1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సంపాదకీయము… అమ్మ (అనంతోత్సవాలు) ఆలయ ప్రవేశ రజతోతత్సవాలు

సంపాదకీయము… అమ్మ (అనంతోత్సవాలు) ఆలయ ప్రవేశ రజతోతత్సవాలు

P S R Anjaneya Prasad
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : August
Issue Number : 1
Year : 2010

అమ్మ అంటే అంతకూ ఆధారమైనది అని అర్ధం చెప్పింది. అమ్మ సంతకం చేయటం కూడా ‘అంఆ’ అని. అంతులేనిది, అడ్డు లేనిది, అంతా అయినది, అర్థంకానిది అదే. అని కూడా చెప్పింది. అమ్మ చెప్పిన ఆ మాటల అర్థం గ్రహిస్తే చాలు, అమ్మ అంటే మనకర్థ మౌతుంది. సృష్టి స్థితి లయాలకు మూలకారకులైన త్రిమూర్తులను కూడా సృష్టించిన ఆదెమ్మ (ఆది + అమ్మ) అమ్మ. మన అదృష్టవశాత్తూ పరిమితమైన రూపంలో వచ్చిన అపరిమిత అనంతశక్తి మళ్ళీ అనంతమూర్తియైన సందర్భంగా చేసుకుంటున్న పండుగ అనంతోత్సవం.

అమ్మ బాల్యంలో తనకు ఈ శరీరాన్నిచ్చిన తల్లి చనిపోతే అందరూ ఏడుస్తున్నారు. ఎందుకు వీరంతా ఏడుస్తున్నారు ? అని అడగ్గా మీ అమ్మ పోయింది గదా! అందుకు అన్నారు. మా అమ్మ ఎక్కడకు పోయింది ? అని అడగ్గా – భగవంతుని దగ్గరకు అని చెప్పారు. అసలు ఎక్కడ నుండి వచ్చింది ? అంటే భగవంతుడి దగ్గర నుండే అన్నారు. భగవంతుడి దగ్గర నుండి వచ్చిన అమ్మ భగవంతుడి దగ్గరకే వెళ్ళితే ఎందుకు ఏడవడం ? అని అడిగింది. వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు.

అమ్మ తన శరీరాన్ని ఆలయంలో చేర్చటానికి నిర్ణయించుకొన్న రోజులలోనే “అమ్మ అంటే ఈ మంచం మీద కూర్చున్న అమ్మ అనే కాదుగా ! నేను శరీరంలో ఉన్నప్పటి కంటే ఇంకా ఎక్కువగా మీకు కనపడుతుంటాను ఎక్కువగా తోడ్పడుతుంటాను” అన్నది. నిజానికి మన అనుభవం కూడా అదే.

అమ్మ తాను ఆలయంలో ప్రవేశించిన 12.6.1985 నుండి ఇప్పటికి అంటే 12.6.2010 నాటికి 25 సంవత్సరాలైంది. ఒక కార్యక్రమం 25 సంవత్సరాలు నిర్విఘ్నంగా కొనసాగుతుంటే అది సంస్థకానివ్వండి. కార్యక్రమం గానివ్వండి. రజతోత్సవాలు చేయటం ఒక సంప్రదాయం. అంటే మామూలుగా చేసే దానికంటే ఆ కార్యక్రమాలను వైభవంగా, ఇంకా ఎక్కువమందికి తాము చేస్తున్న పని తెలియచేయటానికి ఇంకా ఉత్తేజంతో ముందుకు సాగటానికి నూతనశక్తిని, స్ఫూర్తిని పొందటానికి సేవ చేయడానికి అది దోహదం చేస్తుందని ఈ విధమైన రజతోత్సవాలు, స్వర్ణోత్సవాలు, వత్రోత్సవాలు చేయటం. పేరేదైనా పెట్టండి దాని వెనుక నున్న పరమార్థం మాత్రం అదే. 

ఈ రజతోత్సవాల సందర్భంగా అనసూయేశ్వరాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగుతున్నది శ్రీ విశ్వజననీపరిషత్, ఆలయానికి కావలసిన అన్ని హంగులూ ఏర్పాటు చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నది.

అన్నపూర్ణాలయ స్వర్ణోత్సవాల సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి బాలుర (హాస్టల్) వసతి గృహాన్ని పూర్తి చేయటం జరిగింది. అలాగే అన్నపూర్ణాలయ భోజనశాలను కూడా సర్వవసతులతో నిర్మించాలని సంకల్పించారు. అది ఇదిగో ఈ అనసూయేశ్వరాలయ, రజతోత్సవ సంవత్సరంలో పూర్తిచేయాలని తగు వనరులు చేకూర్చుకొంటున్నారు. దానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబడింది. అమ్మకు ఇష్టమైన ఈ అన్నపూర్ణాలయభవన నిర్మాణానికి అందరూ స్పందించి తమ వంతు సహాయ సహకారాలందించాలి.

శ్రీ విశ్వజననీపరిషత్ కార్యకారిణీ (Executive Body) సభ్యులు ఈ మధ్యనే సమావేశమై ఈ సంవత్సరమంతా వివిధ ప్రదేశాలలో ఈ రజతోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలనీ, కనీసం 25 చోట్ల అమ్మ సందేశ వ్యాప్తికి సభలు పూజలు ఏర్పాటుచేయాలనీ నిర్ణయించింది. అలాగే అమ్మకు సంబంధించిన అమ్మ జీవిత చరిత్ర, సంస్థ చేస్తున్న వివిధ సేవాకార్యక్రమాలు తెలిపే గ్రంధాలు చౌకగానూ, ఉచితంగానూ సోదరీ సోదరులకు అందించాలని కూడా భావించింది. అలా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయటానికి కొందరు గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్టణం, సూరంపల్లి మాతృశ్రీ అధ్యయనపరిషత్తులు, అమ్మ సేవాసంస్థలు ముందుకు వచ్చాయి.

