1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సంపాదకీయము.. (శ్రీ అనసూయాదేవి మూలమంత్రార్ధము)

సంపాదకీయము.. (శ్రీ అనసూయాదేవి మూలమంత్రార్ధము)

P S R Anjaneya Prasad
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 9
Month : April
Issue Number : 9
Year : 2010

మంత్రములు శాశ్వతములు – సనాతనములు – లోకంలో మొదటిసారి దర్శించినవారు ఆ మంత్రద్రష్టలు ఆ మంత్రానికి ఋషులౌతారు. నిజానికి “జయహోమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి” అనే ఈ అమ్మనామ మంత్రాన్ని దర్శనం చేసినవాడు ఒక మహమ్మదీయ సోదరుడు ఇమాం. ‘మహమ్మదీయ’ అంటే మంచితనం అని అమ్మ చెప్పింది. మంచి మనసున్న వాడెవడైనా మహమ్మదీయుడే. అతనిచే దర్శించపబడిన మంత్రం అమ్మ నామం. చిరకాలంగా పారాయణ చేయబడుతున్నది. మంత్రంగా జపం చేయబడుతున్నది. హోమం చేయబడుతున్నది.

నామి కన్నా నామం గొప్పది అన్నది అమ్మ. నామం ఎంతో శక్తివంతమైనది. ఆపదల్లో ఉన్న ఎందరినో ఆదుకుంటున్నది, కాపాడుతున్నది. ఎందరికో శుభాలనూ, సుఖాలనూ ప్రసాదిస్తున్నది. జిల్లెళ్ళమూడి వచ్చే ఎందరి నాల్కలపైననో నాట్యమాడుతున్నదీ అమ్మనామం. మనల్నీ, మన చుట్టూ ఉన్న వాతావరణాన్నీ పవిత్రీకృతం చేస్తున్నది. కలియుగంలో నామస్మరణవల్లనే తరిస్తారని పెద్దలు చెబుతున్నారు. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలెంత సహజమో అంత సహజం కావాలి మనం చేసే నామం. స్మరించడం, సంకీర్తన చేయడం రెండు పద్ధతులు. గాయత్రి సామూహికంగా సంకీర్తన చేయబడ్డది. విశ్వామిత్రుడు మంత్రంగా ఉపాసించాడు. సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగాడు. ‘అమంత్ర మక్షరం నాస్తి’ అన్నారు పెద్దలు. “మననాత్ త్రాయతే ఇతి మంత్రః” అని మంత్రవేత్తలు వివరించారు. ఏదైనా మననం వల్లనే మంత్రమౌతున్నది. ఈనాడు అమ్మ నామాన్ని మంత్రంగా చేస్తున్నవారెందరో ఉన్నారు. హోమాలు చేస్తున్నవారూ ఉన్నారు.

“న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః 

పరదైవతమ్” అనే పండిత సూక్తి ఉన్నది. నిజమే. తల్లిని మించిన దైవము, గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రము లేదన్నది లోకవిదితమే – అదృష్టవశాత్తు అమ్మే మనకు సర్వదేవదేవీ స్వరూపిణి, గాయత్రి, లలిత – ఒకటేమిటి ? అన్నీ. అందుకే ఆదీ అంతమూ కానిది అంతటికీ ఆధారమైనది అం ఆ అనేది మనకు అమ్మ చెప్పినమాట. ఇప్పటివరకు మనం చేస్తున్న అమ్మ నామానికే ముందు ఓం – చివర స్వాహా అనే అనే అక్షరాలు కలిపి అమ్మ నామాన్ని శ్రీ అనసూయాదేవి మూలమంత్రంగా ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చాడు మన సోదరుడు జయంతి చక్రవర్తి. ఓం జయహోమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి స్వాహా అనే ఈ మంత్రంలోని అక్షరాలు 24, గాయత్రీ మహామంత్రంలోని అక్షరాలు 24. ఆ రకంగా శ్రీ అనసూయాదేవి మూలమంత్రాన్ని మాతృగాయత్రీ మంత్రంగా సంభావించవచ్చు. ఈ మంత్రాన్ని జపించి సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుని లాగా ముందు ముందు ఎందరు వస్తారో.

ఈ మంత్రాన్ని దీక్షతో ఒక లక్ష జపం చేయండి అన్నప్పుడు కొందరు ఈ మంత్రానికి అర్థం వ్రాస్తే బాగుంటుంది అన్నారు. నిజానికి మంత్రాలన్నింటికీ అర్థాలుంటాయని చెప్పలేం. కాని ఈ మహామంత్రానికి అర్ధం “విబుధవరులవలన విన్నంత కన్నంత తెలియ వచ్చినంత” మీ ముందుంచటానికి ప్రయత్నిస్తాను.

ముందుగా “ఓం” అనే అక్షరం ఉన్నది. దీన్ని ‘ప్రణవము’ అని కూడా అంటారు. ప్రణవం అంటే ఎల్లప్పుడూ చురుకైన సాధనకు తోడ్పడునది అని అర్థం. లక్ష్యభూతమైన వివేకాన్నీ, పరమాత్మ స్వరూపాన్నీ సూచించే అక్షరం ఓం. సర్వవిఘ్నాలను, సర్వదోషాలను హరించేది అని వరాహోపనిషత్ చెపుతున్నది.

“ఓంకార ప్రభవో దేవాః ఓంకార ప్రభవాస్వరాః 

ఓంకార ప్రభ వస్సర్వం త్రైలోక్యం సచరాచరమ్”

ఓంకారమే పరబ్రహ్మము; ఓంకారము నుండి సమస్త దేవతా స్వరూపాలు, స్వరసహితమైన సర్వవేద సాహిత్యము, చరాచరజగత్తు జనించాయి. ఈ ఓంకారాన్ని ధ్యానించటం వల్ల దీర్ఘాయుస్సు, అపారమైన ప్రజ్ఞ, కీర్తి, బ్రహ్మవర్చస్సు పొందుతారు అని మనుస్మృతి చెబుతున్నది. సర్వశ్రేష్ఠమైన ఈ ఓంకారాన్ని స్మరిస్తే ఎవరు ఏది కోరితే వారికది సిద్ధిస్తుందని కఠోపనిషత్ పలుకుతున్నది. ఉదకంలో రసంగా, సూర్యచంద్రులలో తేజస్సుగా, వేదాలలో ఓంకారంగా, ఆకాశంలో శబ్దంగా, పురుషులలో మోక్షసాధనమైన పౌరుషంగా నేనున్నాను అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు.

మంత్రాలన్నింటికీ ఓంకారము మూలకము, శిరస్థానీయము. అందుకే ప్రతిమంత్రమునకు అన్నారు. ప్రారంభంలోనో, మధ్యనో ఈ బీజాక్షరము చేర్చబడి ఉంటుంది. లేకపోతే అది వైదికమంత్రం కాదు. మోక్షప్రాప్తికి అంతగా సాయం చేయదు.

కాశీలో మరణించిన వారికి విశ్వేశ్వరుడు మరణ సమయంలో స్వయంగా వారి చెవిలో తారకమంత్రాన్ని ఉపదేశించి ఉత్తమగతులు కల్పిస్తాడని ప్రతీతి. దీన్ని గూర్చి పద్మపురాణంలో ఒక కథ కూడా ఉన్నది. మృగశృంగుడనే ఋషీశ్వరుని భార్యలు, కాశీ విశ్వేశ్వరాలయంలో ప్రదక్షిణాలు చేస్తూ స్పృహతప్పిపడిపోతూ మహేశ్వరుని రక్షింపమని కోరారు. వారి తలలను తన ఒడిలోకి తీసుకోని విశ్వేశ్వరుడు ఓంకారం ఉపదేశించాడు. ఆ తారకమంత్రంతో వారు దివ్యదేహాలతో శివలోకప్రాప్తిని పొందారు. నిర్గుణ పరబ్రహ్మానికి సగుణరూపం ఓం.

“ప్రణవం హేశ్వరం విద్యాత్ సర్వస్యహృదయ స్థితమ్ 

సర్వవ్యాపిన మోంకారం మత్వా ధీరోన శోచతి”

సర్వజీవుల హృదయాంతరాళ మందున్న ఈశ్వరుడే ఓంకారము. అంటే అందరిలో ఉన్న ఆత్మకే ఓంకారమని పేరు. అందుకే అమ్మ “అది కానిది ఏదీ లేదు. ఉన్నదంతా అదే” అన్నది. అందువల్ల ఓంకారం అంత మహిమాన్వితమైనది.

ఇక రెండవది “జయహోమాతా !” మాతకు జయమగును గాక అని సామాన్యార్థము. ఇందులో రెండు శబ్దములున్నవి. “జయహో”! ఒకటి, రెండవది “మాతా”. జయ అనగా లోకమునకు జయమును చేకూర్చు జయస్వరూపిణి. చివరకు మృత్యువును కూడా జయించినది అమ్మవారు. తనపై తనకు ఆధిపత్యం వస్తే ఇతరులపైన కూడా ఆధిపత్యం వస్తుంది. దీన్నే జయము, విజయము అంటారు. అమ్మకు ఈ రెండూ ఉన్నాయి. తనను అర్చించిన వారికి జయాన్ని ప్రసాదిస్తుంది కనుక అమ్మ జయ. అపజయం లేనిది. అంతేకాదు అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రారచక్రాలలో విజయంచేయునది జయ. అలా సర్వత్రా నిండి ఉండే శ్రీచక్రసంవాసినికి, జయమగుగాక! అని జయగీతిక పలుకుతాం. ‘సాజయతి శక్తిరాద్యా’ అన్నారు. సర్వోత్కృష్టమైన ఆద్యమైన శక్తిని జయ అని

ఇక ‘మాతా’ శబ్దం. మాత అంటే తల్లి. తన నుండి మరొక ప్రాణికి రూపం ఇచ్చేది తల్లి. ప్రధమ గౌరవం అందుకునేది తల్లి. ‘మాతృదేవోభవ’ అనేది ఉపనిషత్ వాక్యం. తల్లిని దేవతగా భావించమని ఉపదేశం. లోకంలోని తల్లులు తాపత్రయాన్ని పొగొట్టలేరు. జగన్మాతయే సమర్ధురాలైనది. సృష్టి ఎవరి నుండి వస్తుందో ఆమె మాత. మానవాళికి అమృతాన్ని ప్రసాదించేది మాత. అమ్మ అమృతస్వరూపిణి. మనం “అమృతస్య పుత్రాః” అయినా మృత స్వరూపులమనుకుంటున్నాం. మనలోని ఆ అజ్ఞానాన్ని పోగొట్టేది మాత. “మంత్రాణాం మాతృభూతాచ మాతృకా పరమేశ్వరీ” అని స్కాందపురాణం చెప్పింది. అన్నిమంత్రాలకు తల్లి మాత.

మాత పదానికి కొలుచునది అని అర్థం. ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎప్పుడివ్వాలో, ఎలా ఇవ్వాలో ఆ కొలత తెలిసినది అమ్మ. కొలతలన్నింటికి తొలి కొలత ఆమె. క్షమ, వాత్సల్యం ఆమె లక్షణాలు. కామజయము, కాలజయము ఆ తల్లివల్లనే వస్తాయి. అమ్మ అంతులేనిది. అడ్డులేనిది, అంతా అయినది, అంతటికీ ఆధారమైనది అని అర్థాలిచ్చింది. తల్లికి తప్పే కనిపించనదన్నది. తల్లి అంటే తనలో లీనం చేసుకొనేది అన్నది. అందుకే మాతా అంటే సృష్టిస్థితిలయాలకు ఆధారమైనది అని అర్థం. తరతమ బేధాలు లేని అమ్మ మాతృత్వాన్ని గూర్చి వాత్సల్యాన్ని గూర్చి ఎంత చెప్పినా తక్కువే కనుక ఉదాహరణలివ్వలేదు. తానే మనల్ని కని మన తల్లులకు పెంపుడిచ్చానన్నది. కనుక అందరి తల్లి అమ్మ.

ఇక ‘శ్రీఅనసూయ’ అంటే ఏమిటో చూద్దాం. ఇక్కడా రెండు పదాలున్నాయి “శ్రీ”, “అనసూయ”. శ్రీ అంటే

మంగళప్రదమైన, శుభప్రదమైన అని అర్థం. శకార, ‘ర’ కార, ‘ఈ’ కారాలున్నాయి. అంటే లక్ష్మి – సరస్వతి – పార్వతి ముగ్గురు ఉన్నారన్నమాట. శ్రీ గౌరవవాచకంగా, పరాత్పరి. శ్రేష్ఠతావాచకంగా కూడా ఉపయోగించుకుంటున్నాం. “శ్రియతే జనైరితి శ్రీః” అనే వ్యుత్పత్తి ప్రకారం జనులచే ఆశ్రయింపబడునది. సర్వసృష్టిచేత సేవ్యురాలైన శ్రీ లోకమాత. షోడశి చివరి అక్షరం ