1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సంపాదకీయము..(మాతృ గీతామృతం)

సంపాదకీయము..(మాతృ గీతామృతం)

P S R Anjaneya Prasad
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 10
Month : February
Issue Number : 7
Year : 2011

“బ్రహ్మ వ్రాసిన నుదుటి వ్రాత, నీ చేతిలోని గీత ఎవరూ మార్చలేరు” అని లోకంలో ఒకనానుడి ఉన్నది. అంతే కాదు మన సాహిత్యంలో ఎన్నో గీతలున్నాయి. భగవద్గీత, ఉద్ధవగీత, శ్రుతిగీత, భ్రమరగీత వంటివి ఎన్నో. రాజు బావ కూడా గీతాలు వ్రాశాడు. డాక్టర్ కొమరవోలు సుబ్బారావుగారు భగవద్గీత అమ్మమాటలతో అన్వయం చేస్తూ మాతృగీతనే వ్రాశారు. గీతలు ఎన్ని ఉన్నా సారాంశం మాత్రం ఒకటే. అలా కాకపోతే అవి నీటిమీద గీతలవుతాయి. అమ్మ “గీతలో లేనిది నేను క్రొత్తగా చెపుతున్నది ఏమీలేదు” అన్నది.

అమ్మ తన గీత చెప్పిందా ? మన గీత చెప్పిందా? అంటే రెండూ వేరు కాదని చెప్పింది. ఏ గీత విన్నా అది అమృతమే. భగవద్గీతను స్తుతిస్తూ

 ‘సర్వశాస్త్రమయీ గీతా’ అన్నారు అంతేకాదు.

పాల్గోవత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్” 

అన్నారు. సర్వ ఉపనిషత్తులు గోవులయితే పాలు పితికేవాడు శ్రీకృష్ణుడు. దూడ అర్జునుడు, బుద్ధి కలవాళ్ళంతా ఆ పాలు త్రాగేవారు. పాలు ఏమిటయ్యా అంటే మహత్తరమైన గీతామృతము. మనందరం మాతృగీతామృతం త్రాగిన వాళ్ళమేకదా.

అమ్మకు కృష్ణుడికి చాల పోలికలు కనిపిస్తున్నాయి. కృష్ణుడిలాగే అమ్మ పుట్టిందొక చోట పెరిగిందొకచోట. కృష్ణుడు దుష్ట సంహారం చేస్తే అమ్మ దుష్టత్వాన్ని పారద్రోలింది ప్రేమతో. అమ్మ దగ్గర శిక్షణే గాని శిక్ష లేదు. ఆ అవతారాలు చేసింది తప్పా ? అంటే ‘అప్పటికది అవసరం, ఇప్పటికిది అవసరం’ అన్నది. అప్పుడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునికి గీతబోధ చేశాడు. గీతలోనే చెప్పిన ‘ఇదం శరీరం కౌనేయ’ క్షేత్ర మిత్యభిధీయతే’ అంటాడు. అన్నట్లుగా మన శరీరాలే ధర్మక్షేత్రాలైన కురుక్షేత్రాలు. ఎపుడు ఎవరికి ఏది అవసరమో అది చెప్పటం అమ్మ అలవాటు. అమ్మ ఏదో బోధగాకుండా తన బిడ్డకు సుద్దులు చెప్పినట్లు ఉంటుంది. తల్లికి శిశువులు తప్ప శిష్యులు లేరందికదా! మహారాణి అహల్యాబాయి గొప్పభక్తురాలు. భగవద్గీతా మహాత్మ్యం విని తన ఆస్థాన పండితుని భగవద్గీత చదవమన్నది. అతడు ‘ధర్మక్షేత్రే కురుక్షేత్రే’ అనగానే, ఇక ఆపండి శాస్త్రీజీ! చాలు అన్నది. ఎందుకంటే ఆ ఒక్క పాదమే మనల్ని తరింపచేస్తుంది. ఇంకా 700 శ్లోకాలు చదవవలసిన పనేముంది. ‘క్షేత్రే క్షేత్రే ధర్మం కురు’. ఏ స్థలంలో ఉన్నా ఏ శరీరం ధరించినా ధర్మాచరణలో ఉండాలి. ఏడు వందల శ్లోకాల సారం అదే కదా ! అమ్మ జీవితంలో కూడా ఇలాంటిదే ఒక సన్నివేశమున్నది.

