1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సంపాదకీయము..(ప్రభావతక్కయ్య)

సంపాదకీయము..(ప్రభావతక్కయ్య)

P S R Anjaneya Prasad
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : February
Issue Number : 7
Year : 2012

అమ్మ సేవకు ప్రప్రథమంలో 1955లో బాల్యంలోనే వచ్చిన ప్రభావతి అక్కయ్య గంగరాజు లోకనాథం గారి కూతురు. వారు కొమ్మూరులో ఉండేవారు. లోకనాథంగారికి అమ్మ మానవాతీతశక్తి పట్ల విశ్వాసం.

లోకనాథంగారిని షుగర్ జబ్బుతో గుంటూరు హాస్పిటల్లో చేర్చారు. కాలు తీసివేయాలన్నారు. అప్పుడు అమ్మ హాస్పిటల్కు వెళ్ళి ‘ఏది ? ఈ కాలేనా ? ఎక్కడి నుండి తీసి వేయాలి’ అంటూ చేతితో ఆభాగాన్ని రాసింది. ఆపరేషన్ లేకుండానే ఆ తర్వాత నయమయింది. ఆ సమయంలో ప్రభావతితో రిక్షాలో రాజుబావవాళ్ళ ఇంటికి వెళ్తూ ‘నాతో జిల్లెళ్ళమూడి వస్తావా ?’ అని అడిగింది. ప్రభావతి వస్తా’నన్నది. ‘అక్కడ ఇక్కడ ఉన్నట్లుండదు ఇల్లు. తేళ్ళు, పాములు, ఎలుకలు, పిల్లులు ఇంట్లో తిరుగు తుంటాయి’ అన్నది. ‘నీవుండగా నాకేమీ భయంలేదు వస్తాను’ అన్నది ప్రభావతి. ప్రభావతికి ఉబ్బసం ఉండటంతో అమ్మ అమ్మ. వద్ద ఉంచితే అది తగ్గుతుందని లోకనాథంగారి నమ్మకం. అమ్మకు పనులలో సాయంగా ఉంటుందని మరొక కారణం. ఉభయతారకంగా ఉంటుందని అమ్మ వద్ద ఉంచారు. కొద్దికాలం అమ్మ వద్ద ఉండేది. ఇంటిమీద గుబులు మళ్ళి కొమ్మూరు వెళ్ళేది. అక్కడ ఉంటే అమ్మ మీద ధ్యాస మళ్ళేది. మళ్ళీ జిల్లెళ్ళమూడి ఈలా తిరుగుతూ తిరుగుతూ అమ్మ దగ్గరే ఎక్కువ కాలం గడపటం అలవాటు చేసుకొన్నది. అమ్మే ప్రభావతికి సుబ్బారావును రవి, హైమ, లను అప్పచెప్పింది.

అదృష్టం ఏమిటంటే అమ్మ చేతుల మీదుగా జరిగిన మొదటి వివాహం కూడా ప్రభావతి రాజుబావలదే. రాజుబావ అమ్మచరిత్రను అమ్మ తాత్వికచింతనను అర్థం చేసుకొని వ్రాసిన గీతాలు అమ్మ చేత అంగీకరింపబడి రాజుబావను ఒక వాగ్గేయకారుని స్థాయిలో నిలబెట్టాయి. పెళ్ళి అయింతర్వాత కూడా రెండు సంవత్సరాలు జిల్లెళ్ళమూడిలో అమ్మదగ్గరే ఉన్నది. రాజుబావే ఉద్యోగానికీ జిల్లెళ్ళమూడికీ తిరుగుతుండేవాడు.

ప్రభావతి అమ్మ సమాధిస్థితిలోకి వెళ్ళటం, ముద్రలు పడటం, ఎన్నోసార్లు చూచింది. అమ్మకు హారతి యిస్తే అమ్మే ‘కృష్ణా! మా యింటికిరారాదా! అనే పాట పాడటం విన్నది. అమ్మ ఇతర భాషలలో మాట్లాడటం విన్నది. రెండు వందల మంది వచ్చినా అవలీలలగా వంట చేసి పెట్టేది. ఎన్నో సార్లు తేళ్ళు కుట్టినా ఏమందూ వాడకుండానే తగ్గిపోయేది.

