మీరు పెట్టే శీర్షికలన్నీ చాలా విచిత్రంగా ఉంటయ్యండీ! అమ్మకు సేవ చేయటమంటే సబబుగా ఉన్నది గాని, అమ్మ సేవేంటండీ? భగవంతుడికి భక్తుడు సేవ చేయటం సహజంగాని, భగవంతుడే భక్తులకు సేవ చేయటం ఉన్నదా? అంటే అసలు ఉన్నదే భగవంతుడు భక్తులకు సేవ చేయడం. నిజమైన భక్తునకు వశుడై భగవంతుడు ఉంటాడు. భక్తునకు ఎక్కడ కష్టం కలుగుతుందో, ఎక్కడ బాధ కలుగుతుందోనని – ఆ కష్టాన్నీ, ఆ బాధను భక్తునకు కలుగకుండ తాను అనుభవించటానికి సిద్ధంగా ఉంటాడు.
“ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష శుక శౌనక భీష్మ దాల్బ్యాన్ రుక్మాంగదార్జున వసిష్ట విభీషణాదిన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి” అని చాలామందిని చెప్పారు. అసలు భగవంతుడే “గోవు వెంట తగులు కోడె భంగి” వారి వెంటనంటి ఉంటానంటాడు. ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు పడ్డాడో!” అయితే అవి అతను అనుభవించాడా? భగవంతుడే అనుభవించాడు. అసలు భగవంతుడే అనుభవించటానికి రానక్కరలేదు. భగవంతుని పరివార దేవతలే వస్తుంటారు. అంబరీషునిపైన కృత్యను ప్రయోగించాడు దుర్వాస మహర్షి సుదర్శన చక్రమే ఆ కృత్యను సంహరించి దూర్వాసుని వెంటపడ్డది. దానిని మళ్ళించటం త్రిమూర్తుల వల్ల కూడా కాలేదు. మళ్ళీ అంబరీషుడే ప్రార్థించి ఉపసంహరించాడు. ద్రౌపదీదేవి “నీవే తప్ప ఇతః పరం బెరుగ” అంటే శ్రీకృష్ణపరమాత్మే అక్షయంగా వలువలిచ్చాడు, అక్షయ పాత్ర నిచ్చాడు. ఇలా చెప్పుకుంటూపోతే పురాణాలలో భగవంతుడు భక్తుల సేవ చేసిన సందర్భాలు ఎన్నో గ్రంథాలు వ్రాయవచ్చు. అది ప్రధాన విషయం కాదు కనుక ప్రస్తుతానికి వద్దాం.
అమ్మ సేవ. అమ్మ ఎవరికి సేవ చేసింది? ఎవరికి సేవ చేయలేదు కనుక? అసలు అమ్మ తప్ప బిడ్డకు ఎవరు సేవ చేస్తారు? పుట్టినప్పటి నుండి మనం పెద్ద వాళ్ళం అయ్యేదాకా అమ్మ తప్ప సేవ ఎవరు చేస్తున్నారు? పసితనం అంటే తెలియనితనం అన్నది అమ్మ. గడ్డాలు నెరిసినా తెలియనితనం ఉంటూనే ఉంటుంది. తెలిసే తెలివి ఇవ్వాల్సింది అమ్మేగా! కాశీలో చనిపోయిన ప్రతి జీవికీ మోక్షం ఇస్తాడుట పరమేశ్వరుడు రామతారక మంత్రం ఉపదేశించి. అలాగే జిల్లెళ్ళమూడి అష్టమ మోక్షక్షేత్రం అన్నారు శ్రీ బులుసుశాస్త్రి. ఇక్కడ చనిపోనే అక్కరలేదు. అమ్మ దృష్టి సోకితేనే మోక్షం. అమ్మే చెప్పింది ఆమాట. “నేను అనుకోనిది ఎవరూ ఇక్కడుకు రాలేరు. ఇక్కడకు రావటం ఎన్నడూ వృధా కాదు. నన్ను చూడటమే. పొందటం” అని. ఆ పొందటం ఏమిటంటారు? ఏది