అమ్మను దేశిరాజు రాజమ్మగారి దగ్గరకు తీసుకొని వెళ్ళారు. అమ్మతో సంభాషించింతర్వాత రాజమ్మగారు అమ్మకు మంత్రోపదేశం చేయాలనుకొని “గురుర్బహ్మ గురుర్విష్ణుః” అనే శ్లోకం మొదలు పెట్టగానే, ‘అమ్మ’ చాలమ్మా! అన్నది. ఆ శ్లోకం చదివిన తర్వాత మంత్రం చెబుతానన్నది రాజమ్మగారు. ఆ శ్లోకం మంత్రం గాదా ? అన్నది అమ్మ. అమ్మ వద్ద ఎన్నో విషయాలు తెలుసుకున్న “సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః రాజమ్మగారు ఎలాగైనా అమ్మకు మంత్రోపదేశం చేయాలని ‘ఓం’ అనగానే అమ్మ నిశ్చలస్థితిలో సమాధిలోకి వెళ్ళింది. మంత్రేశ్వరి అయిన అమ్మకు మంత్రాలతో పనేమున్నది? అయితే అర్జునునకు ఆ సమయంలో గీతోపదేశం ఎలా అవసరమో అమ్మ రాజమ్మగారికి సంభాషణ రూపంలో చేసిన ఉపదేశం లోకానికి అవసరమే.

అర్జునుడు ‘ఈ యుద్ధంలో విజయం వల్ల మూడు లోకాలు ఏలగల స్థితి వచ్చినా నాకు వద్దు. ఈ హింసను చేయలేను’ అని గాండీవాన్ని వదిలిపెట్టినపుడు శ్రీకృష్ణుడు కర్తవ్యాన్ని ఉపదేశించి మళ్ళీ యుద్ధానికి సన్నద్ధుణ్ణి చేస్తూ “హింస యొనర్ప వంటివి సరే! మిము హింసల పాలొనర్చు 

విధ్వంసక శక్తులందు దయ దాల్చుట ధార్మిక హింస కాదె? మా

కంసుని జంపి లోకముల కష్టము దీరనె? చెల్లునే య స్పృ

 జాంసము లెండ తిండికయి మాడుట రాచకొలమ్మువారికిన్” అంటాడు. 

అమ్మ ఇక్కడ ఇంకా చాల స్పష్టంగా చెప్పింది యీ హింసను గూర్చి. ఎవరో మాంసాహారులు అమ్మ వద్దకు వచ్చి “మేము మాంసాహారులం. మరి హింస పాపం కదా! మేమేం చేయాలమ్మా? అదీకాక ఆహారం కోసం చేసే హింస హింసకాదని కొందరు, దేనికి చేసినా హింస హింసేనని కొందరు అంటున్నారు ? ఏది నిజమమ్మా?” అని

అడిగారు. అందుకు అమ్మ సమాధానం చెపుతూ “హింస అంటే సహించలేనిది నాన్నా! మేకలను కోసేవాడు ఆవులను నరకటం సహించలేడు. కోళ్ళను కోసేవాడు గొట్టెలను చంపటం చూడలేడు. సర్వమూ ప్రాణమయమే అనుకున్నప్పుడు, అన్నము తినడము, కూరగాయలు కోయడము, కూడా హింసే. కనుక ఏది హింస ? ఏది కాదు ? అన్నది సమస్య కాదు. ఎవరు ఏది సహించేలేరో అది హింస. కాబట్టి దానిని వారు మానుకుంటే సరి. అదీ మానుకోగలిగితే” అన్నది.

అంతేకాదు గీతలో కృష్ణుడు అర్జునునితో “ఆ హతభాగ్యులను అంతకుముందే చంపి ఉంచాను. నీవు నిమిత్తమాత్రంగా నిలబడు. బాణం వదులు. వారు పడిపోతారు” అంటాడు. అమ్మ కూడా “చేసేవాడూ చేయించేవాడూ వాడే అనుకున్నప్పుడు నీ కెలాంటి పాపపుణ్యాలూ లేవు, అని భావిస్తున్నాను” ఆ పైవాడి ప్రయత్నమంటూ లేనిదే ఎవర్నీ ఎవడూ చంపలేడు. ఆ చంపేవాడూ చంపబడేవాడు వాడి నిర్ణయంలోని వాళ్ళే” అన్నది. కృష్ణుడుకూడా పైన చెప్పినట్లు “మయా హతాన్ త్వం జహిమావ్యధిష్ఠా” “యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్”. అన్నాడు.

