1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సంపాదకీయము.. (మాతృవేదం)

సంపాదకీయము.. (మాతృవేదం)

P S R Anjaneya Prasad
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 10
Month : July
Issue Number : 12
Year : 2011

మాతృవేదమా ? ఎప్పుడూ వినలేదే యీ వేదాన్ని గూర్చి. లోకంలో సుప్రసిద్ధమైన ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అని నాలుగు వేదాలను గూర్చే విన్నాం. దీన్ని ఎవరు వ్రాశారు. అందులో విషయం ఏమిటి? అనే జిజ్ఞాస కలగటం సహజం. వేదాలు అపౌరుషేయాలు అని కదా! లోకంలో ఉన్న నానుడి. మహర్షులు దర్శించారు వేదమంత్రాలను. ఇదీ అంతే – మాతృవేదము అంటే మాత చెప్పిన వేదమా? మాతను గూర్చి చెప్పిన వేదమా! మాతయే వేదమై వచ్చిందా? ఈ మూడూ వేరని అనుకోవడం లేదు. కర్త కర్మ క్రియ అన్నీ ఒకటే. వేరుగా కనిపిస్తుంటాయి. కర్తలేనిది కర్మ క్రియ లేవు.

ఆ కర్త ఎవరు ? రూపంలేని చైతన్యానికి స్త్రీ పుం భేదము లేకపోయినా తానే రెండుగా అయి సృష్టి కార్యానికి ఉపక్రమిస్తుంది. మన కాలికి ఎదురు దెబ్బ తగిలిందనుకోండి అమ్మా! అని అసంకల్పితంగా అంటాం. తెలుగులో కన్న తల్లిని అమ్మ అనటం అలవాటు. అలాగే ఇతర భాషలలో అంబా, మాతా ఇలా వాళ్ళవాళ్ళ భాషలలో పిలుస్తారు. మాతృశబ్దం సంస్కృత శబ్దం కనుక భారతీయ భాషలలో “మాత’ అనే మాట తల్లికి మూలంగా కనిపిస్తున్నది. అసంకల్పితంగా మనం అనే మాత, అమ్మ ఎవరిని గూర్చి అంటున్నాము? నీకు పాంచభౌతికమైన శరీరాన్నిచ్చిన అమ్మను గూర్చా ? మనకు శరీరాన్నిచ్చినవారు బుజ్జగించగలరు, ప్రేమించగలరు కాని ఆధ్యాత్మిక, ఆధిదైవిక తాపత్రయాలను పోగొట్టలేరుకదా ? ఎన్ని జన్మలెత్తామో ? ఏ జన్మలోని తల్లిని నీవు తలిచావు ? వీరెవరినీ కాదు ఈ తల్లులందరికి తల్లి, వాళ్ళకు ఈ మాతృత్వాన్ని ప్రసాదించిన మాత జగన్మాత. ఆమె విశ్వజనని. ఆమెను మనకు తెలియకుండానే తలచుకొంటున్నాం. మాతృకా (అక్షగ) రూపం కలది కనుక మాత. మంత్రాలన్నింటికీ తల్లి కనుక మాత. అ నుండి క్ష వరకు అంటే అన్ని అక్షరాలు (క్షరముకానివి) ఆమే కనుక అంఆ అమ్మ. ఈ అక్షర చక్రాల గుండా సుషుమ్నా మార్గం ద్వారా సహస్రారందాకా ప్రయాణించేది ముఖ్యప్రాణం. ‘యతో వా ఇమాని భూతాని జాయనే’ దేని నుండి ఈ సర్వభూత ప్రపంచము ఉద్భవించిందో ఆ ‘బ్రహ్మము’ను మాత అని పిలుస్తున్నాం. ‘మాతృదేవోభవ’ అని వేదం చెబుతున్నది. ఉపనయనాలలో మాతృభిక్ష మొదటిది. సన్యాసి కూడా తల్లికి నమస్కరించాలి.

