1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సంపాదకీయము.. (మాతృశ్రీ ప్రచురణలు – ఒక ఆలోచన)

సంపాదకీయము.. (మాతృశ్రీ ప్రచురణలు – ఒక ఆలోచన)

Magazine : Viswajanani
Language :
Volume Number :
Month :
Issue Number :
Year :

శ్రీ విశ్వజననీ పరిషత్ ఈ మధ్య మాతృశ్రీ పబ్లికేషన్స్ (ఎగ్జిక్యూటీవోడీ) కార్యవర్గసభ్యుల సమావేశాన్ని 14.8.201ఏర్పాటు చేసింది. ఎన్నో విశేషమైన అభిప్రాయాలను పెద్దలు చర్చలో వివరించారు.

రాజు బావ పాటలు వ్రాయటంతో మొక్కగా మొదలైన మాతృశ్రీ సాహిత్యం 1962 నాటికి పుష్పాలతో పండ్లతో విరాజిల్లే వృక్షంగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి. 1962 సంక్రాంతి ఉత్సవ సందర్భంగా డాక్టర్ ప్రసాదరాయ కులపతి ఇప్పటి కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి ‘అంబికాసాహస్రి’ అని సంస్కృతంలో 300 శోక్లాలు అమరీ త్రిశతిపేరుతోనూ, తెలుగులో 700 పద్యాలు ఆంధ్రీసప్తశతి అనే పేరుతోనూ వ్రాసి అచ్చు చేయించి తెచ్చారు అమ్మ చేతుల మీదుగా ఆవిష్కరించటానికి. అదే సమయంలో ఉభయభాషాప్రవీణ వేదాంతపారీణ, కవితామహేశ్వర, శృంగేరీ విరూపాక్ష పీఠ కళ్యాణానందభారతీమాంతాచార్యస్వామి శిష్యులు, గురుభాగవతాది మహాగ్రంథకర్త, శ్రీ మిన్నికంటి గురునాథశర్మగారు ‘అమ్మ’ అనే పేరుతో అమ్మ జీవితంలో జరిగిన కొన్ని ఘట్టాలను కావ్యంగా వ్రాసి దానిని కూడా అచ్చు చేయించి తెచ్చారు. అంతేకాక శ్రీ వాడరేవు సుబ్బరావు గారు (శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావుగారి మేనత్త కుమారుడు) ‘మాతృశ్రీ అనసూయా దేవి’ అనే పేరుతో వివిధ రచయితల, కవుల రచనలను సంకలనం చేసి తెచ్చారు. ఈ మూడు గ్రంథాలు ఆనాడు అమ్మ దివ్యహస్తాల చేత ఆవిష్కరింపబడ్డాయి.

ఆ తర్వాత అమ్మ జన్మదినోత్సవ సందర్భంగా ఒక ప్రత్యేక సంచిక తీసుకొని రావాలని కొండముది రామకృష్ణ, గోపాలకృష్ణ ప్రయత్నించటం జరిగింది. బ్రహ్మాండం సుబ్బారావు నా సహకారంతో (పి.యస్.ఆర్.) రచనలు సేకరించి ఇచ్చాడు. ఆనాడు ‘మాతృశ్రీ’ పేరుతో అమ్మకు సమర్పింపబడి సంచిక, తరువాత నాలుగు సంవత్సరాలు ఆవిధంగా అమ్మ జన్మ దినోత్సవాలకు ప్రత్యేక సంచికలుగా సమర్పించబడ్డాయి. 1966 జూన్ నుండి మాతృశ్రీ ప్రతి నెల ఒక పత్రిక తీసుకురావాలని నిర్ణయించి అమ్మ అనుగ్రహంతో కొండముది సోదరుల సహాయంతో శ్రీ అధరాపురపు శేషగిరిరావుగారు సంపాదకులుగా తెలుగులోనూ ఆంగ్లభాషలోనూ రెండు పత్రికలు తెచ్చారు. ఆంగ్ల మాసపత్రిక కొన్ని సంవత్సరాలు నడిచి ఆగిపోయింది. తెలుగు పత్రిక దాదాపు 25 సంవత్సరాలు నడిచి 1992 లో ఆగిపోవటం జరిగింది. తిరిగి 2000 ఆగష్టు నుండి ‘విశ్వజనని’ పేరుతో శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ సంపాదకులుగా, డా॥ పొత్తూరి వెంకటేశ్వరరావుగారు గౌరవ సంపాదకులుగా నడుపబడు తున్నది. మాతృశ్రీకి, విశ్వజననికి మేనేజింగ్ ఎడిటర్ గా 

గోపాలన్నయ్యేదే బాధ్యత.

