1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సంపాదకీయము … (దక్షిణామూర్తి రూపిణి)

సంపాదకీయము … (దక్షిణామూర్తి రూపిణి)

Uppala Varalakshmi
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : July
Issue Number : 12
Year : 2022

గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం 

నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః

 ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే

 వ్యోమ వద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః 

సమస్త లోకాలకు గురువై భవరోగపీడితులకు వైద్యుడై సర్వవిద్యలకు – లౌకిక పారలౌకిక పారమార్థిక విద్యలకు పెన్నిధియై సమస్త సృష్టికి అధినేతగా గురువుగా ఆత్మస్వరూపంగా భాసించే సర్వవ్యాపకుడైన దక్షిణా మూర్తికి నమస్కారం.

అమూర్తమైన పరమాత్మ తనదైన సృష్టిపట్ల దయా దాక్షిణ్యాలతో సమస్త లోకానికీ జ్ఞానాన్ని తద్వారా శాంతిని అనుగ్రహించాలని దాక్షిణ్య స్వరూపమై సగుణమై సాకారమై దిగివస్తే అది దక్షిణామూర్తి స్వరూపం.

“ఈ సృష్టి అనాది, నాది” అని అంతా అంటే అంతులేనిది అడ్డులేనిది అన్నింటికీ ఆధారమైనది” అని ప్రకటించిన అమ్మ సమస్త సృష్టికి మూలాధారంగా దర్శన మిస్తుంది. తల్లీ తండ్రీ గురువూ దైవం పూజ్యులని ప్రబోధిస్తూ ‘మాతృదేవో భవ’ అని తల్లికి అగ్రాసనం వేయటంలోని ఆంతర్యం – “తల్లి అంటేనే తొల్లి”. ఏ బిడ్డకయినా తొలి గురువు తల్లే. గురువే దైవం. దైవమే లోకాన్ని అనుగ్రహించాలనే సంకల్పంతో గురువుగా తల్లిగా దిగివచ్చిన మహత్తర సన్నివేశం అమ్మ అవతరణం. అమ్మ గురుమూర్తి, గురుప్రియా, గురుమండలరూపిణి మాత్రమే కాదు. గుణనిధి – జ్ఞాన నిధి, జ్ఞానవిగ్రహ, దక్షిణామూర్తి రూపిణి” “అమ్మే దైవం అమ్మే అసలు గురువు” అని సద్గురు శివానంద మూర్తిగారు అమ్మను గురువుగా దైవంగా దర్శించారు.

గుకార స్వంధకారస్స్యాత్ రుకారస్తన్నిరోధకః

 అంధకార నిరోధిత్వాత్ గురురిత్వభిదీయతే

ఎన్నో జన్మలుగా మన మనస్సులలో నిండి నిబిడీకృతమైన అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞానదీధితులతో ప్రకాశింప జేసేవాడు గురువు. సనాతన ధర్మాన్ని, సంప్రదాయాన్ని మనకు సన్నిహితుడై అందించే గురువు కూడా గురుపరంపరలో భాగమే.

సాక్షాత్మృత బ్రహ్మతత్త్వతయా త్రివిధ పరిచ్చేద శూన్యః జ్ఞానోపదేష్టా పురుషః త్రన్మూర్తయే – (తద్రూపేణ అవస్థితాయ గురుమూర్తయే)

గురుమూర్తిని వ్యాఖ్యానిస్తున్న ఈ మాటలు అమ్మతత్వాన్ని సాక్షాత్కరింప చేసే జ్ఞానదీపికలు. సర్వవ్యాపకమైన బ్రహ్మమును చింతన చేస్తూ స్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకుని నిరంతరం అందులోనే నిలకడ చెంది ఉండటం. “అంతా అదే” అది కానిది కనిపించటం లేదనేది అమ్మ అనుభవం. త్రివిధ పరిచ్ఛేద శూన్యః – దేశ కాల వస్తు పరిమితులు లేకపోవటం . అంటే శరీరంలో తానున్నా శరీరం తాననే అజ్ఞానం లేకపోవటం. “అమ్మంటే జిల్లెళ్ళమూడిలో నాలుగు గోడల మధ్య మంచంపై కూర్చున్న ఈ పరిమిత రూపం కాదని అమ్మ స్పష్టపరిచింది. అమ్మకు దేశకాల వస్తు పరిమితులు లేవు అనటానికి ఎన్నో దర్శనాలు. నిదర్శనాలు. తాను పుట్టకముందు జరిగిన సంఘటన లను పూసగుచ్చినట్లు వివరించి సంభ్రమాశ్చర్యాలకు గురిచేయటం, ఎక్కడో సుదూరంలో జరుగుతున్న విషయాలను ప్రత్యక్షంగా దర్శించటం సంభాషణ లను వివరించటం, సర్వభూత హృదంతరవర్తినియై వారి వారి ఆలోచనలు గ్రహించి ముందుగానే సమాధానం చెప్పటం అమ్మ సన్నిధిలో అందరికీ అనుభవ సిద్ధమైన అంశాలే.

