అమ్మ ‘అందరిల్లు’ ఏర్పాటు చేసింది. ఇదే ఒక విశిష్టమైన భావన. ఇది ‘విశ్వకుటుంబం’ అన్నది. ఈ రకమైన ఆలోచనలు చేయటం వల్ల మనం అమ్మను విశ్వజనని అని పిలుచుకుంటున్నాం. విశ్వజననియై ఈ ఆలోచనలు చేసిందా? ఈ ఆలోచనలు చేయటం వల్ల విశ్వజనని అయిందా! ఈ రెండు ఆలోచనలూ వేరు కాదు. విశ్వజనని కాక ఎవరూ ఈ ఆలోచనలు చేయలేరు.
మిమ్మల్ని నేనే కని మీ తల్లులకు పెంపుడిచ్చాను అని చెప్పింది. మీ తల్లులకు, ఆ తల్లుల తల్లులకు కూడా నేనే తల్లిని అంది. అమ్మ చిన్నప్పుడు రాఘవరావు మామయ్య అన్నానికి రాలేదని బాధపడుతుంటే వాడు రాలేదని బాధపడేతల్లి లేదుగా !అన్నారు (అమ్మమ్మ చనిపోయింది అప్పటికే) ఎవరో ! ఎవరు రాకపోయినా బాధపడే తల్లి ఉన్నదిగా ! అన్నది అమ్మ తనను గూర్చి. మరొక సందర్భంలో గంగరాజు పున్నయ్యగారు శ్రీకృష్ణపరమాత్మగా అమ్మ సాక్షాత్కరిస్తే తల్లి లేని తల్లీ అంటూ అమ్మను ముద్దు పెట్టుకున్నారు. అపుడు ‘తల్లి లేని తల్లీ అంటే తొలి నేనేననా!” అని తల్లి శబ్దానికి నిర్వచనం ఇచ్చింది అమ్మ. నీకు మీకు అందరికీ నేనే తల్లినంటూ ఇంకొంచెం ముందుకు వెళ్ళి తొలి ఏదో అది నేనే అన్నది. అందువల్ల సృష్టికే తల్లియై కూర్చుంది. అలా ఆలోచిస్తే మనమంతా అన్నాతమ్ముళ్ళం, అక్కాచెల్లెళ్ళమే – ఆ వాతావరణం ఒక్క జిల్లెళ్ళమూడిలోనే చూడగలమేమో ! ఆ ఆప్యాయతలు, ఆ అనురాగాలు, ఆ ఆదరణలు పలకరింపులలో ఆ సాన్నిహిత్యం, ఒకరి పట్ల ఒకరు విడివడి ఉండలేని బంధం ఏదో ఒక క్రొత్తలోకంలో ఉన్నట్లు ఉంటుంది.
విచిత్రంగా ఉంటుంది క్రొత్తవాళ్ళకు. పూర్వం జిల్లెళ్ళమూడి నుండి ఎవరైనా మన ఊరికి వచ్చి మనల్ని కలిస్తే, మీరు జిల్లెళ్ళమూడి నుండి సరాసరి వస్తున్నారా! అని వాళ్ళను అడిగి ఒకసారి తాకే వాళ్ళం. అంటే ఏదో ఒక మహత్తరశక్తి వారిలో నుండి మనకు ప్రసరిస్తుందన్న నమ్మకమన్నమాట. ఆ వాతావరణంలో ఒక విద్యుత్ ప్రసరణ ఉంటుందన్నమాట. అది అమ్మ ఉనికి వల్ల వచ్చిందా? హైమ ప్రేమవల్ల వచ్చిందా ! అక్కడి సంచరించే పశుపక్ష్యాదుల వల్ల వచ్చిందా ? అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళ వల్ల వచ్చిందా? వీటన్నింటి సమాహారం వల్ల వచ్చిందా? ఏమో! ఒక మహత్తరశక్తి ప్రవహించే మాట వాస్తవం.
