లోకం అంటే మనస్సు – అమ్మ చెప్పిన ఎన్నో విషయాలు మననం చేసుకుంటూ అమ్మలో లీనం కావటం కంటే అదృష్టం ఏముంది?
స్వర్గాలు – నరకాలు – రకరకాల లోకాలు ఇన్ని లేవు. ఉన్నది ఒకటే లోకం – అమ్మ లోకం అన్ని లోకాలు అందులోవే – సాలోక్యము – సామీప్యము సారూప్యము – సాయుజ్యము – అమ్మ ఏది ప్రసాదిస్తే అదే. ఎవరైనా వచ్చిన చోటికి పోకతప్పదు. మనకున్నది అమ్మే. అమ్మలోకమే.
సోదరీ సోదరులు చాలామందిని అమ్మ తనలో కలుపుకుంటున్నది. కలియుగం నాలుగవపాదం ఇది అన్నది అమ్మ. అందరం ఎప్పుడో ఒకప్పుడు అమ్మలో కలిసి పోకతప్పదు. నాకు అమ్మలోకానికి చేరటమే అదృష్టం అనిపించింది.
శ్రీ జన్నాభట్ల వీరభద్రశాస్త్రి (18.5.2021)
అమ్మ మాటలలో జన్నాభట్లవారి ఇల్లు మరొక జిల్లెళ్ళమూడి అందరిల్లు. తంగిరాల కేశవశర్మ ఇంటిని గూర్చి కూడా అలాగే అన్నది. ఉన్నదాంట్లో కలో గంజో ఆదరంగా వచ్చిన వారందరికీ పెట్టటం ఆ గృహస్థుల లక్షణం. అలా ఉన్న ఇల్లు ఏదైనా జిల్లెళ్ళమూడి అందరిల్లే.
కొన్ని కుటుంబాలు అలా అమ్మ విశ్వకుటుంబంతో అల్లుకుపోతాయి. జొన్నాభట్లవారుగా పిలువబడుతున్నా జన్నాభట్ల వారు బహుశా యజ్ఞాలు చేయటంలో ఆరితేరిన వారనుకుంటా. వీరభద్రశాస్త్రి తాతగారి పేరు కూడా వీరభద్రశాస్త్రే – విజయనగరం తాతారాయుడు శాస్త్రి గారి వద్ద తర్క వేదాంత శాస్త్రాలు అభ్యసించిన మహాపండితుడు. జమ్ములమడక మాధవరామశర్మ గారితో కలిసి అక్కడ చదువుకున్నారు. శృంగేరీ పీఠాధిపతుల సన్మానాలు పొందినవారు. వారిపేరే మన సోదరుడు వీరభద్రశాస్త్రికి కూడా పెట్టారు.
శ్రీ జన్నాభట్ల వెంకట్రామయ్యగారు, సీతారావమ్మ గారు కన్న ఎనిమిది మంది సంతానంలో వీరభద్రశాస్త్రి ప్రధముడు. అమ్మ పట్ల పరమవిశ్వాసం కల్గిన కుటుంబంలో తాతతండ్రుల సంప్రదాయాన్ని పుణికి పుచ్చుకున్నవాడు. ఆధ్యాత్మిక, ఆచార వ్యవహారాలలో, భక్తిప్రపత్తులలో, సేవాతత్పరతలో నలుగురికి ఉన్నదాంట్లో సహాయం చేద్దామన్న ఆలోచనలలో శ్రద్ధ, ఆసక్తి కలిగినవాడు.
తండ్రి ఉండగానే ఆయనకు కుడిభుజంగా చేతికి అంది వచ్చాడు. తండ్రి పరీక్షిన్మహారాజులా అమ్మలో లీనమైన తర్వాత ఆ యింటి బరువు బాధ్యతలు నెత్తి కెత్తుకొని చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, తమ్ముల పెళ్ళిళ్ళు చేసి పైకి తెచ్చాడు. తనకు నలుగురు ఆడపిల్లలు. అందరినీ చదివించి తగిన వరులకిచ్చి వివాహం జరిపించాడు. తల్లిమాట జవదాట కుండా బాధ్యతలు నిర్వర్తించాడు.
