1923 మార్చి 28వ తేదీ రుధిరోద్గారి చైత్ర శుద్ధఏకాదశి బుధవారంనాడు మన్నవలో మన్నవ రంగమ్మ సీతాపతి దంపతుల యింట ఒక ఆడపిల్ల పుట్టిందని, ఆమెనే తరువాత కాలంలో లోకం అమ్మగా గుర్తించి, ఆరాధిస్తోందని మనకు తెలుసు. “ఈ సృష్టి అనాది, నాది” అని ప్రకటించి, ఏ విధమైన తారతమ్యాలూ లేకుండా అందరినీ అన్నింటినీ అంతటినీ తన బిడ్డలుగా చూడగలిగిన “విశ్వజనని” అమ్మ. తన ఇంటిని “అందరిల్లు” గా ప్రకటించి, వసుధైక కుటుంబాన్ని స్థాపించిన ‘లోకైక దీపాంకుర’ అమ్మ.
మన అమ్మకు ఇది శత జయంతి సంవత్సరం. కనుక ఈ సందర్భంగా జిల్లెళ్ళమూడిలోనే కాక, వాడవాడలా ఊరూరా విశేషమైన ఉత్సవాలు నిర్వహించాలని, అమ్మ సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయాలనీ అమ్మ దివ్యానుగ్రహాన్ని జనబాహుళ్యానికి పంచాలనీ మన అభిలాష. ఈ లక్ష్యంతో కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకొని, అందుకు కావలసిన వ్యవస్థను నిర్మించుకొని మనం చిత్తశుద్ధితో పని చేయవలసి ఉన్నది.
ఈ ప్రణాళికలో హెూమాది ఆధ్యాత్మిక క్రతువులు, నామ పారాయణలు, వివిధ ప్రదేశాలలో అమ్మ తత్త్వప్రచారసభలు, అన్న వితరణ కార్యక్రమాలూ మొదలైనవి చేర్చవచ్చు. వీలైనన్ని ప్రాంతాలలో అమ్మ చలన చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తే బహుళ ప్రయోజనకరంగా ఉంటుంది. అమ్మఆశయ సాధనకు అనుగుణంగా జిల్లెళ్ళమూడి సంస్థలకు ఆర్థిక స్థిరత్వం సమకూర్చే ప్రణాళికలు కూడ ఆలోచించవలసి ఉన్నది. అందరింటిలో శాశ్వత ప్రాతిపదికన ఏమైనా బహుళార్థ సాధకమైన నిర్మాణాలు చేపట్టటం కూడ ఎంతైనా ఆవశ్యకం.
అమ్మ అనుగ్రహ ప్రసారంతో విశ్వ శ్రేయస్సు, అమ్మ సందేశ వ్యాప్తి, అమ్మ ఆశయ సాధనకు మార్గం మరింత సుగమం కావటం మొదలైనవే మన లక్ష్యంలో భాగాలు. ఈ కోణంలో మనం సమాలోచన చేయవలసి ఉన్నది.
అయితే, ముందుగా మనం అమ్మ పుట్టుకను గురించే ఆలోచన చేయవలసి ఉన్నది. అమ్మ పుట్టినప్పుడు కాళ్ళూ చేతులు మెలి వేసుకొని, ప్రాణం ఉన్నదా? లేదా? అని సందేహం కలిగించే విధంగా ఏ కదలికా లేకుండా ఉండటం, బొడ్డుకోయటానికి వచ్చిన మంత్రసాని నాగమ్మకు చాకు త్రిశూలంవలె కనిపించటం, అమ్మబొడ్డు ఒక పద్మంవలె తోచి, ఆ నాభికమలంలో సర్వాలంకార సంశోభితురాలైన ఒక దేవతామూర్తి దర్శన మివ్వటం మొదలైనవి ఆశ్చర్య కరమైన నమ్మలేని నిజాలు.
పసిప్రాయంలోనే కన్నతల్లి వెంట రైలు బ్రిడ్జి ఎక్కుతూ, తన చేతి బంగారు గాజును అక్కడున్న ఒక ముసలి బిచ్చగత్తెకు ఇవ్వటం, రైలులో దీనురాలైన శాంతమ్మకు టిక్కెట్టుతోపాటు తన రెండవ చేతి బంగారు గాజును కూడ దానం చేయటం, తన నగలన్నీ అపహరించి, తనకు అపకారం చేయాలనుకున్న జాలరికి ప్రాణభిక్షతో పాటు తన నగలన్నీ ఇచ్చేయటం వంటి కోకొల్లలైన సన్నివేశాలు ముందుముందు అమ్మలో సుస్పష్టం కానున్న విశ్వమాతృత్వ పారిజాత వికాసానికి పసిప్రాయంలోనే కనిపించిన లేత మొగ్గలు.
