ప్రప్రథమంగా అమ్మ ప్రతిష్ఠించిన ఆలయం ‘అన్నపూర్ణాలయం’ అది బంగారుకోవెల 15-8-58 తేదీన అమ్మ అన్నపూర్ణాలయాన్ని ప్రతిష్ఠించక ముందు పూరింట్లో అమ్మ వంటగదే అన్నపూర్ణాలయం. ఆ ఆలయంలో అర్చామూర్తి ‘అన్నపూర్ణాదేవి’.
అన్నపూర్ణేశ్వరి ఎలా ఉంటుంది’.
‘ఉభౌదర్వీకుంభౌ మణికనక సంభావిత గుణా
దధానాపాణిభ్యాం అమృతరస మృష్టాన్నకలితా’- అన్నట్లు ఉంటుంది. మణులు, బంగారముతో విరాజిల్లే గరిటే, పాత్రలను రెండు చేతులా ధరిస్తుంది. ఆ పాత్రలో ఏముంటుంది?
అమృతరసరూప మృష్టాన్న పదార్థము.
అట్టి అన్నపూర్ణేశ్వరిని మనం చూశామా? ఆ మన కళ్ళకి కనిపించేటట్టుగా అమ్మ పాదాలపై ఒకానొక సువర్ణ అంగుళీయకంపై దర్శనం ఇచ్చింది. ఆ దేవి హైమక్కయ్య వలె అమ్మ కడుపున పుట్టిన బిడ్డ. వాస్తవం ఏమంటే అమ్మ కరకమలాల్లో అన్నపూర్ణేశ్వరి సదా దీపిస్తుంది.
తన బాల్యం నుంచీ అమ్మ తన నోటి వద్ద అన్నాన్ని సైతం తీసి గోరుముద్దలు చేసి ప్రేమగా తన సంతానానికి- మనుషులకు, పశువులకు, పక్షులకు క్రిమికీటకాదులకూ తినిపించింది. ఆకలి తీర్చే అన్నం భౌతిక ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా లభిస్తుంది. కానీ అన్నపూర్ణేశ్వరి ప్రసాదించే అన్నం కేవలం క్షుద్బాధా నివారణార్థం కాదు- అది మహాప్రసాదము; దానికోసం దేవతలు సైతం బారులు తీరి దోసిలి ఒగ్గి అర్థిస్తూంటారు.
పూజ్యశ్రీ సద్గురు శివానన్దమూర్తిగారు ఒక అంతర్నిహితమైన, అంతర్లీనమైన ఆధ్యాత్మిక రహస్యాన్ని అమ్మ అవతారలక్ష్యాన్నీ వివరిస్తూ “అమ్మ గుప్పెడు అన్నం చేతిలో పెట్టిందంటే, తిన్నవాడికి తెలియకుండానే జీవుడిని ఆశ్రయించి ఉన్న పూర్వజన్మ సంస్కారములు నాశనం అవుతాయి, కర్మ నశిస్తుంది. ‘ప్రసాదము’ అని దానికి పేరు. ప్రసాదము అంటే దయ అని అర్థం. ప్రసాదగుణం-వాత్సల్యం, ప్రేమ, ఆశీర్వచనం. ఆమె ప్రసాదం నిజమైన ప్రసాదం. అన్నం కాదది, ప్రసాదం” అని ప్రబోధించారు.
ఆర్ష సంస్కృతి ధర్మాలననుసరించి, కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి చెప్పాలంటే కర్మ నశిస్తేనే మోక్షప్రాప్తి. అది గగన కుసుమం, ఎండమావిలో నీరు, ఎన్నటికీ చేరుకోలేని గమ్యం, అసంభవం. కారణం ఏమంటే సత్కర్మ ఆచరించినా, దుష్కర్మ ఆచరించినా వాటి ఫలానుభవం నిమిత్తం జన్మ తప్పదు. జన్మిస్తే ఏదో కర్మను తప్పక ఆచరించాలి. ఈ కర్మ ఫలహేతువైన జననమరణ ఆవర్తన చక్రం నుంచి, బంధనముల నుంచి బయటపడం మోక్షాన్ని పొందటం జీవులకు అసంభవము. అసాధ్యము. కావున “పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీజఠరే శయనం” అనివార్యం.