ఒకసారి లక్ష మారేడు దళాలతో నాన్నగారికి పూజచేయాలని భావం కలిగింది. అమ్మ అంగీకరించి, శాస్త్రి భుజస్కంధాలపై పెట్టింది. దానిని నిర్విఘ్నంగా నెరవేర్చి అమ్మ ప్రశంసలు పొందాడు. ఒక శివరాత్రికి అనసూయేశ్వరాలయంలో మహారుద్రాభిషేకం జరిగింది. అభిషేకానంతరం అందరికీ శాస్త్రి తీర్థం వేశాడు. చివరలో అమ్మ శాస్త్రినిపిలిచి ఒరే అందరికీ తీర్థం వేసి నాకేయవేంటిరా అని అడిగి తీర్థం వేయించుకున్నది. అమ్మ అందరికీ తీర్థం వేసేది శాస్త్రి చేత తీర్థం అమ్మ వేయించుకొని శాస్త్రికి ధన్యత కలిగించింది.
కేశవశర్మ జిల్లెళ్ళమూడి ఆలయాలలో వైభవంగా జరగాలని భావించి శ్రమించినవాడు. కేశవ శిష్యునిగా ఆ ఆలోచనలు పుణికి పుచ్చుకొన్నాడు శాస్త్రి. కేశవశర్మ అమ్మ నడిగి వారి తండ్రి దగ్గర శ్రీచక్రార్చన, షోడశి మంత్రోపదేశం పొందాడు. జీవించి ఉన్నంతవరకు నిత్యార్చన చేసేవాడు. ఆ కేశవశర్మ వద్ద ఆ అర్చనా విధానము మంత్రోపదేశము శాస్త్రి పొంది మంత్రోపాసన చేసేవాడు.
జిల్లెళ్ళమూడి అనసూయేశ్వరాలయంలో అమ్మ సూచించిన గర్భస్థ శిశువుల విగ్రహాలు కేశవ సూచించిన రీతిలో చెక్కించి ప్రతిష్ఠ చేసిన సందర్భంలో క్రతుకలాపాల బాధ్యతను స్వీకరించి మహోన్నతంగా నిర్వహించాడు. అనసూయేశ్వరాలయ చరిత్రలో అదొక సువర్ణాధ్యాయం. హైమమ్మను లక్షగాజులతో అలం కరించారు.
ఏ యజ్ఞం జిల్లెళ్ళమూడిలో జరిగినా దానికి తగిన హోమ ద్రవ్యాలు సేకరించి తెచ్చే బాధ్యత శాస్త్రి స్వచ్ఛందంగా స్వీకరించేవాడు. పంచపల్లవాలు, ఫలరసాలు, విప్పపూవు వంటివి వివిధ రకాలు తెచ్చేవాడు. ఆ పనుల పట్ల రక్తి ఉండేది. తరతరాలుగా వారి పూర్వీకులు యజ్ఞాలు నిర్వహించినవారు. ఆ వాసన బాగానే పట్టింది. ఇంటి పేరే జన్నాభట్లవారాయె. జన్నం అంటే యజ్ఞం కదా!
అన్నపూర్ణాలయానికి నిలవ పచ్చళ్ళు పెట్టే సమయాలలో ఊరగాయలకు చింతకాయలు, నిమ్మకాయలు, మామిడికాయలు బస్తాలు బస్తాలు తెచ్చేవాడు. ఆవకాయ,మాగాయలు ఇంట్లో పెట్టించి, మొదటి నివేదన అమ్మకు చేసి అందరింట్లో వాడిం తర్వాతనే వాళ్ళ ఇంట్లో వాడుకొనేవారు. ఈ రకమైన ఆచారం అడవుల దీవి వారిలో కూడ నేను చూచాను. పూలదండలు, మామిడిపళ్ళు తాను జిల్లెళ్ళమూడి వస్తూ ఆలయాలకు కావలసిన పూలు తెచ్చేవాడు.
నిడదవోలులో గణపతి నవరాత్రులు ప్రతి సంవత్సరం అక్కడి వ్యాపారస్థుల, పండితుల సాయంతో నిర్వహిస్తుండేవాడు. ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడెక్కడి కవులను, పండితులను పిలిపించి ఉపన్యాసాలు, రూపకాలు, సద్దోష్ఠులు, సంగీత నాట్య కార్యక్రమాలు నిర్వహించేవాడు. ఇవి ఎవరైనా, ఎచటైనా చేస్తుంటారు. కానీ నిత్యం ప్రసాదాలతో అమ్మ పూజ నిర్వహించి కొన్ని వేలమందికి సమారాధన చేసేవాడు.
