఆ వేదంబుల వెల్గునై వెలసి, విశ్వారాధ్యయై, దివ్య సు
శ్రీ వాత్సల్య మరీచి మాలిక శుభశ్రీ నించు ఇల్లాలు నా
యావచ్ఛక్తియు భావదీప్తి అనసూయా దేవి మమ్మోముతన్”
అని శ్రీ పి.యస్.ఆర్. వ్రాసిన పద్యం వారి భక్తినీ కవితా శక్తినీ వెల్లడిస్తోంది.
ఆరు దశాబ్దాల క్రితం ఒక సంక్రాంతినాడు తొలి సారిగా అమ్మను దర్శించి, అమ్మ కారుణ్యదృక్ ప్రసారం కోసం పరితపించారు శ్రీ పి.యస్.ఆర్. “రాక విచిత్ర మైనది
…… పల్క వదేమి చిత్రమో!”
అన్న పద్యం వారి హృదయంలో నుంచి దూసుకు వచ్చింది. ఎందరో విద్వాంసుల మధ్య ప్రత్యేకించి పి.యస్.ఆర్. ను దగ్గరకు పిలిచి, పుష్పమాలతో ఆశీర్వదించింది అమ్మ.
“నువ్వు ఈ స్థాన కవివి” అని నిండు సభలో ప్రకటించింది అమ్మ. అమ్మలో కనిపించే అసాధారణ మాతృప్రేమకు ముగ్ధులై, పి.యస్. ఆర్. ఆనాటినుంచి అమ్మే సర్వస్వంగా జీవన యాత్ర సాగించారు. అమ్మలోని దివ్యత్వాన్ని, ప్రేమ తత్వాన్ని, తాత్త్విక దృక్పథాన్నీ చూసి, మురిసిపోయిన పి.యస్.ఆర్. అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ అమ్మకు అక్షరార్చన చేశారు.
అమ్మలోని ప్రేమతత్త్వాన్ని పుణికి పుచ్చుకున్న పి.యస్.ఆర్. అందరింటి సోదరులతో చక్కని అనుబంధాన్ని అవ్యాజంగా పెంచుకున్నారు. అది అమ్మ ప్రసాదించిన వరంగా స్వీకరించారు. వారి అభ్యుదయానికి ఆనందిస్తూ, వారి కష్టాలకు దుఃఖిస్తూ, అందరితో మమేకం అయ్యారు. సుఖ దుఃఖాది సన్నివేశాలలో సాటివారూ తనవంటివారే నని అనుభూతిచెంది, ఆత్మ యోగాన్ని అనుసరించారు.
అమ్మమాటలే మంత్రాలుగా, అమ్మవిధానమే ఉపాసనా మార్గంగా నమ్మిన పి.యస్.ఆర్. గారికి తలపు మెదిలితే అమ్మ, కలం కదిలితే అమ్మ.
“సీతమ్మ మా అమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి…..” అంటూ త్యాగరాజస్వామి రామచంద్ర మూర్తిని సకుటుంబ సపరివారంగా సేవించారు. “విశ్వకుటుంబిని” అయిన అమ్మను అమిత భక్తితో అర్చించిన పి.యస్.ఆర్. అందరింటి సోదరులందరినీ నిర్వ్యాజంగా అభిమానించారు.
అందరింటి సోదరుల్లో ఎవరు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందినా, వారికి పథ్యపానాలతో, వారి వెంట ఉన్నవారికి మృష్టాన్న భోజనం పి.యస్.ఆర్. గారింటినుంచి రావలసిందే.
అంతేనా! భువన విజయ సభలకు దూరప్రాంతాలకు చేసే రైలు ప్రయాణాలలో కవి పండితులందరికీ భోజనం, అతిథ్యం పి.యస్.ఆర్.గారి ఇంటినుంచే.
