ఆంధ్రదేశంలో అమ్మను గూర్చి తెలియనివాళ్ళు తక్కువగా ఉంటారు. ఇతర రాష్ట్రాలలోను, ఇతర దేశాలలో కూడా అమ్మను గూర్చి విన్నవాళ్ళు, చూచిన వాళ్ళు చాలమంది ఉన్నారు. అమ్మ అంటే జిల్లెళ్ళమూడి అమ్మే. అమ్మ అన్నది “అమ్మ అంటే ఈ మంచం మీద కూర్చున్న అమ్మే కాదు సర్వత్రా నిండి ఉన్న అమ్మ” అని. అమ్మా! నీవు దేవతవు అంటే మీరు కానిది నేనేదీ కాదు. మీరంతా నేనే మీదంతా నేనే అన్నది. ఈ సృష్టి నాది, అనాది అన్నది. భగవంతుడు చీమలో దోమలో కూడా ఉన్నాడు. కాదు చీమగా దోమగా కూడా ఉన్నాడు అన్నది. అంఅ అంటే అంతులేనిది అడ్డులేనిది అంతకు ఆధారమైనది. ఈ రకమైన భావాలు చెప్పింది ఒక్క మన అమ్మేనేమో!
అమ్మకు ‘జిలెళ్ళమూడి అమ్మ’ అని పేరు వచ్చింది కాని అమ్మ పుట్టింది జిల్లెళ్ళమూడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘మన్నవ’ గ్రామం. మన్నవ గ్రామం గుంటూరుజిల్లా పొన్నూరుకు అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పొన్నూరు మండలం సుప్రసిద్ధమైనదే. 30 అడుగుల ఎత్తున్న ఆంజనేయస్వామి, గరుత్మంతుడి విగ్రహాలే కాక భావనారాయణస్వామి ఆలయము, సహస్ర లింగాలయము లతో విరాజిల్లు తున్నది. మన్నవ కరణం (విలేజి ఆఫీసరు) మన్నవ సీతాపతిశర్మగారు, రంగమ్మగారు అమ్మ తండ్రి తల్లి. రుధిరోద్గారి నామ సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి బుధవారం (28.3. 1923) ఆశ్లేషా నక్షత్రం అరుణోదయకాలంలో అమ్మ అవతరించింది. అమ్మను మొదటిసారి చూచింది మంత్రసాని గొల్లనాగమ్మ మరొక మంత్రసాని పిచ్చికోటి. పుట్టినపుడు అమ్మ కమలంలో ఒక సర్వాలంకారశోభిత అయిన స్త్రీ శంఖము – శూలములతో నిలబడినట్లు కనిపించింది. అంతేకాదు. అమ్మ పుట్టినపుడు చెన్నకేశవస్వామి ఆలయంలో జేగంటలు మ్రోగాయి. పక్షులు ప్రపంచానికి మేలుకొలుపులు పాడుతున్నాయి. మందమలయానిలాలు ఉపచారం సలుపుతున్నాయి. దేవాలయం నుండి బయలుదేరిన మంగళవాయిద్యాలు లోకానికి శుభసందేశమిస్తున్నాయి.
ఈ పై విషయాలు చూస్తుంటే భాగవతంలోని శ్రీ కృష్ణజనన ఘట్టం జ్ఞప్తికి వచ్చింది. దేవకీదేవి శ్రీకృష్ణుని కంటున్నపుడు గంధర్వులు గానం చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. సిద్ధులు చారణలు భయంతీరి ఆనందించారు. దేవతలు ఉత్సవం చేసుకుంటున్నట్లు భేరీలు మ్రోగించారట.
తండ్రి వసుదేవునకు శ్రీకృష్ణుడు నీలమైన దేహంతో, గద శంఖ చక్ర పద్మాలు గల పొడవైన నాలుగు చేతులతో, తామర రేకులవంటి కన్నులతో, విశాలమైన వక్షస్థలంతో, మెడలో కౌస్తుభరత్నంతో, కంకణాలు, మొలత్రాడు, వైఢూర్యాలు మణులు పొదిగిన కిరీటం ధరించి కనిపించాడుట. ఎంత అదృష్టం. అదే అదృష్టాన్ని అమ్మ పుట్టినప్పుడు మంత్రసానులు పొందారు. అందులో ముఖ్యంగా గొల్ల నాగమ్మ.