ఈ విషయంలోనే ఇంకొక విషయం కూడా చెప్పాలి. గోదావరి, కృష్ణా పుష్కరాల సందర్భంగా శ్రీ విశ్వజననీపరిషత్ పక్షాన 12 రోజులు కొన్నివేలమందికి అన్నవితరణ కార్యక్రమం, అమ్మపూజలు, ఉపన్యాసాలు నిర్వహించి పెద్ద రాజకీయ నాయకులను, పండితులను పిలిచి గౌరవించేవాడు ప్రారంభింప చేసేవాడు.
ఒకసారి నేనూ, పొత్తూరివారు తిరుమల వెళ్ళాం. అప్పుడు మాతో శ్రీ వీరభద్రశాస్త్రి కూడా వచ్చాడు. నిడదవోలులో, వేంకటేశ్వర కల్యాణం టిటిడిచే ఏర్పాటు చేయించాలని అప్పుడు శ్రీ యల్.వి. సుబ్రహ్మణ్యం గారు ఇ.ఒ.గా ఉన్నారు. మేము వారిని కలిసి వారికి ఈ విషయం చెప్పాం. వెంటనే అంగీకరించారు. శాస్త్రి ఏర్పాటు చేశాడు. వైభవంగా జరిగింది.
శాస్త్రి దగ్గర మరో ప్రత్యేక లక్షణం చుట్టూ చేరిన వారిని నవ్వించగలగటం. అమ్మవద్ద చిత్ర విచిత్రమైన హాస్య సంభాషణలతో అమ్మను, చుట్టూ చేరిన జనాన్ని పొట్టచెక్కలయ్యేటట్లు నవ్వించేవాడు. సహజంగా వ్యాపార సంస్థలో పనిచేసినవాడు కావటం వల్ల వివిధ వ్యక్తులలో ఉన్న హావభావ చాతుర్యాన్ని ఆ పలికే తీరులోని విన్యాసం మనకు హాస్యాన్ని ఆనందాన్ని కలిగించేది.
అమ్మ వద్దకు వచ్చే సోదరులం రాచర్ల లక్ష్మీనారాయణ, పి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్, బ్రహ్మాండం రవి, వీరభద్రశాస్త్రి కలిసి ఒక జనరల్ స్టోర్స్, గుంటూరులో నిర్వహించాలని భావించారు. ఆషాపుకు “హైమ జనరల్ స్టోర్స్” అని పేరు పెట్టి సుమారు ఒక సంవత్సరం నిర్వహించారు. జన్నాభట్ల రాము ఆషాపు నిర్వాహకుడు. నిత్యం సుమారు వెయ్యిరూపాయలు దాకా అమ్మకం జరిగేది. కాని సరియైన నిర్వహణా సామర్థ్యం లోపించి ఒక సంవత్సరంలోనే మూసివేయటం జరిగింది.
వీరభద్రశాస్త్రి వ్యాపారంలో చేరిన మొదటి రోజులలో రాజదూత్ మోటారు సైకిల్ మీదనే ఊళ్ళన్నీ తిరుగుతుండే వాడు. శాస్త్రికి మించిన బరువుగా ఉండేది ఆ వాహనం. దాని మీద నుండి ఒకసారి పడి గూడ జారిపోయింది. అది సరికావటానికి చాలాకాలం పట్టింది. అమ్మ దయవల్ల బాగుపడ్డా దాని బాధ చాలకాలం ఉన్నది. అమ్మ ఇక మోటారు సైకిలు వాడవద్దని చెప్పింది. ఆ తర్వాత కంపెనీవారు చిన్న కారు ఏర్పాటు చేశారు. అప్పటి నుండి కారులోనే జిల్లెళ్ళమూడి గాని ఏ ఊరైనా-
ఇంటికి పెద్దకుమారుడై తల్లిదండ్రులపట్ల వినయ విధేయలతో డెబ్భై ఏళ్ళు వచ్చినా ఆ గౌరవాన్ని మన్నిస్తూ జిల్లెళ్ళమూడి సోదరీసోదరుల పట్ల ఎంతో ఆదరంగా ఉండే వ్యక్తులలో వీరభద్రశాస్త్రి ఒకడు. జిల్లెళ్ళమూడి వచ్చి అందరింటి బాధ్యతలు నిర్వహిస్తాడని అనుకున్న రోజులలో అకస్మాత్తుగా ఈ కరోనావ్యాధితో అమ్మలో లీనం కావటం నిజంగా పరిషతు పూడ్చలేని లోటు. ప్రధానంగా జిల్లెళ్ళమూడి ఆలయాల వైభవానికి. 1948 లో విజయవాడలో మాతామహుల ఇంట్లో జన్మించిన శాస్త్రి, 2021 మే 18న కూతురు ఇంట్లో కాకినాడలో అమ్మలో లీనమైనారు. ధన్యులు.