క్రోధం వల్ల సమ్మోహం, సమ్మోహం వల్ల స్మృతి విభ్రమం, స్మృతి విభ్రమం వల్ల బుద్ధినాశమూ, బుద్ధినాశం వల్ల మనుష్యుడే నశిస్తాడు అని గీత చెపుతున్నది. మనిషి క్రోధం వల్ల ఎంత పతనమై పోతున్నాడో చూడండి. ఒక దాని వల్ల ఒకటి వస్తున్నాయి కదా ! కామం అంటే ఏమిటి? ఇది కావాలనే కోరికేగా. కోరిక ముదిరితే ఆశ. “జీవితమనే పుష్పానికి ఆశ మొగ్గలాంటిది” అన్నది అమ్మ. కోపం వేరు క్రోధం వేరు. అవతలవాడు వచ్చేదాకా సాధించేది క్రోధం. ప్రేమ ఉంటేనే కోపం ఉంటుంది. లేకపోతే కోపద్వేషాలు లేవు. ఒకసారి కేశవశర్మ “నిప్పంటించుకొని నట్టింట కూర్చున్నాను నేను – నిప్పులోనూ నువ్వే నట్టింటా నువ్వే, ఆవేశంతో ఊబిలోకి దిగజారిపోతున్నాను, తృష్ణాద్వీపాల శృంగార శైల శృంగాలు తిలకించాలని ఉబలాటపడుతున్నాను, ఉబలాటంలోనూ నువ్వే గుండెమోతలోనూ నువ్వే – నేను పతనమనే భాగాన్ని కానీ నా భోగంలో నీకేం రాగంలేదు పోయిరా !” అంటే అమ్మ “పతనం అనేది నేను కాకపోలేదు” అన్నది. అమ్మ దృష్టిలో శిక్షణ అంటే క్రమశిక్షణే. తరుణం వస్తే గాని దేనికీ తరణోపాయం లభించదు.

“రాగద్వేషాల నుండి పరమాత్మ అనుగ్రహం వల్ల విముక్తుడై తృప్తిని పొందుతాడు” అని గీత చెబుతున్నది. అమ్మ “రాగమున్న చోట ద్వేషానికి, ద్వేషమున్న చోట రాగానికీ చోటు లేదని చాలమంది భావిస్తారు. కాని ఈ సృష్టి రాగద్వేషాలు కలవాడి చేతనే చేయబడ్డది”, “నేను విరాగిని కాదు. నాది మమతల గర్భగుడి. నీ రాగమేమిటంటే సర్వత్రా అనురాగమే విరాగము అంటాను” అన్నది.

యోగి మనఃస్థితి బయటి ప్రపంచం వల్ల మలినం కాకుండా ఉన్నంతవరకూ ఆ ప్రపంచం అతనికి ఉండీ ఆ లేనట్లే. సంసార సాగరంలో ఉన్నా ఒడ్డున ఉన్నట్లే అని గీత చెపుతున్నది. అమ్మ ‘పెళ్ళిలో పెద్దపులి ఉన్నదని భయపడేవారి భయం పోగొట్టటానికే నేను పెళ్ళి చేసుకొన్నాను’ అన్నది. ఆధ్యాత్మిక సాధనకు సంసారం ప్రతిబంధకం కాదని నిరూపించింది అమ్మ. సంసార బాధ్యతలే ఆధ్యాత్మిక సాధన. చేసే ప్రతిపనీ భగవత్సేవేననీ, వాడి ఆజ్ఞతోనే చేస్తున్నాననీ అనుకోగలిగితే సంసారం ప్రతిబంధకం కాదు అన్నది అమ్మ. పతిని ఆధారం చేసుకొని పంచభూతాలను జయించవచ్చని నిరూపించింది.

అసలు గీత ఆరంభంలోనే అర్జునునితో కృష్ణుడు “శోకింపతగని వారి కోసం శోకిస్తున్నావు. పండితులైన వారు ప్రాణం పోయిన వారిని గూర్చి గాని, పోని వారిని గూర్చి గానీ శోకింపరు” అంటాడు. అమ్మ ఏదైనా తన జీవితంలో అనుభవించిందే ఇతరులకు చెబుతుంది. అమ్మ తల్లి రంగమ్మగారు చనిపోయింది. అందరూ ఏడుస్తున్నారు. వీళ్ళంతా ఎందుకేడుస్తున్నారు ? అని అడిగింది చిదంబరరావు తాతగారిని, ‘అమ్మ పోయింది గదమ్మా!’ అన్నారు. ఎక్కడకు వెళ్ళింది ?” అని అడిగింది అమ్మ. ‘దేవుడి దగ్గరకు’ అన్నారు తాతగారు. ‘ఎక్కడ నుండివచ్చింది? అన్నది అమ్మ. ‘దేవుడి దగ్గర నుండే’ అన్నారు తాతగారు. ‘దేవుడు దగ్గరనుండి వచ్చినవాళ్ళు దేవుడి దగ్గరకుపోతే ఆ మధ్య మన యేడు పెందుకు?’ అని ప్రశ్నించింది. ఎంత నిబ్బరం ? ఎంత తత్వస్థైర్యం ?