‘విశ్వప్రాణి విమోక్షైక కారణ అవ్యాజసత్కృపా’ అని అమ్మను కీర్తించారు శ్రీరాధాకృష్ణశర్మగారు. సృష్టిలోని జీవకోటికి మోక్షాన్ని అనుగ్రహించాలనే కారణంగా అకారణ కారుణ్యంతో అమ్మ వచ్చింది అని. అదే అమ్మ అవతార లక్ష్యం. ఇదీ రహస్యం. అన్న ప్రసాద వితరణలో ఐచ్ఛికంగా అమ్మ మూడు పద్ధతులను అనుసరించేది.
- బిడ్డలను చేరదీసి స్వయంగా అన్నం ముద్దలు నోటికి అందించటం.
- ‘అన్నం తినండి’ అని జనబాహుళ్యాన్ని అన్నపూర్ణాలయానికి పంపించటం.
- ‘తిని వచ్చాము’ అంటే, ‘ఎంత ఆకలి అయితే అంతే తినండి’ అనేది ఆ ప్రసాదం ఒక్క ముద్ద తిన్నా చాలు. వానికి కర్మక్షయం, జన్మరాహిత్యం అయి మోక్షద్వారాలు తమంతట తామే తెరుచుకుంటాయి.
తల్లిగా వచ్చింది కాబట్టి ఈ అమోఘవరాన్ని బేషరతుగా అమ్మ ప్రసాదించింది.
అవనీస్థలిపై అమ్మ నడయాడిన మహాయుగంలో అమ్మ చేసిన పనులు ముఖ్యంగా రెండు: ఒకటి దర్శనం ఇవ్వటం; రెండు అన్నప్రసాదాన్ని అందించటం.
ఒకసారి అమ్మ స్వయంగా అన్నం కలిపి తన అనురాగాన్ని ఆప్యాయతని రంగరించి గోరుముద్దలు చేసి నాకు తినిపిస్తున్నది. కూర అన్నం అది. “నాన్నా! కారంగా ఉందా?” అని అడిగింది. ‘అవునమ్మా’ అన్నాను.
“ఈ మమకారం ముందు కారం ఎంత?” అన్నది. నా కళ్ళకి కారం కనిపిస్తోంది; అమ్మ కళ్ళకి మమకారం కనువిందు చేస్తోంది.
అమ్మ అన్న ప్రసాదాన్నీ అందించేటపుడు కారం లేని మమకారంతో పెట్టుకుంటుంది. లోకంలో కనిపించే, కని – పెంచే తల్లులంతా జగన్మాతృ అంశలే. కాగా పరిమితమైన మమకారం, దృష్టి వలన ఒక్కొక్క సారి ‘బిడ్డ అక్కరకు రాలేదు’ అని తల్లి విలవిలలాడుతుంది. ఏ తల్లి అయినా ముందుగా మగపిల్లవాడు పుట్టాలని కోరు కుంటుంది. కారణం- వాడు పెరిగి పెద్దవాడై రెక్కలు అలిసిపోయిన తండ్రికి ఆసరా అవుతాడని ఆశ. ‘ఆత్మవస్తు కామాయ సర్వం ప్రియం భవతి’ అంటుంది శృతి. మనిషి ఏం చేసినా తన కోసమే చేస్తాడు. ఇతరుల కోసం చేసినట్లు కనిపిస్తుంది, అనిపిస్తుంది, కనుక లోకంలోని తల్లుల మమకారంలో కించిత్ కారం ఉంది.
అమ్మ మమకారం ఎటువంటిది? ‘ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి’ అనేది అమ్మ పరంగానూ అక్షర సత్యమే. అమ్మ తన తృప్తి కోసమే అనంత సంతానానికి అన్నం పెట్టుకుంటోంది. అమ్మ తన తృప్తి కోసమే తరింప జేసే తల్లిగా దిగివచ్చి సకల జీవకోటిని సముద్ధరిస్తోంది. అమ్మ స్వార్థం అవధులు లేనిది- అని పరమార్థం.