శ్రీ బులుసు లక్ష్మీప్రసన్న సత్యనారాయణశాస్త్రి:
(9.8.1935 రాజోలులో జననం 16.5.2021 కాకినాడలో అమ్మలో ఐక్యం)
కాకినాడ శాస్త్రిగారుగా, బులుసు శాస్త్రిగారుగా, అన్నయ్యగా జిల్లెళ్ళమూడి సోదరీ సోదరులకు పరిచితుడైన శ్రీ శాస్త్రిగారు 1973లో అమ్మ స్వర్ణోత్సవాల సమయంలో జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మలోని అతిలోక సౌందర్యాన్ని, విశ్వజననీత్వాన్ని దర్శించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజోలులో సోమనాథ శాస్త్రి, శేషమ్మలకు జన్మించారు. తండ్రి అష్టావధాన, శతావధానాలు చేశారు. వీరు ఆ జిల్లా కలెక్టరాఫీసులో ఉద్యోగించారు. పరంపరగా వచ్చిన రచనా వ్యాసంగము – కవిత్వము – పాండిత్యము వీరికి అబ్బినవి. దాదాపు 15 పుస్తకాలు వ్రాశారు. అమ్మను గూర్చి, అమ్మబోధల ప్రభావంతోనూ వ్రాసినవి కూడా ఉన్నాయి. మొదట్లో హేతువాదిగా జీవితాన్ని ప్రారంభించి శంకర వేదాంతం పట్ల అభిమానాన్ని పెంచుకొని రాణి నరసింహ శాస్త్రిగారి వద్ద భాష్యత్రయ శ్రవణం చేశారు. జిల్లెళ్ళమూడి వచ్చేవారిలో సంప్రదాయ వేదాంతాన్ని ఇంతగా అధ్యయనం చేసినవారు అరుదు.
శ్రీ విశ్వజననీపరిషత్లో ఒక దశాబ్దం పాటు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అందరింటి ఆవరణ అభివృద్ధికి ఎంతో సేవచేశారు. అనసూయేశ్వరాలయంలో పాలిష్గాయి తాపడం చేయటం గాని, మాతృశ్రీ గ్రంథాలయానికి ఒక లక్షరూపాయలు విరాళం ఇవ్వటంలో గానీ, హనుమదాలయ నిర్మాణానికి గాని, విద్యార్థినుల వసతి గృహనిర్మాణానికి గాని, మరే కార్యక్రమానికైనా ముందుగా విరాళం ప్రకటించేవారు. వేద పాఠశాలను ప్రోత్సహించారు. ఉద్రేక స్వభావి. కాని కల్మషం లేని నిక్కచ్చి మనిషి. ద్రాక్షరామం వద్ద వేదపాఠశాల నెలకొల్పారు. జిల్లెళ్ళమూడిలో వచ్చినప్పుడు ఉండటానికి ఒక నివాసం ఏర్పాటు చేసుకొన్నారు. జిల్లెళ్ళమూడిని అష్టమ ముక్తిక్షేత్రంగా అభివర్ణించారు.
అమ్మతత్త్వాన్ని అధ్యయనం చేసినవారు. తెలుగులో మహావాక్యం, పదార్చన 3 భాగాలు, కృష్ణం వందే జగద్గురుం, బోధే కార్యం కథం భవేత్, అక్షరం వీధిని పడింది, సబ్రహ్మ స్సశివ స్సహరిః శోక్షర పరమస్వరాట్, మాండూక్యోపనిషత్, భగవద్గీతలో చివరి శ్లోకం, వివిదిష మేను-నేను, ఓం మిదక్షరమిదం సర్వం, వాసుదేవమూర్తి, శంకరులు – అద్వైత సిద్ధాంతము, తీర్పు-న్యాయము, వహ్నిశిఖలు, ఒక భోగి ఆత్మకథ, విజయేంద్ర భాస్కరశర్మ వంటి గ్రంథాలెన్నో వ్రాశారు. వారి కొన్ని గ్రంథాలకు ముందు మాట వ్రాసే అవకాశాన్ని నాకు కల్పించారు కూడా.