ఈ సంవత్సరంలోనే సోదరీ సోదరులు కొందరు ముందుకు వచ్చి ఇక్కడ సంస్కృతం చదివే విద్యార్థినీ విద్యార్థులకు కంప్యూటర్ విద్యా సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రత్యేకించి ఇంగ్లీషు భాషలో నైపుణ్యం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ చదివిన విద్యార్థి బయటకు వెళ్ళిం తర్వాత నాకు జీవన భృతి లేదే అని బాధపడకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకొంటున్నారు.

అమ్మ స్వర్ణోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసుకొన్న ఏడవమైలు దగ్గరి ముఖద్వారం ప్రభుత్వం వారు మురుగుకాలువపై క్రొత్త వంతెన నిర్మాణానికి తొలగించటం జరిగింది. దానిని మళ్ళీ పునర్మించుకొనే ప్రయత్నాలు జరుగుతున్నవి.

ఆదరణాలయం నిర్మించుకోవాలని చిరకాలంగా ఎదురుచూస్తున్నాం. సోదరులు శ్రీ తంగిరాల కేశవశర్మగారి కుటుంబం దాని నిర్మాణానికి అయ్యే ఖర్చు భరించటానికి ముందుకు వచ్చారు. దానిని కూడా ఈ సంవత్సరమే పూర్తిచేసి ఆచరణలోకి తీసుకొని వచ్చే ప్రయత్నం సాగుతున్నది. అంతేకాక బాపట్లలోని ఒక వృద్ధాశ్రమం మన సంస్థయాజమాన్యం ద్వారా నడుపవలసిందిగా ఆ ఆశ్రమాధిపతుల నుండి ఒక దరఖాస్తు వచ్చింది. శ్రీ విశ్వజననీపరిషత్ కార్యవర్గం దానికి అంగీకారం తెలిపింది. అమ్మ ఆదరణలో పెరిగిన మనమంతా అమ్మ చెప్పినట్లుగా ఏ ఆధారమూ లేనివారికి, అనాథలకు, ఆర్థికవనరులున్నా చూచేవారు లేని వారికీ, పిల్లలున్నా ఏ దూరతీరాల లోనూ ఉంటూ తగుసపర్యలు పొందలేనివారికీ, అన్నిరకాల ఇతరులపై ఆధారపడిన వారికీ తగురీతిలో ఆదరణతో, ఆప్యాయంగా సేవచేయటానికి తగిన ఏర్పాట్లకు సంకల్పంలో భాగమే. ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అమ్మ అనుగ్రహంతో జి.యం.ఆర్. సంస్థవారు అందరింటికీ, జిల్లెళ్ళమూడి గ్రామస్తులకు శుభ్రపరచిన శుద్ధమైన నీరు అందించే ప్రయత్నం చేశారు. గ్రామస్థులకు, విద్యార్థులకు, ఆశ్రమవాసులకు ఆరోగ్యాన్ని చేకూర్చే మంచి పధకం. దానికి సంబంధించిన ఫిల్టర్ బెడ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం.

ఈ సంవత్సరమే వేదపాఠశాల ప్రారంభించాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దాని కొరకు ఒక తాత్కాలిక భవన నిర్మాణం కూడా జరిగింది. త్వరలోనే ప్రారంభింప బడుతున్నందుకు సంతోషం.

అమ్మ ఫోటోలు కొన్ని వేల సంఖ్యలో తీయబడినవి ఉన్నాయి. అలాగే అమ్మ సినిమా ఫిలిమ్, ఏన్నో వీడియో టేపులు ఆయా ఉత్సవాలలో తీసినవి ఉన్నాయి. అమ్మవాడిన వస్తువులున్నాయి. భావితరాలకు వాటిని అందించవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది. దాని కొరకు ఒక మ్యూజియం ఏర్పాటుకావాలి. ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ముందుగా ఆరువేల ఫోటోలను సిడిలో ఏర్పాటు చేసి భద్రపరుస్తున్నారు. ఆ ప్రయత్నాలు కూడా ఈ సమయంలోనే అమలులోకి రావటం విశేషం.

ఇక “సుగతిపధం” భవన నిర్మాణం పూర్తి కావస్తున్నది. అమ్మ పదసన్నిధిలోనే తమ జీవితాలు కడతేరాలని కోరుకొనే వారెందరో ఉన్నారు. ఎక్కడ దేహం చాలించినా తమ శరీరాలకు జిల్లెళ్ళమూడిలోనే అంత్యక్రియలు జరగాలని ఎంతో మంది అభిలాష. వారి కోరిక తీరటానికి సుగతిపధ నిర్మాణం కూడా ఈ సంవత్సరమే పూర్తి కావటం కూడా అమ్మ నిర్ణయంలో భాగమే – అదీ పుణ్యపురుషుడు, ఋషితుల్యుడు శ్రీ తంగిరాల కేశవశర్మ అంత్యక్రియలతోనే ఆరంభంకావడం అమ్మ

ఏది ఏమైనా అమ్మ ఆలయ ప్రవేశ రజతోత్సవాల సంవత్సరంలో శ్రీ విశ్వజననీపరిషత్ ముందున్న మహత్తర బృహత్తర కార్యక్రమాలు సంస్థప్రగతికి నిదర్శనాలు. ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించి అమ్మ సందేశాన్ని నలుదిశలా వ్యాపింప చేయటానికి బద్ధకంకణులు కావాలని సోదరీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!