స్థితప్రజ్ఞుడి లక్షణాలను గూర్చి గీతలో విపులంగా చెప్పబడింది. సిద్ధసాధకుల లక్షణాలు, భక్తిజ్ఞానకర్మ యోగాలు చెప్పబడింది. ఈ మార్గాలలో పరిణతుడైన స్థిత ప్రజ్ఞుడికీ సంసారంలో ఉండి అమ్మ చేసి చూపించిన సంసార యజ్ఞానికీ తేడా లేదు. నిత్యజీవితాన్నే ఉపనిషత్తుగా చదువుకున్నది అమ్మ అందుకే అన్న యజ్ఞాన్ని ప్రారంభించింది. సుఖదుఃఖాలు వచ్చినపుడు చలించనివాడు స్థితప్రజ్ఞుడు అని గీత చెబుతున్నది. సీతాపతి తాతగారి మృతదేహం ప్రక్కన అమ్మ కూర్చొని వుండగా గుంటూరు నుండి వచ్చినవారు కొబ్బరికాయ కొట్టటానికి సందేహిస్తుంటే దానికీ దీనికి సంబంధం లేదు దేనికదే కానివ్వండి అన్నది అమ్మ. హైమ ప్రాణం వదిలిన నాలుగు రోజులలో అమ్మ జన్మదినోత్సవం. దేనికదే అంటూ అమ్మ ఆ గర్భశోకంలోనూ మామూలుగా పాల్గొన్నది – కులపతిగారు ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో. దుఃఖం వచ్చినపుడు సహించమని కాదు అర్థం, వాడికది దుఃఖమనిపించదు. ఏడవడం మనస్సుకు తప్పనిసరి. ఏడుపుతో అతనికి సంబంధం ఉండదు. దుఃఖానికి చరమదశ సంతోషం. సంతోషానికి చరమదశ దుఃఖం. బాధలేకపోతే బ్రతకడం అనవసరం, బాధంటే చైతన్యమే అంటుంది అమ్మ.

జ్ఞానయోగులచే పొందబడే పరంధామస్థానమే నిష్కామకర్మ యోగులచేత కూడా పొందబడుతుంది అని గీత చెపుతున్నది. ‘అవిద్యారూపంగా ఉన్న పరమాత్మకు గానీ విద్యారూపంగా ఉన్న పరమాత్మకు గానీ, జగద్రూపంగా ఉన్న పరమాత్మకు గాని ముని భేదం పాటించడు’ అని గీత చెబుతున్నది. అమ్మ అందుకోసమే ‘జగత్తు సత్యం అంటాను’ జీవులు పుట్టినా, గిట్టినా నాకు దూరంగా లేరు. అందరూ నా ఒడిలోనే తిరుగుతున్నారు. ఒడి విడిచి ఎవ్వరూ లేరు అన్నది. పరిణామం తప్ప నాశనం లేదు. సృష్టి నాది, అనాది. నా సంసారానికి మొదలూ చివరా లేదు. మీ సంసారాల్లాంటిది కాదు కదా, నాది విశ్వ సంసారం. నేను నేనైన నేను అంటే ఏమిటి? అంటే నీవు లేకపోవడమే అన్నది. ఈ అవతారం చుట్టూ మీరు, మీ కోసం ఈ అవతారం, ధర్మం కోసం తల్లికాదు. తల్లి ధర్మం నిర్వర్తించడానికే వచ్చాను అన్నది. అమ్మ తన కోసం ఏమీ చేయలేదు. ఈ చీరె కట్టుకోవటం కూడా మీ కోసేమే నన్నది. మీరు నా పిల్లలే కాదు నా అవయవాలు కూడా అన్నది. ‘ఆత్మన్యేవాత్మనే తుష్టః’ అని శ్రీకృష్ణుడంటే ‘శరీరం కూడా ఆత్మ కాకపోదు’ అన్నది అమ్మ. వాడు కానిది ఏదీ లేదు అంటూ, అంతటా ఉన్న అమ్మను అర్థం చేసుకోవటానికే ఈ అమ్మ అంటూ తన సర్వవ్యాపకత్వాన్ని సర్వసమర్థత్వాన్నీ మనకు తెలియచేసింది. అలా అమ్మ ఇచ్చిన గీతామృతాన్ని మనం ఎంతమందిమి అందుకున్నామో ? మన ఆచరణలో లేశమాత్రంగా నైనా చూపించగలగాలి.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!