అసలు సూత్రమంటే ఏమిటో తెలుసుకొని బ్రహ్మ దగ్గరకు అమ్మ దగ్గరకు పోదాం.
“అల్పాక్షర మపందిగ్ధం ప్రారవద్విశ్వతోముఖ
అస్తోభమనవద్యం చ సూత్రం సూత్రవిదోవిదుః
సంక్షిప్తంగా ఉండేది, సరళంగా ఉండేది, సారవంతమైనది తప్పులు లేకుండా ఉండేది, మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేనిది అయిన వాక్యమే సూత్రము అది పెద్దల చేత గుర్తింపబడింది. అందుకే సందేహంలేనిదే సందేశం అన్నది అమ్మ. సంక్షిప్తత అనే దానికి మరీ ప్రాధాన్యం ఇవ్వటం వల్లనేమో సరళం కాకుండా గహనంగా ఉండి పోయినవి బ్రహ్మసూత్రాలు. అకారణంగానే ఎవరి అభిప్రాయాన్ననుసరించి వారు ఆ సూత్రాలకు అర్థాలు చెప్పుకుంటూ పోవటం వల్ల ఎన్నో దర్శనాలు, మతాలు పుట్టుకొని వచ్చాయి. వీటిని రచించిన మహానుభావుడు వ్యాసుడే – బాదరాయణుడు అని కూడా ఆ మహర్షిని పిలుస్తారు.
వ్యాసుడు అంటే సంపాదకుడు – అస్తవ్యస్థంగా ఉన్న వేదమంత్రాలను నాలుగు భాగాలుగా బుక్, యజుస్, సామ అధర్వములుగా విభజించాడు. ప్రతి వేదానికి నాలుగు భాగాలున్నాయి. సంహితలు, బ్రాహ్మణములు, అరణ్యకాలు, ఉపనిషత్తులు అన్నారు. భారతం లోని భగవద్గీత కంటే ముందు ఈబ్రహ్మ సూత్రాలను రచించాడు.
పూర్వం చెప్పినట్లు ఈ సూత్రాలలో సరళత లోపించటం వల్ల తేలికగా అర్థం కావటానికి వీటికి శంకరాచార్యులు, రామానుజార్యులు, మధ్వాచార్యులు వంటి వారు కొందరు వ్యాఖ్యలు వ్రాశారు. వీరి ముగ్గురినీ ఖండిస్తూ వచ్చిన వాదనలు ఆ వాదనలను ఖండించినవారు, సమర్థించినవారు ఎన్నో ఎన్నో తర్వాత వచ్చాయి ఎందరో వచ్చారు.
వేదాంత శాస్త్ర విషయాలు తర్కబద్ధంగా నిబద్ధి స్తున్నవి. కనుక బ్రహ్మసూత్రాలను న్యాయప్రస్థానమనీ, వేదాంత సూత్రాలనీ పిలుస్తున్నారు. ముఖ్యంగా సన్యాసులు అధ్యయనం చేస్తున్నారు కనుక భిక్షుసూత్రాలనీ అంటారు. వేదాలలో చివరి భాగాన్ని చర్చిస్తున్నది కనుక ఉత్తర మీమాంసాసూత్రాలనీ వీటికి పేరు. శరీరంలో ఉన్న శరీరిని గూర్చి చర్చిస్తున్నది కనుక శారీరక మీమాంసా సూత్రాలనీ పిలుస్తున్నారు. ఈ సూత్రాలు మొత్తం 555. ఒకటీ అర తక్కువగా మిగతావారూ అంగీకరించారు. వీటిని నాలుగు అధ్యాయాలుగా విభజించారు. ప్రతి అధ్యాయము మరల నాలుగు అధికరణాలుగా విభజింపబడింది. ఈ సూత్రాలన్నింటిలో ప్రధాన విషయం ఒక్కటే బ్రహ్మము అనే సత్యాన్ని తెలుసుకోవటమే.
అమ్మ కూడా సూత్రాన్ని గూర్చి వివరించింది. అయితే అమ్మ వేదాంత సూత్రాలను గూర్చో, వ్యాకరణ సూత్రాలను గూర్చో, న్యాయసూత్రాలను గూర్చో చెప్పలేదు. స్త్రీలు మంగళసూత్రంలోని సూత్రాన్ని గూర్చి చెప్పింది. అమ్మ ఏది చెప్పినా అన్నింటికీ వర్తిస్తుంది. దానిలోని అంతస్సూత్రం అన్నింటికీ సరిపోతుంది.
