“నిత్యకల్యాణము -పచ్చతోరణము” వైభవంగా ఉత్సవాలు జరిగే ఆలయాలను గూర్చి లోకం అనుకునే వాడుక వాక్యం ఇది. పూర్వం పెద్ద పెద్ద సంపన్నుల ఉమ్మడి కుటుంబాలను గూర్చి కూడా ఇలా అనుకొనే వారు. మనదేశంలో ఎన్నో ప్రముఖము, ప్రసిద్ధమూ అయిన ఆలయాలలో ఈ రకంగా ఉత్సవాలు జరుగు తూనే ఉంటాయి. కోలాహలంగా జనం పాల్గొంటూనే ఉంటారు. కాశీ, రామేశ్వరం, శ్రీశైలం, తిరుమల, శ్రీ రంగం వంటి క్షేత్రాలలో ఇలా నిత్యం జరుగుతూనే ఉంటాయి.
నిజానికి నిత్యకల్యాణము అంటే నిత్యమైన ఒక పరమశక్తికి జరిగే కల్యాణం నిత్యమైనది సత్యమైనది ఏది? శాశ్వతమై ఎల్లపుడు ఎడతెగనిదై ఉండేది ఏదో అది. అది సర్వత్రా వ్యాపించే ఉన్నది. దానిని గుర్తించ టానికి ప్రాచీనులు మార్గాలు చెప్పారు. ఆ శక్తిని గుర్తించి ఆ శక్తిలో కలిసి పోగలగటమే సృష్టి రహస్యం. దానికి ఈ ఆలయాలు కేంద్రాలయ్యాయి. ప్రతి జీవి తన గుండెను ఒక గుడిగా చేసుకోవటం, ఆ గుడిలో ఒక చైతన్యశక్తి ఉన్నదని గుర్తించటం చేతగాక బయటి ఆలయాలను దర్శించటం.
కల్యాణము అంటే శుభము, వివాహము. కల్యాణి అంటే నిత్యము శుభములు ప్రసాదించేది, పార్వతీదేవి. మంగళస్వరూపము కలది, మలయాచలంలో ఉండేది. అంటే మంగళములు కల్గించేది, శుభాత్మకమైన మంగళకరమైన వాక్కులు పలికేది. చల్లని స్పర్శతో అందరినీ రక్షించేది.
ఆలయాలలో ఉండే దేవతల వల్ల పొందు తున్నామా? పొందగలిగినవారు పొందుతున్నారు. వారి మానసికశక్తిని బట్టి అదృష్టవశాత్తూ జిల్లెళ్ళమూడిలో మనం ఒక సజీవ చైతన్య శక్తిస్వరూపాన్ని దర్శించి ఆపై లక్షణాలన్నీ అనుభవించాం. పైగా యీ కలియుగంలో అలసులము, మందబుద్ధులము, అల్పతరాయువులము, ఉగ్రరోగ సంకలితులము కావటం వల్ల దయదలచి కరచరణాద్యవయవాలతో సామాన్య మానవ దేహంతో అవతరించి మనల్ని ఉద్దరించటానికి పూను కున్నది. మనలాగే బాల్య యౌవన వృద్ధాప్యాది అవస్థలలో సహజంగా ఉన్న కష్టనష్టాలను, సుఖదుఃఖాలను అనుభవించింది. కాకపోతే కష్టాలకు కష్టాలుగా కాకుండా దుఃఖాలను దుఃఖాలుగా గాకుండా అన్నీ ఒకటిగానే అనుభవించి తన అనుభవంలో నుండి వేదాంత నిధులుగా మనకు బోధించిన వాక్యాలు సామాన్యులకు ఆచరణీయాలుగా ఉగ్గుబాలతో రంగరించి పోసినట్లుగా ఇచ్చింది.
