1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సంపాదకీయము..(తల్లి ధర్మము)

సంపాదకీయము..(తల్లి ధర్మము)

P S R Anjaneya Prasad
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : September
Issue Number : 2
Year : 2010

శ్రీకృష్ణుడి కాలంలో నేను పుట్టి ఉంటేనా, శ్రీ రామకృష్ణ పరమహంసను చూచి ఉంటేనా, శ్రీ రమణమహర్షిని కలసి ఉంటేనా తప్పక వారి గొప్పదనాన్ని గుర్తించగలిగి ఉండేవాడిని అనుకొనేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే అమ్మను మేము దర్శించలేకపోయాము. లేకపోతేనా అనుకొనేవాళ్ళు ఉంటారు. ఇంతకూ వాళ్ళు అలా ఎందుకనుకుంటున్నారు ? వాళ్ళ చరిత్రలు చదివినప్పుడు, వారి మాటలు, సందేశాలు చూచినప్పుడు వారికి కలిగిన భావాలవి. వారి మేధస్సుకు తెలుసు గ్రంథాలకన్నా వారిని ప్రత్యక్షంగా దర్శించి వారి మాటలు వింటే వారిలో నుండి ప్రసారమయ్యే ఆకర్షణశక్తి, కాంతిలహరులు, మాటలలోని మాధుర్యము, వాటి వెనుకగల ఆధ్యాత్మికశక్తి వాళ్ళలో మార్పు తీసుకొని రాగలదని, వారి లోని ఏదో అలౌకికశక్తి వీళ్ళను కట్టిపడేసి ఉజ్జలశక్తిమంతులను చేసి ఉండేదని వారి భావం. అందులో ఆశ్చర్యం లేదు. చూచినవాళ్ళు అనుభవించిన అనుభూతి అది కనుక.

అమ్మ విషయానికి వస్తే అమ్మను చూచిన వాళ్ళు ఇంకా ఎందరో ఉన్నారు. వాళ్ళు అమ్మను ఎంతవరకు గుర్తించగలిగారు ? నేను కనిపిస్తేగాని మీరు చూడలేరన్నది అమ్మ. ఒక క్షణంలో సృష్టికి మూలమైన మహత్తరశక్తిగా అనిపించే అమ్మ మరుక్షణంలో మనకంటే అతి సామాన్య గృహిణిగా, లౌకిక విషయాలు చక్కబెడుతూ మనం బాధపడితే తాను బాధపడుతూ, మనకేదన్నా జబ్బు చేస్తే మనకన్నా ఎక్కువ ఆందోళన పడుతూ డాక్టరును పిలిపించటం, మందులిప్పించడం చేస్తూ ఉంటుంది. మనం అమ్మను మామూలు అమ్మేలే అని మాయలో పడిపోతుంటాం. తనకేమి తెలియనిదానిలా ప్రశ్నలడుగుతూ, బిడ్డలపట్ల తాపత్రయపడుతుంటే అమ్మ కంటే మనకే తెలుసునని మన ప్రతిభను, తెలివితేటలను ప్రదర్శిస్తుంటాం. ఇదంతా జరిగిన విషయాలే చెపుతున్నాను. మన అహంభావం బయట పడింతర్వాత మనల్ని దారిలో పెట్టటానికి, మన అవివేకం మనకు తెలియచేయటానికి సున్నితంగా వాత్సల్యంగా ప్రేమతో మనంతట మనమే తెలుసుకొనేట్లు చేస్తుంది అమ్మ. ఆమె అమ్మ కనుక, ఆ మార్పు మనలో సహజంగా వచ్చేట్లు చేయటం తల్లి ధర్మం కనుక. ఎవరికి వారికి బయట వారికి ఇలా జరుగుతున్నప్పుడు గమనించినా తమ వద్దకు వచ్చేటప్పటికి మామూలే. మన తెలివితేటలేవీ అమ్మ వద్ద పని చేయవు.

