అమ్మ అనుగ్రహంతో అందరింటి సోదరీ సోదరులకు ధాన్యాభిషేకం ప్రతి సంవత్సరం అలవాటై పోయింది. 1987లో ఏ సుముహూర్తాన మనకు ఆ భావనను అందించిందో 1988 ఫిబ్రవరి నుండి అప్రతిహతంగా, జగన్నాధరథంలా ఈ ధాన్యాభిషేక కార్యక్రమం జరుగుతున్నది. మనం నిత్యం అన్నం తినటం, మంచినీళ్ళు త్రాగటం ఎంత అలవాటయిందో అలాగే ఫిబ్రవరి 17 అంటే ధాన్యాభిషేకం అనేది అంత అలవాటైంది. హైమజన్మదినోత్సవం అంటే లలితా కోటి నామపారాయణ ఎంత అలవోకగా జరుగుతున్నదో అంత అలవోకగా, ఏ వ్యక్తికీ నేనీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా ననే అహంకారం రానివ్వకుండా ధాన్యాభిషేక కార్యక్రమం నిర్వహింపబడుతున్నది.
పూజ్య గురుదేవులు శివశ్రీ శివానందమూర్తిగారు చెప్పినట్లుగా జూన్ 12న అన్నాభిషేకం చేస్తున్నాం. నిజానికి ధాన్యాభిషేకం, అన్నాభిషేకం జిల్లెళ్ళమూడి అందరింటి పండుగలలో విశిష్టమైనవి. బయట ఏ ప్రదేశాలలోనూ కనిపించనివి. ఇప్పుడు అన్నదానాలు చాల ఆలయ ప్రాంగణాలలో ఏర్పాటు చేయబడ్డాయి. ఒకప్పుడు పౌరాణిక కాలంలోనూ, చారిత్రక కాలంలోనూ అన్నసత్రాలు నిర్వహించినట్లు మనకు కనిపిస్తున్నాయి. రాజులు, జమీందారులు సంస్కృత కళాశాలకు అనుబంధంగానూ, సంగీత నృత్యకళాశాలలకు అనుబంధంగానూ అక్కడక్కడ అన్నసత్రాలు పరిమితంగా నైనా ఉన్నట్లు విన్నాము.
ఇటీవల అలాంటివన్నీ కనుమరుగవుతున్న సమయంలో అమ్మ ఒక అన్నపూర్ణాలయాన్ని ఏర్పాటుచేసి ఆకలే అర్హతగా వర్గ, వర్ణ, జాతి, మత, బీద, ధనిక విచక్షణ లేకుండా కడుపులు నింపుతున్నది. అంతేకాదు
తన వద్దకు వచ్చే బిడ్డలందరి ఇళ్ళూ ఆదరంగా పెట్టే అన్నపూర్ణాలయాలు కావాలని కోరుతున్నది. సంస్కృతాంధ్ర కళాశాలను ఏర్పాటు చేసి భోజనవసతి సౌకర్యాలతో విద్యాబోధన ఏర్పాటు చేసింది.
మామూలుగా ఎన్నో ఆలయాలలో జలాభిషేకాలు, క్షీరాభిషేకాలు ఫలరసాభిషేకాలు, పసుపుతో కుంకుమతో అభిషేకాలు, చూస్తున్నాం. అసలు అభిషేకం అంటే మంత్రపూతం. భగవంతుని తడుపులు లేకస్నానం చేయించుట. నిజానికి మన మనస్సులు ప్రేమతో, ఆర్ద్రతతో, శ్రద్ధతో, భక్తితో భగవన్నిలయాలుగా తడిసి పోవాలి. మన శరీరం, మనస్సు పవిత్రీకృతం కావటానికి ఈ రకమైన సేవలు ఉపయోగపడతాయి. రుద్రుడు, కాని వారు రుద్రుని అర్చించలేరు. అందుకే మన శరీరంలోని అన్ని భాగాలలోకి రుద్రుని ఆవాహన చేసేవి మహన్యాస మంత్రాలు. అలాగే మన సర్వస్వం ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఒకటై పోవాలి. మనం నిత్యం ఏకాదశ రుద్రాభిషేకాలు చేస్తున్నాం మన ఆలయాలలో. ప్రత్యేక ఉత్సవాలలో మహారుద్రాభిషేకాలు, అతిరుద్రాభిషేకాలు, కుంభాభిషేకాలు చేస్తున్నాం. కనీస సంవత్సరానికొకసారైనా సహస్రఘటాభిషేకాలు చేస్తున్నాం. సర్వత్రా ఉన్నది ఒకటే, సర్వుల కొరకు ఒకడు ఒకని కొరకు సర్వులూ సమర్పణ భావమే కావలసింది. సమాజపరమేశ్వరుని ఆరాధించటమే లక్ష్యార్థం.