పురుషః – పరిపూర్ణుడైన వాడు. అమ్మదృష్టిలో “పరిపూర్ణత” అంటే సర్వత్ర భిన్నత్వం లేకపోవటమే – అంతా అదే అన్న భావన స్థిరపడి సమదర్శియై వర్తించటం.

సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని

 ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః 

“మీరు కానిది నేనేమీకాను. మీరంతా మీదంతా ఇదంతా నేనే” అని, ‘మీ దృష్టిలో మనుషులూ ఇతర జంతువులూ ఒకటి గానే ఉన్నాయి’ అన్న వారితో, “అవి ఇతరంగా కనిపించటం లేదు. అంతా నేనుగానే కనిపిస్తున్నది” అని విశ్వతాదాత్మ్య స్థితిని ప్రకటించింది అమ్మ. పిల్లి నివేదన ముట్టుకున్నదని కలవరపడుతుంటే ‘పిల్ల ముట్టుకున్నద’ని చక్కదిద్ద గల సమదృష్టి అమ్మది. “విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని పండితాః సమదర్శినః” అని కదా!

 ‘అసంశయః సంశయఛిత్ నిరపేక్షః’ – గురుస్వరూప స్వభావాలను అభివర్ణించే ఈ మాటలు నిస్సంశయా, సంశయఘ్నీ అయిన అమ్మతత్వానికి వ్యాఖ్యాన ప్రాయాలు. ముక్కుపచ్చలారని పసిప్రాయంలోనే ‘బ్రహ్మజ్ఞానం కాదు జ్ఞానమే బ్రహ్మ” అని సార్వకాలిక సత్యాలను అత్యద్భుతంగా ప్రకటించిన అమ్మకు ఏ విషయంలోను సంశయానికి తావులేదు. కనుకనే ఎటువంటి ధర్మసందేహం ఎదురయినా అంతఃకరణ ప్రమాణంగా అలవోకగా పరిష్కరించింది. చిన్నతనంలో ‘ఏం కావాలి’ అని అడిగిన వాసుదాస స్వామితో “ఏదీ కావాలనేది అక్కరలేకుండా కావాలి” అని అడిగిన అమ్మ సాక్షాత్తూ నిరపేక్షకు నిలువెత్తు  రూపమే.

“తెలియనిది తెలియజేయటానికే నారాక” అంటూ జగదుద్ధరణ కోసం కారుణ్యవారాశియై కదిలివచ్చిన దక్షిణామూర్తి స్వరూపిణి అమ్మ. నేను, నాది అనే మోహపాశంలో చిక్కుకున్న మానవాళికి విముక్తిని ప్రసాదించి సుగతిపథంలో నడిపించే పశు పాశ విమోచని అమ్మ. సరే మంత్రం జపిస్తూ సహనమనే దేవతను ఆరాధిస్తూ వాత్సల్యామృత వాహినిలో ఓలలాడించి శిక్షకాని శిక్షణతో మన మనస్సులను శాసించగల మహామహిమాన్విత అద్భుత చారిత్ర అమ్మ. అమ్మ దృష్టిలో “మనస్సే గురువు” మనస్సుకు ప్రేరణ నిచ్చి నడిపించే శక్తి గురువు. ‘గుర్తు చెప్పే వాడు గురువు’. ఒక విషయాన్ని ఎవరు చెప్పినా గ్రహించవలసింది తదనుగుణంగా నడుచుకోవలసిందే మనస్సే. ‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః’ ‘పరిణామ క్రమంలో ప్రధాన భూమిక వహించేది మనస్సే. ఋషిత్వానికీ పశుత్వానికీ మూలం మనస్సే. ‘సంకల్పమే భగవంతు”డని చెప్పిన అమ్మ “జ్ఞానమంటే భావం మారటమే” అన్నది. సామాన్యులకు అందుబాటులో లేని సంకల్పరాహిత్యం గురించి “వచ్చే ప్రతి సంకల్పమూ భగవంతుడిదే అని తెలుసుకోవటమే సంకల్పరాహిత్య” మని సాధనను సులభతరం చేసింది. దానిపట్ల మన భావం మార్చి గుర్తు చెప్పిన గురువుగా మనస్సులలో సుస్థిరంగా నిలిచిపోయింది. వేదాంతమంటే చెప్పేవారికి వినేవారికి అర్థంకానిది. అంతుబట్టని గుహ్యమైన విషయాలను అనుభవంతో రంగరించి అనాయాసంగా అందించటం అమ్మకు స్వభావ సిద్ధమైన విషయం. “అనుభవం శాస్త్రాన్నిస్తుంది కాని శాస్త్రం అనుభవాన్నివ్వదు” అన్న అమ్మ మాట అక్షరసత్యం కదా! అమ్మ చెప్పిన కొన్ని అపూర్వ నిర్వచనాలను అవలోకిస్తే గురువులకే గురువుగా జగద్గురువుగా అమ్మ దర్శన మిస్తుంది.

1) అన్ని వేళలా అన్నింటి యందూ ఒకే భావం కలిగి ఉండటమే ఏకాగ్రత.

2) నీ బిడ్డయందేమి చూస్తున్నావో అందరి యందు దానిని చూడటమే బ్రహ్మస్థితిని పొందటం. 

3) అంతా ఆత్మగా తోచటమే ఆత్మసాక్షాత్కారం.

4) సర్వకాల సర్వావస్థలలోనూ సమానమైన స్థితి సమాధి.

5) సర్వత్రానురాగమే విరాగం.

సూత్రప్రాయమై ఆలోచనామృతమైన అమ్మ వాక్యాలు మనిషి సాగించే జీవన ప్రస్థానంలో వెలుగులు నింపే కరదీపికలు.

ఉద్యోగ బాధ్యతల మధ్య నియమనిష్ఠలతో గాయత్రీ మంత్రానుష్టానం చేయలేకపోతున్నానని అపరాధ భావనతో బాధపడుతున్న యువకునితో “నీకు వీలయినట్లు చేసుకో నాన్నా! సంకోచాలు వద్దు. కులాలు వృత్తిని బట్టి ఏర్పడినవే. మారిన పరిస్థితులను బట్టి నీ ఉద్యోగంలో నీవు నీతి, నిజాయితీలతో ఉండటమే నీ ధర్మం. దాన్ని సక్రమంగా పాటిస్తే మరింకేమీ అవసరంలేదని “కర్తవ్యమే దైవ”మని ప్రబోధించి స్వధర్మాచరణకే అమ్మ పెద్ద పీట వేసింది. సమాజంలో మనం ఏర్పరచుకున్న ఆచారవ్యవహరాల పట్ల సదవగాహనను కలిగించి ‘పరిస్థితులే గురు’వని స్పష్ట పరిచింది.

అమ్మ దృష్టిలో లౌకిక జీవితమని ఆధ్యాత్మిక జీవితమనీ రెండు లేవు. ‘చేసే ప్రతి పనీ దైవ సేవ అనుకోగలిగితే సంసారం ఆధ్యాత్మిక సాధనకు అడ్డుకా’ దనేది అమ్మ అనుభవం. ఈ జగత్తే దైవస్వరూపం అయినపుడు ఏ పనిచేసినా దైవసేవే అవుతుంది. అంతా పరమార్థమే తప్ప స్వార్థం కాదు. ‘చేతలు చేతుల్లో లేవు” ‘అనుకున్నది జరగదు తనకున్నది తప్పదు’ అని తెలుసుకుంటే జీవితంలో ఒడిదుడుకులు  సుఖదుఃఖాలు ఉండవు అంతా ఆనందమే -తృప్తే” అన్నది అమ్మ ప్రబోధం. పదిమంది కోసం పదిమందితో కలిసి పనిచేయటం, మమకారాన్ని చంపుకోవటం కాక పెంచుకోవటం నేటి మానవధర్మం. ఇదే మానవుడు మాధవుడుగా మారటానికి మంచిదారి’ అని సద్గురువై సన్మార్గాన్ని చూపింది. గమ్యం గమనం తానై నిలిచింది. అమ్మ ఆచరణయే సమస్త మానవాళికి ఆదర్శం.

అమ్మ జీవితమే తరతరాలకు తరగని సందేశం. 

మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వమయిన అమ్మ అడుగుదమ్ములకు అంజలి ఘటిస్తూ…..

యు. వరలక్ష్మి

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!