ఇంతకీ మనలో ఆ సోదరీ సోదరభావం అంతగా బలపడటానికి అమ్మే కారణం. రామకృష్ణన్నయ్యను అడుగు, కృష్ణవేణమ్మ, రుక్మిణమ్మక్కయ్య, సరోజిని అక్కయ్యలను అడుగు అంటూ మనకు అన్నయ్యలను, అక్కయ్యలను చూపింది. తరువాత మన తరువాత వచ్చిన వాళ్ళకు మనం అన్నయ్యలము, అక్కయ్యలము అయ్యాం. అందరి అమ్మ కుటుంబంలో, మనం ఒక సభ్యులుగా మెసలుకుంటున్నాం. అందువల్ల మనలో ఈ సోదరీ సోదరభావం బాగా బలపడింది. మన అన్నయ్యల కోసం మన తమ్ముళ్ళ కోసం, మన అక్కయ్యల కోసం, మన చెల్లెళ్ళకోసం ఏ సహాయం చేయటానికైనా, ఏ త్యాగాలు చేయటానికైనా సిద్ధపడతాం కదా! ఇది క్రొత్తగా నేర్చుకున్నదేం కాదు. మన సంప్రదాయంలో ఉమ్మడి కుటుంబాలలో చూచిన విషయాలే పురాణాలలో కూడా ఇటువంటి ఉదాహరణలు ఎన్నో కనిపిస్తూనే ఉంటాయి.
రామాయణ, మహాభారతాలు మనకు భగవంతుని భిక్ష. వాల్మీకి వ్యాసులు మానవ మనస్తత్వాలను, అనుబంధాలను చిత్రించటంలో వారికి వారేసాటి. రామాయణంలో రామలక్ష్మణులు భరత శతృఘ్నులు ఎవరిని చూచినా మనకా సహోదరుల మధ్యఉన్న బంధం సంస్కారం ఆదర్శనీయంగా దర్శనమిస్తుంది. రామునితో అరణ్యాలకు వెళ్ళిన లక్ష్మణుడు, లంకలో యుద్ధంలో విభీషణునిపై కోపంతో ప్రాణం తీయాలని రావణుడు ప్రయోగించిన అష్టఘంటాశక్తికి అడ్డం నిలుస్తాడు ప్రాణత్యాగానికి సిద్ధపడి. లక్ష్మణుడు పడిపోయాడు. ఎందుకు అడ్డంగా నిలచాడు విభీషణుడికి అంటే రాముడు విభీషణుడ్ని లంకారాజ్యానికి పట్టాభిషేకం చేశాడు సముద్రజలంతో. విభీషణుడు చనిపోతే రాముడి మాట పొల్లుపోతుంది. రాముని మాట, చేత అబద్ధం కాకూడదు. లక్ష్మణునికి అన్నగారిపట్ల ఉన్న ప్రేమ శ్రద్ధ అంతటిది. కనుక లక్ష్మణుడు పడి మూర్ఛపోతే రామచంద్రుడు విలవిలలాడిపోయాడు.
“దేశ దేశ కళత్రాణి దేశే దేశేచ బాంధవాః
తంతుదేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరః” ‘అన్నాడు.
అంటే ఎక్కడైనా భార్య దొరకవచ్చు, బంధువులు దొరకవచ్చు కాని లక్ష్మణుని వంటి సోదరుడు దొరకడు అని రోదిస్తాడు. అంతటిది వారి సహోదరుల సఖ్యత. భరత శతృమ్నుల విషయమూ అంతే. తల్లి అయోధ్యారాజ్యానికి భరతుని రాజుని చేయాలని కోరుకుంటే, అన్నగారైన రామచంద్రుని పాదుకలను తెచ్చి సింహాసనంపై పెట్టి రామ ప్రతినిధిగా మాత్రమే రాజ్యం పాలించిన త్యాగమూర్తి భరతుడు, శతృఘ్నుడు కైకను చంపుతానని కత్తిదూస్తే మాతృహంతకుడిని రాముడు ముఖం కూడా చూడడు అని వారించాడు భరతుడు శతృఘ్నుని. అది ఆ అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధం.