ఇదుగో ఆ మాతను గూర్చి తెలిపేది నుండి వచ్చింది – దర్శించింది మాతృవేదం. మరి వేదం అంటే ఏమిటి? ‘వేదయతీతి వేదః’ తెలియచేసేది వేదం. ‘విదాజ్ఞానే’ అనే ధాతువునుండి ‘వేద’ శబ్దం వచ్చింది. ‘వేదం అంటే జ్ఞానం’ అని అర్థం. జ్ఞానమంటే భగవంతుని గూర్చి తెలుసుకోవటం. వేదాలలో ప్రధానంగా యజ్ఞయాగాలకు, కర్మకాండకు ప్రాధాన్యం. గీతలో బ్రహ్మ, ద్రవ్య, తపో, స్వాధ్యాయ, జ్ఞాన యజ్ఞాలని చెప్పబడ్డాయి. సకామ, నిష్కామ యజ్ఞాలున్నాయి. పూజ, ఉపసాన, పరోపకారము, నిస్వార్థసేవ వంటి అర్థాలిచ్చే ‘యజ్’ అనే ధాతువునుండి ‘యజ్ఞ’ శబ్దం వచ్చింది. యజ్ఞమంటే భగవత్ స్వరూపమే. 

జీవితాని కుపకరించేదే ధర్మం అని మహర్షులు చెప్పారు. సార్వత్రిక, సర్వాకాలికమైన నిత్యసత్య ధర్మాన్ని వేదం చెప్పింది. ఇతరులను బాధించటం హింస అని చెప్పింది వేదం. ఇతరుల ధనానికి ఆశించవద్దన్నది. నూరు విధాలుగా సంపాదించి వేయి విధాలుగా ధర్మకార్యాలను ఖర్చు చేయమన్నది వేదం. సరి సమానమైన అన్న పానాలు సరిసమానమైన బాధ్యతలతో కలసి మెలసి జీవించమని బోధించింది. తనకు తాను వేరొకరికి పెట్టకుండా భుజించువాడు పాపమునే భుజించువాడు అని చెప్పింది. ఆధ్యాత్మిక విషయాలతో పాటు అత్యంత లౌకికమైన విషయాలు కూడా వేదంలో చెప్పబడ్డాయి. ఋగ్వేదంలో దేవతా ప్రశంస, యజుర్వేదంలో ప్రధానంగా దేవతా ప్రీతికొరకు యజ్ఞాచరణ విధానం చెప్పబడింది. యజ్ఞం చేయటంవల్ల వానలు సకాలంలో కురిసి, లోకం సుభిక్షమై, సమస్త ప్రాణికోటికి సుఖశాంతిమయమైన జీవనం కలుగుతుంది. సామవేదంలో గాంధారాది స్వరములతో మంత్రోచ్ఛారణవల్ల వేదతత్వం అర్థమౌతుందని చెప్పబడింది. దీనివల్ల విద్వాంసులు గౌరవింపబడి, సంగీత నృత్య, వాద్యాది కళలతో పాటు ఆయా వృత్తులు కూడా ప్రసిద్ధి చెందాయి. అధర్వవేదంలో ఆముష్మికంతో పాటు ఐహిక విషయాలకు కూడా ప్రాధాన్య మివ్వబడ్డది. రోగనివారణ ఔషధ ప్రక్రియలు, రక్షాసూత్రధారణలు, ఉపనయనాది సంస్కారాలు, ప్రాయశ్చిత్తాలు వంటి వెన్నో తెలియచేయబడ్డాయి. గోసూక్త, స్క్రీసూక్తాలలో ఆయా విషయ సంబంధమైన ఎన్నో విషయాలు ప్రస్తావింప బడ్డాయి.

