మాతృప్రేమ, మాతృదీవన, మాతృభిక్ష, మాతృ వందనం, మాతృయజ్ఞం, మాతృత్వం వంటి పదాలు విన్నాం కాని మాతృదక్షిణ అనే పదం ఎవరూ ఉపయోగించగా చూడలేదు. వినలేదు. తల్లి బిడ్డను ప్రేమించటం సహజం. అందుకే త్రిమూర్తులను బిడ్డలుగా చేసి లాలించిన అనసూయాదేవిని గూర్చి చెపుతూ కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి
“మాతృప్రేమ పునీతమౌ సఫల దాంపత్యమ్ము నీ సొమ్ము నీ పాతివ్రత్యములోన అత్రి తపముల్ పండెన్ వియధ్ధంగకే యేతామెత్తెను నీ యశస్సులు గుమాయించెన్ జగమ్మెల్ల నీ ఆతిధ్యమ్ము – నమస్సులమ్మ అనసూయా! అత్రి సీమంతినీ!” అన్నాడు.
కవులు క్రాంతదర్శులు అనటానికి కరుణశ్రీ గారి యీ పద్యం చాలు ఉదాహరణగా. తన అంతర్నేత్రంలో నిజంగా అమ్మను చూచి ఈ మాటలన్నాడా ! అనిపిస్తుంది. అమ్మ ప్రేమకు హద్దులు లేవు. అమ్మకు ఆ మాతృత్వాన్ని ప్రసాదించినవారు నాన్న. నాన్నగారి తపస్సు పండింది. దేనివల్ల? అమ్మ పాతివ్రత్య మహిమవల్ల. నాన్నగారి పాదాలు మంగళసూత్రాల రూపంలో నా మెడలో ఉన్నాయన్నది. ఆ సూత్రాలను అంటే ఆ పాదాలను నిత్యం అభిషేకించి ఆ తీర్థాన్ని తాను స్వీకరించటం వల్లనే మనందరికీ తీర్థం వేసే అధికారం తనకు వచ్చింది అన్నది. నాన్నగారి పాదాల శబ్దం ఎప్పుడూ ఓంకారం లాగా తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో వినిపిస్తూనే ఉన్నయ్యన్నది. ఆయన తనను వదలినా తాను ఆయనను వదలనన్నది. అసలు భర్తంటే భావనే నన్నది. ఆ భావన ఉన్నంతకాలం ఏ స్త్రీకైనా భర్త శరీరం దూరమైనా భర్త దగ్గర ఉన్నట్టే నన్నది.
ఇక పాతివ్రత్యాన్ని గూర్చి చెపుతూ పతిని ఆధారం చేసుకొని పంచభూతాలను జయించటమే పాతివ్రత్యం అన్నది. పాతివ్రత్యానికి పరాకాష్ఠ భర్తచేత సైతం తల్లిగా భావింపబడటమే నన్నది. ఊహకే అతీతమైన భావనయిది. ఏ పురాణాలలోనూ కనిపించనిది. పురాణాలలోనూ, వేదాలలోనూ ఏ అనంతశక్తి కనిపిస్తుందో ఆ సర్వవ్యాపక శక్తి అమ్మ కనుక అమ్మ నోటి వెంట వచ్చిన మాటలు వేద ఋక్కులు. వేదాలకు మూలమైన శక్తి వాక్కులు. అమ్మ ప్రేమను గూర్చి ఆలోచిస్తూ ఇక్కడ దాకా వచ్చాం. అసలు అమ్మ ప్రేమకు నిదర్శనం అమ్మే సృష్టిగారావటం. నాకన్న భిన్నంగా ఎవరూ ఏమీ లేదని చెప్పిన అమ్మ తన సృష్టిని తాను ప్రేమించకుండా ఏలా ఉండగలుగుతుంది ? “జగమేలే పరమాత్మా ! ఎవరితో మొదలిడుదు” అని అమ్మతో ఒకళ్ళంటే “నాతో నేనే” అని వెంటనే బదులిచ్చింది. శరీరధారియైన అమ్మలో అది నిరంతరం జాగృతమయ్యే ఉంది. ఎప్పుడో పాతికేళ్ళ క్రితం వచ్చిన వారి పేరు, అప్పుడే రంగు చొక్కా వేసుకొచ్చారో, ఎవరెవరు కలసివచ్చారో చెపు తుంటే ఇన్ని విషయాలు నీకెట్లా జ్ఞాపక ముంటయ్యమ్మా? అంటే ఎక్కడన్నా పెట్టి మరచిపోతే కదా! గొజ్జెలకాపరికి గొట్టెలన్నీ జ్ఞాపకం ఉండటంలా ? అని జవాబిచ్చింది. కనుక అమ్మ విశ్వజనని విశ్వమే తానైన జనని. ప్రేమించ కుండా ఏలా ఉంటుంది? అది తల్లీబిడ్డల బంధం. తనకూ తనువుకూ ఉన్న సంబంధం.