అమ్మవద్ద నేర్చుకోవలసినవి చాలా ఉన్నవి. అమ్మ మామూలు మానవిగానే వ్యవహరిస్తుంది. అమ్మది భూదేవి ఓర్పు అన్నవారున్నారు. అమ్మ మండే పొగాకు బేరన్లో నుండి వస్తే చూచినవారున్నారు. అమ్మ కడుపులోని బిడ్డ చనిపోతే ఒక రోజు తర్వాత బయటవాళ్ళు హాస్పిటల్లో వాళ్ళు నీవెలా బ్రతుకున్నావో అర్థం కావటంలేదన్న వాళ్ళున్నారు, నడియెండలో నడిస్తే పాదాలక్రింద చర్మం ఊడి రక్తం వస్తున్నా బాధపడని అమ్మను చూచినవాళ్ళకు అమ్మలోని సహనం కొద్దిగా అయినా అర్థమై ఉంటుంది. సహనమనే దేవతను ఆరాధించటానికి బాధలనే పూజా పుష్పాలు కావాలి అన్న అమ్మ అనుభవించిన బాధలు చూస్తే అమ్మ చెప్పిన మాటలు జ్ఞప్తికి వస్తాయి. అమ్మ బాధలను బాధలుగా అనుభవించలేదు. సుఖదుఃఖాలు అమ్మకు సమానమే. దేనికీ పొంగదు, క్రుంగదు. ఓర్పు అమ్మ వద్దనే చూడాలి. తన శరీరం మీద లేచిన గడ్డను కోస్తున్నా ఏ మాత్రమూ చలించదు.

ఒకసారి నారదుడు ఒక అరణ్యం గుండా పోతుంటే ఒక తపస్వి కనిపించి మీరెక్కడకు వెళుతున్నారని నారదుణ్ణి ప్రశ్నించాడు. స్వర్గానికి వెళుతున్నానని చెప్పాడు నారదుడు. నాకు భగవంతుడు ఎప్పుడు ముక్తిని ప్రసాదిస్తాడో అడిగి చెప్పండి అన్నాడు. సరేనన్నాడు నారదుడు. ఇంక కొంత దూరం నారదుడు వెళ్ళగా భగవంతుడి గానం చేస్తూ, నృత్యం చేస్తూ మరొక వ్యక్తి కనిపించాడు. అతడు నారదునితో భగవంతునితో తన ముక్తి సంగతి అడిగిచెప్పమన్నాడు. సరేనని వెళ్ళాడు నారదుడు. కొంతకాలానికి తిరిగి నారదుడు కనిపించి మొదటి వానితో నాలుగు జన్మలలో ముక్తి వస్తుందని స్వామి చెప్పినట్లు చెప్పాడు. ఇంత తపస్సు చేశాను ఇంకా నాలుగు జన్మలా అని ఏడ్చాడు. రెండవవాని వద్దకు వచ్చి అతనితో ఎదురుగా ఉన్న చింత చెట్టు చూపించి దాని ఆకులు ఎన్నో అన్ని జన్మల తర్వాతే నీకు మోక్షం వస్తుందని చెప్పాడయ్యా అన్నాడు. అందుకు వాడు సంతోషించి ఇంత కొద్దికాలంలోనే నాకు మోక్షం లభిస్తుందా అని ఆనందించాడు. అప్పుడు ఆకాశవాణి ఈ క్షణంలోనే నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పిందట. నిరుత్సాహం లేదు ఎన్ని జన్మలైనా ఓర్చుకుంటాననే వాడికి అప్పుడే ముక్తి వచ్చింది మరి. అమ్మ అందుకే “తృప్తే ముక్తి” అన్నది.