వారి పెద్దకుమారుడు సోమసుందరశాస్త్రి అర్థాంతరంగా అమ్మలో కలిసినప్పుడు వారి నవనాడులు కృంగిపోయినట్టుగా భావించారు. ఎందుకు అని అడగకుండా లక్షలు లక్షలు ధనం దానధర్మాలకు సత్కార్యాలకు ఇచ్చేవాడు. వారి తండ్రి గారి పేరే పెట్టుకున్నారు అతనికి.
అమ్మతో తన మాండూక్యోపనిషత్ ప్రచురించే ముందు అమ్మకిచ్చారు చూడమని ఆ గ్రంథాన్ని. అమ్మ దీంట్లో వారి వారి అభిప్రాయాలు చెప్పావు. నీ అభిప్రాయ మేమిటి నాన్నా! అని అడిగింది. గంజాయి మొక్క తులసిమొక్క వేరంటావా? అన్నది. అంతా అమ్మే నమ్మా! అన్నారు శాస్త్రిగారు. అదే దీంట్లో వ్రాశావా? అన్నది. అవునమ్మా! అన్నారు. అమ్మకే ఆ గ్రంథాన్ని అంకితం చేశారు.
అమ్మను గూర్చి చెపుతూ శ్రోత్రియులు ఆచారపరుల సరసన అంత్యజులైన వారిని భోజనానికి కూర్చోబెట్టింది. అమ్మ తెచ్చిన నిశ్శబ్ద సాంఘిక విప్లవం ఇది అన్నారు. లౌకికంగా, ఆధ్యాత్మికంగా బిడ్డలకు అన్ని అవసరాలు తీర్చింది. ‘యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ” అని వేదం వర్ణించే మాటలకు కూడా అందని ‘మహత్తరశక్తి అమ్మ’ అని గుర్తించారు. అమ్మ మహాతల్లి. మన మనస్సు చిన్న కొలబద్ద. అది అనంత తత్త్వాన్ని గ్రహించలేదు. అమ్మను తెలుసుకోవాలంటే మనమూ అమ్మలం కావాలి అని వారు సోదరులకు సందేశం ఇచ్చారు.
నెల్లూరు డాక్టర్ శిష్ట్లా వెంకట సుబ్బారావు
(20.5.2021 అమ్మలో ఐక్యం)
అమ్మను భక్తి ప్రపత్తులతోనూ, వైద్యంతోనూ ఆరాధించిన మహామనీషి డాక్టర్ శిష్ట్లా సుబ్బారావు గారు. అసలు గుంటూరు వారు. గుంటూరులో వైద్య విద్య అభ్యసించారు. నెల్లూరులో దేవుడు వైద్యునిగా ప్రసిద్ధి వహించారు. అమ్మకు వైద్యం చేయాల్సివస్తే మేము మందు లిస్తున్నా తగ్గించుకోవాలిసింది నీవే నమ్మా అని మందును నివేదన చేసినట్లు ఇచ్చేవారు. జిల్లెళ్ళమూడిలో ఎవరికి అనారోగ్యంతో అవసరం వచ్చినా వారి వద్దకే పంపేది. అత్యవసరమైతే జిల్లెళ్ళమూడి పిలిపించేది. జిల్లెళ్ళమూడిలో హాస్పిటల్ సేవకు డాక్టర్ ఇనజకుమారికి కావలసిన తర్ఫీదునిచ్చి ప్రధమ వైద్యురాలిగా పంపి అమ్మ చేత ప్రధమంగా పరీక్ష చేయించుకున్నారు.
శ్రీ పన్నాల రాధాకృష్ణశర్మగారి కుమారునికి అనారోగ్యం చేసి కాత్యాయని బాధపడుతుంటే డాక్టర్ గారి వద్దకు నెల్లూరు పంపింది. ఇంట్లో పెట్టుకొని సొంత మనుషులుగా వైద్యం చేశారు.