ఆశ్చర్యమేమిటంటే పుట్టగానే శ్రీకృష్ణుని గోకులానికి తీసుకెళ్ళాడు వసుదేవుడు. అమ్మను తల్లి రంగమ్మగారు అమ్మ పెంపకాన్నిగొల్ల నాగమ్మకు అప్ప చెప్పింది. కారణమేదైనా – శ్రీకృష్ణుడు అమ్మ ఇద్దరూ గొల్లవాళ్ళ ఇళ్ళల్లోనే పెంచబడ్డారు. అంతేకాదు సీతాపతిగారి చెల్లెలు కనకమ్మగారు అమ్మకు మొదటిసారి చనుబాలు కుడిపింది. ఈ పిల్ల తన పిల్లె అని కనకమ్మగారిని అనిపించింది. తరువాతి కాలంలో కనకమ్మ గారి (మేనత్త) పెద్ద కుమారుడు నాగేశ్వరరావుగారితోనే అమ్మకు కళ్యాణం జరిగింది. బాలసారె కాలంలోనే అక్కడ ఉన్న నాన్నగారు అమ్మను ఆశీర్వదించారు.
అమ్మ తల్లి రంగమ్మగారికి కూడా ఎన్నో అనుభవాలు కనిపించాయి. పుట్టిన నాలుగోరోజు అమ్మ శరీరం కొయ్యబారి పోతే అంతా భయపడ్డారు. రంగమ్మగారికి ఏమీ ఫర్వాలేదు – దిగులుపడకు’ అని తనలో నుండే తనకు వినిపించింది. అమ్మను చూడటానికి వచ్చే జనానికి విధీవి రామం లేదు. శ్రీకృష్ణుని చూడటానికి కూడా గోకులంలోని స్త్రీలంతా “మన యశోద చిన్ని మగవాని కనెనట చూచి వత్తమమ్మ సుదతులార!” అని జట్లు జట్లుగా వచ్చారట. అలాగే ‘రంగమాంబ చిన్ని రమణిని కనెనట రండి రండి చూచి రాగ మీరు’ అని అమ్మను చూడటానికి వచ్చారు.
అమ్మకు పురిటి స్నానం చేయించేందుకు మన్నవలో 500 ఇళ్ళల్లో చెప్పి వస్తే 108 మంది 108 బిందెలు నీళ్ళుతెస్తే వాటిలో నుండి 108 చెంబుల నీళ్ళు తీసి అమ్మకు స్నానం చేయించారు.
పుట్టిన దగ్గర నుండి ఎంతమందికి శ్రీకృష్ణుడు మోక్షాన్ని ప్రసాదించాడో గమనిస్తే అమ్మకూడా అంతకంటే ఎక్కువే ప్రసాదించిందేమో అనిపిస్తుంది. పూతన, తృణావర్తుడు, యమళార్జునులు, వత్సాసురుడు, బకాసురుడు, ధేనుకాసురుడు, వృషభాసురుడు ఒకటేమిటి ఎంతమందో ఆఖరికి సాక్షీమాత్రుడుగా 18 అక్షోహిణిల సైన్యానికి సహితం మోక్షాన్నిచ్చాడు. అమ్మ కూడా. అమ్మను కరుచుకున్న తేలు, పిల్లి, కుక్క, కోనవెంకాయమ్మ, సుబ్బరావు, నక్సలైట్లు ఒకరేమిటి ఇలా అందరికీ సుగతిని పుట్టినప్పటి నుండీ ప్రసాదిస్తూనే ఉన్నది. అయితే అమ్మలో సంహార క్రియ కంటే సంస్కరణ క్రియే ఎక్కువ అనేది అమ్మ జీవితాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. మన్నవలో అమ్మ రాజ్యలక్ష్మీవారి గుడిలో నామాలు చెబితే మైకు లేకుండా ఊరంతా వినిపించిందట. అమ్మ బాల్యం మరిడమ్మగారితో మన్నవలోనే గడిచింది. అమ్మజీవితంలోని ఎన్నో సంఘటనలకు అదిస్థానం. మన్నవకు మౌనస్వామి వచ్చి రాజ్యలక్ష్మీ అమ్మవారి విగ్రహం క్రింద రాజరాజేశ్వరీయంత్రం వేశారు. మన్నవలో వారు మహనీయులను, కవి పండితులను సత్కరించే సంస్కారహృదయులు, విద్యా వంతులు ఎక్కువ. కొప్పరపు కవీశ్వరులు మన్నవలో వార్షికంగా కార్యక్రమాలు చేసి సత్కారాలు పొందేవారు.