ఇక వేదాలలో చివర చెప్పిన బ్రాహ్మణములలో కర్మకాండ, ఉపాసనకాండ ఆరణ్యకములో చెప్పబడింది. వేదాలలో చివర చెప్పటంవల్ల వేదాంతమని చెపుతున్నారు. వీటినే ఉపనిషత్తులు అంటున్నారు. ఉపనిషత్ అంటే యతి సమీపంలో కూర్చొని తెలుసుకొను పరతత్వము అని అర్థం. ఆశ్రయించిన వారి అవిద్యను దూరం చేసేది. అంటే వ్యవధానరహితమైన సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చేది. వేదం వల్ల కలిగే ప్రయోజనాన్ని ఇచ్చేది వేదాంతం. వేదసారమనీ బ్రహ్మవిద్య అని కూడా అంటారు.

స్థూలంగా వేదం అంటే ఈ పైన పేర్కొన్న విషయమంతా కలిసింది. ఇక మాతృవేదాన్ని గూర్చి తెలుసుకొందాం, మాత అంటే తెలిసింది. వేదం అంటే కాస్తో కూస్తో తెలుసుకొన్నాం. ఇక మాతృవేదం ఎక్కడ ఉన్నది? ఒకటేనా? ఋక్, యజుస్, సామ, అధర్వణ వేదాల్లాగా నాలుగున్నాయా? నిజానికి ఒకవేదం లోంచే అంటే ఋగ్వేదంలో నుండే నాలుగు వేదాలు వచ్చాయి అని తెలుస్తున్నది. అలాగే మనకు కూడా అమ్మలో నుండి వచ్చిన శబ్దాలు మాతృశ్రీ మహోదధి అయింది. దానిలో నుండి మనకు నాలుగు వేదాలు వచ్చాయి. మాతృశ్రీ మహోదధి, అమ్మ అమ్మ వాక్యాలు, అమ్మతో సంభాషణలు, మాతృశ్రీ మహోదధిలో తరంగాలు. ఇవిగాక ఉపవేదాలు, పురాణాలు, కావ్యాలు లాగా మరికొన్ని కూడా ఉన్నాయి. ఒకటి శ్రీ కొండముది రామకృష్ణ వ్రాసిన ‘మాతృసంహిత’, వసుంధర వ్రాసిన ‘శ్రీవారిచరణ సన్నిధిలో, మన్నవ దత్తాత్రేయ శర్మ వ్రాసిన ‘అమృతవాహిని’, కుసుమాచక్రవర్తి వ్రాసిన ‘అమ్మ సచ్చరిత్ర’ భవాని కుమారి వ్రాసిన ‘అర్కపురి విశేషాలు’, ఎక్కిరాల భరద్వాజ వ్రాసిన ‘వింతలు విశేషాలు, కొండముది బాలగోపాలకృష్ణ మూర్తి వ్రాసిన “నా అనుభవాలు జ్ఞాపకాలు”, డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి వ్రాసిన “అమ్మ” సూచించిన కొత్తదారి, కొమరవోలు సుబ్బారావు వ్రాసిన ‘మాతృగీత, శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి వ్రాసిన ‘అంబికాసాహస్రి’, శ్రీ మిన్నికంటి గురునాథశర్మ వ్రాసిన ‘అమ్మ’, డాక్టర్ పన్నాల రాధాకృష్ణశర్మ వ్రాసిన ‘అశ్రుతర్పణం’ ‘డా॥ శ్రీ నారపరాజు శ్రీధరరావు’ వ్రాసిన ‘అమ్మ’ వంటివి కూడా ఉన్నాయి. ఇవికాక ఆంగ్ల, సంస్కృత, హిందీ, కన్నడ, తమిళ భాషలలో కొన్ని గ్రంథాలు వచ్చాయి.

