వేసము చేసి పంపితివి వేదికమీదకు పొడువేళ నా
మనము జారిపోయి విషమించి పరిస్థితి, ప్రేక్షకుల్ పరీ
హాసము చేయునుండిరి, రహస్యముగా తెరవేయుమంచునీ
కోసము చూచితిన్ కవరు కొంటి విదెక్కడి దర్శకత్వమో!
– ‘కరుణశ్రీ’
అమ్మా! నాటక రంగంమీదకు పంపించావు. నీవు ఆడించినట్లల్లా ఆడుతూ మా తెలివితేటలతో మే మాడుతున్నామని భావించి పొంగిపోతున్నాము – క్రుంగిపోతున్నాము. ఈ గెలుపు ఓటముల మధ్య నలిగిపోతున్నాము. ఆ రెండూ నే నిచ్చినవేనని భావించమన్నావు. ఆ సంయమనమూ, సమభావన నీ వివ్వవల్సిందేగా!
“మాతృశ్రీ క్రీడా సాంస్కృతిక సంఘం” పేరుతో జిల్లెళ్ళమూడిలో ఒక సంస్థను ఏర్పాటు చేసుకొన్నాం. దానికి శ్రీ పి.వి. అప్పారావుగారు అధ్యక్షుడు, డాక్టర్ టి.యస్.శాస్త్రి కార్యదర్శిగా ఉండేవారు, మా ఆటలు పాటలు చూడటం నీ కొక సరదా ! ఆనందం. నీవు వచ్చి చూస్తున్నావంటే మమ్మల్నిపట్ట పగ్గాలుండవు. ఎంత ఉత్సాహమో ! మా అంతటి వీరులు లేరనుకుంటుంటాం. నీవు వీరమాతవు కదా !
ఒకసారి అమ్మ, శేషు, శాస్త్రి, భవాని వైకుంఠపాళి ఆట ఆడుతున్నారు. అమ్మ మొదటి పందెం వెయ్యగానే శాస్త్రి అమ్మపావు కదిలించబోతున్నాడు. భవాని అన్నది ‘అమ్మ’ దేవుడిపందెం వెయ్యాలి అని. అమ్మ వెంటనే దేవుడే పందెం వేస్తుంటే – దేవుడిపందెం ఏముందీ? అన్నది.
అలాగే ఇంకొకసారి కేరంబోర్డు ఆడుతున్నారు. కాసేపాడి అమ్మ మీరాడుకోండిరా అని తాను ప్రక్కకు తిరిగి కూర్చున్నది. నీవులేని ఆటలో మజా ఏమున్నదమ్మా! అన్నారు మిగతావారు. నా ఆట నా కెట్లాగూ ఉన్నదిరా! మీ ఆట మీరాడండి అన్నది. నిజమే అమ్మ ఆడిస్తుంటుంది మన ఆదుతుంటాం. అయితే మనం అదుతూ అమ్మ ఆదిస్తున్నదని మరచిపోతుంటాం.
ఒకసారి శ్రీ లక్కరాజు కృష్ణమూర్తిగారింటికి అమ్మ కరెవరం వెళ్ళింది. అమ్మ వెంట శ్రీపాద గోపాలకృష్ణమూర్తి
గారు, వీరమాచనేని ప్రసాదరావుగారు మరికొందరు సోదరీసోదరులు కూడా వెళ్ళారు. అమ్మ కృష్ణమూర్తిగారి స్పోర్ట్స్ మెన్ షిప్ ను గూర్చి చెపుతుంటే శ్రీపాదవారు మీ ఆటలు యీ ఆధ్యాత్మికతకు ఎట్లా లంగరు కుదిరింది? అన్నారు కృష్ణమూర్తిగారితో, అమ్మ వెంటనే ఆటలు ఆధ్యాత్మికం కాకపోతే కదా! అన్నది. మరొకసారి కృష్ణమూర్తిగారితో ఆటలలోని గెలుపు ఓటములను చర్చిస్తూ “ఓడు” పోగొట్టటానికే యీ ఆటలు అన్నది. అంటే ఓటమి విజయానికి సోపానమన్నమాట. అంతేకాదు మనిషి శారీరకంగానూ, మానసికంగానూ ఓడుపోయి గట్టిపడతా డన్నమాట.