మన్నవలోని చింతలతోపులో అమ్మ ఎందరికో విశ్వరూప సందర్శనం ఇచ్చిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. మౌలాలి, చిదంబరరావుగారు వంటివారున్నారు. అంతేకాదు శ్రీకృష్ణునిగా గంగరాజు పున్నయ్యగారికి, సత్యనారాయణస్వామిగా తురుమెళ్ళ వెంకటప్పయ్యగారికీ, మన్నవ గోపాలకృష్ణయ్యగారి కూతురికి నాగేంద్రునిగా ఇలా అమ్మ ఎంతమందికో వారి ఇష్ట దేవస్వరూపాలుగా కనిపించింది. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఇలాంటి కొన్ని సన్నివేశాలు అమ్మతో ముడిపడ్డవి, మనకు తెలిసినవి ‘మన్నవ’ గ్రామంలో జరిగాయి కాబట్టి. ఆ గ్రామం అమ్మ వంటి అవతారమూర్తికి జన్మను ఇచ్చే అదృష్టాన్ని పొందింది
కాబట్టి.
శ్రీరాముని జన్మస్థలం అయోధ్యకు – శ్రీకృష్ణుని జన్మస్థలం మధురకూ మనం ఎందుకు అంతప్రాధాన్యం ఇస్తున్నాం. భారతదేశంలోని జనం శ్రీరాముని జన్మస్థలంలో రామమందిర నిర్మాణం కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? శ్రీ కృష్ణుడు జన్మించింది కారాగారంలో అయినా ఆ కారాగార ప్రాంతాన్ని ఎంత వైభవంగా ఏర్పాటు చేశారో ఎప్పుడైనా చూశారా? రాధాకృష్ణులలో రాధాదేవి జన్మస్థానమైన ‘రావల్’ గ్రామం నుండి వృషభాను మహారాజు తెచ్చి పెంచిన ‘బర్సానా’ లోనూ ఎంత వైభవంగా రాధాదేవి జన్మాష్టమి ఉత్సవాలు జరుగుతాయో చూశారా?
ఎందుకు వాటికి ప్రాధాన్యం అంటే రూపరహితమైన పరబ్రహ్మం ఆయారూపాలలో రూపసహితుడ్ని కూడా అని తెలియజేయటానికి వచ్చినందున ఆస్థలాలకు అంత విశిష్టత, పవిత్రత ఏర్పడింది. అలాగే అమ్మ పుట్టిన మన్నవ. మెట్టిన ప్రసిద్ధి వహించిన జిల్లెళ్ళమూడి, రెండూ పవిత్రపుణ్యక్షేత్రాలే. లక్షలు లక్షలు ఎందుకు దర్శించుకుంటున్నారు ? తాము తరిస్తామని దానికి తగ్గట్టుగా త్వరగా తరింప జేసే వనరులు –ఆయా దేవతల ఆశీస్సులు త్వరగా లభిస్తాయని, తపస్సు – ధ్యానము – అక్కడ త్వరగా ఫలిస్తాయని.
