అమ్మ అమ్మమ్మ మాతామహుడు జానకమ్మ – చంద్రమౌళి వెంకట సుబ్బారావులు. వారికి ఆరుగురు, ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు. మొదటి కూతురు బలభద్రపాత్రుని అన్నపూర్ణమ్మ. మన అమ్మ తల్లి రంగమ్మగారు రెండవది. 3) నంబూరు భాగ్యమ్మ, 4) మతుకుమల్లి శేషమ్మ 5) యల్లంరాజు వరలక్ష్మి 6) ప్రత్తిపాటి హైమవతి ఆడపిల్లలు. మగపిల్లవాడు సీతారామయ్య. చిదంబరరావుగారు వేంకట సుబ్బయ్యగారి తమ్ముడు. సీతాపతి తాతగారికి మేనత్త కొడుకులు వీరిద్దరు. గుడివాడకు చెందిన వారిలో యల్లంరాజు వరలక్ష్మిని యల్లంరాజు హరినారాయణ గారికిచ్చారు. వారికి నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. వారిలో చివరి ఆడపిల్ల దుర్గపిన్ని. దుర్గపిన్నిని కుమ్మమూరు శ్రీ రామారావు గారికిచ్చి వివాహంచేశారు. పెద్దకూతురు రుక్మిణిని తుమ్మలపల్లి చలపతిరావుకు, రెండవకూతురు చిట్టి పిన్ని శ్రీ మహాలక్ష్మిని ఉప్పులూరి వాసుదేవరావుకు, కంకిపాడు పిన్ని కృష్ణవేణమ్మను పింగళి కేశవరావుకు యిచ్చి వివాహం చేశారు. మగపిల్లలు వెంకటరమణ లక్ష్మణులకు, జిల్లెళ్ళమూడితో అనుబంధం తక్కువగాని, ఆడపిల్లలు వారి కుటుంబాలు అందరూ జిల్లెళ్ళమూడి అనుబంధం కలిగినవారే. నేను ఈ అందరిళ్ళకు వెళ్ళాను. అమ్మ చిన్నప్పుడు వరాలమ్మమ్మ హరినారాయణ కూడా ఆదరించేవారే.
హరినారాయణ గారిని నేనుచూడలేదు గాని వరాల అమ్మమ్మ జిల్లెళ్ళమూడి చాలసార్లు వచ్చింది దుర్గపిన్నితో. దుర్గపిన్నితో శ్రీ కె.యస్. రామారావుగారు అమ్మ పూజలు వాళ్ళయింట్లో ప్రతిసంవత్సరం చేయించే వారు. రామారావు బాబాయి అమ్మ తత్త్వాన్ని గూర్చి ఇంగ్లీషులో చాలావ్యాసాలు వ్రాశారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అమ్మను గూర్చి చాలా విషయాలు మాట్లాడుతూ ఉండేవారు. అంతేకాదు. అందరింటి వ్యవస్థను గూర్చి, విశ్వజనని, The Mother of All” గూర్చి చక్కని సూచన లిస్తుండేవారు. ఇక దుర్గ పిన్ని కుటుంబం. అందులో మగపిల్లలు ముగ్గురు. నరసింహమూర్తి, హరికుమార్, కృష్ణ. ఆడపిల్లలు వత్సల, వాత్యల్య. అందరూ అమ్మ సేవలో పాల్గొంటున్నవారే. నరసింహమూర్తి మన విశ్వజననీ ట్రస్ట్‌లో మేనేజింగ్ ట్రస్టీ. అనసూయేశ్వర ట్రస్టుకు అధ్యకక్షుడు. రాష్ట్ర ప్రభుత్వంచే పెద్ద ఆడిటర్‌గా గుర్తింపబడ్డవాడు. నేను అమ్మ చరిత్ర పారాయణ గ్రంథాన్ని నరసింహమూర్తికి అంకిత మిచ్చాను. దుర్గపిన్ని రామారావు బాబాయిలు తమ పిల్లలు విషయంలో బాధ్యతలన్నీ చక్కగా నెరవేర్చారు. ఈ మధ్యనే నరసింహమూర్తి కొడుకు చిరంజీవి శ్రీ చరణ్ (తండ్రికి తగ్గ కుమారుడు) వివాహం అక్టోబరు 31న హైదరాబాద్‌లోనే జరిగింది. దానికి దుర్గపిన్నితో సహా పిన్ని పిల్లలందరూ నూతన వధూవరులతో తీసిన ఫోటోను గత నెల డిసెంబరు విశ్వజనని సంచిక చివరి కవర్‌పేజీలో వేయటం జరిగింది.
దుర్గపిన్ని గూర్చి చెప్పవలసి వస్తే హైదరాబాద్ లోని జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితికి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసరిని చెప్పాలి. వాళ్ళింట్లో జరిగే అమ్మ పూజలకు, అమ్మ అనంతోత్సవాలకు పెద్ద పెద్ద I.A.S., I.P.S.ఆఫీసర్లు, జడ్జిలతో సహా 300 మందిపైగా వచ్చేవారంటే దుర్గపిన్ని కృషి సామాన్యమైంది కాదు. ఒకటికి రెండుసార్లు ఫోను చేసి ఆహ్వానించటం లోనే ఆ చాకచక్యం ఉన్నది. వచ్చిన వారిని ఆప్యాయతతో ఆదరించటం గొప్ప విద్య. అది పిన్నిలో చూస్తాం మనం. ఆ యింటిని నిర్వహించటం లోను వచ్చిన అతిథులను ఆదరించటం లోనూ భార్యా భర్తలు పెట్టింది పేరు.
శ్రీ రామారావు గారు హైదరాబాద్‌లోని జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితికి వ్యవస్థాపక ప్రప్రథమ అధ్యకక్షుడు. దుర్గపిన్ని సంగతి సరే సరి. నువ్వు వస్తున్నావు సరేనయ్యా! సంతోషం, ఎప్పుడూ కోడలిని తీసుకరావేం. ఒకసారి తీసుకురావయ్యా అని నన్ను హెచ్చరిస్తుండేది. వాళ్ళింట్లో విశ్వజననీ పరిషత్ ”కార్యాకారిణీ సమావేశం” (Executive Meeting) జరిగినప్పుడల్లా భరద్వాజుని విందు తలపింప జేసేవారు.
శ్రీ రామారావు బాబాయిగారు 2019 ఫిబ్రవరి 25న అమ్మలో ఐక్యమైనారు. ఆ సమయంలోనే దుర్గపిన్ని పంచప్రాణాలు కృంగిపోయాయి. పిల్లలను చూచుకొని ఆయాసంతో, ఊగిసలాడే ప్రాణంతో కాలం వెళ్ళబుచ్చుతున్నది. ఆశ్చర్యం విధి చేసే వింత చేష్టలలో భాగంగా ఈ డిసెంబరు నెల 5వ తారీకున దుర్గపిన్ని కూతురు వత్సల ఏరకమైన అనారోగ్యం లేకుండా అనాయాసంగా అమ్మలో కలిసిపోయింది. ఆ షాకింగ్ వార్త దుర్గపిన్ని మనస్సును కలచి వేసింది. ఆకస్మాత్తుగా తెలిసిన వార్తను తట్టుకోలేక విలవిలలాడింది. దుర్గపిన్నిని హాస్పిటల్‌లో చేర్చారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచారు. కాని ఆ గుండె తట్టుకోలేకపోయింది. వెంటిలేటర్స్ పెట్టి ఎలాగైనా రక్షించుకోవాలని పిల్లలు ప్రయత్నించారు. కాని 12.12.2020న అమ్మ నిర్ణయంలో భాగంగా దుర్గపిన్ని అమ్మవద్దకే అమ్మలోనే ఐక్యమైంది. 2019లో తండ్రిని పోగొట్టుకున్న పిల్లలు ఈనాడు తల్లిలేని వాళ్ళైనారు. అందరితల్లి అందరమ్మ వారందరికీ కావల్సిన మనశ్శాంతిని, ధైర్యాన్ని ప్రసాదిస్తుందని, అలా ప్రసాదించాలని ప్రార్థిస్తున్నది శ్రీ విశ్వజననీపరిషత్.