మనం ధాన్యంతో అమ్మను నాన్నగారిని అభిషేకిస్తున్నాం అంటే జిల్లెళ్ళమూడి వచ్చే యాతాయాత సోదరీ సోదరులకు, ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు, అందరింటి సేవాపరాయణులకు ఆదరంగా, ఆహారంగా ఉపయోగించటానికి సద్వి నియోగం చేస్తున్నాం. అమ్మ ఆ అవకాశాన్ని మనకు కల్పిస్తున్నది. మనకు తెలియకుండానే మనలో సహజ పరమేశ్వరుని ఆరాధించే సత్యార్యాన్ని ప్రోత్సహిస్తున్నది.
వసుంధరకు కనకాభిషేకం
పురుషుడు అంటే పురములో నివసించేవాడు. సర్వచేతనాచేతనాలలో నివసిస్తున్నవాడు పరమ పురుషుడు. నా కన్నా పురుషుడెవరురా? అన్నది అమ్మ. నిజంగా అలాంటి అమ్మ నాన్నగారిని వివాహం చేసుకొన్నది. అంటే తనలో సగం నాన్నగారు ఉండగా మరొక సగభాగం వసుంధరకు చోటిచ్చింది. ఆ రకంగా అమ్మ పూర్ణత్వాన్ని ఇద్దరికి ప్రసాదించింది. సంపూర్ణమైన శక్తిలోంచి ఎంత పంచినా ఆ సంపూర్ణత్వానికి లోటు రాదు. సంపూర్ణంగానే ఉంటుంది.
నాన్నగారి ఆరాధననాడు ధాన్యాభిషేకానికి సంకల్పాన్ని ప్రసాదించిన అమ్మ -వసుంధరకు కనకాభిషేక – సంకల్పాన్నిచ్చి ఈ సంక్రాంతికి ఒక క్రొత్త శోభను సంతరించి పెట్టింది.
పూర్వం అమ్మకు సువర్ణ పుష్పాలతో 2013లో పూజ చేశాం. అది ఒక మహత్తర ఘట్టం. ఈనాడు. అమ్మ గృహిణికి అపరంజిపూలతో అభిషేకం జరగటం. ఒక విశిష్ట సన్నివేశం. పూర్వం “శ్రీనాధకవి సార్వభౌము”నికి కనకాభిషేకం జరిగిందని చరిత్ర చెపుతున్నది. అంతకు పూర్వం “భారవి” మహాకవికి, కాకతీయుల కాలంలో “విద్యానాథు”నకు కనకాభిషేకాలు జరిగినట్లు చెపుతున్నారు. జిల్లెళ్ళమూడి చరిత్రలో మాత్రం మొదటిసారిగా జరిగిన సువర్ణాక్షరాలతో వ్రాయదగ్గ ఘట్టం వసుంధరక్కయ్యకు కనకాభిషేకం జరగటం అని శ్రీ విశ్వజననీపరిషత్ అధ్యక్షుడు శ్రీ దినకర్ పలకటం ముదావహం.