ఇక మాతృదీవన. అమ్మా దీవించమ్మా! అని ఎవరడిగినా, అది ఎప్పుడూ ఉన్నది నాన్నా! అడిగినా అడగకపోయినా అంటుంది. విచిత్రం అడగక పోయినా ఉండటమేమిటి? అడగకపోయినంత మాత్రాన బిడ్డకు దీవెన ఇవ్వకుండా తల్లి ఉండగలదా ? తన బిడ్డ క్షేమంగా ఉండాలని ఏ తల్లి కోరుకోదు? కోరుకోకపోతే ఆమె తల్లే కాదు. ఒకడు అనాకారి, కుంటివాడో, గుడ్డివాడో అయినంత మాత్రాన తల్లి బిడ్డను ప్రేమించకుండా ఉంటుందా? ఇంకా అలాంటి బిడ్డ మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అయితే గుర్తించగలిగిన శక్తి బిడ్డకు ఉండకపోవచ్చు. అందుకే ఆచార్య శంకరులు “కుపుత్రో జాయేత క్వచిదపి – కుమాతా. నభవతి” అంటారు. చెడ్డబిడ్డ ఉండవచ్చుగాని చెడ్డ తల్లి ఉండదు. అందువల్లనే తల్లి దీవెన బిడ్డలందరికీ ఎప్పుడూ ఉంటుంది అంటుంది అమ్మ.
ఇక మాతృభిక్ష. ఈ పదం మనం సామాన్యంగా ఉపనయనాలు జరిగే ఇళ్ళల్లో వటువు ముందుగా ‘మాతృభిక్ష’ స్వీకరించాలి అని వటువు చేత ‘భవతి భిక్షాందేహి’ అని అడిగించి తల్లి చేత భిక్ష వేయిస్తారు. పూర్వం మన ఇళ్ళ ముందు భిక్షకు వచ్చేవారు కూడా ‘భవతి భిక్షాందేహి’ అని అడిగేవారు. అలా మాతృభిక్ష లోకంలో వ్యాపించింది. అసలు అమ్మే కదా బిడ్డకు తన అమృతకలశంలోని పాలిచ్చేది. అమ్మే కదా అన్నం కలిపి ముద్దలు పెట్టేది. అమ్మే కదా లాలిపాటలతో, జోల పాటలతో జ్ఞానభిక్షను ప్రసాదించేది.