అది అలా ఉండగా 1962లో మొదలైన అమ్మ సాహిత్య ప్రచురణలు తామరతంపరగా అమ్మ అమ్మవాక్యాలు, అమ్మతో సంభాషణలు మాతృశ్రీ మహోదధిలో తరంగాలు వంటివి వెలువడ్డాయి. 1966లో మాతృశ్రీ పబ్లికేషన్స్ పేర ఏర్పడిన ప్రచురణ సంస్థ మాతృశ్రీ ప్రింటర్స్ పేర ఒక ప్రెస్ ను కూడా ఏర్పాటు చేసుకున్నది. ఆ ప్రెస్లోనే అమ్మ సాహిత్యమంతా మాసపత్రికలతో సహా ఆ అచ్చవుతుండేవి. కొండముది రామకృష్ణ, గోపాలన్నయ్య నిర్వహిస్తుండేవారు. 1971లో శ్రీ విశ్వజననీ పరిషత్ రిజిష్టరు కాబడిన సందర్భంగా, సాంకేతిక కారణాలు దృష్ట్యా మాతృశ్రీ పబ్లికేషన్స్ – మాతృశ్రీ పబ్లికేషన్ ట్రస్టు రెండుగా నిర్వహించటం జరిగింది. 1986లో అన్ని విభాగాలు విశ్వజననీపరిషత్లో కలసిపోయే ఏర్పాటు జరిగినప్పుడు అందులో భాగంగా మళ్ళీ మాతృశ్రీ పబ్లికేషన్స్ డివిజన్ పేరుతో ప్రచురణ విభాగం ఏర్పాటైంది.

సరే ఈ ఉపోద్ఘాతం పూర్వచరిత్ర తెలియనివారి కొరకు. ఇక ఆగష్టులో జరిగిన చర్చా విశేషాలు ఆలోచిద్దాం. సభను ప్రారంభిస్తూ అధ్యక్షులు శ్రీ దినకర్ ఇప్పటివరకు ప్రచురింపబడిన పుస్తకాలు ప్రస్తుతం మనకు దొరుకుతున్నవి, మన వద్ద నిలువ ఉన్న వాటిని గురించి వివరించి పుస్తకాలు ఉన్న వాటిని మార్కెటింగ్ చేసే వ్యవస్థ మన వద్ద లేకపోవటంతో ఉన్న గ్రంథాలు కూడా ఉపయోగపడని స్థితికి వస్తున్నాయని చెప్పారు. వాటికి తగు వినిమయపు ఏర్పాట్లు చూడాలన్నారు. ప్రతి గ్రంథాలయంలోనూ అమ్మ సాహిత్యం ఉండేటట్లు చూడాలన్నారు.

విశ్వజనని మాసపత్రికకు సంబంధించి రెండు సంవత్సరాల క్రితం జరిగిన సమావేశంలో వచ్చిన సూచనలు కొన్ని ఆచరణలో పెట్టటం జరిగిందన్నారు. అలాగే ‘విశ్వజనని’ ప్రచురణకు స్పాన్సర్లను ఆహ్వానించాలన్నారు ? ఆధ్యాత్మిక సంస్థలకు, ఆధ్యాత్మిక వేత్తలకు, నిర్వహణా సామర్థ్యం గల ప్రతిభావంతులకు కాంప్లిమెంటరీ కాపీలు ఇప్పుడు పంపిస్తున్నామనీ ఇంకా ఎవరైనా సూచన చేస్తే పంపిస్తామని చెప్పారు. పత్రిక ధర కాలానుగుణ్యంగా నిర్ణయించాలని చెప్పారు. సంపాదకవర్గం ఇప్పుడున్నది సరిపోతే సరే లేకపోతే పెంచాలన్నారు. ఈ విధంగా వారిచ్చిన సూచనలను అందుకొని కొందరు అమూల్యమైన సూచనలు చేశారు.