అమ్మ కూడా కల్యాణం చేసుకున్నది. అమ్మలోని అతిమానుష, దైవికశక్తిని గుర్తించినవారు అమ్మను ప్రశ్నించారు. చిదంబరరావు తాతగారు “అసలు నీకు వివాహం ఎందుకమ్మా?” అనగా అమ్మ “కావలసిన యోగ్యత ఉంటే జరుగుతుది. నీకు పెళ్ళెందుకు అంటారేం? అందరికి ఎందుకో నాకూ అందుకే, అందరికీ జరిగినట్లే జరుగుతాయి” అంటుంది. మౌలాలీ “అమ్మా! నీకు పెళ్ళిలేకపోతేయేం? మనం ఏ అడవులలో నన్నా వెళ్ళి ఉందామా?” అని అడగ్గా అమ్మ “ఇప్పుడున్నది అడవికాకపోతేగా? ఎక్కడి బాధలు అక్కడ ఉంటాయి, ఇట్లా అర్థం చేసుకోని బాధ ఎంతదూరం అయినా తప్పదు” అన్నది. వెంకటరత్నశర్మగారు వేదాం తోపన్యాసాలు గీతా ఉపనిషత్తులు చెప్పేవారు. తెనాలిలోని అమ్మ మాతామహుడు సుబ్బయ్యతాతగారితో “అమ్మకు పెళ్ళా ? పుట్టుకతోనే “అమ్మ” అయితే అమ్మకు ఇంకా పెళ్ళేమిటి? అసలు పెళ్ళికావటం అనేది అమ్మ కావటం కొరకేగా. ఇంకా ఆమెకు పెళ్ళెందుకు? అంటూ అమ్మతో ఏమమ్మా! నీవు పెళ్ళి చేసుకోవలసిందేనా? అని అడుగుతారు. అందుకు అమ్మ “చేసుకోవటం ఎంతో చేసుకోకపోవటం కూడా అంతేగా” అనగా శర్మగారు సంసారానికి తగిన బాధలుంటయ్యిగా అమ్మా! అంటే అమ్మ “సంకల్పమే సంసారం” సంకల్పం లేకుండా ఏ. మానవుడూ ఉండడు గదా అంటే “ద్వంద్వాలు తోచే సంకల్పమే మానవత్వం. ఏకత్వం కల సంకల్పమే దైవత్వం. ఎన్ని వచ్చినా మనస్సుకు ఏమీ సంబంధం లేదని చెప్పడానికే నా పెళ్ళి” అన్నది. వివాహం ఆధ్యాత్మిక సాధనకు విరుద్ధం కాదనీ, ఐహిక ఆముష్మిక సాధనకు బంధం కాదని చెప్పటానికే అమ్మపెళ్ళి చేసుకుంది.
ఒక పెన్నిధి అండన చేరటమే పెళ్ళి అనీ, ఆ అందన పొందే పరిణామమే పరిణయమనీ, కళంకరహితమైన మనస్సును మనోవాక్కాయ కర్మలా కళంక రహితంగా మరొకరికి అర్పణ చేయటమే కళ్యాణమనీ, వివాదరహితమైనదే వివాహమనీ, సర్వాన్నీ అనుభవిస్తూ సర్వాన్ని విడిచిపెట్టేదే వివాహమనీ, పెళ్ళితోనే నిత్యా నిత్య వస్తు వివేకాన్ని తెలుసుకోవటమనీ చెప్పింది.
భార్యకు భర్త దేవుడైతే, భార్య కూడా భర్తకు దేవతేననీ పతిని ఆధారం చేసుకుని పంచభూతాలను జయించింది పతివ్రత అనీ, పతివ్రతకు చరమదశ పతిచేతసైతం తల్లిగా భావింపబడటమే నని చెప్పింది. భరించేవాడు భర్తనీ – భరింపబడేది భార్యనీ – మెడవంచి స్త్రీ తాళికట్టించుకుంటే నడుం వంచి భర్త తాళి కడతాడనీ ఒకరికొకరు వంగక తప్పదనీ – భావం మనసులో ఉన్నంత కాలం ఒకరిని ఒకరు విడిచి ఉన్నట్లు కాదనీ, మంగళసూత్రాల రూపంలో భర్తపాదాలు భార్య వద్ద-జందెం రూపంలో భార్య భర్త వద్ద ఎప్పుడూ ఉంటారనీ అమ్మ భార్యభర్తల అవినాభావ సంబంధాన్ని చెప్పింది.