అమ్మకు ప్రధానంగా చిన్నకారు సమర్పించారు. అమ్మ సేవచేసే అన్నపూర్ణను తన తమ్ముడు దక్షిణా మూర్తితో వివాహం కావించారు. అమ్మ అనారోగ్యంతో నెల్లూరులో ఉంటే తన ఇల్లే అన్నపూర్ణాలయంగా మార్చారు. అమ్మ వారింట్లో ఉన్న రోజుల్లో అడవులదీవి మధు తండ్రి ఆబ్దికం వస్తే అతడు రాకముందే అన్ని ఏర్పాట్లు చేయించారు. ఒకరకంగా డాక్టర్ సుబ్బారావు గారు కర్మయోగి, ధర్మయోగి, వైద్యయోగి. అమ్మ యెడల అచంచల విశ్వాసం కలవారు. 20.5.2021 గురువారం నెల్లూరులో అమ్మలో ఐక్యమైనారు. వారి కుటుంబానికి శ్రీ విశ్వజననీపరిషత్ సానుభూతి తెలియచేస్తున్నది.
శ్రీ పుప్పాల వెంకయ్య
(14-4-2021 అమ్మలో ఐక్యం)
చీరాల డాక్టర్ గారితో కలసి అమ్మ దర్శనార్థం వచ్చే సమూహంలో వెంకయ్యగారు ఒకరు. చీరాలలో సానిటరీ ఇన్పెక్టర్గా చేస్తుండేవారు. అమ్మపట్ల అచంచల విశ్వాసంతో జిల్లెళ్ళమూడి సేవలలో పాల్గొనేవారు. జిల్లెళ్ళమూడి అందరింటి పరిసరాల పరిశుభ్రత విషయంలో తన పరిధిలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ శ్రీ విశ్వజననీ పరిషత్కు సాయపడుతుండేవాడు. బాపట్లలో కొంతకాలం ఉద్యోగించి గుంటూరు చేరాడు. గుంటూరు మాతృశ్రీ అధ్యయన పరిషత్ ఉపాధ్యక్షులుగా ఉండేవారు. సౌమ్యస్వభావుడు, పరోపకారి, జిల్లెళ్ళమూడి సోదరీ సోదరులు పట్ల ఎంతో ఆదరంతో ఉండేవారు. వారు, వారి భార్య శ్రీమతి కస్తూరి ప్రతి నెల జరిగే అమ్మ పూజలలో తప్పకుండా హాజరవుతూ, వారింట్లో కూడా పూజలు నిర్వహించేవారు. గత నాలుగైదేళ్ళుగా అనారోగ్యంతో (షుగరు, గుండెజబ్బువంటివి) ఎక్కడకు కదలటం లేదు. 14.4.2021 న అకస్మాత్తుగా గుంటూరు స్వగృహంలో క్రిందపడి అమ్మలో ఐక్యమైనారు.
శ్రీమతి ఎక్కిరాల అలివేలు మంగతాయారు
(3-6-2021 అమ్మలో ఐక్యం)
జిల్లెళ్ళమూడి వెళ్ళిన క్రొత్తలో రాజుబావ పాటలు అమ్మ మీద వ్రాసినవి గంగరాజు వెంకటేశ్వర్లు గారు గానం చేస్తుండేవారు. రాజుపాటలు అమ్మ చరిత్రలో కూడా స్థానం సంపాదించుకొన్నవి. రాజుబావ చెల్లెళ్ళు ఆ పాటలు పాడుతుండేవారు. 1958-59 ప్రాంతాలలో తంగిరాల కేశవశర్మ నేను గుంటూరులో రాజుబావ తండ్రి బాలకృష్ణశర్మ గారు ఎలిమెంటరీ పాఠశాల ఉపాధ్యాయుడుగా ఉంటే వాళ్ళింటికి వెళ్ళుతుండేవాళ్ళం. రాజుబావ పాటలు, అప్పుడప్పుడు వ్రాసిన క్రొత్తపాటలు పాడించుకొని వింటుండే వాళ్ళం. బాగా పాడేవాళ్ళు. రాజుబావ చెల్లెలే కదా మంగా. ఆ పాటలలో ఉన్న మాధుర్యం అలాంటిది. ఆ తర్వాత జిల్లెళ్ళమూడిలో అమ్మ సేవలో వచ్చి ఉండేవారు. బాల, మంగ ఇద్దరూ అక్క చెల్లెళ్ళు. జిల్లెళ్ళమూడిలో చెయ్యని పని అంటూ లేదు. చెరువు నుండి నీళ్ళు తెచ్చేవారు. పొలం పంట కోతలకు వెళ్ళేవారు. ఇసుక లారీల మీద వెళ్ళి ఇసుక తెచ్చేవారు. ‘బాల’ అమ్మ దినచర్య కొంత కాలం వ్రాసింది.
