1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సంపాదకీయము.. (అమ్మ ఇచ్చిన ప్రసాదము)

సంపాదకీయము.. (అమ్మ ఇచ్చిన ప్రసాదము)

P S R Anjaneya Prasad
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 10
Month : June
Issue Number : 11
Year : 2010

అమ్మ జిల్లెళ్ళమూడికి వచ్చిన ప్రతివ్యక్తిని భోజనం చేయమని చెపుతుంది. చేసివచ్చానన్నా ఆకలివేసినంత తినమంటుంది. తానే కలిపి నోటికి ముద్దలు అందిస్తుంది. అది మహాప్రసాదంగా అందరూ తింటారు. అమ్మ చేతి ముద్ద రుచి వర్ణనాతీతం. అంతేకాదు అన్నపూర్ణాలయంలో భోజనం చేసి రమ్మంటుంది అక్కడ పెట్టేది ఎవరైనా అమ్మ అమృత హస్తం అంతర్లీనంగా మనకు కనిపిస్తుంది. అందులో ఆదరణ, ఆప్యాయత, అనురాగం చోటు చేసుకుంటుంది. బాధలకు నివారణ, అనారోగ్యానికి ఔషధము మన సమస్యలకు పరిష్కారము, మన ప్రశ్నలకు సమాధానాలు అన్నీ అందులో దొరుకుతాయి. అదీ అమ్మ ఇచ్చిన ప్రసాదము యొక్క లక్షణం. అమ్మ అన్ని పదార్థాలూ కలిపి పెట్టితే అంత రుచి ఎక్కడ నుండి వచ్చింది? పదార్థాలన్నీ కలిపితే ఆరుచి వస్తుందని మనం కలిపి తింటే ఆ రుచి రాదు. కారణం ? అమ్మ పెట్టింది ప్రసాదం మనం కలిపింది అన్నం. అమ్మ దివ్యశక్తి కరుణ అందులోకి ప్రవహిస్తుంది.

ఇక అమ్మవద్దకు వచ్చి తిరిగి వెళ్ళేవారందరికీ అమ్మ కుంకుమ పొట్లాలు ఇస్తుంది ప్రసాదంగా. సహజంగా ప్రసాదంగా తన దగ్గర ఉంటే అరటిపండో, మామిడిపండో, ఆపిలాయో ఏది దగ్గర ఉంటే అది ఇస్తుంటుంది. వాటితో పాటు కుంకుమ పొట్లాలు ఇస్తూంది. పండ్లు ఉన్నా లేకపోయినా కుంకుమ పొట్లాలు తప్పక ఇస్తుంది. చాలమంది కుంకుమ పొట్లాలు ప్రసాదం ఇచ్చినా ప్రసాదం ఇవ్వమ్మా ! అని అడుగుతారు. ఇచ్చానుగా అంటుంది. అంటే కుంకు ప్రసాదమనే భావన వారికి కలిగిస్తుంది. అదే అన్నిటికి పరిష్కారాన్ని ప్రసాదిస్తుంది. చాలమంది సోదరీసోదరులు ఈ కుంకుమతో ఎంతోమందికి ఎన్నో సమస్యలు, జబ్బులు నయం చేసినవారున్నారు.