అమ్మ – ప్రభావతి చేత హైమచేత తెల్లవారు జామున ధ్యానం చేయించేది. ప్రభావతి అమ్మ సేవకు ఎక్కడ ఆటంకం అవుతుందోనని అన్నం తినటం మానేసింది. ఒక మాఘపూర్ణిమ రోజున అమ్మ గంటా ముప్ఫై నిమిషాల కాలంలో 600 మందికి మంత్రోపదేశం చేసినప్పుడు ప్రభావతి కూడా మంత్రోపదేశం పొందింది. సాధన విషయంలో అమ్మ ప్రభావతితో ‘ప్రత్యేకించి సాధన చెయ్యవలసిన పనిలేదు. నీ మనస్సు ఎప్పుడూ నా మీదే ఉంటుంది’ అని చెప్పింది. పెళ్ళి అయింతర్వాత శ్రావణ మాసం నోములు నోయించటానికి ప్రభావతి వాళ్ళ అమ్మ. తీసుకెళ్ళుతానన్నది. ‘దానికే వ్రతాలు అక్కర్లేదు’ అన్నది అమ్మ. 

అమ్మ అన్న ప్రకారమే ప్రభావతి ఏ పనిచేస్తున్నా ఎక్కడ ఉన్నా మనస్సు మాత్రం అమ్మ ధ్యాసలోనే ఉండేది. అమ్మ ఆలయంలో ప్రవేశించిన తర్వాత కూడా కలల్లో అమ్మ కనిపించేది. జ్యోతిస్వరూపంగా కూడా దర్శనం ఇచ్చేది. అమ్మ ఇచ్చిన మట్టి, కుంకుమ ఎంతో సువాసన రావటం గమనించింది. అమ్మలోని అణిమ – గరిమ శక్తులు చూచింది ప్రభావతి. అమ్మను తాను ఎత్తుకుంటే అతి తేలికగా అయిపోయేదిట. అమ్మ తన కోసం కాకపోయినా ఎవరికోసమో అడిగి అడిగి పదార్థాలు చేయించుకొని తినేది. అమ్మ ఎంతో మందికి తీర్థంతో, బత్తాయి రసంతో జబ్బులు తగ్గించిన సన్నివేశాలు చూసింది. పాలు, ఆవకాయ అన్నం, సాంబారు అన్నం బారెన్ వద్ద పెడితే శ్యామల, శకుంతల, అవర్ణవంటివారు తినిపోయేవారు. నాన్నగారు ఎక్కడ ఉన్నా రాత్రిళ్ళు జిల్లెళ్ళమూడి నుండే అమ్మ మాట్లాడుతుంటే చూసింది ప్రభావతి. కొమ్మూరులో ఆంజనేయస్వామి విగ్రహం వెనుక అమ్మ కనిపించింది. అమ్మ నాగేంద్రుని రూపంలో చాలమందికి కనిపించటం కూడా గమనించింది. అమ్మ కట్టుకున్న చీరెలు రవికలు కూడా మంచి సువాసనలు వెదజల్లటం చూచి అడిగితే అమ్మ ‘దానిదేముంది నీ గుడ్డలూ అలా వాసనలు వస్తాయి’ అన్నది. అలా అన్న కొద్దిరోజులు ప్రభావతి గుడ్డలు కూడా సువాసనలు వచ్చేవి. ఏది ఏమైనా ప్రభావతి జీవితాన్ని అమ్మ తీర్చిదిద్దింది. ప్రభావతి అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్లో చేరిస్తే అమ్మ, హైమ ఆమెకు ఇరుప్రక్కలా నిలబడటం ప్రభావతి చూచింది. అమ్మ చెప్పిన రీతిలో పతినిదేవతగా భావించి సేవించింది. సంసార సముద్రాన్ని యీదింది. అమ్మఒడ్డుకు చేరింది.

శరీరం వచ్చింతర్వాత ఎప్పటికైనా రాలిపోక తప్పదు. లోకంలో ముత్తయిదువగా కాలం చేసిన వారంతా గౌరీలోకానికి వెళ్ళుతారని నానుడి. భర్తను వదిలి ముందుగా శరీరాన్ని స్త్రీలు వదలటం అమ్మ హర్షించలేదు. స్త్రీలు

 

భర్తను ముందు పంపి తర్వాత భార్య శరీరం వదలటం ధర్మం అన్నది. స్త్రీలకు అంత స్వార్థం పనికిరాదన్నది. భర్త కన్నా ముందు వెళ్ళినా, భర్తను పంపి తర్వాత వెళ్ళినా వెళ్లేది ఒక చోటికే, ఆ గౌరీలోకానికే, తనలోకే అని స్పష్టంగా చెప్పింది. ఏమైనా అమ్మ సేవలో, అమ్మ భావనలో తరించిన ప్రభావతి ధన్యురాలయినడంలో సందేహంలేదు.

అమ్మ – నాన్నగారి కుటుంబంలో ఒదిగిపోయి సేవలు చేసింది. చివరి సమయంలో అమ్మను హైమకు దర్శనం చేసుకొన్నది. 8.1.2012 ఆదివారం ఆదిశక్తి అయిన అమ్మలో లీనమైంది. ధన్యురాలు ప్రభావతి.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!