విశ్వజనని ఏప్రిల్ 2021 సంచిక కవర్ పేజీ మీద ఉటంకించిన ఈ అమ్మ వాక్యాన్ని చూచి హైదరాబాద్ నుండి ఒక సోదరుడు ఫోన్ చేశారు. అమ్మ చెప్పిన ఈ వాక్యం వివరణ వ్రాయండి అని. అమ్మ చెప్పిన మాటల అంతరార్థం తెలుసుకోవటం సామాన్య విషయం కాదు. తరచుగా మూలానికి తీసుకొని వెళుతుంది ప్రతివాక్యము ‘మే’ విశ్వజనని సంచిక మీద కూడా ఈలాంటి వాక్యమే “నాకున్న అన్నిపాళ్ళు నాకంటే ఏ కొంచమైనా ఎక్కువ ఉంటే కాని నన్ను తెలుసుకోలేరు” అన్న అమ్మ వాక్యము కూడా అంతే – మనలాగా మనతో మంచి చెడులు పంచుకుంటూ మనం ఏడిస్తే తను కన్నీరు పెట్టుకుంటూ, మనం నవ్వితే తనూ దరహాసం చేస్తూ మనలాగే సంచరించిన అమ్మ అన్నీ అంటుకొని ఏదీ అంటకుండా ఉండగలిగిన చైతన్యశక్తిని అర్థం చేసుకోవటం కష్టం.
వేదకాలంలో ఉన్న పరిస్థితులు ఆనాటి సమాజమును మనం ఊహించలేము. ఎందుకంటే మనం అందుకోలేము కనుక. తరువాత తరువాత వచ్చిన పురాణాలు, శాస్త్రాలు ఉపనిషత్తులు అన్నీ “జన్మ-కర్మ” సిద్ధాంతం మీదనే ఆధారపడి ఉన్నవి కనుక. వాటిని మన జీవన విధానంలో బలంగా పాతుకుపోయే రీతిలో పండితులు వింగడించారు కనుక. ఉగ్గుబాలతో అవి రంగరించి పోశారు కనుక. తరతరాలుగా అవి మన మనస్సులపై నాటుకొని ఉన్నవి. అంత తేలికగా వదిలించు కోవటం కష్టమే. నిజానికి వేదంలో జన్మకర్మ సిద్ధాంతం ఉన్నదా? అని పొత్తూరి వారు అడిగిన ప్రశ్నకు “వేదంలో లేదు. కాని వేదాంతంలోని ఉపనిషత్తులలో చెప్పబడింది కదా!” అన్నారు కులపతి గారు.
అమ్మతో అమ్మ వాక్యాలను చర్చించిన సోదరులతో “అమ్మ జన్మలు లేవంటే భుజాలు తడుము కుంటారెందుకురా? నాకూ ఒప్పుకుందామనే ఉన్నది ఆధారం దొరకటం లేదు’ అన్నది. జన్మ పరంపరను గూర్చి పండితులు జన్మ సమాప్తమయినపుడు చేసిన పుణ్య పాపములు కర్మ తాలూకా వచ్చే కష్ట సుఖాలు అనుభవింప జేసి, పూర్తిగా కాదు కొంత ఆ జీవికి అట్టిపెట్టి మళ్ళీ తరువాత వచ్చే జన్మకు అంటుకొని ఉంటుందంటారు. అంటుకొని ఉండేది శరీరానికా? ఆత్మకా? శరీరానికి అనుకుంటే శరీరం జడం అంటున్నారు. జడం అనే దానికి జన్మేమిటి? వాళ్ళు చెప్పే ప్రకారం చూచుకున్నా ‘శరీరం’ ఇక్కడ వదిలి ‘ఆత్మ’ ఎక్కడో లయమవుతుంది. అది మారదంటున్నారు. కాబట్టి జన్మ ఒకటే కదా! “ఈ శరీరం మళ్ళీ వచ్చేదాకా ఎక్కడ ఉన్నట్లు? సూక్ష్మ శరీరాలంటున్నారు. వాళ్ళు వచ్చారో లేదో! రాముడు, కృష్ణుడు కనిపించాడంటారు. వాళ్లు శరీరాలతో కొంతకాలం ఉన్నట్టు విన్నాం. వాళ్ళు మళ్ళీ కనిపించారనే మాటలు వింటున్నాం. అలాగే ఇలాంటివీ. పూర్వజన్మ గుర్తులున్నాయి అని చెప్పేవాళ్ళు ఒకటి అడ్డం వేయవచ్చు. నిద్రలో ఏం తెలుస్తుంది? అంతకుముందు తెల్సు. వాళ్ళకు శరీరం వచ్చింతర్వాత గుర్తున్నై అని. శరీరం ఉన్నప్పుడేగా నిద్ర, ఆకలి, శరీరం లేకపోతే ఆకలి లేదు, నిద్రలేదు. నిద్రలేనపుడు మరుపేమిటి? పూర్వజన్మ అంటే పూర్వానికి పూర్వం, దానికి పూర్వం అట్లా పోయినా అసలు దగ్గరకే పోతుంది. ఆ జన్మలో తాను చేస్తున్న దేమీ లేదు కదా, తర్వాత జన్మ ప్రారబ్ధం కావటానికి? “తెలిసినవాడికి జన్మలు లేవు. తెలియనివాడికి ఏది ఏమౌతుందో తెలియదు. జన్మవాడిస్తే రావలసిందే. నీవు చేసే కర్మవల్ల కాదు. ” – అమ్మవాక్యం.