సూత్రం అంటే ఇముడ్చుకొనేది అన్నది. ఒక దానిలో ఒకటి ఇమిడిపోవటం. దారం బంగారంతో చేసిన తాళిబొట్లలో ఇమిడి ఉన్నది. తాళిబొట్లు దారంలో యిమిడి ఉన్నవి. ఇముడ్చుకొనేశక్తి రెండింటికీ ఉన్నదన్నమాట, శబ్దంలో అర్థం భావం ఇమిడి ఉన్నట్లుగా. దానినే అర్థనారీశ్వర తత్వం అంటారు అన్నది అమ్మ. దారం లేకపోయినా సూత్రం కాదు బొట్లు లేకపోయినా సూత్రం కాదు. రెండు కలిస్తేనే సూత్రం అంటుంది అమ్మ.
కనుక అమ్మ చెప్పింది చూసినా వ్యాసుడు చెప్పిన బ్రహ్మసూత్రాలు చూచినా సూత్రంలో బ్రహ్మము ఇమిడి యున్నది. బ్రహ్మములో సూత్రమూ ఇమిడి ఉన్నది. అయితే తేలికగా అర్థం కావడానికి బ్రహ్మము సూత్రరూపముగా బయటకు వచ్చింది. దీని ద్వారా దానిని (బ్రహ్మము) తెలుసుకోవడం అన్నది అంతరార్థం. అందుకే అమ్మ “శరీరం ఆత్మకాకపోతేగా” అన్నది. అందుకే బ్రహ్మ సూత్రాలను శారీరక మీమాంసాసూత్రాలు అని కూడా అన్నారు. అమ్మ చెప్పే ప్రతిమాట అందరినీ అన్నింటినీ సమన్వయం చేయటమే.
మొదటి అధ్యాయం పేరు “సమన్వయం” దేనిని సమన్వయిస్తుంది. బ్రహ్మము సత్యమనీ, సత్, చిత్, ఆనందమనేది దాని స్వభావమనీ, అదే ధ్యాన గమ్యమనీ, అనుభవవైకవైద్యమైనదనీ విశ్లేషించి సమన్వయిస్తుంది.
రెండవ అధ్యాయం “అవిరోధం”. ఇందులో వేదాంత మార్గాన్ని వెతికే వారికి వచ్చే అడ్డంకులు, అభ్యంతరాలు చర్చించి పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది.
మూడవ అధ్యాయం “సాధన”. ఈ శరీరం దీని ఆవరణ, మనస్సు దాని పరిధుల నుండి క్రమంగా ఆత్మ విడుదల పొందటానికి చేసే సాధనా మార్గాన్ని తెలియచేసేది.
నాలగవ అధ్యాయం “ఫలం”. ఉపాసనలు, వాటి స్వరూపము, వాటి ఫలితము చర్చించటం.
ఈ పై నాలుగు అధ్యాయాలనూ సమన్వయంతో, సదవగాహనతో అధ్యయనం చేసి, అనుభవంతో జోడిస్తే సత్యాన్వేషణ సమగ్రమై సంపన్నమౌతుందనేది నమ్మకంగానే చెప్పవచ్చు. వేదవిభాగాన్ని చేయడం కోసం వేదాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ అధ్యయనసారాన్ని సంగ్రహంగా సూత్రప్రాయంగా చెప్పారు వ్యాసమహర్షి.
అమ్మ చెప్పే సూత్రాలలో (వాక్యాలు – మాటలు) కూడా ఎవరికీ దేనికీ విరోధం ఉండదు. అమ్మది సరేమంత్రం. సాధన విషయంలో కూడా నేను సాధన లేదని చెప్పను సాధ్యమైనదే సాధన అంటాను అన్నది. ఇక ఉపాసనలు పద్ధతుల వాటి ఫలాన్ని గూర్చి కూడా అమ్మ స్పష్టంగానే చెప్పింది. అమ్మ చెప్పిన వీటిని గూర్చి కూడా మనం చర్చించుకుందాం సూక్ష్మంగా.