1968 జనవరి ఒకటవతారీకున పిల్లలను హుషారు. చేయాలని అమ్మ రవితో నేనొస్తున్నాను క్రికెట్ ఆటకు సిద్ధం కమ్మని చెప్పింది. మేమంతా క్రికెట్ ఆట ఆడుతున్నాం. అమ్మ ప్రక్కనే కుర్చీలో కూర్చొని చూస్తున్నది. సుబ్బారావు రవివాళ్ళతో పాటు నాలాంటి వాళ్ళం కూడా కొంతమందిమి. ఉన్నాం. ఆకారపుష్టి నైవేద్యనష్టి లాగా డక్కౌట్ అయ్యేవాళ్ళం. ఆట అయిపోతుండగానే బిడ్డలు అది అలసిపోయారని అందరికీ టిఫిన్ చేయించి పెట్టించింది. ఆ ప్రేమ అట్లాంటిది. ఆటలో నిష్ఠ, నైపుణ్యము, ఏకాగ్రత ఎన్ని నేర్చుకోవాలో. అవి ఆటకే కాదు ఆధ్యాత్మికంగా ఎదగటానికి కూడా బాగా తోడ్పడతాయి. అసలు ఏకళ అయినా భగవంతుని చేరటానికే కదా !
ఒకసారి నాటకం రిహార్సల్స్ చేస్తున్నారు. బ్రహ్మండం సుబ్బారావు దర్శకుడు. రావూరి నర్శింహమూర్తిగారు, రుక్మిణక్కయ్య తమ్ముడు శంకరరావు, తంగిరాల శ్రీను, రవి, వల్లూరి సత్యం వంటి వారెందరో దాంట్లో పాల్గొంటున్నారు. నాన్నగారు కూడా వచ్చి చూస్తుండేవారు. చెప్పొచ్చేదేమిటంటే నాన్నగారు చిన్నప్పుడు కోన ప్రభాకరరావుగారితో కలసి పౌరాణిక నాటకాలాడుతుండేవారు. హార్మణీ పెట్టే జిల్లెళ్ళమూడి తెచ్చి పిల్లలు నాటకాలు ప్రాక్టీసు చేస్తుంటే నాన్నగారు కూడా పద్యాలు రాగయుక్తంగా పాడేవారు. అలాగే కొత్తగా రవివాళ్ళు టేబుల్ టెన్నిస్ తెస్తే పిల్లలతో కలసి నాన్నగారు కూడా టేబుల్ టెన్నిస్ ఆడేవారు. ఆటలలో పాటలలో నాన్నగారు మేటిగానే ఉండేవారు.
నాన్నగారు దేవాలయంలో చేరింతర్వాత లక్కరాజు కృష్ణమూర్తిగారితో చెప్పి అమ్మ జిల్లెళ్ళమూడిలో బాట్మెంటెన్, వాలీబాల్ కాంపిటేషన్సు ఏర్పాటు చేయించింది. నాన్నగారి పేర జరిగిన ఆ పోటీలలో రాష్ట్రం నలుమూలల నుండి ప్రసిద్ధులైన ఆటగాళ్ళు వచ్చి అమ్మ చేతుల మీదుగా బహుమతులు స్వీకరించారు.
ఈ మధ్య కూడా రాష్ట్రస్థాయి చెస్ కాంపీటేషన్స్ శ్రీ లక్కరాజు సత్యనారాయణ నేతృత్వంలో పెట్టి నాన్నగారి పేర బహుమతులివ్వటం జరిగింది. ప్రతి సంవత్సరం కాలేజీ పిల్లలకు పోటీలు పెట్టి బ్రహ్మాండం రవి నాన్నగారి పేర బహుమతులు పంచే ఏర్పాటు చేస్తున్నాడు. అలాగే బ్రహ్మాండం సుబ్బారావు పేర కూడా కొన్ని ఆటల పోటీలు వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేసి ఆగష్టు 15న బహుమతులు పంచుతున్నారు.