“కర్మ’ అంటే పని. ఒక పని చెయ్యాలి అనుకుంటే చెయ్యలేకపోతున్నాం. చెయ్యలేము అనుకుంటే సాధించవచ్చు. అంటే మనను ప్రేరేపించేది కనిపించని శక్తి అనేగా! అకర్మ కనిపించదు. కర్మకు కారణం అకరే.. “ప్రారబ్ధం అనండి, భగవంతుడనండి, శక్తి అనండి. అంతా నేనే చేస్తున్నాను వీటన్నింటికి కారణం మనమే అనండి. కాదు ఏదో శక్తి చేయిస్తున్నది అని అనండి. కొంత మనం, కొంత కాదు అనుకుంటే చిక్కే” అన్నారు. అమ్మ. దేనివల్ల కర్మ వచ్చింది ? ఆధారం దొరకదు. ఒకడు చంపితే మరొకడికి శిక్షపడుతున్నది. శిక్ష ఎందుకు పడింది అంటే పూర్వజన్మలో చేసి ఉంటావేమో అంటారు. అన్నీ తనే చేస్తుంటే నీవు చేయి అనేది పుట్టదు. “పుణ్యమను కొని పుణ్యమూ చేయలేవు – పాపము అనుకొని పాపము చేయకుండా ఉండలేవు – ప్రకృతి జనితమైన గుణస్వభావాలు నీ చేత ఏ పనులు చేయిస్తే వాటిని చేయటానికే నీకు అధికారమూ, సామర్థ్యమూ ఉంది. చేసేవాడూ చేయించేవాడూ వాడే అనుకుంటే నీకెలాంటి పాప పుణ్యాలూ అంటవు. చంపేవాడు చంపబడేవాడూ అంతా వాడి నిర్ణయమే – అందుకోసమే అమ్మ నమస్కారం నీవు పెట్టటం కాదు, నేను పెట్టించుకోవటమే అంటుంది.
“జ్ఞానయోగ, కర్మయోగ, భక్తియోగాలలో సిద్ధులు, స్థితప్రజ్ఞులు పొందిన లక్షణాలేవైతే ఉన్నాయో-సాక్షాత్సం సారంలో ఉండి అమ్మ చేసి చూపించిన సంసార యజ్ఞానికీ ఏమీ భేదం లేదని అమ్మ స్పష్టంగా చెప్పింది – కొబ్బరి చిప్పలతో, పిడకలతో, దురదగొండాకులతో ఉమ్మెత్త కాయలతో పూజ చేసినా, పూలతో చేసినా మనస్సును అర్పించడమే ప్రధానం అన్నది. కంటి బాధ ముక్కుకు తెలియదు, ముక్కు బాధ చెవికి తెలియదు. అన్నీ తలలో ఉన్నా అన్నింటి బాధలు మనస్సు ద్వారా వ్యక్తమౌతాయి. మనస్సే అన్నింటికీ ప్రధానం. ఇహలోకానుభవంతోనే పరమాత్మను దర్శించవచ్చు. శబ్దవేది విద్య రామాయణానికి మూలం. శబ్దం నుండే జగత్తు పుట్టింది. ఇంద్రియానుభవం లేకుండా నిర్ధూమమైన పరంజ్యోతిగా వెలిగేశక్తి మనస్సు కున్నది. ఏ మార్గాన నడిచినా వాడే నడిపిస్తున్నాడనుకోవడం సన్మార్గం. నిష్ఠ అంటే సాధనకు పరిపక్వమైన దశ. అది భగవత్ప్రసాదం వల్ల రావలిసిందే గాని మనంతట మనం అభ్యసించేది కాదు. అసలు పురుషప్రయత్నం లేదు.