ఇప్పటిదాకా జిల్లెళ్ళమూడిని మనం పవిత్ర పుణ్యక్షేత్రంగా అష్టమముక్తిక్షేత్రంగా భావిస్తున్నాం, దర్శిస్తున్నాం, తరిస్తున్నాం. ఇప్పటిదాకా ఎవరో కొద్దిమంది తప్ప అమ్మ జన్మస్థలం ‘మన్నవ’ ను దర్శించుకున్నవాళ్ళు తక్కువనే చెప్పాలి. ఇప్పటివరకు అమ్మ జన్మస్థలంలో అమ్మమ్మ (అమ్మ మారుటితల్లి – కామేశ్వరమ్మ గారు) స్వయంగా ఒక ఆలయాన్ని నిర్మించింది. ఆమె అమ్మలో లీనమైన తర్వాత, రాఘవరావు మామయ్య (అమ్మ అన్నగారు) కుమారుడు రంగనాధ్ గౌతమ్ ఆ ఆలయ బాగోగులు చూస్తున్నారు. అతడు కూడా వయసు పైబడి పెద్దవాడై అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటిదాకా వారిల్లే అందరికీ అతిథిగృహం. కాని వారు కూడా మన్నవ నుండి కారణాంతరాల వల్ల పొన్నూరులో ఉండటం తటస్థించింది. ఇప్పుడు ఆ ఆలయాన్ని పెద్దమనస్సుతో శ్రీ విశ్వజననీపరిషత్కు అప్పగించటానికి ఆ కుటుంబమంతా నిశ్చయించి మొన్న సెప్టెంబరు 10వ తారీకున పరిషత్కు రిజిష్టరు చేశారు. ఇప్పుడు ఆ ఆలయ విషయంలో రంగనాధ్ గౌతమ్ తోపాటు మనందరిపైనా బృహత్తర బాధ్యత ఉన్నది. ఈ విషయంలో రంగనాధ్ గౌతమ్ కుటుంబాన్ని అభినందించాల్సిన అవసరం ఉన్నది. అమ్మ మేనల్లునిగా తన బాధ్యత తను నిర్వహించాడు – మన బాధ్యతలు మనం నిర్వహించాలి. సోదరుడు శ్రీ తంగిరాల కేశవశర్మ ముందుచూపుతో వారుండగానే ‘అమ్మ జన్మస్థలి ట్రస్ట్’ అని అమ్మ జన్మభూమి అభివృద్ధికి ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. దానిని కూడా బలపరచవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఆ ఆలయ సర్వతోముఖాభివృద్ధికి తగు ప్రణాళికను సిద్ధం చేయాలి. అమ్మ తండ్రి సీతాపతి తాతగారి ఇంటి స్థలంలో కొంతభాగం పూర్వం అమ్మబడి ఇతరుల ఆధీనంలో ఉన్నది. దానిని మళ్ళీ మనంకొనవలసిన అవసరం ఉన్నది. ప్రప్రధమంగా ఒక అర్చకుని కుటుంబంతో సహా అక్కడ ఉండేందుకు తగిన ఏర్పాటు చేయవలసి ఉంది. నిత్యార్చనలు నిర్వహింప బడాలి. జిల్ళెళ్ళమూడి వచ్చే సోదర సోదరీమణులందరూ తేలికగా ‘మన్నవ’ అమ్మ జన్మస్థలం చూడటానికి ఒక ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయాలి. అది ప్రభుత్వపరంగానైనా, సంస్థపరంగానైనా, ప్రవేటుపరంగానైనా సరే.
ఈ విషయాలపై ప్రత్యక శ్రద్ధ వహించి శ్రీ విశ్వజననీపరిషత్ సభ్యులందరూ త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని త్వరితగతిని నిర్ణయాలు తీసుకొని అమలుపరచాలి.
ఒక రకంగా నేనెంతో అదృష్టవంతుడిని. అమ్మను చూడటానికి 1958లో కేశవవర్మతో మొదటి సారి జిల్లెళ్ళమూడి వెళుతూ ముందుగా మన్నవలో అమ్మజన్మస్థలంలో అమ్మ నామ సంకీర్తన చేసి రాఘవరావురామయ్య గారింట్లో ఆతిథ్యం స్వీకరించి మరీ జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మను మొదటిసారి చూచాను. అంతేకాదు అమ్మ జన్మస్థలంలో చాల సంవత్సరాలు ‘అనసూయావ్రతాలు’ మన్నవ లోని సోదరీ సోదరుల చేత చేయించాను. నేనెప్పుడూ నా చేతనైన సేవ, అమ్మ నా చేత చేయించుకున్నది చేయటానికి సిద్ధమే. మీరు సిద్ధంకండి మన్నవ ఆలయ అభివృద్ధికి.