ఒకనాటక రచయిత, దర్శకుడు, నటుడు అయినట్లుగా సర్వవ్యాపి అయిన అమ్మ ప్రత్యేకంగా మాతృ రూపం ధరించి వచ్చింది. అయినా తాను సర్వవ్యాపి యైన సృష్టికర్తను అనే మెలకువ నిరంతరం జాగృతమై ఉన్నది. అందుకే ‘రూపం పరిమితం శక్తి అనంతం’ అన్నది అమ్మ. ‘దేహాన్ని కలిగి దేహం కూడా తానైనవాడు విదేహి’ అని దేహం కూడా అమ్మకు భిన్నంకాదు అని తెలిపింది. ‘నేను కన్నాను, నేనే పెంచాను, నాలోనే కలుపుకున్నాను’ అని హైమను గూర్చి అన్న మాట. తాను సృష్టిస్థితిలయకారిణి ననీ’ అందరినీ తానే కన్నానని, మీరంతా నా అవయవాలనీ, నా ఒడి విడిచి లేరు అన్న అమ్మ మాటలు అమ్మ యొక్క తత్వాన్ని మనకు విశదం చేస్తున్నాయి.

నేటి పరిస్థితులకు మాతృత్వం అవసరం కనుక అమ్మగా రూపందాల్చింది. ప్రేమ, వాత్సల్యాలు సహజమైనాయి. విశ్వాన్ని ఆమె సృష్టించింది కనుక విశ్వజనని. విశ్వంగా తానే మారింది కనుక తనకు భిన్నంగా ఎవ్వరూ లేరని చెప్పగలిగింది. కష్టం సుఖం రెండూ నేనిచ్చినవే. ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో అది ఇస్తాను. అన్నప్రాశన చేసే రోజు పాయసం నాలుకకు రాస్తాను. జబ్బు చేసిన బిడ్డకు గరళం పోస్తే బ్రతుకుతాడనుకుంటే విషమే ఇస్తాను అన్నది. నిద్ర లేపి నీ వెవరు? అంటే “అమ్మను” అంటూ, ఎవరికి అంటే ‘నీకూ మీకూ అందరికీ అన్నిటికీ’ అన్నది. ‘రాగద్వేషాలు లేని అనసూయను’ అన్నది. నక్సలైటైనా, నరకాసురుడైనా ఇష్టమే – తల్లికి తప్పే కనిపించదు అన్నది.

వేదాలు అపౌరుషేయాలు అంటారు. అంటే పురుషులు పలికినవికావు. అంటే ఎవరు పలికినవి? వినిపించినవి అన్నారు. అసలు పురుషుండటే ఎవరు? ఉన్నపురుషుడు ఒకడే కదా ! పురియందువసించేవాడు. పురుషుడు. శరీరమనే పురంలో ఉన్నవాడు వాడు లేకపోతే – ఈ పంచభూతాత్మకమైన శరీరం మళ్ళీ వాటిలో కలిసిపోయేది కదా ! పురుషులుగా కనిపించేవారి అందరిలో ఉన్న పురుషుడు ఒకడే కదా! ఆ శబ్దాన్ని విన్నది ఎవరు? ఈ శరీరంలోని వాడేకదా ! అసలు ఆ శబ్దం ఎక్కడ నుండి వచ్చింది. ఆకాశం నుండి వాయువు, వాయువునుండి (శబ్దము) తేజస్సు, తేజస్సు నుండి జలము, జలము నుండి భూమి వచ్చాయి కదా అంటే పంచభూతాలు ఒక దానినుండే పుట్టాయికదా! అలాగే అమ్మ పంచామృతాలంటే ఒకే అమృతం. అయిదుగా పంచబడ్డది అని ఉదాహరణ ఇస్తూ, పాలు ఉన్నాయి. అందులోంచి పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి వచ్చినట్లుగా అన్నది. “శబ్దం వినా నైవ కదాపి తేజః – తేజో వినా నైవ కదాపి శబ్దః” అన్నారు. కనుక శబ్దం శాస్త్రం అంటే వేదం విన్నవాడు పురుషుడే. అందరినీ కన్న అమ్మ, అందరిలోను ఉన్న అమ్మ అంటే నేను నేనైన నేనుగా, అన్ని నేనులు నేనుగా అంటే తానుగా ఉన్న అమ్మలో నుండి వచ్చిన శబ్దాలు, వాక్యాలు వేదమంత్రాలు కాక ఏమిటి?