ఒకరోజు ధర్మరాజు తన వద్దకు వచ్చిన అందరికీ దానాలు చేసి అలసిపోయాడు. అప్పుడొకడు వచ్చి యాచించాడు. రేపురా నీకు ఇస్తాను కావలసింది అన్నాడు ధర్మరాజు. భీముడు నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావని అడిగాడు ధర్మరాజు. “నీకెంత విశ్వాసం అన్నయ్యా ! రేపటిదాకా బ్రతుకుతానని. మరుక్షణంలో ఏం జరుగుతుందో తెలియదుకదా!” అన్నాడు. ధర్మరాజు ఆ యాచకుడికి వెంటనే కావల్సింది ఇచ్చిపంపాడు. మనకేం తెలియదు కదా! మనను గూర్చి అమ్మ ఉన్న రోజులలో అమ్మను ఎంత తెలిసికోగలిగాం. అమ్మ చూపించే వాత్సల్యంలో, అమ్మ పెట్టే అన్నపు ముద్దలలో, అమ్మ చూపించే ఆదరణలో కరిగిపోయాం తప్ప ఆ తత్వాన్ని ఎంత అర్ధం చేసుకోగలిగాం ? ఏడవ మైలు దాటగానే మన పిల్లలు, మన ఉద్యోగాలు, మన సంసారం, మన జంజాటాలు. రోజులో ఎంత సేపు అమ్మను గూర్చి సంస్థను గూర్చి ఆలోచించాం ? వినిపించే ప్రతి శబ్దంలో అమ్మ నామం, కనిపించే ప్రతి దృశ్యంలో అమ్మ రూపం చూడగలిగామా? ఇన్ని సంవత్సరాల బట్టీ వస్తున్నాను, ఇన్ని కార్యక్రమాలు ఇక్కడ చేశాను. ఇంత ధనం ఇచ్చాను అనే అహంకారాన్నే వదులుకోలేం – మనం ఆ అనంతశక్తిని ఏం అర్థం చేసుకోగలం ? వాల్మీకి తన పాపంలో భాగం పంచుకోబోమన్న కుటుంబాన్ని వదిలి మహర్షి అయ్యాడనే కథ ఒకటున్నది. అది నిజమా ! కాదా ! అనే విషయం అవతల బెట్టి ఆయనలో వచ్చిన మార్పును గమనించగలిగామా ? అమ్మ చూపే ప్రేమతో ఆదరణతో మాయలో మునిగిపోయాం. అమ్మను తెలుసుకోవటానికి ప్రయత్నం ఎంతవరకూ చేశామో ఎవరికి వారు ఆలోచించుకోవాలి. నారదు డంతటి దేవర్షికూడా మాయలో పడి సంసారాన్ని అనుభవించిన కథ కూడా మనం చదువుకున్నాం. అమ్మ మనస్సే అన్నిటికీ ప్రధానమన్నది. “జీవితంలో బ్రతుకుకూ, మనస్సుకూ పోరాటం తప్పదు. ఆ రెంటికీ సమన్వయం కుదరదు” కుదిరితే లక్ష్యసిద్ధిని  పొందినట్లే.

“మనస్సే దైవం – మనస్సే వైకుంఠం” అన్నది అమ్మ. “మనస్సులో ఆలోచనలు రాకమానవు. వచ్చే ఆలోచనలు మనవి కావనుకోవటమే ఆలోచనలు లేని స్థితి. ఏ ఆలోచనలు వచ్చినా అవి భగవంతుడు ఇచ్చినవే అనుకో. అప్పుడవి నీ జోలికిరావు” అంటుంది అమ్మ. అవును అది నేర్చుకోవాలి. సామాన్యంగా మనసుకు ఏకాగ్రత కుదరటం లేదంటుంటాం. “ఏకాగ్రత అంటే ప్రతి ఆలోచనా – కనబడేవన్నీ ఒకటిగా తోచడమే. ఏది చూచినా, ఎందులోనైనా ఒకే వస్తువును చూడటమే ఏకాగ్రత. అన్నివేళలలో అన్నిటియందు ఒకే భావం కలిగి ఉండటమే ఏకాగ్రత” అంటుంది అమ్మ. మంచి చెడు రెండూ వాడిచ్చినవే అనుకోగలిగిన స్థితి మనకున్నదా ? ఎవరికి వారు ప్రశ్నించుకోవలిసిన విషయం.

