1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సంపాదకీయము….(అమ్మ జగద్గురువే)

సంపాదకీయము….(అమ్మ జగద్గురువే)

P S R Anjaneya Prasad
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : September
Issue Number : 2
Year : 2011

జగతికి గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడు జగద్గురువు. మరి విశ్వానికి మాతోపదేశం చేసిన అమ్మ జగన్మాతే కాదు. జగద్గురువు కూడా. గీతలో ఏడువందల శ్లోకాలలో చెప్పిన సారాంశాన్ని అమ్మ మూడే మూడు వాక్యాలలో చెప్పింది. నీకున్నది తృప్తిగా తిను. ఇతరులకు ఆదరణగా పెట్టుకో. అంతా వాడే చేయిస్తున్నాడనుకో” అని. అసలు గురువూ దైవమూ ఒకరే. గురువే బ్రహ్మ, విష్ణువు, గురు మహేశ్వరుడు, చివరకు గురువే పరబ్రహ్మము అని చెప్పుకునే సంప్రదాయంలోని వాళ్ళము మనం. అలాగే గురువు అను గ్రహం పొందిన వారికి రక్షణ లేకపోవటం అంటూ ఉండదు. గురువు శిష్యులనెప్పుడూ విడిచిపెట్టడు.

అమ్మ “నేను దేవతను కాను, మీరు భక్తులు కారు. నేను గురువును కాను, మీరు శిష్యులు కాదు. నేను అమ్మను, మీరు బిడ్డలు” అని చెప్పింది కదండి అంటారా ! చూడండి. అమ్మ అడిగిన సందర్భాన్ని బట్టి, అడిగిన సమయాన్ని బట్టి, అడిగినవారికి కావలసిన రీతిలో తగ్గట్టుగా అమ్మ చెబుతుంది. సోదరుడు శ్రీ ఎక్కిరాల భరద్వాజ అమ్మ పై మాటలు విని అమ్మను అడిగాడు. “అమ్మా ! నీవు సద్గురువును కాదన్నావా?” అని. “నేనలా అనలేదు. సద్గురువు అంటే దైవమే అని నా ఉద్దేశం. నేను గురువు కాను అన్నప్పుడు నా భావం యీనాడు ‘గురువు’ అన్న పదం సంఘంలో బహు తేలికగా అయినదని” అన్నది. అంటే అక్కడ అమ్మ మాటలలో అమ్మ సద్గురువని, దైవమని ఆ రెంటికీ భేదం లేదని.

“అమ్మా ! మీరు దేవత” అంటే – “మీరు కానిది నేనేదీకాదు నాయనా ! అంటూ, మీరు దేవతలైనప్పుడు నేను కాకుండా పోతానా? ఉన్నదంతా అదే అనుకుంటున్నప్పుడు అది కాదు ఇది అనుకోవటం ఎందుకు? వాడే సర్వత్రా ఉన్నాడు వ్యాపించి అనే భావనే ప్రకటించింది. నాకు శిష్యులెవరూ లేరు అన్నదంటే, తానుకానిది ఏదీ లేదని తెలిసిన తల్లికి, ‘మీరంతా నా బిడ్డలే కాదు, నా అవయవాలు’ అన్న తల్లికి శిష్యభావన ఎక్కడుంటుంది ? వారిపై వాత్సల్య భావన తప్ప. అమ్మ బిడ్డకు అవసరమైతే గురువు అవుతుంది, దైవమూ అవుతుంది, సర్వమూ అవుతుంది. అమ్మది సహేంద్ర తక్షకాయ స్వాహా సిద్ధాంతం. బిడ్డరక్షణకు తల్లి కావటం కాదు రక్షణే తల్లి అంటుంది.

ఒకరు రమణమహర్షిని మీకు శిష్యులు లేరా? అంటే లేరు అని చెప్పారుట. అందుకు కారణం చెపుతూ “జ్ఞాని అయిన గురువు శిష్యులకూ తనకూ భేదం చూడదు. ఆయన దృష్టిలో అజ్ఞానులే ఉండరు. అందరిలో పరిపూర్ణమయిన జ్ఞానాన్నే చూస్తాడు” అన్నారుట. అందుకే అమ్మ కూడా మీలో తప్పులెంచను. అసలు తల్లికి తప్పే కనిపించదు. మీరు లేదని నేననుకోవటం లేదు. మీరు బుందలో కాలువేసి వస్తే కడిగి శుభ్రం చేయవలసి, బాధ్యత నాది. మన తప్పులు మనకే తెలిసేటట్లు చేసి, వాటినుండి సరియైన మార్గంలో నడిచే ప్రేరణశక్తి అమ్మే ఇస్తుంది. మనకు తెలియకుండానే మనలో మార్పును తెస్తుంది.