సుప్రసిద్ధ జర్నలిస్టు, ఏన్నో దినపత్రికలకు సమర్థులైన సంపాదకులుగా చేసినవారు, ప్రెస్ అకాడమీ పూర్వాధ్యక్షులు శ్రీశ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావుగారు ప్రసంగిస్తూ అమ్మ జీవిత విశేషాలు, వ్యక్తుల అనుభవాలు విడిగా ఉండాలి. అమ్మ చరిత్ర అమ్మ ఆవిర్భవించిన 1923 నుండి 1954 వరకు ఒక భాగం, రెండవ భాగం 1954 నుండి 1985 వరకు సేకరించాలి. మూడవ భాగం 1985 తర్వాత సంస్థను గూర్చిన విశేషాలు ఇలా విభాగించుకొని ఆలోచించా అన్నారు.

అమ్మ చాలమంది యతీశ్వరులు మౌనస్వామి, వాసుదాస స్వామి, కళ్యాణనంద భారతీస్వామి వంటి ఎందరితోనో సంభాషణలు చేసింది. వాటిని విడిగా ప్రచురించాలి. అమ్మ చెప్పినవి జీవిత విధానానికి సంబంధించినవి. సనాతన భారతీయ తత్త్వానికి అతీతంగా ఏమన్నా చెప్పిందా ? ఆలోచించాలి. అమ్మ చెప్పిన మాటలలోని సత్యాన్ని నిరూపణ చేయాలి. తత్వచింతన సదస్సులలో వ్యక్తిగతమైన అనుభవాల కన్న తత్వచింతన ఎంతవరకు జరిగింది ? ఆలోచించాలి. అమ్మ అభిప్రాయాలు మార్చుకుంటు వచ్చిందా ? అనేది శాస్త్రీయంగా విశ్లేషించాలి. సనాతన, బౌద్ధ, ఇస్లామిక్, క్రిష్టియన్ వంటి సిద్ధాంతాలకు తీసిపోని ఎన్నో ఎంతో అమూల్యమైన సిద్ధాంత సంపదతో సర్వసిద్ధాంత సార్వభౌమగా అమ్మ మనకు అందించింది. అదంతా బయటకు రావాలి. అనుభవాలు వ్యక్తిగతాలు. వాటికి సార్వత్రికమైన ప్రామాణికత ఉండదు. వాటిని నమ్మే వాళ్ళను నమ్మ నీయండి. కాని శాశ్వతము, ప్రామాణికము అయినవే సర్వకాలికంగా నిలబడతాయి. వాటికోసం నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ దృష్టితో ముందుకు నడుద్దామని ఎంతో ఉత్తేజితమైన ఆలోచనలు సోదరుల ముందుంచారు. అంతేకాక మాతృశ్రీ జీవితమహోదధిలోని విషయాలు సామాన్యులకు తెలిసే రీతిలో అధోజ్ఞాపికలు (Footnotes) ఉండాలి అన్నారు.

ఇక దర్శనం పత్రిక సంపాదకులు శ్రీ మరు మామూల వెంకట రమణశర్మగారు మాట్లాడుతూ. మాసపత్రికలో క్రొత్తవారిచేత రచనలు చేయించాలనీ, యువకులను ఆకర్షించే రీతిలో ఉండాలనీ, కళాశాలలో, పాఠశాలలో విద్యార్థులకు అమ్మను గూర్చి తెలియచేసే కార్యక్రమాలు నిర్వహించాలనీ చెప్పారు. సంపాదకుడు ఒక్కడి మీదే బాధ్యత పెడితే చాలదనీ ఇద్దరు ముగ్గురైనా మూడు నెలల ముందు నుండే పత్రిక ఎలా ఉండాలో ఆలోచించే వారు కావాలనీ చెప్పారు.

మన కళాశాల పూర్వవిద్యార్థి డాక్టర్ శ్రీ జయంతి చక్రవర్తి గ్రంధాలు ప్రతి బుక్ లోనూ కనిపించాలనీ ధర చాలా తక్కువగా ఉండాలనీ, అన్ని పుణ్యక్షేత్రాలలోనూ బుక్ ఎగ్జిబిషన్ లోనూ మన గ్రంధాలు, మాసపత్రిక, త్రైమాస పత్రికలు కనిపించటానికి తగు ఏర్పాటు చేయాలన్నారు. పుస్తకాలు ప్రచురించి ఇస్తే వాటి మార్కెటింగ్ వ్యవహారం తాను చూస్తానన్నారు.

జిల్లాలవారీగా ఎక్కువ పత్రికలు ఎక్కువమందికి అందేటట్లుగా చర్యలు చేపట్టాలి. సాధ్యమైనంతవరకు ఇతర నెల పత్రికలలా కిళ్ళీకొట్లలో సైతం మన పత్రికలు అందుబాటులో ఉండేటట్లు చూడాలి. వ్యాపార ప్రకటనలు సంపాదించి పత్రికను ఎక్కువ మల్టీ కలర్ బొమ్మలతో ఆకర్షణీయంగా చేయాలి. పత్రికలకు ప్రతినెల స్పాన్సర్స్ ఏర్పాటు అయ్లేట్లు చూడాలి. పుస్తక ప్రదర్శనశాలలో ఇతర సామాజిక కార్యక్రమాలు జరిగిన చోట మన పత్రికల గ్రంథాలు ప్రదర్శింపబడాలి. జనరల్ మార్కెట్లో మన పత్రిక ఎక్కువమందికి అందే విధంగా చూడాలి. దానికి చర్యలు చేపట్టాలి. వివిధ మార్గాలకు చెందిన పెద్దలను, వారి రచనలను కూడా మనపత్రికలో ఉంటే ఎక్కువ మార్గాల వారిని కూడా ఆకర్షించవచ్చు.

దర్శనం పత్రికలో సంపాదకవర్గంలో పనిచేస్తున్న శ్రీ ప్రసాదవర్మ గారు ప్రసంగిస్తూ విశ్వజనని పత్రిక టెక్నికల్ డిజైన్ చేయాలి. ఒక్క అమ్మను గూర్చే గాక మిగిలిన మహాపురుషులను గూర్చి కూడా ఉంటే బాగుంటుంది. దేవతలలో చాలా మంది మాతృమూర్తులున్నారు. వారిని ఆరాధించిన వారున్నారు. ప్రాచీన ఋషులు, మహనీయులు అమ్మను గూర్చి ఏమేం చెప్పారో నలుగురికీ తెలియచేయాలి. క్రొత్త రచయితలను గూర్చి వారి వ్యాసం ముందు పరిచయం చేస్తే బాగుంటుంది. ప్రత్యేక సంచిక తెచ్చే ముందు రెండు నెలల ముందే రచనలకు అడ్వరటైజ్ చేస్తే పత్రికకు కొత్త రచనలు వచ్చే అవకాశం ఉంది. మన రచనలలో అమ్మ తత్వం ఎంతవరకు చెపుతున్నామో సమీక్షించుకోవాలి. పత్రిక ఎంతమందికి పంపగలుగుతున్నాం? ఎంతమంది కొత్తవారికి అందుతుంది? దానికి ఒక టార్గెట్ పెట్టుకొని కృషి చేయాలి. పత్రిక గెటప్ ఇంకా సుందరంగా చేయాలి. పత్రికకు జీవిత సభ్యులే కాక (ఎక్కువైతే నష్టం). సాధ్యమైనంత వరకు 5 సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు, 15 సంవత్సరాలకు ప్రత్యేక సభ్యత్వం రుసుము ఏర్పాటు చేయటం బాగుంటుంది అని తమ అనుభవాన్ని చెప్పారు.