బందరు మూర్తిగారని ఒక సోదరుడు అమ్మ వద్దకు 1970లో వచ్చాడు. అతడు చిరకాలంగా అమ్మ వద్దకు వస్తున్నవాడే. అమ్మ వద్దకు వచ్చి వంగి అమ్మ పాదాలకు నమస్కారం చేశాడు. అతడి చొక్కా జేబులోంచి ఒక బరిణె క్రిందపడ్డది. అమ్మ ఆ బరిణెను తన చేతిలోకి తీసుకొన్నది. ఆ బరిణమూత తెరిచింది. దాని నిండా కుంకుమ ఉన్నది. ఆ కుంకుమలో దాగి ఉన్న చేమంతిపూవును బయటకు తీసి తన చుట్టూ కూర్చున్న అందరకూ చూపించి ఇది 1956లోది అని చెప్పింది. ఆశ్చర్యపోవటం వారివంతయింది. ఆ పూవు రేకులు విడిపోకుండా ఎంతో భద్రంగా ఉన్నది. నాటికి 14 సంవత్సరాల నాటి ఆ పూవు చలనం లేకుండా ఎలా ఉన్నది ? అది నిత్య సత్యస్వరూపిణి అయిన అమ్మచే ప్రసాదింపబడింది. ఆ ప్రసాదమే అతన్ని రక్షిస్తున్నది. అమ్మ ప్రసాదం మనతో ఉంటే అమ్మ మనతో ఉన్నట్టే కదా! మనల్ని రక్షిస్తున్నట్టే – అందుకే చాలమంది తమ మనీ పరుస్సలో అమ్మ కుంకుమ పొట్లం పెట్టుకొని ఉంటారు. అమ్మ ఏ ప్రసాదం ఇచ్చినా దాని మహిమ అలాంటిదే. అమ్మ అన్నాన్నీ, కుంకుమనూ ప్రసాదంగా ఎన్నుకోవటం మనల్ని తరింపచేయటానికే. అమ్మ తన అనుగ్రహాన్నీ, ప్రేమనూ, ఆశీర్వచనాన్నీ, అలా ఆ కుంకుమ పొట్లం ద్వారా ప్రసాదిస్తున్నదని అనుభవించిన కొందరు మాత్రమే అర్థం చేసుకోగలరు.

అలాటి వారిలో శ్రీ లక్కరాజు లీలా వేణుగోపాల కృష్ణమూర్తిగారు ఒకరు. అంతకన్నా కఠేవరం కృష్ణమూర్తి గారనో, లక్కరాజు కృష్ణమూర్తిగారనో అంటే జిల్లెళ్ళమూడి వచ్చే చాలామంది సోదరీసోదరులకు తెలుసు. వారు అమ్మ కుంకుమను సర్వరోగనివారిణి, సర్వసంపత్ప్రదాయిని, సర్వ సమస్యా పరిష్కారిణి అంటూ తన అనుభవాలెన్నింటినో చెప్పారు. ఈ మధ్యనే జిల్లెళ్ళమూడిలో కలిసినపుడు.

వారు తమ మామిడి తోటకు వెళ్ళుతుండగా ఎదురు వచ్చిన ఒక స్త్రీ దీనంగా కనిపించింది. ఏమిటి ? ఎందుకలా ఉన్నావు ఏమైంది ? అని అడిగారు. తన భర్త తనను వదిలి వెళ్ళాడనీ చాల బాధలు పడుతున్నానీ చెప్పి ఏడ్చింది. వారు వెంటనే ఆ స్త్రీకి తన జేబులో ఉన్న కుంకు పొట్లాలు తీసి ఇచ్చి “నీ భర్త వస్తాడు – నీవు భయపడాల్సిన పనిలేదు – ఈ కుంకుమ పెట్టుకో” అన్నారు. అంతే పక్షం రోజులు తిరగకుండానే పతిదేవుడు ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు ఆమె వద్దకు. అతనికి ఈ మానసికమైన మార్పు ఎలా వచ్చింది ? కుంకుమ మహిమ పట్ల కృష్ణమూర్తి గారి విశ్వాసమా ? లేక ఆమెకు భర్త తిరిగి వచ్చే సమయం వచ్చిందా ? అమ్మ యొక్క కుంకుమ ప్రమేయం ఎంతవరకు ? అది కుంకుమ పొట్లాలిచ్చిన అమ్మకే తెలియాలి. 