“నిండు మనంబు నవ్య నవనీత సమానము, పల్కు దారుణా ఖండల శస్త్ర తుల్యము…” అన్న పద్యం పి.యస్.ఆర్.ను చూడగానే గుర్తుకు వస్తుంది. వారి మాట మరీ అంత వజ్రాయుధం కాదు కానీ, ఉంటాము. హృదయం మాత్రం “నవ్య నవనీత సమాన”మే.
తాను నమ్మిన నిజాన్ని ఏ విధమైన మొగమోటమూ లేకుండా, కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పే తత్త్వం వారిది. అందువల్ల వారి మాట కొన్ని సందర్భాలలో కొందరికి కొంత కరుకుగా తోచవచ్చు. కాని, వారికి సన్నిహితమైన కొద్దీ తెలుస్తుంది- వారి హృదయంలోని ప్రేమ, వారి మాటల్లోని నిజాయితీ ఎంతటివో.
ఒక హైస్కూల్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ ఉ ద్యోగం నిర్వహించిన వారు శ్రీ పి.యస్. ఆర్. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కార్యవర్గ అధ్యక్షులు, కరస్పాండెంట్ మొదలైన వారు శ్రీ పి.యస్.ఆర్. గారిని ఎంతగానో గౌరవించేవారు. పీయస్ఆర్ నిబద్దత, కార్యదీక్ష, నిజాయితీలే అందుకు కారణమని ఇటీవల ఒక సమావేశంలో ఆ అధ్యక్ష కార్యదర్శులే స్వయంగా తెలియచేశారు.
అమ్మ పట్ల పి.యస్.ఆర్. హృదయంలో గల భక్తి విశ్వాసాలు కొలతలకు అందనివి.
“నీ కళ్ళను చూస్తుండగా, నా కను రెప్పలు వాలుతుంటే, ఎంత కోపం వస్తుందో! అడ్డు పడుతున్నాయని…” అమ్మకు విన్నవించుకున్న అంకిత భక్తుడు శ్రీ పి.యస్. ఆర్.
‘చెల్లని రూపాయిని చెలామణీ చేశావు…. నీ బిడ్డపైన నీ కెంత మమకార మమ్మా!” అన్న కవితోక్తి వారి వినయానికి దర్పణం.
“లోకైక దీపాంకుర” అయిన అమ్మ జీవిత సన్నివేశాలలోని కొన్ని అంశాలను ఏర్చి, కూర్చి మండల దీక్షగా నిత్య పారాయణానికి అనువుగా తీర్చి దిద్ది, మనకు అందించారు శ్రీ ఆంజనేయ ప్రసాద్. అంతవరకు వెల్లడికాని ఎన్నో వినూతనాంశాలను సేకరించి, సమర్పించిన ఈ మహనీయునికి మనమంతా ఋణపడి ఉంటాము.
“నాకు కావలసిన వాళ్ళను నేను ఏరుకుంటాను. నాకు అవసరమైనప్పుడు వాడుకుంటాను” అన్న అమ్మవాక్యం పి. యస్. ఆర్. పట్ల చక్కగా సరిపోతుంది. అమ్మ దివ్య ప్రణాళికకు ఉపకరణమై తరించిన ధన్యుడు శ్రీ పి.యస్.ఆర్.
అమ్మ ప్రసాదించిన ‘లోచూపు’ ఆధారంగా, తనకు దక్కిన అక్షర విజ్ఞానం ముడి సరుకుగా, అమ్మ కటాక్ష వీక్షణాలు తన సంపదగా, ఇన్ని దశాబ్దాల కాలం కొత్తకాంతులను వెదజల్లుతూనే వచ్చింది అంజనేయ ప్రసాద్ గారి అమృత లేఖిని.