అమ్మ చూపు – సర్వార్థ దాయకం, అమ్మరూపు దివ్యం; మనస్సు- భిన్నత్వం లేనిది; అమ్మ ప్రసాదం- అమృతం.
‘జన్మ కర్మచమేదివ్యం’ అన్నారు కృష్ణ పరమాత్మ. అమ్మదర్శనం, అమ్మచేతలు దివ్యమైనవి; ఊహతీతమైనవి.
అమ్మ అన్నరూపమహాప్రసాదాన్ని భిక్షగా వేయదు.
వాస్తవానికి అది అన్నం కాదు- జ్ఞానం, శక్తి, సంపద, అనుగ్రహం.
అమ్మ అన్నం పెట్టుకునే తీరును ఉపనిషత్తులు చక్కగా వివరించాయి.
శ్రద్ధయాదేయం- శ్రద్ధతో ఇవ్వాలి; అశ్రద్ధయా అదేయం- నిర్లక్ష్యంగా ఇవ్వకూడదు; శ్రియాదేయం- కలిగి ఉన్నంతలోలోపం లేకుండా ఇవ్వాలి; ప్రియాదేయం సిగ్గుపడుతూ- ఇంతమాత్రమే ఇస్తున్నాను అనే భావంతో, భియాదేయం- భయపడుతూ నా చేయిపైన అనే గర్వం లేకుండా); సంవిదాదేయం- ‘నారాయణ స్వరూపాయ’ అని సత్కరించే విధంగా అమ్మకి తన అనంత సంతానమే ఆరాధ్యమూర్తులు- ఈ ఒక్క ఉదాత్త భావన సకల ఉపనిషత్ప్రబోధసారం. కోటి మందికి దర్శనం ఇవ్వాలనీ, లక్షమంది బిడ్డలు ఒకే పంక్తిలో అన్నం తింటూంటే చూడాలనీ; లక్షమంది పసివాళ్ళని వాళ్ళ తల్లులు ఉయ్యాలల్లో వేసి ఊపుతూంటే చూడాలనే లోకోత్తరమైన ఆకాంక్షలు, ఒక్కటే- అమ్మ కర్తవ్యం: దర్శనం, ప్రసాద వితరణం.
ఈ వ్యాస సారాంశాన్ని ఒక్క సన్నివేశంలో చెపుతాను. ఒకసారి ఒక సోదరుడు “అమ్మా! అభివృద్ధిలేదు. అంతా బాగానే ఉంది” అన్నారు. వెంటనే అమ్మ, “నాన్నా! నీ ఉద్దేశంలో అభివృద్ధి అంటే ఏమిటి? భవనాలు.నా ఉద్దేశంలో అభివృద్ధి అంటే ఇంకా వేలమంది భోజనం చేసి పోవటం. అది జరుగుతోంది” అన్నది. అదే బంగారు కోవెల, అన్నపూర్ణాలయం, అర్థం- పరమార్థం.
కనుక మన తక్షణ కర్తవ్యం అన్నపూర్ణాలయాన్ని బలోపేతం చేయటం. డార్మెటరీ కట్టాలి. వచ్చినవాళ్ళు స్నానం చేసి, సేదతీరి, గుడికి వెళ్ళి అమ్మను దర్శించుకోవాలి, అర్చించుకోవాలి. తర్వాత అన్న పూర్ణాలయానికి వెళ్ళి ‘మహాప్రసాదం’ స్వీకరించాలి. వాళ్ళంతా తరిస్తారు. అంతే. పురాణాలూ, ప్రవచనాలూ, జ్ఞానబోధలూ అవసరం లేదు.
అమ్మను దర్శించుకోవటం పుణ్యం, అన్నపూర్ణాలయ ప్రసాద స్వీకరణం సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య ప్రాప్తి.