అమ్మకు సర్వాత్మనా తన సర్వస్వాన్నీ సమర్పించి, అమ్మకు ఒక ఉపకరణంగా, ఒక అవయవంగా, ఒక సేవకురాలిగా, మంత్రిగా, మహారాణిగా, ఒక ఇల్లాలుగా, అణకువతో, సహనంతో పతిని ఆధారం చేసుకొని పంచ భూతాలను జయించినదే పతివ్రత” అన్నసూక్తికి ఆదర్శంగా, ఆదర్శ గృహిణిగా సంచరిస్తూ, భర్తవెంటే భార్య అన్న భావనను సర్వదా సర్వధా హృదయగతం చేసుకొని ఆరాధిస్తున్న అమ్మగృహిణి వసుంధరక్కయ్య. తాను పవిత్రురాలు కావటమే కాకుండా అందరినీ అమ్మ: ప్రేమతో పవిత్రీకృతం చేస్తున్న పరమసాధ్వి వసుంధ రక్కయ్య. ఎవరిలోనూ లోపాలెంచకుండా ప్రేమతో, దయతో సేవించే తత్వాన్ని చూచే అమ్మ వసుంధ రక్కయ్యను ‘దయామణి’ అన్నది. నిరంతరం అమ్మ చింతనలో పరవశిస్తున్నది అక్కయ్య.
అమ్మ చెప్పి చేయించిన అమ్మ “సమర్తబంతిని” “సందెగొబ్బెమ్మను” “క్షీరాబ్ధిద్వాదశి”ని నిర్వర్తిస్తూ నిర్వర్తింపచేస్తున్నది. తాను అమ్మ వద్దకు వచ్చిన క్రొత్తలోనే మొదలు పెట్టి అమ్మదినచర్య (డైరీ)ను “శ్రీవారి చరణసన్నిధి” గా మనకందించిన ఒక మహత్తర కానుక అది – రెండుభాగాలుగా ప్రచురింపబడి తన రచనాశక్తికి ఆనవాలుగా వెలుగొందుతున్నది.
అలాంటి అమ్మ గృహిణికి అపరంజి పుష్పాలతో అభిషేకం జరగాలని అమ్మ ప్రేరణ కలిగించటం, ‘పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ ఛారిటబుల్ ట్రస్టు” వారు. ఆ కార్యక్రమానికి పూనుకోవటం, సోదరీ సోదరులెందరో తాము కూడా ఆ స్వర్ణాభిషేకంలో పాల్గొంటామని ఆర్థికంగా, హార్ధికంగా ముందుకు రావటం, శ్రీ విశ్వజననీ పరిషత్వారు తమ సంపూర్ణ సహకారం అందించటం జిల్లెళ్ళమూడి అందరింటి చరిత్రలో ఒక చారిత్రక సన్నివేశం. 2022 జనవరి సంక్రాంతికి ముందు ఆదివారం 9-1-2022 న విజయవంతంగా అమ్మ. అనుగ్రహంతో నిర్వహింపబడి ఎందరి మనసులకో ఆనందాన్ని కలిగించింది. వసుంధరక్కయ్య జీవితంలో అమ్మ అనుగ్రహించిన కనకాభిషేకం ఆబాలగోపాలం ఆనాడు అందరింట్లో అమ్మబిడ్డలు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాలేని సోదరీ సోదరులు వాట్సప్, యూట్యూబులలో చూచి పరవశులైనారు.
వసుంధరక్కయ్య అలా తనను అభిషేకించిన బంగారు పుష్పాలను తనకు వచ్చిన ధన బహుమతులను అన్నీ శ్రీ విశ్వజననీపరిషత్కు సమర్పించటం కొసమెరుపు.
అలాగే ఫిబ్రవరి 17న నాన్నగారి ఆరాధ నోత్సవంలో జరిగే ధాన్యాభిషేకంలో ఇబ్బడిముబ్బడిగా సకుటుంబంగా పాల్గొని తరించవలసిందిగా సోదరీ అమ్మ పాదాలపై ప్రతిదినం తులసీదళాలు వేస్తూ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం.