జిల్లెళ్ళమూడి నాన్నగారి శతజయంతి ఉత్సవాలు అక్టోబరు 22వ తారీకు తిధుల ప్రకారం ఆశ్వయుజ శుద్ధ తదియ జన్మదినం నుండి తేదీల ప్రకారం జన్మదినమైన అక్టోబరు 26 వరకు పంచాహ్నికంగా విజయవంతంగా నిర్వహింపబడినవి.
అనుకున్నది జరగదు తనకున్నది తప్పదు అంటుంది అమ్మ. మనం అనుకోవటానికైనా ప్రేరణ (దైవం) వాడిచ్చిందే కదా! మరి మనం అనుకున్నది జరుగక పోవట మెందువల్ల ? వాడ (దైవం)ను కొన్నదే జరుగుతుంది. ఎందువల్ల ? సంకల్పం వాడి ప్రేరణే కదా ! సంకల్పం తర్వాత చేసేది మన ప్రయత్నమా ? అంటే ప్రయత్నం వాడిచ్చేది కాదా? అన్నీ వాడిచ్చేవే అనుకుంటే చిక్కేలేదు. అయితే లోకంలో పురుష ప్రయత్నం అని ఒకటున్నది కదా ! అంటారు సంప్రదాయవాదులు. అమ్మ మాత్రం దానిని అంగీకరించలేదు.
తాను చేసే పనులలో తనది ఏదో ఉన్నదనుకోకపోతే బ్రతకలేడు. మానవుడికి మిగిలింది అదొకటే – తాను చేయకపోయినా చేశానని అనుకోవటం. చేస్తున్న కాళ్ళూ చేతులూ కనిపిస్తున్నవి కనుక మనమే చేస్తున్నామని భ్రాంతి పడటం. మానవులలో ఉండే ప్రయత్నం కూడా దైవమే. ప్రయత్నం వెనుక ప్రేరణ ఉన్నది. ఆ ప్రేరణ దైవమే- ఆ ప్రేరణ నేనే – అని చెప్పింది అమ్మ.
ఇక ఇప్పుడు నాన్నగారి శతజయంతి ఉత్సవాల వద్దకు వద్దాం. ఒక సంవత్సరం క్రితమే శ్రీ విశ్వజననీపరిషత్ నాన్నగారి శతజయంతి ఉత్సవాలను గూర్చి ఆలోచించి చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. అవి అమలుపరచటానికి ప్రయత్నించింది. ఇక్కడ ప్రేరణ ప్రయత్నం కూడా అమ్మ ఇచ్చినవే కనుక నిర్విఘ్నంగా విజయవంతంగా వంద సంవత్సరాలకు వందచోట్ల అన్నవితరణ కార్యక్రమాలు జరిగాయి. అమ్మకు నాన్నగారికి ఇష్టమైన పనికదా ! జరిగింది.
ఇక చివరలో వంద సంవత్సరాలు నిండి 101వ సంవత్సరం అడుగు పెట్టబోయే ముందు జరిగే ఉత్సవాలు ఎంతో వైభవంగా జరపాలని బిడ్డలం అమ్మ ఇచ్చిన ప్రేరణతోనే ఆలోచన చేశాం. అయిదు రోజులు ఉత్సవాలలో నాన్నగారి శతజయంతి ప్రత్యేక సంచిక తెచ్చి నాన్నగారిని గూర్చి వారి విశిష్టతను గూర్చి, లోకానికి చేతనైనంత తెలియచేయటానికి ప్రయత్నించాలనుకున్నాం. అంతేకాదు. అమ్మను గూర్చిన సాహిత్యం కూడా కొన్ని క్రొత్త గ్రంధాలు ప్రచురించి ఆవిష్కరించాలనుకున్నాం. నాన్నగారి కిష్టమైన ఆటలపోటీలు నాటకాలు ఏర్పాటు చేయాలని ఆ రకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆహ్వాన పత్రిక తయారు చేసుకొన్నాం. ఆ సందర్భంగా నాకొక ఆలోచన వచ్చింది. ఈ ఉత్సవాలు కనీసం రాష్ట్ర ప్రజలకు తెలియాలంటే దినపత్రికలలో ప్రముఖంగా రావాలంటే కొందరు మంత్రులను రాజకీయ ప్రముఖులను పిలిస్తే బాగుంటుందనుకొని కొందరు మంత్రులను, యం.యల్.సి.లను, పోలీసు ఉన్నతాధికారులను ఆహ్వానించాను. చాలమంది అంగీకరించారు కూడా. ఆహ్వానాలు వేసి వారందరికీ అందించటం కూడా జరిగింది.
ఒక భగవత్ కార్యంలో పాల్గొనటానికి మనం అనుకుంటే చాలదు. ఆ భగవంతుని అనుగ్రహం కూడా కావాలి. అమ్మ అంటుంది ఆ తరుణం వస్తేనే రాగలరు. నన్ను చూడగలరు. తరుణం రాకపోతే మీ యింటి ప్రక్కకు వచ్చినా నన్ను చూడలేరు. తరుణం అంటే తప్పించుకుందా మన్నా తప్పనిది, చేద్దామన్నా చేయనీయనిది, వీటినన్నింటినీ నడిపించేది అని. నిజమే ఎంత ఆహ్వానింపబడినా, ఎంతవద్దామనుకున్నా అధికార గణం రాలేకపోయారు ఈ ఉత్సవాలకు. కారణాలకేం ఎన్నైనా ఉండవచ్చు. కాని ప్రధానంగా మన కళ్ళకు కనిపించింది కుండపోత వర్షాలు, తుఫాను భీభత్సం. జిల్లెళ్ళమూడి ఒక ద్వీపకల్పంలా తయారైంది. నల్లమడడ్రైన్ (ఓంకారనది అమ్మపెట్టిన పేరు) కట్టలు తెంచుకొని ప్రవహించింది. కాలువ గట్లు తెగిపోయి నీటి వెల్లువతో పొలమేదో రోడ్డదో తెలియలేదు. కట్టిన వంతెనల వద్ద కోసుకొని పోయి రోడ్డుకు గండ్లు పడ్డాయి. ప్రపంచంతో సంబంధం తెగిపోయింది. బయటవాళ్ళు, ఊళ్ళోకి రాలేరు. ఊళ్ళో వాళ్ళు బయటకు వెళ్ళలేరు..
24.10.2013 గురువారం ఉదయం 11 గంటలకు వచ్చి కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిన రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీ యల్.వి. సుబ్రహ్మణ్యం గారే చివరి అధికారి. ఆ తర్వాత 24 మధ్యాహ్నం నుండి 26 మధ్యాహ్నం వరకు రాకపోకలు బంద్ అయ్యాయి. కాని శతజయంతి కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా సాగిపోయాయి. ఎన్ని అడ్డంకులు, హెచ్చరికలు వచ్చినా అమ్మ అనుగ్రహం అది. భగవంతుడు భక్తరక్షణ కళాదాక్షిణ్యుడు కదా ! వచ్చిన ఓంకారనదికి చీరెసారె పసుపు కుంకుమలు పెట్టి పంపారు. రెండు రోజులు దాదాపు 48 గంటలు ఇండ్లలోకి మోకాలులోతు నీళ్ళు వచ్చాయి. గ్రామస్థులందరికీ అందరింటి సోదరీ సోదరులతో భోజనాలు ఏర్పాటు చేయ బడ్డాయి.
బాపట్ల పెదనందిపాడు మార్గంలో జిల్లెళ్ళమూడి ఉన్నది. ఆ రోడ్డుమీద దిగి 2 కిలోమీటర్లు నడచి ఊళ్ళోకి వెళ్ళాలి. బస్సు దిగిన చోట నల్లమడ డ్రయిన్పై ఒక వంతెన ఉన్నది. అక్కడి నుండి జిల్లెళ్ళమూడి ఊరు కనిపిస్తుంది. అమ్మ ఉండే అందరిల్లు ఎత్తుగా ఒక తెల్లటిపడవగా కనిపిస్తుంటుంది. అది ప్రళయకాలంలో పునఃసృష్టి కొరకు రక్షింపబడిన వారితో నున్న నావకావచ్చు. బైబిలులో చెప్పబడింది కూడా యీ నావను గురించేనేమో.
నా కప్పుడప్పుడు అనిపించేది. మనందరినీ రక్షించటానికి జగన్మాత యీ నావను నెలకొల్పిందేమోనని. రాత్రిపూట మినుకు మినుకుమంటూ కనిపించే అమ్మ గదిలోని దీపం దారి చూపిస్తుండేది మా వంటివారలకు.
ఇదిగో అలా జిల్లెళ్ళమూడి పాలసముద్రంలో వెలసిన జగదేకమాత విశ్వజనని విలాసం. ఈనాడు ఓంకారనదిచే చుట్టుకోబడిన మణిద్వీపంలా భాసించింది. ఆ మణిద్వీపంలోని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన . కళ్యాణ వేదికపైన కార్యక్రమాలు జరిగాయి.
22.10.2013 గన్నవరం శ్రీ భువనేశ్వర పీఠం ఉత్తరపీఠాధిపతి శ్రీ సత్యానందభారతీస్వామివారు నాన్నగారి శతజయంతి ఉత్సవాలను ప్రారంభించారు. ఋషికల్పుడు భాస్కరరావన్నయ్య నాన్నగారి “అనసూయేశ్వర నమో నమో శ్రీ నాగేశ్వర నమో నమో” అన్న నామ ఏకాహాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ వ్రాసిన “ధన్యజీవులు” గ్రంధం (అమ్మకు సేవ చేసిన పుణ్యమూర్తులు), వసుంధర తండ్రిగారు శ్రీ కోన వెంకట సుబ్బారావుగారు వ్రాసిన ‘కైతలకోన” గ్రంధం, శ్రీ బెల్లంకొండ దినకర్ వ్రాసిన “అమ్మతో నా అనుభవాలు” గ్రంథం, శ్రీ బృందావనం రంగాచార్యులు వ్రాసిన “పూజా పుష్పాలు” గ్రంధం, డా.బి.యల్. సుగుణ వ్రాసిన “మాతృశ్రీ తత్త్వ సౌరభం” గ్రంథం, శ్రీ వి.యస్.ఆర్.మూర్తి వ్రాసిన “అమ్మత్త్వం” గ్రంధం, శ్రీ మన్నవ బుచ్చిరాజు శర్మగారు (రాజుబావ) రచించిన “లోచూపు” గ్రంధం, శ్రీ కొండముది రామకృష్ణ వ్రాసిన “మాతృదర్శనం” గ్రంథం, “నాన్నగారి శతజయయంతి ప్రత్యేకసంచిక” ఆవిష్కరింపబడ్డాయి.
వీటితో పాటు ఆటలపోటీలు పెట్టి బహుమతి ప్రదానం, ‘శ్రీకృష్ణరాయబారం’ నాటక ప్రదర్శన, ఆశుకవితా ప్రదర్శన అనసూయా సాహిత్య సామ్రాజ్య రూపక కార్యక్రమాలు జరిగాయి.
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి. యస్. ఆర్. మూర్తి గారికి ఒక జర్నలిష్టుగా విశిష్ట సత్కారం జరిగింది. కాలేజీ పూర్వ
విద్యార్థులచే కదంబ కార్యక్రమం నిర్వహింపబడింది.
కాలేజి విద్యార్థి శ్రీ జయంతి చక్రవర్తి సంకలనం చేసి తెచ్చిన నాలుగు గ్రంధాలు శ్రీ లలితాత్రిపురసుందరీదేవి విశేష పూజాకల్పము, గణేశ పూజాకల్పము, గురు దత్తాత్రేయ విశేష పూజాకల్పము, శరన్నవరాత్రి పూజా విశేష కల్పము ఆవిష్కరింపబడ్డాయి. సుప్రసిద్ధ జర్నలిస్టు ప్రెస్ అకాడమీ పూర్వాధ్యక్షులు డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావుగారు ఈ ఉత్సవాలలో అన్ని రోజులు దగ్గరుండి కార్యకర్తలలో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్నీ నింపారు.
అమ్మ నాన్నగారిఉత్సవాలను తాను అనుకున్నట్లుగా ఏవి ఎలా జరగాలో తీర్చిదిద్దినట్లుగా వైభవోపేతంగా జరిపించింది. ఈ నాటకంలో పాత్రధారులమై కొంతమంది అమ్మ లీలావిలాసంలో సూత్రధారులమై కొంతమంది ఆనందానుభూతిని పొందాము.
ఇది అమ్మసంకల్పం – అమ్మ ప్రేరణ, అమ్మ ప్రయత్నం. ఈ విజయం వెనుక, అపజయాల వెనుక కూడా అమ్మే ఉన్నది – ఉన్నది ఉన్నది.
సత్యం సత్యం పునః సత్యం సత్యమేవ పునః పునః
మాతా సత్యం – పితా సత్యం – సత్యరూపం నమామ్యహం.