అమ్మ ఏమీ చదువుకోలేదు – చదువుల సారం ఆమే కదా? ఏం చదవాలి? అన్నీ తన అనుభవంలోంచే చెప్పింది. వేదం నిత్య సత్యధర్మాన్ని చెప్పింది కదా! ధర్మం అంటే జీవితాని కుపకరించేది కదా ! భర్తమీద కోపంతో అమ్మ మీద ప్రేమతో వందలమైళ్ళ దూరం నుండి ఒక యువతి పరుగెత్తుకొని వచ్చినా, భర్త దగ్గరకు పంపించటం నా ధర్మం అని పంపి, ప్రేమకంటే ధర్మం గొప్పదని ఋజువు చేసింది అమ్మ. ధర్మార్థ కామమోక్షాల కంటే కూడా అతీతమైన పంచమపురుషార్ధం ప్రేమ అనేవాళ్లున్నారు. ఉన్నాయి. అయినా ప్రేమమూర్తి అయిన అమ్మ ధర్మానికే ప్రాధాన్యం ఇచ్చింది. మాటే ప్రధానమనుకున్న వాళ్ళకు మాటే చాలు. వేదాలలో చెప్పే మహామంత్రాలన్నీ మాటలేగా – ఏ గ్రంథాలూ, ఏ శాస్త్రాలూ నిత్యజీవితం కంటే ఎక్కువ బోధించేదేమీ లేదు. విన్నవాడు విమర్శిస్తాడు, కన్నవాడు వివరిస్తాడు. విన్నది శాస్త్రం’, కన్నది అనుభవం.

వేదాలు యజ్ఞాన్ని గూర్చి చెప్పాయి. అమ్మ, చేసే ప్రతి పనీ ఆ భావనతో చేస్తే యజ్ఞమే నన్నది. అమ్మ మాతృయాగం నిర్వహించింది. శ్రీ మల్లాప్రగడ శ్రీ రంగారావుగారు, శ్రీ తంగిరాల కేశవశర్మగారు అమ్మ సన్నిధిలో గాయత్రీ యాగం చేశారు. వారు పూర్ణాహుతి చేయటానికి అమ్మను రమ్మని పిలిచారు. అమ్మ నేనేది వేసినా అన్నపూర్ణాలయం గాడిపోయిలోనే వేస్తాను. ఎవరే యాగం చేసినా నాది ‘జనయిత్రీ యాగమే’ అన్నది. ఆ యాగాన్ని గూర్చి వివరిస్తూ చేతనై నంతలో వీలయినంతలో ఎక్కువమందికి అన్నవస్త్రాలు పంచటమే నన్నది. ‘నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో’ అని బిడ్డలకు సందేశాన్ని ఇచ్చింది. అమ్మ అన్నయజ్ఞమే కాదు, హైమకోరిక ప్రకారం నామయజ్ఞం ప్రారంభించింది. అమ్మ అఖండ నామ యజ్ఞం జరగాలని ఏర్పాటు చేసింది. కలియుగంలో నామస్మరణం ధన్యోపాయం కదా ! అమ్మది విశ్వకుటుంబం. అందరిల్లు. లక్షమందికి ఒకే ప భోజనం పెట్టుతుంది. లక్షమంది పసిపిల్లలను లక్ష ఉయ్యాలల్లో ఊపుతుంటే చూడాలంటుంది. సృష్టి తానే కనుక పశు పక్ష్యాదులు కొండలు కోనలు అన్నీ తానే నంటుంది. అందరూ అన్నదమ్ముళ్లూ, అక్కచెల్లెళ్ళూ ఒకకుటుంబ సభ్యులుగా కలిసి మెలసి జీవించమంటుంది.

వేదాలు కర్మకాండకూ ప్రాధాన్యమిచ్చాయి. పూజ, ఉపాసన, పరోపకారము, తపస్సు, నిస్వార్ధసేవను గూర్చి ఎంతో చెప్పాయి. అమ్మ నిగ్రహం కొరకే విగ్రహారాధన అనీ, తనశక్తిని ఉపయోగించడమే ఆరాధన, ధారణయే ఆరాధన, ఆవేదనే ఆరాధన నిరంతరం ఆ ధ్యాసలో ఉండడమే ధ్యానం, ఏది చూచినా, ఎందులోనైనా ఒకే వస్తువును చూడటమే ఏకాగ్రత, తపనే తపస్సు, మనస్సే మంత్రం, మననం వల్లనే ఏదైనా మంత్రం ఔతుంది అని చెప్పింది. వేదంలో శ్రీసూక్త భూసూక్తాలు వంటివి చాలా ఉన్నాయి. 

అమ్మ ఏది చెప్పినా మూలానికి వెళ్ళి చెపుతుంది. అన్నింటికీ మూలమే అమ్మ కదా ! అమ్మ 5 ఏళ్ళప్పుడు. దేవుడి విగ్రహం వద్ద విగ్రహం అంటే దేవుడు కాదా అని అడిగి ఆ విగ్రహం దగ్గరకు వెళ్ళి కన్నుల కోసం చూచింది. కట్టిన గుడ్డలు విప్ప దీసింది. రాయి మిగిలింది. ఈ రాయి దేవుడా? ఈ అలంకారం దేవుడా? రాయి చెక్కినవాడు. దేవుడా ? వీటన్నింటినీ దేవుడు అనుకున్నవాడు దేవుడా? అని తర్కించి పూలు, నివేదనలు అసలీ పదార్థాలన్నీ ఇచ్చిన భూమి దేవుడా? అని భూదేవతే అన్నింటికీ మూలమని తేల్చి భూమినే అందరూ పూజించాలంటుంది. అలా అమ్మ అని తర్కించి పూలు, నివేదనలు అసలీ పదార్థాలన్నీ ఇచ్చిన భూమి దేవుడా? అని భూదేవతే అన్నింటికీ మూలమని తేల్చి భూమినే అందరూ పూజించాలంటుంది. అలా అమ్మ అన్నింటికీ మూలాలు అన్వేషించమని మనకు ఆచరణ పూర్వకంగా చూపిస్తుంది.

భరించలేనిది బాధ, సహింపలేనిది హింస, బానిసకు బాధ లెక్కువ, స్వతంత్రుడికి బాధ్యత లెక్కువ అని చెపుతూ, పరిమితమైన మమకారం మానవత్వం అపరిమితమైన మమకారం మాధవత్వం అని నిర్వచించింది. ఎదుటివారిలో దైవత్వాన్ని చూస్తే మనలో దైవత్వం కలుగుతుంది, సర్వత్రా పూజ్యభావాన్ని కలిగినవారే పూజ్యులు. ద్వంద్వాలు బ్రహ్మగా గుర్తించటమే బ్రహ్మానందం. వైకల్యం లేకపోవటమే కైవల్యం. నాచేత దైవం ఏదిచేయిస్తే అది చేస్తున్నాను అనుకుంటే మానవుడు తరిస్తాడు. మృత్యుంజయుడంటే ఎల్లకాలమూ ఉంటాడని కాదు. చావుని గురించి ఆలోచనలేనివాడూ, భయం లేనివాడు. ఏది వచ్చినా బాధ లేకుండా అనుభవించడమే సుగతి. సుగతి ఎవరికి లేకుండా ఉంది? అందరికీ సుగతే.

ఇలా అమ్మవి అనుభవ వేదాంత నిధులు మాతృశ్రీ సూక్తిసుధలు. అమ్మ మాటలు మంత్రాలు, మాననీయాలు. మనల్ని పూర్వ వేదాలలా శాసించవు. లలిత లలితంగా మృదుమధురంగా, అమ్మ ఒడిలో లాలిస్తున్నట్లుగా ఉండి తరింపచేస్తాయి. తరింపచేయటమే గాని మన పురుష ప్రయత్నంతో తరించటం కాదు. అదే మాతృవేదం.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!