పొందితే జన్మ ధన్యమో అది పొందటం. ఆ మోక్షాన్ని పొందటం ఆ మోక్షాన్ని పొందటం. మోక్షం అంటే ఎక్కడ నుండి పొందేది కాదు. పొందవలసింది ఏమీ లేదు. అని తెలుసుకోవటం. అలాంటి సేవ జ్ఞానం మనకు ప్రసాదిస్తున్నది అమ్మ. అమ్మ అన్నం పెటుతున్నదనో, విద్య అందిస్తున్నదనో ఏవో అనుకుంటే అంతేకాదు. ఆ సేవ చేయటం ద్వారా అమ్మ మనకేం కావాలో మనం అడక్కుండానే మనకిస్తున్నది. కాకపోతే ఆ అన్నము, విద్య మాధ్యమాలు మనకు అజ్ఞానమనే జబ్బును పారద్రోలే అమృతపు గుళికలు. ఆ రకమైన సేవ మరిడమ్మ తాతమ్మకు, చిదంబరరావుగారికీ, తనకే పాఠాలు, మంత్రాలు చెప్పుదామని కుతూహలపడ్డ గురువులకు, మంత్రవేత్తలకు, సన్యాసులకే కాదు అమ్మ జీవితంలో తటస్థ పడ్డ అందరికీ చేసింది. ఇంకా లోతుకు పోతే తనను చూచినా, చూడకపోయినా అందరికీ సుగతేనని హామీ ఇచ్చింది. అయితే ఆ సేవను, హామీని అర్థం చేసుకోగల సామర్థ్యం ఎంతమందికి కలుగుతుందో తెలియదు. ఎందుకంటే ఆ సామర్థ్యం కూడా అమ్మ ఇవ్వాల్సిందేకదా! అమ్మ సేవను ఈ రకంగా, అమ్మ ప్రసాదంగా పొందగల అదృష్టవంతులం మనం. కాకపోతే ఆ అదృష్టాన్ని ఎలా త్వరగా పొందుతామో ఆలోచిద్దాం. ఒక ఆఫీసులో, పది ఉద్యోగాలున్నవి అనుకుందాం. ఆ పది ఉద్యోగాలకు వెయ్యిమంది కావలసిన అర్హత పొందినవారు దరఖాస్తు చేసుకున్నారు. పదిమందికేగా ఉద్యోగాలిచ్చేది. ఆ పదిమందిలో మనం ఉండాలంటే ఏం చేయాలి? అదిగో అది అమ్మసేవ, భగవత్ సేవ.
ఆ అమ్మ సేవకై మనం అనుసరించాల్సిన మార్గం ఏమిటి? విచిత్రం ఏమిటంటే అది కూడా అమ్మే చెప్పింది. నాకు వంటింట్లో పనిచేసే వంటవాడూ, పాకీదొడ్లో పనిచేసే పాకీవాడు ఒకటే అని. అంటే నిస్వార్థంగా తనకు చేతనైన పనిచేస్తూ సర్వ సమర్పణా భావం కలిగినవా డెవడైనా అమ్మకు సేవ చేసినట్లే. ఆదరంతో అన్నం వడ్డించు, ప్రేమతో వడ్డించు, నీ బిడ్డకు వడ్డించినట్లు వడ్డించు. ఆలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. అందరిల్లు ఉన్నది. అవి పరిశుభ్రంగా చిమ్మండి, బూజు దులపండి, కడగండి, ముగ్గులు పెట్టండి. ఆఫీసులో ఫాన్ కింద కూర్చొని చేసేదే సేవకాదు. అది కూడా సేవలో ఒక భాగమే. ‘ప్రతిపనీ’ అంతే. అమ్మ సేవలో భాగమే. ఏ పనినైనా నీ కోసం నీవు చేసుకుంటున్నావు. కాకపోతే అమ్మ సేవా భావంతో చేస్తే నీవు తరిస్తావు. ఒక బాధ్యత నీకు అప్ప చెప్పినా, నీవు తీసుకున్నా నీ జీవితంలో అది ఒక భాగమనుకో మధ్యలో వదలిపోకు. ఆటుపోట్లు వస్తుంటవి. దాని లాభనష్టాలు నీవికావు. భగవంతుడివి. వదిలివేయ్.