1966-67లలో సోదరుడు శ్రీ ఎక్కిరాల భరద్వాజ జిల్లెళ్ళమూడి రావటం మొదలైన తర్వాత బ్రహ్మాండం హైమ, ‘మంగా’ అతడితో సాన్నిహిత్యం ఏర్పడి యోగసాధనలు, సాయిచరిత్ర, పారాయణలు చేయటం జరిగింది. తర్వాత భరద్వాజ మంగను వివాహం చేసుకొన్నాడు.
బాల, మంగ జిల్లెళ్ళమూడిలో ఉన్నరోజులలో బాలకృష్ణశర్మగారు మన్నవలో అమ్మలో లీనమైనట్లు కబురు వచ్చింది. అమ్మ నన్ను పిలిచి వాళ్ళిద్దరినీ మన్నవ తీసుకెళ్ళు. మన్నవ వారింటికి చేరేవరకు వాళ్ళ నాన్న చనిపోయినట్లు చెప్పకు అన్నది. సరేనని మీ నాన్నకు బాగోలేదు, మిమ్మల్ని అర్జంటుగా రమ్మన్నారు అని పొన్నూరు తీసుకెళ్ళి అక్కడ నుండి ఒంటెద్దు బండిలో మన్నవ తీసుకెళ్ళి దించి వచ్చాను.
ఆ తర్వాత మంగను ఒకసారి ఒంగోలులో భరద్వాజ ఇంటికి వెళ్ళినపుడు చూచాను. అప్పటికే మంగకు ఇద్దరు పిల్లలు. నడుములు పడిపోయి అన్నీ మంచంలోనే. నేను చూద్దామని కాసేపు కూర్చున్నాను. స్నానం చేయించి శిష్యురాండ్రు తెచ్చి మంచం పైన కూర్చోబెట్టారు. ఏలా ఉన్నావు మంగా అని పలకరించాను. బాగానే ఉన్నా నన్నది. భరద్వాజతో మాట్లాడి వచ్చేశాను.
ఆ తర్వాత మంగను చూడటం తటస్థించలేదు. హైదరాబాద్ లో ఉంటుందని తెలిసింది. వెళ్ళి చూద్దామను కున్నాను గాని కారణాలేమైనా కుదరలేదు. జిల్లెళ్ళ మూడిలో కలసి పనిచేసిన రోజులు జ్ఞప్తి కొస్తున్నాయి. “3-6-2021 గురువారం అమ్మలో ఐక్యం” అయిందని తెలిసి విచారించాను.
శ్రీ చింతలపాటి నరసింహదీక్షితశర్మ
(10-5-2021 అమ్మలో ఐక్యం)
మధురకవి, కవిరాజమౌళి, అవధాని, ఆశుకవి, ఆదర్శ ఉపాధ్యాయుడు శ్రీ నరసింహదీక్షిత శర్మగారు. వారు శతాధిక గ్రంథకర్త. ప్రత్యేకించి అమ్మను గూర్చి ‘విశ్వజననీచరితమ్’ సంస్కృత శ్లోకాలలో రచించారు. శ్రీ తంగిరాల కేశవశర్మగారి తోడల్లుడు. జిల్లెళ్ళమూడిలో సత్కారం పొందారు.
పొన్నూరు, హైదరాబాద్లో ఆంధ్ర, సంస్కృత భాషలలో విద్యాప్రవీణులై గుంటూరుజిల్లాలో జిల్లా పరిషత్ పాఠశాలలో పండితునిగా పనిచేశారు. రైతుగా, కావ్యరచయితగా సుప్రసిద్ధులైన శర్మగారు 1.9.1927లో జన్మించి 95 ఏళ్ళప్రాయంలో 10.5.2021 సోమవారం మాసశివరాత్రి నాడు గుంటూరుజిల్లా కోగంటివారి పాలెంలో అమ్మలో ఐక్యమైనారు. వారి కుటుంబానికి అమ్మ ఆశీస్సులు.