ఇంతకూ ఇప్పటిదాకా బ్రహ్మసూత్రాలు ఎవరు వ్రాశారు? అందులో ఏయే విషయాలున్నాయి? అవి ఎందుకు సామాన్యులకు అందుబాటులో లేవు అనేవి సూచనప్రాయంగా తెలుసుకున్నాం. ఇందులోని సూత్రము అంటే ఏమిటో కూడా తెలుసుకున్నాం. ఇక బ్రహ్మము అంటే ఏమిటో తెలుసుకోవాలి. అమ్మ బ్రహ్మ ఎట్లా వేరు కాదో తెలుసుకోవాలి. బ్రహ్మసూత్రాలు చూడాలి అమ్మ సూత్రాలు చూడాలి. బ్రహ్మసూత్రాలలో మొదటి అధ్యాయంలో మొదటి సూత్రంలో అధాతో బ్రహ్మజిజ్ఞాసా’ అని ఉన్నది. అంటే దీని తదుపరి బ్రహ్మజిజ్ఞాస అని. దేని తదుపరి ? సాధన చతుష్టయ సంపత్తి కలిగింతర్వాత, ఏమిటీ సాధన చతుష్టయం. 1. నిత్యానిత్య వస్తువివేకం. అంటే ఏది శాశ్వతమైనది. ఏది అశాశ్వతమైనది ? అని విచారించి తెలుసుకొనేశక్తి 2. ఇహాముత్ర ఫలభోగ విరాగం. తాను చేసే పనులు ఫలితం యెడల కోరిక లేకపోవడం. 3. అంతరింద్రియ బాహ్యేంద్రియాలను అదుపులో ఉంచుకోవటం. దేనికీ చలించని మానసిక స్థితి. ఓర్పు, శ్రద్ధా, పెద్దల పట్ల గౌరవం, ధ్యానించే వస్తువు పట్ల అభేదస్థితి కలగటం. 4. ముముక్షత్వం. అంటే అసలు రూపాన్ని తెలుసుకోవటం. పాకృత సుఖదుఃఖాల నుండి విడుదల పొందటం. ఇవి సాధించింతర్వాత బ్రహ్మ జిజ్ఞాసకు యోగ్యత వస్తుందట. అంటే సత్యనిష్ఠ ఏర్పడి ఆ సంస్కారబలంతో బ్రహ్మజిజ్ఞాస చేయాలి అని అర్థం. అపుడు వివేకబుద్ధికి సమాధానం తెలుస్తుంది బ్రహ్మము అనేదొకటే మనకు అభిన్నంగా ఉన్నది అని అనుభవం ద్వారా తెలుస్తుంది. సాధన చతుష్టయ సంపత్తి లేనివారిలో బ్రహ్మ జిజ్ఞాస కలిగినావారు లేరా ? ఉన్నారే – అది ఎట్లా సాధ్యమైంది ? అంటే పూర్వజన్మ సంస్కారం వల్ల అంటున్నారు. వారిలో గల లక్షణాలనూ విశ్వలక్షణాలను ఇంద్రియ జ్ఞానానికి అందినంతవరకూ పరిశీలించి సత్యాన్ని అన్వేషిస్తూ ముందుకు సాగుతున్నా డన్నమాట. ఆ సత్యనిష్ఠనే …. సంస్కారబలం అంటున్నారు.