అమ్మ “నీదేం లేదు వాడు నడిపించినట్లు నడిచేవాళ్ళమే” అన్నది కదా ! మనదేమున్నది ? అనే వాళ్ళు కూడా ఎక్కువమందే ఉంటారు. సాధన మీ చేతుల్లో లేదు సాధ్యమైనదే సాధన అన్నది. కనుక మనం సాధన చేయాల్సిన పనిలేదు అనేవాళ్ళున్నారు. “సాధనలో ఈ సాధన గొప్పది ఆ సాధన తక్కువ అని లేదు. ఏది ఎవరికి సాధ్యమైతే అది గొప్ప సాధన అని నా అభిప్రాయం. వచ్చినవాడికి ఆదరంగా పెట్టడం, ఉన్నదానితో తృప్తిగా ఉండటం ఇదే నే చెప్పేసాధన. నే నెప్పుడూ సాధనవద్దని ఎవరికీ చెప్పలేదు. ఉన్నదంతా దైవం కనుక సాధన సాధ్యం ఆలోచనే దైవం. చేయించే ఆలోచనా వేరుకాదు. చెయ్యాలనే దైవమే. అన్నింటినీ చేయించే వాడెవడో మనకు తెలియదు కనుక మనం చేస్తున్నాం. నీ కర్తవ్యం నీవు సక్రమంగా నిర్వహించడమూ దైవారాధనే. ఏ సాధనైనా మనస్సుకు ఏకాగ్రత సంపాదించటం కోసమే. ఆ ఏకాగ్రతతో ఈ మనస్సూ, అంటే ఈ శరీరాన్ని ఆశ్రయించిన మనస్సూ, సర్వవ్యాప్తమైన మహా చైతన్యం ఒకటేనని తెలుసుకోవడమే. సంసార బాధ్యతలే ఆధ్యాత్మిక సాధన. సాధనకు నిత్యకృత్యం కన్నా కావలసినదేముంది ?” అన్నది. నిరంతరం నిత్యం ఆ స్మరణతో ఏదైనా చేయమని అమ్మ చెబుతున్నది కదా ! ఎంతమందిమి చేస్తున్నాం ? ధ్యాసే ధ్యానం అన్నది అమ్మ. ఎంతమందిమి ఆ ధ్యాసలో ఉంటున్నాం. ద్వంద్వంలో ఉంటున్నాం కనుక, శరీరం ఉన్నది కనుక అన్నీ చెయ్యాల్సిందే. చెయ్యకుండా ఉండలేవు అన్నది. అయితే వాడు   చేయిస్తున్నాడనే ధ్యాస నిరంతరం ఉంటూ చేయాలి.

కనిపించేదంతా ఆత్మగా  తోచడమే ఆత్మ సాక్షాత్కారం అన్న అమ్మకు మరిడమ్మతాతమ్మతో కాలువగట్టున వెళుతుంటే ఒక చెట్టు యొక్క ప్రతి ఆకులో, కొమ్మలో, కాండంలో సర్వం నేను నేనైన నేనుగా చూడగల శక్తి – సర్వం కనిపించేదంతా తన రూపమే తోచింది. తాను కాకుండా ఇతరం లేని వాడు నేనే అనే అనుభూతిని ప్రసాదించి తరింప చేయి. లేకపోతే అంతా తానైనవాడే భగవంతుడు అన్న అమ్మను ఎందరు తెలిసికోగలిగారు ? ఏమో! శ్రీరాముని కాలంలో రాముని నలుగురైదుగురు తెలుసుకున్నారుట ఆయనే విష్ణుమూర్తి అని. శ్రీకృష్ణుని కాలంలో అన్ని మహిమలు చూపించినా గారడీవాడు అన్నాడు దుర్యోధనుడు. ఏ వ్యాసుడు భీష్ముని వంటివారో గ్రహించ గలిగినవారు. విశ్వరూప సందర్శనం చేసిన అర్జునునకు మళ్ళీ ఉత్తర గీత చెప్పవలసి వచ్చింది. ఇక మన సంగతేమిటి ? ‘నన్ను చూడటమే పొందటం’, ‘అందరికీసుగతే’ అని హామీ ఇచ్చింది కనుక అమ్మా నిన్ను నిన్ను తెలుసుకో గల శక్తి, నన్ను తెలుసుకోగల శక్తి మా కెక్కడిది? తల్లివి తల్లి ధర్మం ఎలాగు నెరవేరుస్తావు. అడగ్గలిగిన వాడికి అడిగింది ఇస్తానన్నావు కదా ! సరిగ్గా అడగ్గలిగే శక్తిని కూడా నీవే ఇవ్వాలి మరి.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!