మాతృశ్రీ క్రీడా సాంస్కృతిక సంఘం పక్షాన డాక్టర్ ప్రసాదరాయకులపతిగారి ఆధ్వర్యంలో జిల్లెళ్ళమూడిలో ‘అమ్మ”ను సరస్వతీదేవిగా దర్శిస్తూ సరస్వతీ సామ్రాజ్యం నిర్వహించటం జరిగింది. అది ఆరోజుల్లో అందరి హృదయాలనూ ఉర్రూత లూగించింది. అందులో డాక్టర్ ప్రసాదరాయకులపతి (నేడు శ్రీ సిద్ధేశ్వరానందభారతీ స్వామి – కుర్తాళపీఠాధిపతి) తో పాటు మహామహోపాధ్యాయ జమ్ములమడక మాధవరామశర్మ, కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి, మధ్వశ్రీ పళ్ళె పూర్ణ ప్రజ్ఞాచార్యులు, డాక్టర్ పన్నాల రాధాకృష్ణశర్మ, డాక్టరు మారుటూరి పాండురంగా రావు, శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్, శ్రీమాన్ కోగంటి సీతారామచార్యులు, శ్రీ ధనకుధరం వెంకటాచార్యులు పాల్గొన్నారు.
సాంస్కృతికసంఘం తరఫున చాల నాటకాలు, ఆటల పోటీలతో పాటు యీలాటి సాహిత్య కార్యక్రమాలు కూడా ఎన్నో అమ్మ సమక్షంలో జరిగాయి. అపుడాడిన నాటక ప్రదర్శనలలో ఛైర్మన్, అనంతం, భజంత్రీలు వంటి కొన్ని మాత్రమే – ఒకసారి నాటకంలో విశిష్ట నటనకు బహుమతులిచ్చే పరీక్షకునిగా న్యాయమూర్తిగా శ్రీ మన్నవ రాఘవరావు మామయ్య ఉండటం ఆ నాటకంలో రవికి ప్రథమబహుమతి రావటం జరిగింది. ఆ నాటకాలలో నటించిన వారిలో చాలామంది తెరమరుగైనారు. కొందరు రకరకాల రంగాలలో సుప్రసిద్ధులైనారు. ఏమైనా అమ్మా!
“ననుమెడ బట్టి గెంటితివి నాటకరంగముపైకి చేతకా
దని బతిమాలుకొన్న వినవైతివి – కన్నులు విప్పి సభ్యులన్
కనుగొనినంత కాళ్ళు వడకం దొడగెన్ – సరికొత్త నర్తనం
బసుకొని చప్పటుల్ చరిచి రందరు చాల్ తెరదింపు మమ్మరో!
ఆడుచు పొడుచున్ తగవులాడుచు నవ్వుచు నేడ్చుచున్ జతల్
వీడుచు పోయినారు తెరవెన్కకు పోయినవాడు వెండియున్
రాడొకడేని చిత్రమగు నాటకమియ్యది దీని ‘నాంది’ నీ
వాడ రచించితో భరతవాక్యము సైతము వ్రాయు మమ్మరో!”
“కరుణశ్రీ”
అని కరుణశ్రీ గారన్నట్లు ఆడుతూ పాడుతూ. హాయిగా గడిపేవారం. ఇవన్నీ తలచుకొంటుంటే మళ్ళీ 1968 -75 మధ్యలో మా చిన్ననాటి చిలిపి చేష్టలు అమ్మ అనుగ్రహము జ్ఞాపకానికి వస్తున్నాయి.
మాతృశ్రీ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ లీగ్ పునరుద్ధరించి ప్రతి యేటా కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది. అమ్మ ఆనందించి, ఆశీర్వదించే విషయమే ఇది –