రామాయణంలోనే అన్నదమ్ముల అనుబంధానికి మరో ఉదాహరణ కూడా ఉన్నది. సంపాతి, జటాయువు అన్నదమ్ములు ఇద్దరూ ఒకరోజు, ఆకాశంలో ఎంత ఎత్తుకు ఎవరు ఎగురగలరు అని పోటీపడ్డారు. ఇద్దరు ఆకాశంలో ఉన్న ఏడు కక్ష్యలలో అయిదు కక్ష్యల ఎత్తుకు ఎగిరారు. అంతే వారి శక్తి. తమ్ముడు జటాయువు పోటీతో ఇంకా ఎగురుతున్నాడు పైకి. ఇది గమనించిన అన్న సంపాతి సూర్యరశ్మితో జటాయువు కాలి చనిపోకుండా తన రెక్కలు అడ్డుపెట్టి తమ్ముని కాపాడి తన రెక్కలు కాలి క్రింద పడిపోయాడు. తమ్మునిపై ఉన్న ప్రేమ అలాంటిది.
అలాగే భారతంలో పాండవులు అయిదుగురి మధ్య ఉన్న ప్రేమ కూడా సహోదరత్వానికి చక్కని ఉదాహరణమే. విచిత్రమేమిటంటే రామసోదరులందరిలో రామునితో సాటి రాగలిగినంత గొప్పవారు కాదు లక్ష్మణభరత శతృఘ్నులు. పాండవులలా కాదు. ధర్మరాజు కంటే భీమార్జునులు చాల ప్రతిభా సంపన్నులు. కాని అన్నమాట ఎన్నడూ జవదాటి ఎరుగరు.
భీముడు ఆవేశపరుడనే అపవాదున్నది. నిజానికి అభిమానపరుడు, ఆలోచనాపరుడేకాని ఆవేశపరుడుకాదు. లక్ష్మణునిలో, భీమునిలో ఎక్కడైనా ఆవేశమున్నట్లు మన కనిపించినా అది ధర్మావేశమే కాని క్రోధం కాదు, కోపం కాదు.
కోపం చాల చెడ్డది. అన్ని పాపాలకు మూలం కోపమే. భాస్కరరామాయణంలో ఒక పద్యమున్నది.
“కోపులు గురువధకోడరు
కోపులు పరనిందసేయగొంకరు, కోపం
బాపదల కెల్ల మూలము
కోపము పాపముల పొత్తు” గుర్తుంచుకోదగ్గ విషయం.
యక్షప్రశ్నలలో ధర్మదేవత “కఃశత్రుర్దుర్ణయం పుంసాం” పురుషునకు జయించుటకు సాధ్యము కాని శత్రువు ఎవరు ? అంటే ధర్మరాజు క్రోధః శత్రుర్దుర్జయః” పురుషునకు జయించుటకు సాధ్యముకాని శత్రువు క్రోధము అని సమాధానం చెప్పాడు. గీతాచార్యుడు కూడా “క్రోధాత్భవతి సంమోహః” అంటాడు. క్రోధం వల్ల యుక్తా యుక్తవివేకం నశిస్తుంది అని అర్థం.
భీముని వద్దకు వచ్చి కీచకునిచే అవమానింపబడ్డ ద్రౌపది రాత్రిపూట వచ్చి మొరపెట్టుకుంటే భీముడు ఎంత శాంతవచనాలు పలికాడో గమనిస్తే తెలుస్తుంది. అతడు ఆవేశపరుడనేమాట ఎంత అబద్ధమో ! ద్రౌపదీ ! ధర్మాన్ని వదలి పెట్టకు. క్రోధాన్ని వీడు. నీ మాటలు ధర్మరాజుగాని, అర్జునుడు గాని, నకుల సహదేవులు గాని వింటే జీవింప జాలరు అని పూర్వ పతివ్రతల కథలు చెప్పాడు. 13 ఏళ్ళ తర్వాత చక్రవర్తి భార్యవౌతావు అని ధైర్యం చెప్పి, ఆ తర్వాత కీచకుని వధిస్తాడు.