ఒక స్త్రీ పొలం పనులు చేసుకొంటూ జీవించేది. గర్భం వస్తున్నది. కాని మధ్యలోనే గర్భస్రావమౌతున్నది. ఆమె చాలా బాధపడుతున్నది. ఒక రోజు కృష్ణమూర్తి గారితో ఈ విషయం ఏదో సందర్భంలో చెప్పింది. వారి వద్ద సంజీవినీ విద్య ఉన్నది కదా ! వెంటనే కుంకుమ పొట్లాలిచ్చి ఇది నీళ్ళలో కలుపుకొని తీర్థం తీసుకో, రోజూ బొట్టు పెట్టుకో, తలక్రింద పొట్లం పెట్టుకో అని ఇచ్చారు. అంతే సంవత్సరం తిరగకుండానే పండంటి బిడ్డతో వచ్చి కృష్ణమూర్తిగారి ఆశీర్వచనాలు తీసుకొన్నది.

కృష్ణమూర్తిగారు వయసులోనూ, అనుభవంలోనూ పెద్దవారే. వారి భార్యకు అనారోగ్యం చేసి హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. 15 రోజులు వైద్యశాలలో ఉన్నది. ఎన్నో మందులు వాడారు. కాని చివరకువారి కుంకుమ చిట్కావైద్యమే ఆమెకు ఆరోగ్యాన్ని ప్రసాదించింది. క్షేమంగా ఇంటికి చేర్చింది.

సహజంగా బజారులో అమ్మే కుంకుమ రకరకాల పదార్థాలతో ఆసిడ్స్తో చేయబడ్డది. చర్మానికి, ఆరోగ్యానికి హానిని కలిగిస్తుంది. అమ్మ కృష్ణమూర్తిగారితో కుంకుమ తయారుచేసే పద్ధతి చెప్పి తయారు చేసుకొని రమ్మన్నది. వారికి పసుపుతోటలున్నాయి. వారు అమ్మ చెప్పిన రీతిలో నిమ్మకాయ రసంలో పసుపు కొమ్ములు నానబెట్టి కుంకుమ తయారుచేసి ఒక బస్తా కుంకుమ తెచ్చి ఇచ్చారు. అలా ప్రతి సంవత్సరం అమ్మకు తనకు చేతనయినంత కుంకుమ తయారు చేసి అమ్మకు సమర్పించటం వారి అలవాటైంది. మొన్న మాట్లాడుతూ ఇది అమ్మ నాకు ప్రసాదించిన అవకాశం, నన్నుద్ధరించటానికి అమ్మ చేసిన ఏర్పాటిది. నేనున్నా లేకపోయినా ఈ పని ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలంటే కొంత మొత్తం సంస్థలో ఫిక్సెడ్ డిపాజిట్గా వేస్తాను. దాని నుండి వచ్చే వడ్డీతో ఈ పని యీలాగే కొనసాగించండి అని కోరాడు. నిజమే అమ్మ ఎవరికి ఎప్పుడు ఏ రకమైన ప్రేరణ ఇస్తుందో ఎవరు చెప్పగలరు ?

అమ్మ ఇచ్చే తీర్థం కూడా ఈలాటి మహాత్యం కలదే. చాలమందికి అమ్మ తన చేతివేలును తెచ్చిన నీటి చెంబులో పెట్టి తీసుకెళ్ళు అని చెప్పేది. కొంతమంది అమ్మ పాదాలు కడిగిన నీటిని తీర్థంగా సీసాలో పట్టుకొని తీసుకెళ్ళుతారు. తీర్థం సర్వరోగ నివారిణి అని చాలామంది విశ్వాసం. ఆ ఒకసారి బాపట్లలో వఝా శివరామయ్య గారు తీర్థం అయిపోగా జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మను అడిగి తీర్థం తెమ్మన్నారు. వారి కుమారుడు తీర్థం అంటే నీళ్ళే కదా !  అని బాపట్ల బావిలోని నీరే సీసాలో పట్టి తీసుకెళ్ళాడు. మరుసటి రోజుకు వాసన కొట్టాయి ఆనీరు. అమ్మ పాదస్పర్శ పొందితే కదా అది గంగాతీర్థం అయ్యేది. అమ్మ మనందరికీ తీర్థం ఇచ్చే అర్హత తనకు నాన్నగారి పాద చిహ్నాలయిన మంగళసూత్రాలను అభిషేకించి ఆ పవిత్ర జలాన్ని తాను తీసుకుంటున్నందువల్ల తనకు వచ్చిందంటుంది అమ్మ. పతివ్రతలకందరికీ అమ్మ ఇచ్చే ఆచరణీయమైన సలహా అది. అకాలమృత్యుహరణం, సర్వవ్యాధి నివారణ అనసూయా పాదోదకం పావనం శుభదం శుభం అని మనం నిత్యం తీసుకొనే ఆతీర్థంలో అమ్మ అనుగ్రహమే ప్రసారమౌతుంటుంది. ఆశక్తి ప్రసరణ అందరికీ సాధ్యమెలా అవుతుంది ?

జిల్లెళ్లమూడి వచ్చేవారిలో గోపాలన్నయ్య తెలియని వారుండరు. వారి కొకప్పుడు కడుపులో అల్సర్ వల్ల అన్నం తింటే వాంతులయ్యేవి. ఏది తిన్నా అంతే. ఏమీ లోపల ఇమిడేది కాదు. అమ్మ పాలు త్రాగరా ! అన్నది. ఎక్కడకు వెళ్ళిన పాలు తీసుకొనేవాడు. ఒకసారి మద్రాసు వెళ్లాల్సి వచ్చింది. నేను పాలిస్తాను రారా ! అన్నది. అమ్మవద్ద పాలు త్రాగటానికి ఆయనేమన్నా పసిపిల్లవాడా ! మొహమాటమేసింది. ఊరికి బయలుదేరాడు. రైల్లో కల వచ్చింది. అమ్మ తన వద్ద పడుకుని తనకు పాలిచ్చింది. మెలకువ వచ్చిన తర్వాత నోరంతా పాలవాసన వచ్చింది. ఎవరమైనా అమ్మ పాలిటి వారిమే కాని అమ్మ తన అమృత కలశాలతో గోపాలన్నయ్యకు పాలివ్వటం వల్ల ఆయన అమరుడైనాడు. లేకపోతే గోపాలన్నయ్యకు జరిగిన ఎన్ని ప్రమాదాల నుండి ఆయన రక్షింపబడ్డాడో! అదీ ఆ మాతృమమతామృతపు క్షీరమానిన మహాత్మ్యం.

అమ్మ తనచూపు ద్వారా, తన స్పర్శ ద్వారా, తనిచ్చిన కుంకుమ పొట్లం ద్వారా, తన తీర్థం ద్వారా అన్నపూర్ణాలయంలో అన్నం ద్వారా ఏలా ప్రసాదిస్తుందో! ఎలా ప్రసరిస్తుందో చెప్పలేము కాని అమ్మ ఇచ్చిన ప్రసాదం ప్రభావం ఎందరి జీవితలానో ప్రభావితం చేసింది. జిల్లెళ్ళమూడి వచ్చిన అందరి జీవితాలపై తన ముద్ర వేసింది. ఇతరులపై అమ్మ ప్రభావం ఉండదా అంటే ఉంటుంది. వీళ్ళు గుర్తించినట్లుగా మిగతావారు గుర్తించలేరేమో! అనిపిస్తుంది. అమ్మ చూపు ప్రసారమైంది ఏదైనా అమ్మ ప్రసాదమే. ఆ చూపు మనపైన ప్రసరించేట్టు చేసుకోవడమే. ప్రసరిస్తున్నది చూసుకోవడమే.

– పి.యస్.ఆర్.

 

అందరినీ మోసే తల్లి భూదేవి. ఉన్నా పోయినా మోసేది ఆమే.

 దేశసేవ, దేవునిసేవ రెండూ వేరు కాదు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!