1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సంపాదకీయము..(మాతృ ముక్తి)

సంపాదకీయము..(మాతృ ముక్తి)

P S R Anjaneya Prasad
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 12
Month : August
Issue Number : 1
Year : 2012

అమ్మ ముక్తిని గూర్చి చెపుతూ “తృప్తే ముక్తి” అన్నది. ఏది చేస్తున్నా అన్ని వేళల్లో తృప్తి కలిగితే అదే ముక్తి లేదు అని బాధ లేని వాడు యోగి, ఎంతున్నా తృప్తిపడేవాడు భోగి. నీవూ నేనూ ఏకం కావటం అంటే శరీరం కలుసుకోదు. భావం కావటమే. సాధనలన్నింటికీ చరమదశ తృప్తే. సుఖం ఎక్కడ ఉన్నది అంటే తృప్తిలో ఉన్నది”. అమ్మ సామాన్యజీవి ముక్తుడు కావాలంటే ఎంతో తేలికగా రెండు వాక్యాలో చెప్పింది. “నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో” అని. అది చేస్తే ఎవరికైనా ముక్తి వచ్చినట్లే.

వ్యాసమహర్షి అర్ధశ్లోకంలో “పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం” అన్నాడు. పరపీడనం అంటే ఒక ప్రాణికి బాధ, నొప్పి కలిగించటం. అది అధర్మము పాపము. అయితే శాస్త్రంలో చెప్పిన హింస హింసకాదు. దేహాన్ని రక్షించటానికి ఆపరేషన్ చేస్తే అది హింసకాదు. అలాగే లోకరక్షణ కోసం చేసే దుష్టశిక్షణ హింసకాదని ఆవిధమైన పని ధర్మమే అని పెద్దలు చెపుతున్నారు. అర్జునుడు భారతయుద్ధం ముందర ఇంతమంది బంధువులను సైన్యాన్ని చంపి హింస చేయజాలనంటే శ్రీకృష్ణుడు చెప్పాడు.

“హింస యొనర్పనంట సరే! మిము హింసల పాల్గొనర్చు వి.

 ధ్వంసక శక్తులందు దయదాల్చుట ధార్మిక హింసకాదె? మా

 కంసుని జంపి లోకముల కష్టము దీర్పనె? చెల్లునే అసృ 

బ్యాంసము లెండ తిండికయిమాడుట రాచకొలమ్ము హరికిన్”.

(విజయశ్రీ)

ధర్మానికి గ్లాని కలిగినప్పుడు మా మేనమామ కంసుని చంపి లోకానికి హితాన్ని చేకూర్చాను. హింస అనేది పరిస్థితులను బట్టి ఉంటుంది. విధ్వంసక శక్తులను నాశనం చేయవలసిందే అని చెప్పాడు గీతాచార్యుడు.

అమ్మ “సహించలేనిది హింస” అని రెండు ముక్కలలో సారాంశం చెప్పింది. చెట్టుకు కాసిన కాయ కోయటం, పూవు కోయటం కూడా హింసే. ఎందుకంటే వాటికి కూడా ప్రాణం ఉన్నది కనుక. ప్రాణం లేని వస్తువు సృష్టిలో లేదు కనుక. అంటే అవతలివాడికి బాధ కలిగించకుండా ఉండగలగటం అహింస, ఒక మాటతో అవతలి వాడికి బాధ కలిగినా అది హింసే – కొట్టటమే కాదు తిట్టటమే కాదు.

“ఆచారః పరమోధర్మః” అంటుంటారు. అంటే శాస్త్రాలు చెప్పినట్లుగా ఆచరించటమే ధర్మము అని. “ఆచారము అంటే ఆచరించేది’ అని అమ్మ చెప్పింది. సజ్జనులు ఆచరించేది అని వివరణ. అందుకే అమ్మ నే చెప్పేదేముంది నాన్నా! ఆవరణలో ఉండి నేనేం చేస్తున్నానో గమనించి వ్రాసుకోండి అని చెప్పింది. అంటే తననడవడి ద్వారా నేర్చుకోమని చెప్పకనే చెప్పింది అమ్మ. దానాలు, ధర్మాలు, జపతపధ్యానాలు, ఎన్ని చేసినా దుష్ప్రవర్తనగల వారికి ఏ రకమైన ఫలము రాదని, వాడు మోక్షానికి అర్హుడు కాడని శాస్త్రం చెపుతున్నది. అయితే నిరంతరం ‘అమ్మ’ స్మరణలో, అమ్మ నామం చేస్తూ ఉన్నవారికి మోక్షం కరతలా మలకం. నామస్మరణ వలన సర్వపాపాలు హరిస్తాయి. అలా అని నేను నామం చేస్తున్నాను అని పాపాలు చేయకూడదు. ఎందుకంటే తేలుమందు దగ్గర ఉన్నది అని తేలు చేత కుట్టించుకోముగదా! పాము మందు ఉన్నదని పాము చేత కరిపించుకోముగదా!

సమస్త సృష్టి భగవత్ స్వరూపమే అని గుర్తించే దాకా సాకార స్వరూపాన్ని ఆరాధించాల్సిందే. మనో బుధ్యహంకారాదులచేత గోచరం కాకుండా వాటిని సైతము ప్రకాశింప జేస్తూ ఉండేది నిర్గుణ స్వరూపము “బ్రహ్మైవేగం విశ్వమిదం వరిష్ఠమ్” ఈ జగత్తు సర్వము ఆ పరబ్రహ్మ ఈ స్వరూపమే అని ముండకోపనిషత్తు చెపుతున్నది అమ్మ ఒక్క మాటలో “అది (బ్రహ్మము) కానిది ఏదీ కనిపించటం లేదు నాన్నా” అన్నది. అందుకే ‘మీరంతా నేనే మీదంతా – నేనే – నాకంటే భిన్నంగా మీరు లేరు మీరంతా నా – అవయవాలే’ అని స్పష్టంగా చెప్పింది తేలిగ్గా.

పుణ్యకార్యాలు చేయటం చేత, దానధర్మాలచేత, తీర్ధయాత్రల చేత ఉపవాసాది వ్రతాల చేత హృదయం నిర్మలమై ఏదో కారణం చేత కాకతాళీయంగా వైరాగ్య సమాధి. సర్వకాల సర్వావస్థల యందు సహజమైన సహనమే 

బుద్ధి పుడుతుంది. అప్పుడు సద్గురువును ఆశ్రయిస్తే ఆత్మజ్ఞాన మార్గం దొరికి బ్రహ్మవేత్త కావచ్చు అని యోగవాసిష్ఠం ముముక్షు ప్రకరణం చెపుతున్నది. నిజానికి లోకంలో బాధగురువులే గాని బోధగురువులు తక్కువ. తెలియనిది, తెలియ చెప్పేవాడు గురువు’ నిజమైన గురుతు చూపించేవాడు గురువు. గురుర్బహ్మ అన్న తర్వాత వేరెవరితో పనిలేదు. ఆయన వద్దకు పోయి నమస్కారం చేసి ఆయన చెప్పినట్లు చెయ్యటమే. గురువుకూ ఇష్టదైవానికీ తేడా లేదు. లక్ష్యం ఎక్కడ ఉంటే అదే గురువు. పరిస్థితులే గురువూ, బంధువు. మనస్సు గురువేకదా” అంటూ అమ్మ గురువును గూర్చి చెప్పింది. శంకరులు కూడా జగత్తు జీవేశ్వరుల తత్వాన్ని చక్కగా తెలిసి, శిష్యుని మేలుకోసం ప్రయత్నించే వాడు గురువు అని నిర్వచించారు. అలాంటి గురువు దొరికితే అసాధ్యమేమీకాదు.

తరించటానికి ఏదన్నా మార్గం చెప్పమ్మా అని అడిగినవారికి అమ్మ బాపట్లలో తుఫానులో ఇళ్ళు దెబ్బతిన్నవారికి పంచటానికి అన్నపూర్ణాలయంలో సాంబారు అన్నం, పెరుగన్నం పొట్లాలుగా కట్టుతున్నవారిని చూపించి వారికి సాయం చేయండి అని చెప్పింది. ఆపదలో ఉన్నవాళ్ళను ఆదుకోవటం, ఆకలితో ఉన్న వారి ఆకలి కావలసినదే. తీర్చటం కంటే తరించే సులువైన మార్గామేముంది అని అమ్మ చెప్పేదాకా అది అర్థం చేసుకోవటానికి వారికి సమయం పట్టింది.

ఎల్లప్పుడు, ఎల్లవేళల, ఎల్లరూపాలతో, ఎల్లచోట్ల ఉన్నది నేనే అనే అఖందాత్మదృష్టి కలగటమే సమాధిస్థితి, జ్ఞానసమాధి అని వాసిష్ఠ రామాయణం చెపుతున్నది. ఇది ఆత్మ ఇది కాదు అనే దానికి అవకాశమే లేదు. నీటి నుండి తరంగంవలె, ఆకాశం నుండి నీలిమవలె, ఆత్మ అనాత్మ అని వేరుగా లేవు ఉన్నదంతా ఆత్మయే. నీకు ఊహరాని రోజులలో బంధువు పరాయిదేశానికి వెళ్ళాడు. ఏ ముప్ఫయి ఏళ్ళతర్వాతో మీ యింటికి వచ్చాడు. నీవు ఎవరు అని ప్రశ్నించి తెలసికున్న తర్వాత బంధువై పోయాడు. తెలిసికొన్న తర్వాత సృష్టి అంతా ఆత్మగానే భాసిస్తుంది అని వసిష్ఠుడు రామునకు తెలియచేశాడు.

సమాధిని గూర్చి అమ్మ “అవధులు లేనిది సమాధి. సమత్వమే సమాధి. సర్వకాల సర్వావస్థలలో సమాన స్థితియే సమాధి. అంతా ఆత్మగా తోచటమే ఆత్మ సాక్షాత్కారం. అన్ని శబ్దాలు నీ శబ్దాలు కావటమే నిశ్శబ్దం. లోపల ఏదో వెలుపల అదే. ఆత్మకు ప్రతి జగత్తే” అని చెప్పింది. సహజ సమాధి అంటే ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండటం అన్నది. అమ్మతో నిన్ను ఈ ప్రపంచంలోకి లాగుతున్నా మేమో! అమ్మ అంటే ఈ వ్యాపారంలో లావాదేవీలు లేవు నేనెప్పుడు ఒకే స్థితిలో ఉన్నాను. నాలో ఏ మార్పూ లేదు. అన్నది. నిలుచున్నా, నడుస్తున్నా, మేల్కొన్నా, నిద్రిస్తున్నా నాకీ సమాధి స్థిరమై పోయింది. స్వప్నంలో కూడా ఈ స్వరూప ఆ రూఢ స్థితికి చలనం లేదు అని ఒకప్పుడు కాక భుశుండ వశిష్ఠునితో చెప్పాడు.

నాభిం సంసార చక్రస్య చిత్తమేవ నిరోధయత్’ జననమరణ సంసార చక్రమును తిరగకుండా ఆపివేయాలంటే మనస్సు కదలకుండా చేయాలి. అమ్మ దీనికి ఒక సులువైన మార్గం చెప్పింది. ఉచ్ఛ్వాస నిశ్వాల గతిని గమనించమన్నది. అయితే ఈ విధంగా మనస్సు సంచరించకుండా చేసినా కలిగేది తాత్కాలిక మనశ్శాంతే – పరమశాంతి ముక్తి చేకూరాలంటే వాడి కరుణ కావలసిందే. 

సామాన్యంగా సంప్రదాయ వేదాంతం పూర్వజన్మ కర్మ, పురుష ప్రయత్నము మీద ఆధారపడిన నడుస్తుంటుంది. ఏది బలవంతంగా ఉంటే రెండోది. ఓడిపోతుందని వారి వాదన. వీటికి ఆధారంగా మార్కండేయ చరిత్ర, సావిత్ర సత్యవంతుల చరిత్ర చూపిస్తుంటారు. నిజానికి ప్రారబ్ధం ప్రకారం అంతా నడుస్తుంటే ఇంకా శాస్త్రాలు విధి నిషేధాలు ఎందుకు?

మనం ఎన్నో స్తోత్రాలు, లలితాసహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, చండీసప్తశతులు, గీతా పారాయణులు చేస్తుంటాం. దాని ఫలశ్రుతులు కూడా చెప్పబడ్డాయి. దౌర్భాగ్య తూల వాతూల, రోగపర్వత దంభోళి, మృత్యుదారుకుతారికా, లోకశోకవినాశినీ, సర్వోపద్రవ వారిణీం అంటూ అమ్మను స్తోత్రం చేస్తున్నాం’ అంటే దురదృష్టాన్ని దూదిపింజను ఎగురగొట్టే తుఫానుగాలి వంటిది, రోగాలనే కొండలను నరికే వజ్రాయుధము వంటిది, మృత్యువనే వృక్షాన్ని నరికే గండ్రగొడ్డలి వంటిది, దగ్గరకు చేరిన బిడ్డల శోకాన్ని పోగొట్టేది, సర్వ ఉపద్రవాలనూ నివారించేదీ అని కదా అర్థం. మరి నిర్ణయానికిబద్ధులై జనులుంటే ఈ స్తోత్రాలు, ఈ మంత్రాలు, ఈ హోమాలు ఎందుకు చేయటం?

అయితే అమ్మ ఒక మంత్రం చెప్పింది. ఆ మంత్రం ఏముంది ? అదే ఏమిటంటే నీకు ఏ స్తోత్రమో, ఏ మంత్రమో, ఏ హోమమో చేయాలనే ప్రేరణ ఎక్కడ నుండి వస్తున్నది ? గమనించు. అదీ వాడిచ్చిందే – ప్రేరణ కూడా నిర్ణయంలో భాగమై పోయింది. ఇది సహేంద్ర తక్షకాయస్వాహా అన్నట్లున్నది. దీనిని అర్థం చేసుకోవటానికి చాల చింతన కావాలి. అమ్మ తత్వచింతన సదస్సులు జరుగుతున్నవి. కాని ఈ రకమైన చింతనకు అంతగా ప్రాధాన్యం రావటం లేదు. వసిష్ఠుడు చెప్పినట్లు ‘ద్విత్వమే కస్యకీ దృశమ్’ ఉన్నది ఒకటే. రెండు అనే వ్యవహారానికే చోటు లేదు. అమ్మ కూడా ‘అది’ తప్ప ఇంకేమీ కనిపించటం లేదు నాన్నా! అన్నది.

‘బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మగ్నే బ్రహ్మణాహుతమ్! బ్రహ్మైవతేన గన్తవ్యం బ్రహ్మకర్మసమాధినా ॥” అని జ్ఞానయోగంలో శ్రీకృష్ణపరమాత్మ చెప్పాడు. యజ్ఞం చేసేవాడు, యజ్ఞాని కుపయోగించే ద్రవ్యాలు, వాటిని హుతం చేసే అగ్ని, అన్నీ బ్రహ్మస్వరూపాలే – దానివల్ల ఫలితం కూడా బ్రహ్మర్పణమే. ఈ విధంగా సర్వకర్మలూ యజ్ఞదృష్టితో చేస్తే అదే బ్రహ్మకర్మ సమాధినిష్ట. ఈ నిష్టకలవాడు పరబ్రహ్మస్థితి, ముక్తిని పొందును. అంటే జీవితంలోని ప్రతి పని యజ్ఞభావనతో ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలని తాత్పర్యం. అలాగే పెద్దలు పితృకార్యం చేసేటప్పుడు బ్రాహ్మణుడు చెప్పిస్తుంటాడు. “అన్నంద బ్రహ్మ – అహంచ బ్రహ్మ – భోక్తాచబ్రహ్మ” అని. అంటే అక్కడా ఇంతే అంతా పరబ్రహ్మమే – ఫలితమూ బ్రహ్మర్పణమే ఈ రకమైన ఆలోచనతో చేసే పనే బ్రహ్మకర్మ నిష్ఠ అని శాస్త్రాలు చెపుతున్నాయి.

లోకంలో పండితులున్నారు. పండితులు అంటే బాగా శాస్త్రాలు చదువుకున్న వారిని అర్ధం. కష్టసుఖాలను, లాభనష్టాలను, కీర్తి అపకీర్తులను సమంగా చూస్తూ, వాటికీ అతీతంగా ఉన్నవాడు పండితుడు అని గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుల లోనూ, గోవులలోనూ, ఏనుగులలోనూ, కుక్కలను చంపిన వానిలోనూ ఒకే అంతర్యామిని చూడగలిగినవాడు పండితుడు అని కృష్ణుని మాట. అమ్మది విచక్షణ లేని వీక్షణ. శిక్ష అంటే మనిషిని సంహరించటం కాదు గుణాన్ని సంహరించటమే మరణమంటే వేరే

తరుణం వస్తే అన్నీ జరుగుతవి. తప్పించు కుందామన్నా తప్పనిది. చేద్దామన్నా చేయనీయనిది. వీటినన్నింటినీ నడిపించేది తరుణం. కోరికలు పోయే రోజు వస్తే వాటంతట అవే పోతాయి. మానుకోవాలంటే మానుకోనివ్వందీ, చెయ్యాలంటే చెయ్యనివ్వనిదే నిర్ణయం. అనుకున్నది జరుగదు తనకున్నది తప్పదు అని తెలిసినా మనం చేస్తున్నాము అన్నది అనుకోక తప్పదు. విదేహి విదేహి అంటారు. అంటే దేహం లేకపోవడం కాదు. దేహంతో ఉండి దేహం కూడా తానయినవాడు విదేహి, జరిగే ప్రతిదీ ‘వాడు’ చేయిస్తున్నా డనుకోవటమే.

దేహం కూడా ఆత్మే అనుకుంటే దేహాత్మభావం ఉండదు. ఆత్మ జీవాత్మ పరమాత్మ అని మూడులేవు మారేదీ మారనిదీ కూడా ఆత్మే. ఆత్మ అంటే అంతా ఆవరించిఉన్నది. సూదిమొన మోప సందులేదంటున్నప్పుడు ఆత్మకానిదేం ఉంది ? ఉపాధిలేనిది ఆత్మ అంటారు శాస్త్రవేత్తలు. ఉపాధి కూడా ఆత్మే అంటున్నాను నేను. అన్నది అమ్మ. అమ్మ అందుకే అందరూ దేవుళ్ళేనన్నది. అందిరకీ సుగతే నన్నది. అందరూ ముక్తులే అన్నది.

నిజానికి అమ్మ చెప్పినట్లు మనం ముక్తులమయ్యే ఉన్నాము. మన సహజస్థితి అది. కానీ దాని నుండి చెదరిపోతున్నాం. మనం రసవత్తరమైన మంచి సినిమాకు వెళ్ళాం. అక్కడి సినిమాహాలు, దాని అందం, ముందూ వెనుకా మనుషులు, కూర్చోటానికి వీలుగా లేని కుర్చీలు అందులో నల్లులు అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. కానీ సినిమా మొదలుకాగానే దానిలోని దృశ్యాలతో మమేకపోతాం. నవ్వుతాం, కన్నీళ్ళు పెట్టుకుంటాం. కొంతసేపటికి సినిమా అయిపోతుంది. సినిమా చూస్తూన్నప్పుడు చూడటానికి వెళ్ళినమనమూ, చూచిన సినిమా, సినిమాను చూడటం అనే మూడు కార్యాలు ఒకటిగానే అయిపోయాయి. చూపేవాడు చూడబడే సినిమా, చూడటమనే క్రియ ఈ – మూడూ కలిగిన త్రిపుటి క్రమంగా కరిగిపోయే సినిమా చూచిన అభుభూతి మాత్రం నిలుస్తుంది. దీనినే మోక్షస్థితి అంటారు. ఏ సంగీత సభకో వెళితే ఆ రాగప్రస్తారంలో మనం కాసేపు లీనమై పోతాం. ఆకొద్దిసేపు అనుభవించిన ముక్తస్థితిని అంతరాయం లేకుండా అనుభవించగలిగితే అంతకంటే ముక్తి వేరే ఎక్కడున్నది ? ఈ కనిపించే సృష్టి దేనితో చేయబడి, దేనిలో ఉంటున్నదో దానినే దైవం అని అంటున్నదీ లోకం. కాలువనిండుగా ప్రవహిస్తున్నా త్రాగటానికి రేవు అవసరమైనట్లు సర్వత్రా నిండి ఉన్న చైతన్యాన్ని గుర్తించటానికి దేవాలయం అవసరం ఐండి, అమూర్తిని దర్శించి ఆయనలో అంతర్యామిత్వాన్ని అనుభవిస్తే ఆ అనన్యచింతకలిగితే, ఆ అనుభవమే మోక్షము అని అనుభూతిలోకి వస్తుంది.

అందుకే మనం ముక్తులమయ్యే ఉన్నాం. అనన్యచింతతో ఉందాం. అనుభూతిలో నిలుద్దాం.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!