సోదరుల అన్యోన్యత చెప్పేవాడివి చెప్పక ఈ సోదంతా ఎందుకు చెప్పినట్లు అని అనుకోవచ్చు. కారణమున్నది. మనను గూర్చి మనమే ఆలోచించు కుందాం ఒకసారి. శ్రీ విశ్వజననీపరిషత్లో బాధ్యతలు నిర్వహిస్తున్న వారంతా మన సోదరులే. తమ సంసార సుఖాలు త్యాగం చేసి సేవ చేస్తున్న వారే ఎక్కువ మంది. వారిపట్ల మనం ఏలా ప్రవరిస్తున్నాం. అమ్మ ఒక మాటన్నది ఒకరు జిల్లెళ్ళమూడిలో ఉంటానమ్మా ! అని అడిగితే. “ఉండవచ్చు నాన్నా ఎవరైనా! ఇతరులను విమర్శించకుండా ఉండగలిగితే ఎవరికి తగ్గపని వాళ్ళకున్నది.”అలా ఉండగలగటమే కష్టం.
నిజానికి జిల్లెళ్ళమూడి వచ్చి పూర్వంగానీ, ఇప్పుడు గానీ అమ్మతో గడిపే సమయంఎప్పుడూ తక్కువే. మిగతా వారితో గడిపే సమయమే ఎక్కువ. వారిలోని ప్రేమ, ఆదరణ, ఆప్యాయతలే మనల్ని కట్టిపడేసేవి, మళ్ళీ మళ్ళీ జిల్లెళ్ళమూడి రప్పించేవి. కొంతమంది ఇప్పుడంతగా కనిపించటం లేదు ఆ వాతావరణం అనేవారున్నారు. అప్పుడప్పుడు వింటుంటాం కూడా కొందరు సోదరీ సోదరులనుండి యీ మాటలు. ఎందుకీలా అంటున్నారు. అని నేను ఆలోచించుకుంటే నాకు సమాధానం దొరికింది. ఎవరిలో ప్రేమ, సహనము, ఆదరణ, ఆప్యాయతలు తగ్గినవో వారికే అలా అనిపిస్తున్నది అని. మనం బుజాలు తడుముకోవద్దు. మనకి మనం ఆలోచించుకుందాం. మన లక్ష్యం ఏమిటో మనకు తెలుసు. ఇక్కడ ఆ లక్ష్యం కోసం ఆ ధర్మం కోసం పనిచేస్తున్న సోదరీసోదరులున్నారు. వారికి మనపట్ల ప్రేమకాక మరొక టెందుకుంటుంది? సోదరీ సోదరులపట్ల ఆదరణా ఆప్యాయత కాక మరొక టెందుకుంటుంది? క్రొత్తగా వచ్చిన సోదరీ సోదరులెందరో ఇప్పటికీ ఆ ఆదరణనూ, ఆప్యాయతను ఆ సోదర మాధుర్యాన్నీ అనుభవిస్తున్నామనే చెపుతున్నారే! చిరకాలంగా వస్తున్న వారిలో యీ రకమైన అన్యధా ఆలోచన ఎందుకు వస్తున్నది ? అంటే నాకనిపించింది కనిపించింది ఒకటే. ‘యద్భావం తద్భవతి’ అని. మనలో ప్రేమించటం తగ్గిందా! అవతలి వారిని గౌరవించే భావం, ఆదరించే భావం తగ్గిందా! ఓపిక తగ్గి, ఇతరులను విమర్శించటం పెరిగిందా! ఏమిటి? ఎందుకు వస్తున్నవీ ఆలోచనలు ? మనలోకి మనం చూసుకోవలసిన సమయం అవసరం వచ్చిందా? మన కర్తవ్యం నుండి మనం దూరమవు తున్నామా? ఆలోచించుకుందాం.