అయితే సమావేశంలో ఈ వచ్చిన ఆలోచనలన్నిటినీ సమీక్షించి ఒక నిర్ణయం తీసుకోవటానికి ఒక ప్రత్యేక ఉపసంఘాన్ని నియమించారు (Sub committee). ఆ సంఘం త్వరలో కూర్చొని ఆలోచన చేసి అమలు పరచగలిగిన ఆలోచనలు చేసి నిర్ణయించాలి అందులో సభ్యులుగా శ్రీ బి. రవీంద్రరావు (పాట్రన్), శ్రీ యం.దినకర్ (అధ్యక్షులు), కె.బి.జి. కృష్ణమూర్తి (మేనేజింగ్ ఎడిటర్), పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ (సంపాదకుడు -కన్వీనర్), శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి (సంపాదకవర్గ సభ్యుడు), శ్రీ ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం (సంపాదక వర్గ సభ్యుడు), డా.బి.యల్.సుగుణ, శ్రీ ఆర్.వి.శేషగిరిరావు, శ్రీ బులుసు సత్యనారాయణశాస్త్రి, శ్రీ వి.ధర్మసూరి (ఉపాధ్యక్షుడు) ఉన్నారు.

ఆ ఉపసంఘం నవంబరు 14 న సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. 1)విశ్వజనని చందా సంవత్సరానికి రూ.200/-లు గాను, 3 సంవత్సరాలకు రూ.500/- లు గానూ, 6 సంవత్సరాలకు రూ. 1000/-లు గానూ 12 సంవత్సరాలకు రూ.2000/- లు గానూ, పెంచాలని తీర్మానించింది. పత్రిక స్పాన్సర్ ఎవరైనా వస్తే నెలకు 20,000 రూపాయలు ఇచ్చిన వారి పేర ఆనెల పత్రిక వెలువడుతుంది. 2) ప్రసిద్ధులైన రచయితల ఇంటర్వూలు కూడా ఉండటం మంచిదని భావించింది. 3)బుక్ ఫెస్టివల్లో మన స్టాల్ పెట్టాలని 4) అమ్మకు సంబంధించిన వ్యాసాలే కాక ఒక ఆధ్యాత్మిక వ్యాసం వేయవచ్చునని 5) సంపాదకవర్గంలో అలంకార ప్రాయులుంటే తొలగించాలని 6) క్రొత్త రచయితలను గూర్చి పరిచయ వాక్యాలు వ్రాయాలని 7) అమ్మపై వచ్చిన గ్రంథసమీక్షలు వేయాలని 8) అనుభవాలతో పాటు అమ్మ తత్త్వచింతన వ్యాసాలకు ప్రాధాన్యం ఇవ్వాలనీ, విశాల అంతర్జాతీయ దృక్పధం గల రచనలు రావాలనీ 9) ఎక్కడ సేవాకార్యక్రమాలు మన అనుబంధ సంస్థలు చేసినవి కూడా పత్రికలో రావాలని 10) చందాలు వసూలు చేయటానికి ఇద్దరు కనీసం తిరగాలనీ 11) గ్రంథాలు సబ్సిడీ రేట్లపై ఇతరులకు అందేటట్లు చూడాలనీ 12) అమ్మవాక్యాలు వివరించేటప్పుడు పూర్వాపరాలు వ్రాస్తే బాగుంటుందనీ 13) పాత వారు అమ్మతో ఉన్న ఫోటోలు పంపిస్తే వారిని పరిచయం చేస్తూ ప్రచురిస్తే బాగుంటుందనీ 14) ఈ సంవత్సరం విజయవాడలో ఎగ్జిబిషన్ నిర్వహణకు శ్రీ రామబ్రహ్మంగారిని ఇన్ఛార్జిగా నియమించడమైనదని నిర్ణయించారు.

ఇప్పటి దాకా అమ్మ సాహిత్యాన్ని శ్రీ విశ్వజననీ పరిషత్ కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి బయటకు వచ్చినవి 140 గ్రంధాల దాకా ఉన్నాయి. ఇవి కాక ప్రత్యేక సంచికలుగా వెలువడ్డవి 20 దాకా ఉన్నాయి. ఆడియోలు, వీడియోలు, సినిమాలు సిడిలలో, డివిడీలలో భద్రపరచ బడ్డవి కొన్ని ఉన్నాయి. వాటి వివరాలు మరొకసారి ప్రచురించటం జరుగుతుంది. ఈ రకంగా ఒక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని ముందడగు వేయడం హర్షించదగ్గ

విషయం.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!