మాతృవందనం – తల్లికి నమస్కారం చేస్తే అందరికీ చేసినట్లే – తల్లే బిడ్డ క్షేమం కోసం రకరకాల దేవుళ్ళకు నమస్కారం చేస్తుంటుది. భారతజాతి విలక్షణమైనది. ఈ దేశాన్ని ‘భారతమాత’ అని పిలుస్తారు. భారతమాతను ఆరాధించేవారు కూడా చాలామందే యీ దేశంలో ఉన్నారు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఈ రకమైన మాతృత్వ భావన దేశాన్ని గూర్చి లేదేమో! ‘భారతమాత నాతల్లి ఈ దేశ ప్రజలు నా సహోదరులు’ అంటూ ప్రతిజ్ఞ కూడా చేయిస్తుంటారు. సరే ఏది ఏమైనా సర్వత్రా మాతృత్వ భావన మాతృవందనం ఉన్నది. అమ్మ అంటుంది తల్లికి బిడ్డ సరెండరు కావటం కాదు, తల్లే బిడ్డకు సరెండరవుతుంది అని. ఇంతకీ బిడ్డ తల్లికి వందనం చేస్తున్నాడా ? తల్లి బిడ్డకు వందనం చేస్తున్నదా ? తల్లి బిడ్డ కడుపు చూస్తుంది భార్య భర్త జేబు చూస్తుంది’ అంటారు. సహజమే. అయితే “భోజ్యేషు మాతా’ అన్నం పెట్టేటప్పుడు భార్య కూడా భర్తకు తల్లి భావనతో కడుపునిండా ఆరోగ్యకరమైన ఆహారమే పెట్టాలి.
మాతృయజ్ఞం. ఇది కూడా క్రొత్తదే. యజ్ఞాలు, యాగాలు ఈ దేశానికి క్రొత్తగాదు, ఈ ప్రజలకూ క్రొత్త కాదు. రుద్రయాగాలనీ, చండీయాగాలని, గాయత్రీ యాగాలనీ రకరకాల యాగాలున్నాయి. అయితే ‘మాతృయాగం’ ‘మాతృయజ్ఞం’ అనే పేర్లు వినలేదు. అమ్మ అన్నవితరణ కార్యక్రమాన్నే మాతృయజ్ఞం అన్నది.. సత్రయాగం లాగా, నిరంతరం జరిగే అన్నవితరణకు ‘మాతృయజ్ఞం’ అనే నానుకరణం చేసింది. గాయత్రీ యాగం చేస్తూ జిల్లెళ్ళమూడిలో అమ్మను పూర్ణాహుతికి రమ్మన్నారు. అమ్మ నేను ఏది వేసినా గాడిపోయిలోనే వేస్తాను. అదే నా యజ్ఞశాల అన్నది. నదీరా అనే కవి అమ్మ చేసే ఈ యాగాన్ని “ఇది ఒక యాగం – ఇది ఒక యోగం. ప్రజోపయోగం. ప్రేమప్రయోగం” అంటూ కీర్తించాడు. అమ్మ ఈ యజ్ఞాన్ని ప్రారంభిస్తూ ఇది జగన్నాథరథం. కదిలితే ఆగదు అని కదిలించింది. ఆ చిదగ్ని 1958 ఆగష్టు 15 నుండి ఆరకుండా వెలుగుతూనే ఉన్నది. ఈ మాతృయజ్ఞంలో అందరం పాల్గొంటూనే ఉన్నాం. శివశ్రీ కందుకూరి శివానందమూర్తిగారు చెప్పినట్లు అక్కడ తిన్న ఒక్కొక్క మెతుకూ ఒక్కొక్క జన్మను త్రుంచివేస్తుంది. అందుకే అమ్మ అందరికీ సుగతేనన్నది. ఎందుకంటే ఇక్కడి ఈ మాతృయజ్ఞంలోని ప్రసాదం ఎన్ని ముద్దలు ఎన్నెన్నిసార్లు తిన్నామో! మనకెందుకు మళ్ళీ జన్మ ఉంటుంది. సరాసరి అమ్మలోకే మన ప్రయాణం.
ఇక ‘మాతృదక్షిణ’ను గూర్చి తెలుసుకుందాం. లోకంలో ‘గురుదక్షిణ’ ను గూర్చి వింటుంటాం. పురాణాలలో గురుదక్షిణకు సంబంధించిన కథలెన్నో ఉన్నాయి. భారతంలోనే ఉదంకోపాఖ్యానమున్నది. గురుపత్ని కోసం పౌష్య మహాదేవి కర్ణాభరణాలిచ్చి గురువుకు దక్షిణగా సమర్పించటమున్నది. అలాగే ద్రోణాచార్యుడు అర్జునుని అడిగిన గురుదక్షిణ ద్రుపదుని బంధించి తెమ్మని. అలా చేసి గురుదక్షిణ సమర్పించిన సన్నివేశము – బొటనవేలును గురుదక్షిణగా ద్రోణాచార్యులు అడుగగా ఏకలవ్యుడు గురుదక్షిణ సమర్పించిన విషయము మనకు తెలిసినవే. పరమాత్మ శ్రీకృష్ణుడే తన గురువు సాందీపని మహర్షిని కోరగా చనిపోయిన గురుపుత్రులను తెచ్చి గురుదక్షిణగా ఇచ్చిన ఘట్టం భాగవతంలో మనకు కనిపిస్తున్నది. రఘుమహారాజు కాలంలో వరతంతు మహాముని శిష్యుడు కౌత్యుడు గురువు కోరికపై గురుదక్షిణగా ఏడు బారువులు బంగారం రఘుమహారాజు నడిగి తెచ్చి ఇచ్చిన విషయం కూడా ఎంతో విశిష్టమైనది.
ఇక శైవసాహిత్యంలో శివభక్తుల గురుదక్షిణ సమర్పణ లోకోత్తరమైనదిగా కనిపిస్తున్నది. బిజ్జల మహారాజు దగ్గర మహామంత్రిగా ఎదిగిన బసవేశ్వరుడు గొప్ప శివభక్తుడు. వెనుకబడిన వర్గాలను కూడా చేరదీసి జ్ఞానమార్గాన్ని బోధించిన బసవేశ్వరుని మహారాజే సన్మానించాలనుకున్నాడు. మహారాజేగాక బసవేశ్వరుని బోధనలచే ప్రభావితులైన శివభక్తులెందరో సత్కరించటానికి ముందుకు వచ్చారు. అందులో ఒకరు తెల్లని వస్త్రంతో కట్టబడిన మూటను ఒక దంపతులు సమర్పించారు. బసవేశ్వరుడు ఆ మూటను విప్పి అందులో చెప్పుల జత ఉండటం చూచి అది సమర్పించిన హరళయ్య అనే చెప్పులు కుట్టుకొని జీవించేవాడు, అతని భార్య సీతమ్మలకు పాద నమస్కారం చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. కారణం ఆ దంపతులకు ఇల్లు గడవటమే గగనమై జ్ఞాన మార్గాన్ని బోధిస్తున్న గురువుకు ఏమీ యివ్వలేకపోతున్నామనే తపనతో తమ కుడి తొడ చర్మం కోసి చెప్పులు కుట్టి గురుదక్షిణగా సమర్పించారు. అవీ ఆ పాదరక్షలు. ఈ గురుదక్షిణ ప్రపంచంలోనే అత్యున్నత గురుదక్షిణగా భావింపబడి వినుతికెక్కింది.
ఈదేశంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘమనే ఒక జాతీయ సంస్థ ఉన్నది. ఆ సంస్థ సభ్యులు గురువుగా తరతరాలుగా ఈ జాతికి మాననీయమైన, త్యాగానికి ప్రతీకమైన కాషాయ ధ్వజాన్ని గురువుగా భావించి ప్రతి సంవత్సరం వ్యాసపూర్ణిమనాడు, పూజ చేసి తమ శక్తిమేర గురుదక్షిణ సమర్పిస్తుంటారు. ఆ ధనంతో ఈ దేశ ప్రజలలో ఐకమత్యావశక్యతను, క్రమశిక్షణా జీవనాన్ని, సోదర సోదరీ భావాన్ని పెంపొందించటానికి వినియోగిస్తారు.
మీరు చెప్పిందంతా బాగానే ఉన్నది. ఈ మాతృదక్షిణ మాటేమిటి? అని మీరడగవచ్చు. మాతృదక్షిణలో మాతృశబ్దాన్ని గూర్చి ఇవ్వాళ క్రొత్తగా వివరించాల్సి పనిలేదు. ఎందుకంటే తల్లి లేకపోతే సృష్టే లేదు కనుక, ఇలా ప్రశ్నించే మనిషే ఉండడు కనుక. యత్యాశ్రమం స్వీకరించిన సన్యాసులైన వారికి లోకంలో అందరూ నమస్కరిస్తారు. ఆఖరికి తండ్రి కూడా. కాని సన్యాసి యైనా, పీఠాధిపతియైనా తల్లికి నమస్కరించాలట. తల్లి యొక్క ప్రత్యేకత అది.
ఇక దక్షిణ విషయం. దక్షిణ అంటే యజ్ఞములలో ఋత్విక్కులకు ఇచ్చే ధనము. మరి మాతృదక్షిణ అంటే అమ్మకు ఇచ్చే ధనము. గురుదక్షిణ అంటే గురువుకు ఇచ్చే ధనము కనుక ఇదీ అంతే అనుకోవాలా ? అమ్మకు మనమిచ్చేదేమిటి? అమ్మే మనల్ని లోకానికి ఇచ్చింది కదా! అమ్మ తన పొట్టను చూపిస్తూ ఇది కన్నపొట్టేగాని తిన్న పొట్టకాదురా! అన్నది. మరి ఈ మాతృదక్షిణను ఏలా అర్థం చేసుకోవాలి? అసలు అమ్మకు ఇవ్వటమే కాని పుచ్చుకోవటం తెలియదు కదా! మరియు దక్షిణయేమిటి? అమ్మకు మన యెడల దాక్షిణ్యమున్నది కాని దక్షిణ తీసుకోవటమేమిటి? అమ్మ మనకు దక్షిణ ఇస్తున్నదా? భిక్ష ఇస్తుంది కాని దానిని దక్షిణ అనరు కదా!
తన బిడ్డ సమర్థుడై తను మన ధనాలను మాతృపాదాల చెంత సమర్పింపగల దక్షుడై చైతన్యవంతుడైతే ఆ దక్షతను మాతృపాదాలకు దక్షిణగా సమర్పించవచ్చు. తల్లి తన బిడ్డ ఒక కలెక్టరో, ఒక వీరుడో, ఒక మహారాజో, ఒక మహాకవో అయితే తన బిడ్డ అభివృద్ధిని చూచి పొంగిపోతుంది కదా ! అలాంటి బిడ్డ ధర్మమార్గంలో జాతికి, లోకానికి మార్గదర్శనం చేసేవాడైతే అంత కన్నా తల్లికి కావల్సిందేమున్నది ? అలా కావటాన్ని ఏ అమ్మైనా మాతృదక్షిణగానే భావిస్తుంది. స్వాతంత్ర్యం కోసం భారతమాత దాస్య శృంఖలాలను బాపటానికి ఒక గరుత్మంతుడు, ఒక భగత్సింగ్, ఒక సుధీరాంబోస్లను చూచి గర్విస్తుందికదా తల్లి. జాతీయ సమైక్యత కోసం – మానవతా మహిమోన్నత శిఖరం మీద అమ్మను నిలబెట్టగల్గిన ప్రతిబిడ్డ మాతృదక్షిణ సమర్పించిన వీరుడే – త్యాగమూర్తే, ప్రత్యేకించి నాన్నగారి ఆరాధనోత్సవం ఫిబ్రవరి 17న వస్తున్నది. నాన్నగారిని ఆరాధిస్తే తనను ఆరాధించినట్లే. తాను నాన్నగారిలో, నాన్నగారు తనలో కలసి ఉన్న అద్వైతస్థితి కదా! ఈనాటి అనసూయే శ్వరాలయం. నాన్నగారు బిడ్డలందరికీ అన్నం పెట్టి ఆదరించారు. రెక్కలు వచ్చిన బిడ్డలు ఈ బాధ్యత నెత్తి పైకెత్తుకున్నారు. అమ్మనాన్నలు ఆనందిస్తున్నారు. దాన్ని సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహించి ధాన్యాభిషేకాన్ని తద్వారా మాతృ, పితృదక్షిణను నెరవేర్చటానికి కంకణం కట్టుకుందామా!