అమ్మ తత్త్వంపట్ల స్పష్టమైన అవగాహన, నిత్య నిరంతర చింతన, అపారమైన జీవితానుభవం వారి భక్తిసౌధానికి పునాదులు. ఆ పునాదులపై రసరమ్యమైన మందిరాలు నిర్మించి, అమ్మను ప్రతిష్ఠించి, ప్రతి నిత్యమూ అక్షర దీపారాధన చేసిన అర్చకులు శ్రీ పి.యస్.ఆర్.
తమ రచనలతో పాటు అందరింటి సోదరుల మరెన్నో రచనల ముద్రణ చేపట్టి, ఆర్థిక బాధ్యత తాను వహించి, శ్రీ విశ్వజననీ పరిషత్ ప్రచురణలుగా అందించిన గుప్త దాత శ్రీ పి.యస్.ఆర్.
ఒక సందర్భంలో వారికి చిన్న ప్రమాదం జరిగి కాలు ఫ్రాక్చర్ అయింది. వైద్యుల సూచన మేరకు వారు కొన్నాళ్ళు కదలకుండా ఉండవలసి వచ్చింది. నేను వారిని చూడాలని వెళ్ళాను.
ఏ దిగులూ లేకుండా నిశ్చింతగా నిలిచి, నాకు ధైర్యం చెప్పారు శ్రీ పి.యస్. ఆర్.
పెద్ద కొడుకు నిర్యాణం చెందినప్పుడు, ధర్మపత్ని పరమపదించినప్పుడు వారిలోని స్థిత ప్రజ్ఞ స్థితిని చూసి, నేను ఆశ్చర్య పోయాను. మహా యోగులకు సైతం ఆచరణ సాధ్యం కాని ఆ నిలకడతనానికి మనస్సులోనే మోకరిల్లాను.
“ఉత్సాహ ప్రభు మంత్ర శక్తియుతమైన ప్రతిభతో, అర్కపురిలోని ‘అన్ని’ కార్యక్రమాలకూ రూపకల్పన చేస్తూ, అమ్మ ఆశయాల సాధన కోసం అవసరమైతే, గదమాయించి మరీ నిర్వహించ గలిగిన గురు స్థానీయులు శ్రీ పి.యస్.ఆర్. అలాంటి పెద్దదిక్కు కనుమరుగైందని అందరిల్లు అలమటిస్తోంది ఈనాడు.
ఇటీవల వారు ఆసుపత్రిలో ఉండగా వారితో ఫోనులో సంభాషించే అవకాశం కలిగింది కొన్నిసార్లు.ఎప్పుడు మాటాడినా అమ్మను గురించో, పత్రికను గురించో, ధాన్యాభిషేకాన్ని గురించో తప్ప, తన ఆరోగ్యాన్ని గురించిన దిగులు వారి మాటల్లో కించిత్తయినా లేదు.
“మృత్యుభయాన్ని జయించటమే మృత్యుం జయత్వం” అని చెప్పిన అమ్మ సూక్తికి అక్షరాలా ఉదాహరణ అన దగిన వ్యక్తిత్వం వారిది.
అమ్మఒడి చేరిన పి.యస్.ఆర్. కు పునర్జన్మ లేదు. అసలు మరణిస్తే కదా! మళ్ళీ పుట్టటానికి?
వారి శరీరం కనుమరుగైంది కాని, వారి వ్యక్తిత్వానికీ సేవా తత్పరతకూ అంకిత భావానికీ ప్రతిభా సంపత్తికీ మరణం లేదు.
జిల్లెళ్ళమూడిలోని అణువణువులోనూ అందరి సోదరుల అంతరంగాలలోనూ అమరుడూ, అన్ని రంగాల్లో అజేయుడు శ్రీ పి.యస్.ఆర్.
ఆ మహనీయుడి వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని మరచిపోగలమా! “ధరణిపై స్మరణ జరుగుతున్నంత వరకు మరణానికి ఉనికి లేదు”.
మృత్యుంజయుడు శ్రీ పి.యస్. ఆర్. ఆంజనేయ ప్రసాద్.