బ్రహ్మ జిజ్ఞాస అంటే త్రిమూర్తులలోని బ్రహ్మను గూర్చి కాదు. ఈ బ్రహ్మ కూడా సృష్టిలోని వాడే కనుక పరబ్రహ్మను గూర్జిన జిజ్ఞాసయే. బ్రహ్మము అంటే వృద్ధి అయ్యేది. వృద్ధి చేసేది. కనుక బ్రహ్మమునకు లక్షణం వృద్ధి. ఏమి వృద్ధి ? ఆత్మానుభూతికి దగ్గరకు తీసుకొని వెళ్ళే జ్ఞానవృద్ధి అని అనుకోవాలి. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే బలీయమైన కోరిక. శబ్దార్థమైతే అధ : = ఇప్పుడు, అతః = అందువలన, బ్రహ్మ జిజ్ఞాస = బ్రహ్మ విచారణ (బ్రహ్మ యొక్క నిజమైన స్వరూపమును గూర్చిన పర్యాలోచన)
అమ్మ “ఉన్నదంతా అదే. అధికానిది ఏదీ కనిపించటం లేదు” అన్నది. అంటే అంతా అదే అయితే తెలుసుకోవాలనే కోరిక ఎక్కడిది ? తెలుసుకోవాలనుకొనే వాడు – తెలుసుకోవలసింది రెండుగా ఉంటే కదా! శరీరం ఉన్నది మనస్సున్నది అని తెలుస్తున్నది. అంటే ద్వంద్వంలో ఉన్నాం కనుక ఏదో తెలుసుకోవాలని మనసు అనుకుంటున్నది. దానికి కారణం ఎవరు ? ప్రేరణ ఆ ప్రేరణ ఎవరిస్తున్నారు ? ప్రేరణే దైవం అన్నది అమ్మ. ప్రేరణ మనకు తెలియకుండా మనలో కలిగేది. ఆ శక్తే మనకు తెలుసుకోవాలనే కోరిక కలిగిస్తున్నది. కోరిక కలిగించింది కనుక కోరిక తీర్చేది కూడా అదే అంటుంది అమ్మ. సరిగమలు నేర్వకుండా సంగీతం లొంగదు కదా! అంటే సంగీతం నేర్చుకోనివాడు కూడా హృదయానికి హత్తుకునేటట్లు పాడగల్గుతున్నాడు కదా మరి. అంటే అది దైవదత్తం అంటున్నారు. సంస్కారబలం అంటున్నారు. అంటే “వాడిస్తే” ఏదైనా వస్తుంది. అంతా వాడి సంకల్పమే. ప్రయత్నం కనిపిస్తుంది ప్రేరణ కనిపించదు. మన ప్రయత్నం ఏమీ లేదు. తరుణం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది.
ఇక బ్రహ్మసూత్రాలలో రెండవది జన్మాద్యస్యయతః అంటే యతః = దేని నుండి (ఏ కారణంగా), అస్య = దీని యొక్క, జన్మ = పుట్టుక, ఆది = మొదలైనవి. – అని అర్థం. దేని నుండి లేక దేని కారణంగా దీని పుట్టుక మొదలైనవి కలుగుతున్నవి ? దేని పుట్టుక ? ఈ ప్రపంచము యొక్క ఉత్పత్తి, స్థితి, లయములు దేని నుండి జనించునో అదియే బ్రహ్మము అని సూత్రం యొక్క అర్థం.
“యతోవా ఇమాని భూతాని జాయంతే యేనజాతాని జీవంతి
యత్రయం తృభిసంవిశంతి తద్వివిజ్ఞానస్వతత్ప్రహ్మ”
దేని నుండి యీ భూతములు పుట్టునో, దేనివలన బ్రతుకునో దేనియందు చివరకు లీనమగునో అది బ్రహ్మము. “సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ” ఇది బ్రహ్మ యొక్క స్వరూపం అని శాస్త్రాలు చెపుతున్నవి.
“సృష్టి అనాది నాది” అన్నది అమ్మ. సృష్టికి నాశనం లేదు రూపాంతరం తప్ప. సృష్టే భగవంతుడు. సృష్టికి ఆద్యంతాలు లేవు. సృష్టితోనే సృష్టి అయింది. సృష్టికంటే మహిమ ఏమున్నది ? సృష్టి కంటే విశేషము లేదు. మీరంటున్న అశాశ్వతమైనది శాశ్వతమైన దానిలో నుండే వచ్చింది. విశ్వరూప సందర్శనమంటే ఈ కనపడే దానిని చూడటమే నన్నది.
సృష్టి, స్థితి, ప్రళయ లక్షణములు ఈ ప్రపంచ లక్షణములు. అవి సహజాలు – ఉన్నది లేనట్లు కనపడటం భ్రాంతి. ఉన్నది ఉన్నట్లుగా కనపడటం లోచూపు. భ్రాంతి పోతే బ్రహ్మమే. మనం కూడా వడ్లగింజిలలో బియ్యపు గింజలా ఉన్నాం. మనలోని దోషాలు తొలగించుకొని ఆ విధంగా. వేరు కావాలి. ఇది అసలు లక్షణం. అంటే విశ్వలక్షణం. ఈ పరిపూర్ణ జ్ఞానమే ఆత్మజ్ఞానం.
ఇక మూడవ సూత్రం “శాస్త్రయోనిత్యాత్” అంటే శాస్త్రమునకు జన్మస్థానము. అంటే బ్రహ్మము శాస్త్రాలకు మూలం, పుట్టిల్లు. మరొక అర్ధం బ్రహ్మమును తెలుసుకోవటానికి శాస్త్రాలు ఆధారం. శాస్త్రం అంటే వేదం. మిగతా శాస్త్రాలు దానిలో నుండి వచ్చినవే. వేదము బ్రహ్మ నుండి వచ్చిందే. వేదములు బ్రహ్మము యొక్క నిశ్వసితమే అని చెప్పారు. అది ఎలా ? బ్రహ్మజ్ఞానానికి ఆధారభూతంగా ఉన్నది వేదమే కదా ! శాస్త్రంలోని విషయము విషయకారణమూ రెండు కూడా బ్రహ్మమే అని “యోని” శబ్దానికి అర్థం. అన్ని శాస్త్రాలు బ్రహ్మము నుండి ప్రకటమైనవే అని భారతీయుల విశ్వాసం. అదికాక శాస్త్రములు కూడా మహర్షుల ఆధ్యాత్మికానుభవములే.
ఇక అమ్మ ఈ విషయంలో “అనుభవం శాస్త్రాన్నిస్తుంది కాని శాస్త్రం అనుభవాన్నివ్వదు” అన్నది. “ఏ గ్రంథాలూ, ఏ శాస్త్రాలు నిత్య జీవితం కంటే ఎక్కువ బోధించేదేమీ లేదు. నిత్యకృత్యంలోనే జీవిత సత్యం తెలుస్తుంది. అనుభవంతో విశ్వాసం కలుగుతుందా ? లేక విశ్వాసంతో అనుభవం వస్తున్నదా ? అనుభవంతోనే కలుగుతున్నదని రూఢి అవుతున్నది కదా ! భగవంతుడు లేడు అనే వాడికి ఉన్నాడనే వాడికీ, ఎవరూ అనే వాడికి సరిపోయేటట్లు చెప్పగలిగింది శాస్త్రం. విన్నవాడు. విమర్శిస్తాడు, కన్నవాడు వివరిస్తాడు. వినటం శాస్త్రం – కనటం అనుభవం.
శరీరాన్ని విడిచి ఆత్మ ఎట్లా ఉంటుంది? దానికి రూపం ఎక్కడున్నది? ప్రళయం అనేది ఉన్నదా? పరిణామమే గాని ప్రళయం లేదు. అది (బ్రహ్మము) కానిది యేదీ కనిపించటం లేదు నాన్నా!” అన్నీ అందులోంచి వచ్చినవే – అంతే పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంటారు. పిపీలిక బ్రహ్మ కాకపోతే కదా ! చీమలో దోమలో కూడా బ్రహ్మ ఉన్నాడని కాదు చీమగా దోమగా ఉన్నాడు” అన్నది అమ్మ.
ఇక నాలుగవ సూత్రం “తత్తు సమన్వయాత్” అంటే ఆ బ్రహ్మము సమన్వయము వలన తెలియవచ్చును అని. దేనితో సమన్వయం చేస్తే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. వేదోపనిషత్ జ్ఞానం వల్ల కలుగుతుంది. వేదంలో ఉపాసన, కర్మకాండ, జ్ఞానకాండ మూడు భాగాలు. అంటే మూడింటిని సమన్వయ పరిస్తే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఉపనిషత్తులలో బ్రహ్మను ప్రస్తావించినవి పరస్పర విరుద్ధముగా ఉన్నవి కదా ! మతాచార్యులలో మతభేదాలున్నవి కదా ! సత్యజ్ఞానం కలిగేందుకు ఆయా విరోధాలను కూడా తొలగించ గల సమన్వయం కావాలి.
వ్యావహారిక సత్యం పారమార్థిక సత్యం ఉన్నాయి. పరమసత్యాన్వేషణలో సత్యాలను సమన్వయించుకుంటూ సాగిపోవాలి అనేది ఈ సూత్ర ఉద్దేశం.
అమ్మది ‘సరే’ మంత్రం. ‘సర్వసమ్మతమైనదే నా మతం, “వైకల్యం లేనిదే కైవల్యం” అన్నది అమ్మ. జీవితములో వైకల్యమూ, అసంతృప్తి లేకుండా ఉండాలంటే ఏంచేయాలో మతాలన్నీ వాటి వాటి రీతులలో జవాబులు చెప్పాయి “జైనమతం నీ కర్మల భారమే నీ కష్టాలకు సుఖాలకు కారణం. అనుభవించడం ద్వారా ఆ భారం వదల్చుకో” అంటుంది. బౌద్ధము “దుఃఖమున్నది. దానికి కారణమున్నది. నివారణ ఉన్నది. మార్గము ఉన్నది అని అష్టాంగ యోగం” చెప్పింది. “ఆది దంపతులు చేసిన పాపమే వారి సంతతిని హింసిస్తున్నది. దేవుని దూతా, దేవుని కుమారుడూ ఇచ్చిన సందేశం పాలిస్తే స్వామి సన్నిధి సుఖము లభిస్తుందిని” కొన్ని మతాలు చెప్పుతున్నాయి. “ఆత్మ అంతటా ఉన్నది. దానిని తెలసుకుంటే ముక్తి కలుగుతుంది. లేకుంటే పితృయానమార్గాన వెళ్ళి నీకర్మను అనుభవించి మళ్ళీ జన్మ ఎత్తుతావు” అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. “ఫలాపేక్ష రహితంగా సర్వమూ నాకు సమర్పించు నేను రక్షిస్తాను” అంటారు గీతాచార్యులు.
అమ్మ ఏ దారీ చెప్పదు చేరేది గమ్యమే. విశ్వశక్తి జగత్తును నడుపుకుపోతున్నది. అందరికీ సుగతే. ఏది జరిగినా ఏది చేసినా మనం కాదు చేసేది. మనల్ని నడిపించే శక్తి ఒకటి ఉన్నది. తోచినదేదో చేస్తూ కష్టసుఖాలు ఆ శక్తి ఇచ్చినవిగా అనుభవించడమే. లౌకికమూ ఆధ్యాత్మికమూ రెండులేవు. ఉన్నదంతా అదే. వాడి క్రియ నీ క్రియ అంటూ రెండూ లేవు. ఉన్నదొక్కటే క్రియ. కనిపించేదంతా దైవం అనుకోవటమే జ్ఞానం. అన్నీ తానైనవాడే దైవం. ఆ సర్వములోని వాళ్ళమే మనం. అందరిదీ తలోరాతగా కనిపిస్తున్నా చివరకు అన్నీ ఒకే రాతలో కలుస్తాయి.” “నా చేతదైవం ఏది చేయిస్తే అది చేస్తున్నాను” అనుకోవటమే సమన్వయానికి మూలం. అమ్మకు మించిన సమన్వయ శక్తి లేదు. అందుకే అమ్మది సహేంద్ర తక్షకాయస్వాహా మంత్రమే.
ఈ వ్యాసంలో బ్రహ్మసూత్రాలలోని ‘చతుస్సూత్రి’ని అమ్మ వాక్యాలతో అన్వయించడానికి దిఙ్మాత్రంగా ప్రయత్నించాను. బ్రహ్మసూత్రాలు 555 ఉన్నవి. అమ్మ సూత్రాలు అనంతాలు. అయినా 3333 గా శ్రీపాదవారు క్రోడీకరించారు. ఇలా ఎవరు ఎక్కడ ఎన్ని సూత్రాలు వ్రాసినా, ఉపనిషత్తులు వ్రాసినా, గీతలు వ్రాసినా అన్నీ అమ్మ చెప్పిన సూక్ష్మాతి సూక్ష్మ సూత్రాలలో (వాక్యాలలో) ఇమిడి పోయేవే. వాటిని సమన్వయం చేసే మాతృశ్రీ పాదులు ముందు ముందు రాగలరని నా విశ్వాసం.