“అపరకర్మ అని జీవుడు చనిపోయినపుడు చేస్తుంటారు” ఏం చేసినా మన ప్రేమకు చిహ్నంగా చేయటమే – సేవ, కర్మ బ్రతికి ఉన్నవాడికి కాని చచ్చిన వాడికి కాదు. విష్ణుస్వరూపంగా బ్రాహ్మణుడికి భోజనం పెడుతున్నాం. భోక్తలో విష్ణుమూర్తి ప్రవేశించాడో లేదో ఉన్నాడనుకొని పెట్టుతున్నాం. కర్మ చేస్తున్నవాడు. స్మరించటం ముఖ్యం కనుక చేస్తాడు. జీవుడున్నాడని. చేస్తున్నాం. వడుగు కాకపోతే జీవుడులేదా? కర్మ రకరకాలు ఏదో విధంగా నలుగురికి పెట్టటం సంతోషం.
కర్మ సిద్ధాంతమునకు ఆధారం చేసుకొన్నది కర్మ, జన్మలే కదా! కర్మంటే ఎక్కటిది ? దేనివల్ల ఈ కర్మ వచ్చింది. దీనికి ఆధారం దొరకదు. ఒక పదార్థము తింటే జబ్బు ఎక్కువవుతున్నది. మరొకటి తింటే తగ్గుతున్నది. భూమిలో నుండి సర్వమూ వచ్చినా ఒక దాని గుణం ఒకదానికి రాలేదు. శక్తి ఇన్నిగా అయింది. జన్మ వాడిచ్చేదే. కర్మా వాడిచ్చేదే.
“సముద్రంలో ఒక కెరటం వస్తున్నది. కెరటంలోపలకు వెళుతున్నది. అందువల్ల చైతన్యం అనే సముద్రం నుండి జన్మలు వస్తున్నవి. నేను జన్మలు లేవనటం లేదు. పునర్జన్మ లేదంటున్నాను. కెరటాలు వచ్చినట్లుగానే జన్మలు వస్తాయి. ప్రస్తుతజన్మకీ తర్వాత జన్మకు సంబంధం లేదు. ఇది మహాచైతన్యంలో కలిసి పోతుంది. మళ్ళీ ఆ చైతన్యంలో నుండే ఇంకొక రూపంలో వస్తుంది. ఒక అనంతమైన శక్తి ఇస్తే జన్మలు వస్తవి. మోక్షమనేది కూడా అంతే. వాడిస్తే రావలసిందే. మనం చేసే కర్మలన్నీ వాడి అనుగ్రహమే”
అందువల్ల కర్మ మనం ఆర్జించుకున్నది కాదు. అంతా వాడిచ్చిందే. అందుకే అమ్మ ఎక్కడి నుండి వచ్చామో అక్కడికే వెళ్ళుతారు. అందరికీ సుగతే నన్నది. అన్నం బ్రహ్మైతే అశుద్ధం బ్రహ్మ కాదా ? సర్వం వాడే అయినపుడు పుణ్యం, పాపం రెండూ వాడివేగా! అందుకే అమ్మ కర్మ చేయాలనుకున్నా చేయలేవు. ఊరుకుందా మనుకున్నా ఊరుకోలేవు – ప్రకృతి ప్రసాదించిన పనులు చేస్తూ అంతా వాడే చేయిస్తున్నాడనే భావనతో సర్వం వాడి నెత్తిన పెట్టటమే అదీ వాడిదయతో పెట్టగలిగితే అంతకు మించి జీవి చేయగలిగిందేమీ లేదు – అలా నిర్లిప్తంగా, సాక్షీభూతంగా ఉండటానికే ఈ సాధనలు చేస్తున్నామని అనుకోవటం. అదీ వాడి ప్రసాదమే. “తనుమూల మిదం జగత్ అవసరం విలువైనది: తృప్తే ముక్తి” అనే అమ్మ మాటలు ఆణిముత్యాలు.