జిల్లెళ్ళమూడిలో అభివృద్ధి అన్ని రంగాలలోనూ కనిపిస్తూనే ఉన్నదే – మనకు కనిపించటం లేదా ! అంగబలం అర్థబలం లేకపోయినా అమ్మ ఊరుకోవటం లేదే – ఏదీ ఆగటం లేదే – జరగవలసినంత సమర్థ వంతంగా, ప్రణాళికాబద్ధంగా, ప్రతిభావంతంగా, లాఘవంగా, నేర్పుగా జరుగుతుండకపోవచ్చు. మనమంతా ఉన్నాంకదా! అన్నదమ్ములం, అక్కాచెల్లెళ్ళం. మనమంతా పూనుకుందాం రండి. తలా ఒక చెయ్యివేస్తే ఎంతటి పనినైనా అవలీలగా చేయవచ్చు. నీరసపడాల్సిన, నిర్వీర్యులం కావాల్సిన అవసరం లేదు. చావు పుట్టుకలు మన చేతుల్లో లేవుగా కర్తవ్యం నిర్వహించాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉన్నది మన చేతల్లో ఉన్నది. ఇవి మనకు అమ్మ ఇచ్చిన చేతులు, అమ్మ ఇచ్చిన చేతలు – అమ్మ ఇచ్చిన ధర్మం.
‘ధర్మోరక్షతి రక్షితః’ అనే మాటలు వింటుంటాం. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అని. చాలవిచిత్రంగా ఉన్నవి యీ మాటలు. అమ్మ రక్షిస్తుందని మనం వస్తే, మనం అమ్మ ఇచ్చిన దర్మాన్ని రక్షించటం ఏమిటి? అనే అనుమానం రావటం సహజం. వివేకానందుడు దీనికొక ఉదాహరణ చెప్పాడు, గమనించ దగ్గది. ధర్మం అనే పడవలో నీవు ప్రయాణం చేస్తున్నావు. ఆ పడవకు ఏదో కొట్టుకొని ఒక చిల్లి పడ్డది. ఆ చిల్లిని పూడ్చకపోతే అదే నిన్ను జలసమాధి చేస్తుంది. అలాగే అమ్మ మనకిచ్చిన ధర్మాన్ని మనం అన్నదమ్ములం, అక్కా చెల్లెళ్ళం నిర్వర్తిద్దాం. మనల్ని అమ్మే రక్షిస్తుంది. దాని కోసం మన ప్రయత్నం మనం చేద్దాం. లేకపోతే మనకు మనమే దెబ్బతింటాం. ఈ విషయం భారతంలో చాలా స్పష్టంగా చెప్పారు.
“సారపుధర్మమున్ విమలసత్యము, పాపముచేత బొంకుచే
పారము పొందలేక చెడబారినదైన అవస్థ, దక్షు లే
వ్వార లుపేక్ష చేసి రది వారల చేటగుగాని ధర్మ వి
సారక మయ్యు సత్యశుభదాయకమయ్యును రైవ ముండెడిన్”
అమ్మ ఉన్నది. నీవు చేయాల్సిన పని నీవు చేయకపోతే నీవే దెబ్బతింటావు కాని ఆపని ఆగదు. అమ్మ చేయించుకుంటుంది. దేని వాడు దానికి వస్తాడు.
‘అందరికీ సుగతే’ అని అమ్మ అన్నదిలే అనుకుంటే ‘కాస్త ముందూ వెనుకా’ అనే పదాలు కూడా జోడించింది. నీవు వెనుకబడిపోయి పని చేసేవారు ముందుకు వెళతారు. నీ యిష్టం నీవు ముందుంటావో వెనుకబడతావో నీవే ఆలోచించుకోవాలి. మనం అంతా అన్నాతమ్ముళ్ళం – అక్కాచెల్లెళ్ళం. కలిసి పనిచేద్దాం కలిసే తరిద్దాం.