ఇదే సందర్భంలో “తల్లికి బిడ్డసొమ్ము, బిడ్డకు డబ్బు సొమ్ము” అని అమ్మ ప్రకటించటం, బాపట్ల భావనారాయణ స్వామి దేవాలయంలో కొబ్బరి చిప్పను ముక్కలుచేసి, “చూశారూ! ఒక్కటే అనేక మయింది” అని తత్త్వ రహస్యాన్ని వెల్లడించటం, రాజ్యలక్ష్మీ అమ్మవారిని గురించి “దేవుడు వేరూ, విగ్రహాలు వేరూనా? విగ్రహాలే దేవుడా?”అని విచికిత్స చేయటం, కన్నతల్లి నిర్యాణం చెందినప్పుడు, “దైవం పంపిన మనిషి దైవం ఇష్టం ప్రకారం దైవంలోకి పోతే మధ్యలో మనకు ఏడుపు ఎందుకు తాతయ్యా?”అని ప్రశ్నోపనిషత్తు సంధించటం మొదలైనవి మానవాళికి ప్రబోధించనున్న ఒక మహాప్రవక్త సందేశానికి ఉపోద్ఘాతాలు.
అతి తీవ్రమైన ఉష్ణోగ్రత గల పొగాకు బేరనులో నుండి కసుగందకుండా బయటకు రావటం, సలసల కాగే పులుసు కళాయిలో చేయిపెట్టి కలియబెట్టినా ఆ చేయి చెక్కుచెదరక పోవటం వంటివి క్రమంగా అమ్మలో లోకం అంతా దర్శించబోయే దివ్యత్వ వైభవ దృశ్య రూపకానికి నాందీ ప్రస్తావనలు.
“నువ్వు లేనప్పుడు నేనే అమ్మనై ఉంటానుగా” అని తన కన్నతల్లితో అనటం, జీడిపప్పు అమ్ముకునే అమ్మాయికి తానే జీడిపప్పు కొని ఇవ్వటం మొదలైన సన్నివేశాలు “నేనే మీ అందరినీ కని మీ మీ తల్లులకు పెంపు డిచ్చాను” అని అనంతర కాలంలో అమ్మ చేసిన విశ్వజనీన మాతృ ప్రేమ తత్త్వ ప్రకటన ప్రబంధానికి అవతారికలు.
అమ్మ సన్నిధిలో జరిగిన మహిమలు అమ్మ దివ్యత్వాన్ని చాటుతూ ఉండగా, అమ్మ జీవిత సన్నివేశాలు అమ్మలోని విశ్వమాతృత్వానికి అద్దం పడుతున్నాయి. పుట్టుకే లేని ఒక దివ్యశక్తి అమ్మ రూపం ధరించి పుట్టినట్లు కనిపిస్తోంది. కర్మబంధం లేని ఒక దేవత ఎన్నో కర్మ లాచరించినట్లు అనిపిస్తోంది.
“జన్మ కర్మచ మే దివ్యం”అని గీతలో పరమాత్మ చేసిన ప్రకటన ఈ సందర్భంలో మన మదిలో మెదులుతుంది.
“జననములేక కర్మముల జాడల బోక, సమస్త చిత్త వ
ర్తనుడగు చక్రికిన్ కవు లుదార పదంబుల జన్మ కర్మముల్
వినుతులు సేయు చుండుదురు; వేద రహస్యములందు నెందు జూ
చిన మరి లేవు దేవునికి జీవుని కైవడి జన్మ కర్మముల్”
అవతారమూర్తులు, ప్రవక్తలు కారణజన్ములై ఉంటారని భాగవతంలో పోతన్నగారు స్పష్టం చేశారు. మానవుల మధ్య పరస్పర సదవగాహనను పెంచటానికి సమన్వయాత్మక మైన సందేశం అమ్మ జీవితం.
విశ్వసౌభ్రాత్రాన్ని మనకు నేర్పటానికి ఉదాహరణాత్మకమైన ఉపదేశం అమ్మ ప్రబోధం. అవ్యాజప్రేమ విలువను మనకు తెలియచేసేందుకు ఆచరణాత్మకమైన ఆదేశం అమ్మ సచ్చరిత్ర.
ఇలా పరిశీలిస్తే, “అమ్మ అంటే జిల్లెళ్ళమూడిలో మంచంమీద కూర్చున్నదే కాదు, అంతులేనిది, అడ్డులేనిది, అన్నింటికీ ఆధారమైనది, అంతటా వ్యాపించి ఉన్నది” అని అమ్మచేసిన ప్రకటనలోని ఆంతర్యం మనకు అవగతమవుతుంది.
అలాంటి అమ్మకు ఇపుడు పుట్టిన రోజు. అదీ శతవసంతాల పండుగ. మన ఆరాధ్య దైవమైన అమ్మకు ఈ శతజయంతి సందర్భంగా మనం ఏమి కానుక ఇవ్వాలి? ఏమి కానుక ఇవ్వగలం? మన సొంతం ఏమున్నది గనుక? ఏమిచ్చినా, అది అమ్మ మనకు ఇచ్చినదే కదా!
“త్వదీయం వస్తు గోవింద! తుభ్యమేవ సమర్పయే” అన్నట్లు అమ్మ ఇచ్చింది అమ్మకే ఇవ్వటం మాత్రమే. మనకున్న శరీరమూ మనసూ తెలివి సంపదా- అన్నీ అమ్మ ఇస్తే వచ్చినవే. వాటిని మళ్ళీ అమ్మసేవలో వినియోగించటం మాత్రమే మనం చేయ గలిగినది. అమ్మ ప్రేమకు ప్రతినిధులమై, అమ్మ సందేశానికి వాహికలమై, అమ్మకూ ప్రపంచానికీ మధ్య వారధులమై అమ్మమయ జీవనం సాగించటానికి మనం పునరంకితం కావటమే మన పవిత్ర కర్తవ్యం.
– మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి