1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సంపాదకీయము……(వైద్య విద్యాధరి అమ్మ)

సంపాదకీయము……(వైద్య విద్యాధరి అమ్మ)

P S R Anjaneya Prasad
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : February
Issue Number : 7
Year : 2021

అమ్మ సర్వేశ్వరి, సృష్టి స్థితిలయకారిణి, స్వరూప లలిత, స్వభావ మధుర, ముగురమ్మల మూలపుటమ్మ అని చెపుతూ వైద్య విద్యాధరి అంటూ ప్రత్యేకించి ఏదో ఒక విభాగానికి పరిమితం చేస్తారేం అనే ఆలోచన కొందరికి రావచ్చు. లలితా సహస్రనామాలతో అమ్మను పూజిస్తూ, అంబికా సహస్ర నామాలతో స్తుతిస్తూ ఉన్నాం. కదా! సర్వత్రా సర్వనామాల్లో ఉన్నది అమ్మే అని చెప్పటమే కదా ధ్యేయం. ఒక్కొక్క నామం అమ్మలోని ఒక్కొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ వుంటుంది. అలాగే  వైద్యవిద్యాధరి, భిషగ్వరేశ్వరి వంటివి కూడా.

అసలు విద్య అంటే అసలుసు తెలుసుకోవటం. అయితే శరీరం మన ఇష్టా అయిష్టాలతో నిమిత్తం లేకుండా మనకు ప్రసాదింపబడింది. దాని బాగోగులకు కూడా ఎన్నో సృష్టించింది. అందులో భాగమే వైద్యం కూడా – ఆరోగ్య అనారోగ్యాలు మనం చేసే యాగాలు, యోగాలు, భోగాలను బట్టి వస్తుంటాయి పోతుంటాయి. అవి మాత్రం మన చేతుల్లో ఉంటయ్యా? మన చేతలు మన చేతుల్లో లేవంటుంది కదా అమ్మ! సర్వసంకల్ప అయిన అమ్మ మన చేత చేయించేది అనుభవింపచేసేది అమ్మే. అయితే ఏమిటి బాబూ ఇదంతా అంటే ఇదంతా ఒక ఆట. శేషగిరిరావు అన్నయ్య మనువడు ఫణి అమ్మతో నీకు ఆటలంటే ఇష్టమా? అని అడిగితే నే చేసే పనే అది. అన్నిటితో అందరితో ఆడుకోవటమే అన్నది.

సరే అసలు విషయానికి వద్దాం. అమ్మది అవతారమైనా ప్రాకృతిక శరీరం ధరించింది కదా! దాని పరిధులు దాని కుంటవి గదా! నిర్ణయించినవాడు నిర్ణయానికి బద్ధుడే అన్నది కదా? అందువల్ల మన శరీరాల్లాగానే అమ్మ శరీరం కూడా బాధలు అనుభవించింది. దానికి తగ్గరీతిలో ఆయుర్వేదము, అల్లోపతి, హోమియో మందులు తీసుకున్నది. కాకపోతే మనం శరీరంతో తాదాత్మ్యం చెంది ఉన్నాం కనుక మన మనస్సుకు బాధ అనిపించి యాతన పడతాం. అమ్మ శరీరం అనుభవిస్తున్నా అది ఆ శరీరానికే గాని మనసుకు అంటదు. నీవెందుకు ఈ బాధలు తగ్గించుకోవు అంటే, మీరున్నట్లే అవీ ఉన్నాయి. మీరు లేనినాడు అవీ ఉండవు అన్నది. మనం అమ్మను వదలలేనట్లే అవీ అమ్మను వదలలేవు.

అమ్మ: శరీరం బాల్యం నుండి అనుభవిస్తూనే ఉన్నది. అమ్మకు నాలుగేళ్ళప్పుడు ఒక గోసాయి అమ్మ: మెడలో కట్టుకోమని ఒక మూలిక ఇస్తాడు. అమ్మ దానిని నోట్లో వేసుకొని నమిలి మ్రింగింది. అది తింటే చచ్చిపోతారు అంటే ఆయుర్దాయం లేనివాడిని ఎలా బ్రతికించలేరో ఆయుర్దాయం ఉన్నవాళ్ళను ఏదీ చంప లేదంటుంది. ఆ మూలిక అమ్మను ఏమీ చేయలేక పోయింది. అంటే దానిని వజ్రయానం అంటారు. భారతంలో విషం తిన్నా భీముడు బ్రతికే ఉండగలిగాడు. ఆ విద్య భీమునకున్నట్లు తెలుస్తున్నది. అమ్మలో కనిపించింది మనకు.) చిదంబరరావు తాతయ్యగారు బాల్యంలో అమ్మలోని అతిమాసుషత్వాన్ని చూచిన వారే. ఎంత నీవు సర్వానివి అనిపిస్తున్నా నీ శరీరం ఇన్ని బాధలు పడటం సహించలేకుండా ఉన్నాను అంటాడు. అప్పుడే ఏమయిందండీ! నేను చనిపోతానని భయమా? ముందున్నది చాలా. ఎన్ని అనుభవించాలో ఏ సమయానికి ఏది అనుభవించాలో అది తప్పదండి. మీరేం బాధపడకండీ అంటుంది.

జిల్లెళ్ళమూడిలో ఉన్న మద్దిబోయిన సాంబయ్యసు పిలిచి ఏ ఆకు దేనికి పనిచేస్తుందో చెప్పి, ఏ మందు దేనికి పనిచేస్తుందో చెప్పి ఆయుర్వేద వైద్యుని చేసింది. నిజానికి భారతదేశంలో ఆయుర్వేదమే ప్రాచీనమైనది. చరకుడు, శుశ్రుతుడు, అశ్వనీదేవతలు ఆయుర్వేదంలో ప్రసిద్ధి పొందారు. భాగవతంలో ప్రహ్లాదచరిత్రలో “అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయు క్రియ” అని ఉంది. అంటే శస్త్రచికిత్సా విభాగం కూడా అందులో ఉన్నదన్నమాట. దేవతలందరూ మరణం లేని వారు కారు. పురాణాలు చదివిన వారికి తెలుసు. రాక్షసులు ఎక్కువ చనిపోతుంటే వాళ్ళ గురువు శుక్రాచార్యులవారు మృతసంజీవినీ విద్యద్వారా బ్రతికిస్తున్నాడు. ఇది దేవతలకు తెలిసింది. బృహస్పతి కుమారుడు కచుని ఆ విద్య నేర్చుకొని రమ్మని దేవతలు కోరారు. కచుడు వెళ్ళి శుక్రాచార్యుల శుశ్రూష చేసి నానాయాతనలు పడి ఆవిద్య నేర్చుకొని వచ్చాడు. అంటే దేవతలందరూ మరణం లేనివారు కాదు. వారిలో అమరులు కొద్దిమందే. అందువల్ల అమ్మ సాంబయ్యకు ఆయుర్వేద విద్యనేర్పి వైద్యం చేయించింది. కొమ్మూరి డాక్టరు శీతాచలం గారు, సూతలపాటి వీరయ్యగారు, ఆయుర్వేద వైద్యులు అమ్మను యోగీశ్వరిగా గుర్తించారు. 

ఇక బ్రిటీష్ వారు మనదేశం వచ్చిం తర్వాత ఆంగ్లభాష నేర్పి ఆంగ్లవైద్యం కూడా నెమ్మదిగా మనదేశంలో ప్రచారం చేశారు. అది యెంతవరకు ప్రాకిందంటే ఈనాడు ప్రతిపల్లెటూరుకు కూడా ప్రాకిందంటే ఎంత బలంగా వ్రేళ్ళూనుకున్నదో తెలుస్తుంది. ఒక 50, 60 ఏళ్ళ క్రితం దాకా ఆయుర్వేదమే పల్లెటూళ్ళల్లో వైద్యం. ఏ శరీరభాగమో పనికిరానిదై తీయవలసివస్తే ధనవంతులు బస్తీలకు వచ్చి ఆయా వైద్యంలో శస్త్ర చికిత్స చేయించుకునేవారు. ఈ నాడు అన్ని విభాగాలలోనూ ప్రత్యేక నైపుణ్యం గల వైద్య విభాగాలు వచ్చి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తయారయ్యాయి. ఒక 60, 70 యేళ్ళలో యీ వైద్యం మూడు పూలు ఆరుకాయలుగా విలసిల్లుతున్నది.

పోతుకూచి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారి కుమార్తె జ్యోత్స్నను, పరుచూరి వీరయ్యచౌదరి గారి మేనకోడలు కమలను, డియస్పి సత్యనారాయణగారి మరదలు ఇనజకుమారిని అమ్మ ప్రోత్సహించింది. డాక్టర్ ఇనజకుమారిని జిల్లెళ్ళమూడిలో వైద్యురాలిగా శాశ్వతంగా ఉండేట్లు చేసింది. డాక్టర్ శిష్ట్లాసుబ్బారావు గారు నెల్లూరులో ప్రసిద్ధ వైద్యులు, అమ్మ బాగా ఇష్టపడ్డ ఒకరు. రాచర్ల శ్రీరామమూర్తి భార్యకు పిల్లలు పుట్టరని కమల చెప్పింది. అది లోపల చూచి వచ్చిందా ఎందుకు పుట్టరో చూద్దాం అని హైమకు ప్రదక్షిణ చేయించి పిల్లలను ప్రసాదించింది.

ఇక హోమియో వైద్యానికి వస్తే అధరాపురపు శేషగిరిరావుగారు హోమియో వైద్యులు, స్వాతంత్య్ర నమరయోధులు. అమ్మవద్ద తొలిరోజుల్లో సేవచేసినవారు. వారి మందు అమ్మవాడుతుండేది. నెమ్మదిగా హోమియో మందు పట్ల నమ్మకం కుదురుతూ వచ్చింది. కోన సుబ్బారావురావు గారి కుమారుడు కోస సత్యనారాయణ మూర్తిని హోమియో వైద్యవిద్యకు ప్రోత్సహించి జిల్లెళ్ళమూడిలోనే ప్రభుత్వవైద్యునిగా ఏర్పాటు చేయిచింది. హోమియో వైద్యాన్ని ఆ రకంగా ప్రోత్సహించింది.

ఒకసారి విశాఖ నుండి అయ్యగారి శ్రీ చక్రవర్తి వచ్చినప్పుడు మాటల సందర్భంలో హోమియో వైద్యం నాకిష్టం రా అని చెప్పగా విన్న చక్రవర్తిగారు ఆ వైద్యం నేర్చుకొని, నైపుణ్యం సంపాదించి ఉచితంగా కొన్ని వేల మందికి వైద్య సహాయం చేశారు.

ఈ రకంగా ఆలోచిస్తే అమ్మ ప్రోత్సహించని వైద్యరంగం లేదు. అన్నింటినీ ప్రోత్సహించింది. ఒక్కొక్క వైద్య విధానంలో కొన్ని మెళుకువలు ఉంటాయి. ఏ విధానమూ తీసివేయతగ్గది కాదు. అన్నీ వాటి వాటి పరిధులలో గొప్పవే. అయితే ఆ విద్యలో తపస్సు చేసిన వాని చేతిలో దాని వైభవం వెల్లడౌతూ ఉంటుంది. ప్రతిదానిలోనూ (సైడ్ ఎఫెక్ట్) దుష్ప్రభావాలు ఉంటాయి. అవి రాకుండా వస్తే నివారణకు తీసుకోగలబాధ్యత వైద్యుని ప్రతిభ మీద ఆధారపడి ఉంటాయి.

రాగద్వేషాలు అసలు జబ్బులు. అహంకారం నిజమైన జబ్బు. వాటిని పోగొట్టు కోవటానికి కావలసిన వైద్యం, తెలుసుకోవటం లోనే మానవుని తెలివితేటలు, పైవాని ఆశీర్బలముల మీద ఆధారపడి ఉంటుంది. వల్లూరి జగన్నాథరావు గారి పెద్దకుమారుడు వెంకటరమణకు కాన్సర్ అని అనుమానిస్తుంటే అది కాదేమోరా! అన్నది అమ్మ. అతనికి నివారింపబడింది. కమ్యూనిష్టు పార్టీ పార్లమెంటు మెంబర్ వీరమాచనేని ప్రసాదరావు గారి కోడలికి ఆక్సిడెంట్లో మెదడు దెబ్బతింటే తాను వైద్యురాలై ఆపరేషన్ చేసి బ్రతికించిందని వారి ప్రత్యక్ష దర్శనం. జన్నాభట్ల వెంకట్రామయ్య గారికి సన్యాసం తీసుకోవాలనే మక్కువ. ఎవరికీ చెప్పలేదు. హాస్పిటల్లో ఎక్కువ కాలం జీవించరని చెప్పారు. అమ్మ జిల్లెళ్ళమూడి తీసుకురమ్మని కొడుకు చేతనే జందెం తీసి వేయించి మంత్రోపదేశం చేయించి సన్యాసం ఇప్పించింది. కోన వెంకాయమ్మ గారు ప్రాణం పోకముందే అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేయించి ఇచ్ఛామరణాన్ని ప్రసాదించింది. ఇలా చెప్పుకుంటూపోతే ఇదే ఒక పెద్ద జాబితా అవుతుంది.

ఇవన్నీ యెందుకు? అమ్మకు జబ్బు చేసి హైదరాబాద్ తీసుకువెళ్ళారు. డాక్టర్లు కేన్సర్ అన్నారు. నాన్నగారు నన్ను పంపిన తర్వాతే నీ మహాప్రస్థానం అన్నారు. తనకు డాక్టర్లు చెప్పినట్లు కాన్సర్ కాదేమోనని తగ్గించుకోవటం మొదలైంది నాన్నగారి కోరికపై. అమ్మ చీరాల హాస్పిటల్లో ఉన్నప్పుడు నర్స్ ట్రైనింగ్ పాసైంది. అచటి రోగులందరికీ సేవచేసింది. అమ్మే ఒక రోగి, అమ్మే ఒక నర్స్, అమ్మే ఒక డాక్టర్ అమ్మ కానిదేదీ లేదు. అమ్మను వైద్య విద్యాధరి అంటే అమ్మకు అది ఒక భూషణమే.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!