అమ్మ కల్యాణం లోకకల్యాణం. సీతారాములు కల్యాణాన్ని యీ దేశమంతా చేసుకుంటుంది. దేనికోసం? లోకానికి సీతారాములు ఆదర్శమూర్తులుగా నిలిచారు. కనుక. వారి నుండి తమజీవితాలకు స్ఫూర్తిని పొందారు. కనుక. అలాగే అమ్మ నాన్నగార్ల నుండి మనం స్ఫూర్తిని పొందుతున్నాం. తన యింటిని అన్నపూర్ణాలయం చేసి సర్వులకూ కడుపునింపిన మహనీయులు నాన్నగారు. లోకం కోసం అమ్మను త్యాగం చేసి మనందరికి లోకమాతనే తల్లిగా అందించిన మహానుభావుడు, లోకేశ్వరుడు, సోమేశ్వరుడు, నాగేశ్వరుడు నాన్నగారు. తన అనుభవ వేదాంతనిధులు ఆచరణలో గోరుముద్దలు చేసి తినిపించింది అమ్మ. సర్వలోకేశ్వరి, అనసూయేశ్వరి, రాజరాజేశ్వరి అంతులేక అడ్డులేక అంతకూ ఆధారమైన అమ్మ.
అమ్మ భౌతిక శరీరాన్ని వదిలి విశ్వకల్యాణం కోసం జిల్లెళ్ళమూడి ఆలయంలో నిలిచి సర్వవ్యాప్తంగా లోకకల్యాణాన్ని నిర్వహిస్తున్నది. అమ్మ శతజయంతి వచ్చే సంవత్సరం నుండి సంవత్సరమంతా చేసుకోవచ్చు. దేశంలోనూ, విదేశాలలోనూ అన్ని కేంద్రాలలోనూ చేసుకోవచ్చు. శ్రీ విశ్వజననీపరిషత్ అమ్మ ఏర్పాటు చేసిన సంస్థలను అమ్మ అనుగ్రహంతో విజయవంతంగా నిర్వహిస్తున్నది. ఆదరణగా పెట్టే అన్నపూర్ణాలయం, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం హైమాలయం, ఐహిక ఆధ్యాత్మిక విద్యావ్యాప్తికి మాతృశ్రీ సంస్కృత విద్యాలయాలు, ఆధారం లేని వృద్ధులకు ఆదరణాలయం, వేదవిద్యాలయం, ధ్యానాలయం, పాదుకాలయం, హోమాలయం, వైద్యాలయం, గ్రంథాలయం వంటివి. నిర్వహిస్తున్నది.
రాబోయే 2023లో అమ్మ శతజయంతిని పురస్కరించుకొని విద్యార్థినులకు సర్వసదుపాయాలలో వసతి భవనం (హాస్టల్) నిర్మాణం జరుగుతున్నది. తిరుపతి వారి ఆర్థిక సాయంతో నిర్మింపబడిన కల్యాణ మందిరం పునర్వైభవస్థితినందుకుంటున్నది. అమ్మ షష్టిపూర్తి సందర్భంగా ఏర్పాటైన జిల్లెళ్ళమూడి ముఖద్వార నిర్మాణం ప్రభుత్వం కారణాంతరాలతో తొలగించింది. పునర్నిర్మాణం జరగాలి. అమ్మ నామకోటి శిలాస్థూపం, అమ్మ జన్మస్థలంలో ఆలయ వైభవంగా ఏర్పాటు కావాలి. వివిధ ప్రదేశాలలో ఉన్న అమ్మ ఆలయాలకు సమున్నతమైన సర్వాంగసుందరమైన రూపురేఖలు తేగలగాలి. వాటిని దర్శనీయస్థలాలుగా తీర్చిదిద్దాలి.
అమ్మ నాన్నల కల్యాణ వార్షికోత్సవం నాడు లోకకల్యాణం కొరకు అమ్మ చూపించిన మార్గాన్ని నేల నాలుగు చెరగులా అందచేయాలి. అమ్మ భక్తులు (అమ్మ) దృష్టిలో అందరూ బిడ్డలైనా) గతయేబది సంవత్సరాలుగా సంస్కృత కళాశాలలో తయారైన విద్యార్థులు (ఇప్పుడు అధ్యాపకులు) ఈ ఉద్యమంలో ఉత్సాహంగా ఇతోధికంగా ముందుకురుకవలసిన అవసరం ఉన్నది. మనందరం మట్టిబొమ్మలం. మానవతా మంత్రంతో లోకకల్యాణ ప్రచోదన ఉద్యమాన్ని కట్టుకట్టి గట్టు నడిపించమని అమ్మను ప్రార్థిస్తున్నాం.