“తమ కార్యంబు పరిత్యజించియు పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్
తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్
తమకై అన్యహితార్థ ఘాతుక జనుల్ దైత్యుల్ వృధాన్యార్థభం
గము గావించెడు వారలెవ్వరొ యెఱుంగన్ శక్యమే యేరికిన్” అన్నాడు భర్తృహరి.
మనం దైత్యులుగా, అధమాధములుగా, మధ్యములుగా కూడా ఉండవద్దు. సజ్జనులు గానే ఉందాము. పనిచేసేటప్పుడు బాధ్యతో కూడిన అహంకారం లేకుండా ఉండదు. అయినా నీది కాదు. ఎవరి పనిచేస్తున్నామో వారిదే ఆ అహంకారం కూడా. ఆ మెలుకువ ఉండాలి. అది నిరంతరం జాగృతమై ఉంచమని అమ్మను ప్రార్థిద్దాం.
ఆ అహంకారం శ్రుతిమించకూడదు. అహంకారాలలో కూడా సాత్వికాహంకారము, రాజసాహంకారము, తామసాహంకారము అని మూడు రకాలుగా ఉన్నది.
ఒక్కొక్క బాధ్యత ఒక్కొక్కళ్ళకు అప్పగించవచ్చు. అమ్మ. భౌతికంగా ఉన్నప్పుడు, అనంతమూర్తిగా ఉన్నప్పుడు. మనకు ఆ నిర్వహణ సామర్థ్యాన్ని కూడా అమ్మే ఇస్తున్నది. అయితే భౌతికంగాను, మానసికంగాను, అమ్మకు సన్నిహితంగా మెసలే అవకాశం అమ్మే కల్పిస్తుంది. అది మన ప్రతిభ కాదు. అమ్మ అనుగ్రహం. దానిని దుర్వినియోగం చేసుకుంటే మనకు తెలియకుండానే మనం పతనం వైపు అడుగులు వేస్తున్నట్లే. అమ్మ వ్యాపారం చేయమనవచ్చు, మేనేజ్మెంట్ చేయమనవచ్చు. విద్యావ్యవస్థ చూడమనవచ్చు. వైద్యశాల చూడమనవచ్చు. పత్రిక చూడమనవచ్చు. ఏదైనా అమ్మ నిర్ణయాలే – మన వల్లనే ఇవి విజయవంతంగా జరుగుతున్నాయి అనుకుంటే ఒక మెట్టుకు మెట్టు క్రిందకు జారుతున్నట్లే.
నాకు నేను మీరేం పని చేయగలరు అంటే పూర్వం నాకున్న రచనా వ్యాసంగము, పత్రికా నిర్వహణ పరిచయంతో ఈ పత్రిక బాధ్యత నేను చూడగలను అనుకున్నాను. రాను రాను నేను కాదు చూచేది అమ్మకు నేను ఒక ఉపకరణం మాత్రమే అనేది అర్థం కావటం మొదలైంది. తర్వాత తర్వాత వచ్చిన అమ్మ ఇచ్చిన అనుభవాలతో అది రూఢి అయింది. కాలేజి బాధ్యత చూడమన్నారు. నేను దానికి తగినవాడనని మీకనిపిస్తే అలాగే చూస్తానన్నాను. ఎందుకంటే చూచే ఉపకరణాన్ని మాత్రమే నేను కనుక. ఇలాగే అన్ని రంగాలలో ఉన్న వ్యక్తులకు అర్థమౌతుంది. అమ్మ అన్నది “ఇక్కడ ఏదైనా గోడకు బంతి కొట్టినట్టే నాన్నా” అని. శ్రీకృష్ణుడు కూడా గీతలో అర్జునునకు భారత సంగ్రామంలో “అందరినీ నేను పూర్వమే చంపాను. బాణం వేసి నీవు చంపానని అనిపించుకో” అని. అలాగే అమ్మ నేను కరణాన్ని మీరు ఉపకరణాలుగా, కనీసం రాజసమైన అహంకార ఉపకరణాలుగా నైనా వాడుకోవాలని అమ్మను పదే పదే వేడుకుందాం. అడిగీ అడగ్గానే వరాలిచ్చే దేవతేకదా! అమ్మ సేవలో తరిద్దాం.