నేను గురువును అని ఎవరైనా అనుకుంటే అతడు నిజమైన గురువుకాడు. గురువంటే తాను ఆత్మ సాక్షాత్కారం పొంది ఇతరులు కూడా ఆ వైపు వెళ్ళేందుకు సహాయపడేవాడు. అమ్మను జిజ్ఞాసువులు కొందరు “మేం అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నాం మమ్మల్ని ఒడ్డున పడేయ్యమ్మా” అంటే, అమ్మ “మీరంతా జ్ఞానస్వరూపులుగానే కనిపిస్తున్నారు” అన్నది. “తల్లి అంటే తొలి అని, తల్లి అంటే తనలో లీనం చేసుకోనేది” అని చెప్పింది. “నేను ఆదెమ్మను (ఆది + అమ్మ)” అని చెప్పింది. అంటే తానే దైవం తానే గురువు, తానే ఆత్మ అన్న అర్థం స్ఫురించటం లేదా !

‘మేం తరించే మార్గం ఏదన్నా చెప్పమ్మా !’ అంటే “చెప్పేదేముంది నాన్నా! చేయటమే కాని” అన్నది. అమ్మ మంత్రోపదేశాలు చెయ్యదా ? అని అడిగేవారున్నారు. ఎందుకంటే లోకంలో మంత్రోపదేశాలు చేసే చాలామంది గురువులున్నారు కనుక. అమ్మ మంత్రం ఉపదేశించిన సన్నివేశాలు లేకపోలేదు. కాని అమ్మ అసలు మంత్రం అంటే ఏమిటో చెప్పుతుంది.

మాటే మననం వల్ల మంత్రం అవుతున్నది. అది మంత్రం కాదని నీవనుకుంటే అది మామూలుమాటే. భావనే మంత్రం. మనస్సే మంత్రం. సాధనకు మంత్రం అవసరమా అంటే ఓపికలేని వాడు కఱ్ఱపట్టుకున్నట్లు. మనస్సును మనస్సుతో గుర్తించాలి. అమ్మ చాలా తేలికైన ఉపాయం చెప్పింది. ‘పీల్చి వదిలే శ్వాసను గమనించు చాలు’ అని చెప్పింది. ‘తృప్తినీ, హాయినీ, శాంతిని ఇచ్చి సందేహ నివృత్తి చేయగలిగిందేదైనా మంత్రమే’ అన్నది. 

ఈనాడు గురువులు అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ గురువులేనా ? మన మనస్సే గురువు. గుర్తే గుర్తించిన జ్ఞానమే గురువు. మీరు ఏ గురువు దగ్గరకూ వెళ్ళనక్కరలేదు. నీ మనస్సులో ఎక్కడ లక్ష్యముంటే అదే మంత్రం. తరుణం వస్తే ఆశక్తే మీ సాధనను నడిపిస్తుంది. నిజమైన గుర్తు చూపించేవాడు గురువు. పరిస్థితులే గురువు. తెలియనిది తెలియజెప్పినవాడే గురువు. ఉపదేశం అంటే దైవసన్నిధికి చేర్చటం. ఉపదేశం అంటే ‘నేను బద్ధుడైన జీవిని’ అనే భ్రమను తొలగించి నీవే ఆత్మస్వరూపానివి అని తెలియచేయడం”.

గురుకృపలేకపోతే, గురూపదేశం లేకపోతే ఆత్మ సాక్షాత్కారం ఎలా కలుగుతుంది ? అనే సందేహం చాలామందికి వస్తుంది. సాధకుడు ఎన్నో వ్యాపకాలతో బాధపడుతుంటాడు. అతడు శాంతి కోరుకుంటాడు. గురువు ఆమంత్రం చేయి, యీ మంత్రం చేయి అని ఉన్న వ్యాపకాలకు తోడు యింకొక వ్యాపకాన్ని పెట్టకూడదు. అలా చెపితే అతడు నిజమైన గురువుకాదు. అందుకే అమ్మ ఎవరికీ మంత్రాలు ఉపదేశం చెయ్యదు. “నీ కష్టాలు బాధలు కూడా వాడిచ్ఛినవే అనుకో”మంటుంది. మనకు జన్మ ఇచ్చింది వాడే, తీసుకొనేది వాడే. కనుక కష్టసుఖాలు రెండూ వాడి కరుణే, వాడి అనుగ్రహమే. మనల్ని తరింప చేయటానికే ఇవి ఇచ్చాడు అనుకుంటే మనస్సు హాయిగా ఉంటుంది. బయట ఎవరో మనల్ని బాధపెడుతున్నా రనిపించదు.

సద్గురువు అంటే ఓర్పు, క్షమ, ప్రశాంతత వంటి సద్గుణాలుండాలి. సూదంటురాయి ఇనుమును ఆకర్షించినట్లు తన చూపుతోనే ఇతరులను ఆకర్షించాలి. అందరిపట్ల సమభావన ఉండాలి. అమ్మను చూచినఎవరైనా అమ్మ చేత ఆకర్షింపబడతారు. అమ్మ ప్రేమకు, వాత్సల్యానికి కరిగిపోతారు. మనస్సు ద్రవించి అనుకోకుండా చాలామందికి కళ్ళవెంట నీరుకారుతాయి. భూదేవి కున్నంత ఓర్పు అమ్మది. కడుపులో బిడ్డ చనిపోయి రెండు రోజులయినా, పాదంలో గడ్డపార దిగబడ్డా, సలసల మండుతున్న పొగాకు బారెన్ లో పనిచేసినా ఏ మాత్రం చలించటం ఉండదు. అమ్మది సహజ సహనం. ప్రయత్నం మీద ఓర్చుకోవటం కాదు. అలాగే తన పట్ల ఎందరెన్ని తప్పులు చేసినా, ఎన్ని దురాగతాలు చేసినా, క్షమిస్తుందే తప్ప అగ్రహించి ఎరుగదు. “పైగా నేను తప్పులెన్నటం మొదలు పెడితే 7వ మైలు దిగేవాడు ఉండడు” అన్నది. “అయినా ఏదైనా మీరు చేస్తున్నారనుకోవటం లేదు. ఎవరు మిమ్మల్ని నడిపిస్తున్నాడో వాడే మీ చేత చేయిస్తున్నాడు” అని తన తాదాత్మ్యాన్ని తెలియచేస్తుంది. ఇక సమభావన సంగతి చెప్పేదేముంది ? అందరూ తన బిడ్డలే. తన, పర భేదం లేదు. సృష్టి మొత్తాన్నీ తన సంతతిగానే భావించింది. మనుషులే కాదు పశువులు, పక్షులు, సకల చరాచర సృష్టి తన సంతతే – అంత సమభావన. కారులో వచ్చిన యజమాని నెంత ప్రేమించిందో, ఆ కారు డ్రైవరుకూ అంతే ప్రేమతో నోటికి ముద్దలు అందించింది. వంట ఇంట్లో వంట చేసే వారెంతో, పాకీ దొడ్డి శుభ్రం చేసే పాకీవాడూ అంతే అన్నది. అమ్మ పసితనం లోనే రోడ్డుమీద ఆపదలో ఉన్న పాకీపిల్ల నెత్తుకున్నప్పుడు, జీతగాడికి నోటిలో ఇడ్లీ పెట్టినప్పుడు బ్రాహ్మణత్వాన్ని నాశనం చేశావు అని ఇంట్లో పెద్దలంటే కష్టాలలో బాధలలో ఉన్నవారిని ఆదుకోని వారే బ్రాహ్మణత్వాన్ని నాశనం చేశారని, శుక్ల శోణితాలకేది కులమో అదే తనకులమనీ తెలియజేసింది. సమభావన అంటే అందరినీ భగవంతునిగా చూడటమేనని తాను చేసి చూపించింది.

మనకు తెలియకుండా మనలో మార్పు తేవటమే గురువు యొక్క పని. అయినా మనం తెలుసుకోలేక గురుకృప అనుగ్రహించమని గురువును కోరుకుంటుంటారు. జనం. గురువు యొక్క దయ, దీవన అడుగుతుంటారు. అందుకే అమ్మ అంటారు నా దీవెన ఎప్పుడూ ఉన్నది. కష్టం సుఖం రెండూ నాదీవనే. అయితే అది మనకెప్పుడు తెలుస్తుందంటే మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు లేదా మనం అమ్మకు సమర్పణ కావించుకున్నప్పుడు. ఆ ప్రపత్తి మనకా జ్ఞానాన్ని కలిగిస్తుంది. శరణాగతి లేనంత కాలం ఈ జంజాటం తప్పదు. యీ అడగటం తప్పదు.

కొంతమందికి మరొక అనుమానం కూడా వస్తుంది. ఒకరికంటే ఎక్కువ ఆధ్యాత్మిక గురువులుండవచ్చా ? అని. నీ మనస్సే గురువంటున్నది అమ్మ. అమ్మ “భగవంతుడు, గురువు ఒక్కరే” అన్నది. దత్తాత్రేయుడు తనకు ఇరవై నలుగురి కన్నా ఎక్కువ గురువులున్నారన్నాడు. ఎవరి దగ్గర నుండి ఏం నేర్చుకున్నా వారు గురువే. అసలు అవసరమే గురువు అంటుంది అమ్మ.

అమ్మా! నీవు దేవతవు – అంటే, మీరు కానిది నేనేదీ కాదు అంటూ, దానికి నిదర్శనంగా తన బిడ్డ హైమను దేవతను చేసి పూజించింది. హైమను చూపిస్తూ బింబ ప్రతిబింబాలమన్నది. మనమంతా అమ్మ (అంఆ) బింబానికి ప్రతిబింబాలమే – మీ ఆరాధ్యదైవమెవరమ్మా? అంటే, మీరంతా నా ఆరాధ్య దైవాలే అన్నది.

భగవంతుని పట్ల అపచారం చేస్తే గురువు రక్షించగలడేమోగాని, గురువు పట్ల అపచారం చేస్తే భగవంతుడు కూడా రక్షించలేడు అంటారు మహర్షులు. శిష్యుల పట్ల విపరీతమైన ప్రేమవల్ల, గురువు యొక్క కటాక్షవీక్షణ వల్ల శిష్యుడు రక్షింపబడతాడు. అమ్మతో మనమూ అంటుంటాం. మా బరువు బాధ్యతలన్నీ నీ నెత్తి మీదే వేస్తున్నాం, నీవే చూసుకోవాలి అని. అమ్మ కూడా వెయ్యండిరా అన్నీ భరించేదాన్ని నేనున్నాను గదా ! అంటుంది. అమ్మకు ప్రేమ సహజం. మన మంచి చెడులతో సంబంధం లేదు, బిడ్డ రక్షణ తల్లి కర్తవ్యం. అందుకే తల్లి రక్షణ కాదు రక్షణే తల్లి అని మనల్ని వేసుకొన్నది. మన రక్షణను నెత్తిపై వేసుకున్నది. 

తన అపార వాత్సల్యంతో నాకు శిష్యులు లేరు అంతా శిశువులే అన్నది అమ్మ. సామాన్యంగా జగద్గురువు అంటే జగత్తుకంతా గురువులని అర్థం. ఒకసారి కుర్తాళం పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ సిద్ధేశ్వరానందభారతీ స్వామివారితో కొంతమంది వచ్చి మేమంతా మీ శిష్యులమండీ అన్నారు. అందుకు వారు –  నాకు  శిష్యులెవరూ లేరు నేను సర్వజగత్తుకూ శిష్యుణ్ణి, అంటూ “శిష్యోహం సర్వలోకానాం” అంటూ జగద్గురువు అంటే మీరంతా జగత్తుకు గురువు అనుకుంటారు. అలా కాదు జగత్తు గురువుగా కలవాడు అని బహువ్రీహి సమాసం చేయాలి అన్నారు. అది వారి అనహంకారానికి, వినమ్రతకీ నిదర్శనం. అందరు గురువులూ అలా ఉండరు.

అమ్మ అసలు మీదేం లేదు. అంతా వాడే చూసుకుంటాడు. అయితే మీరు అకర్మణ్యులుగా ఉండాలన్నా ఉండలేరు. ప్రేరణ రూపంలో వాడే మీ చేత చేయిస్తుంటాడు. తరుణం వచ్చి నప్పుడు వాడే తరింపచేస్తాడు అని చెపుతుంది. తెలియంది తెలియచెయ్యటానికే నా రాక అని చెప్పిన జగద్గురువు అమ్మ. అమ్మ దృష్టిలో జగత్తే గురువు కనుక, జగన్మాత అంటే జగత్తే మాత గనుక ఇప్పటికి ఈ రూపం అవసరం కనుక మాతృత్వం రూపం దాల్చి ఈ భూమి మీదకు వచ్చింది. ఒక్క జగద్గురువే కాదు ఎప్పుడు ఏది కావాలంటే అది కాగల సంపూర్ణత్వం అమ్మ నేను నేనైన నేనుగా, అన్ని నేనులు నేనుగా నిలచిన రూపం అమ్మ.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!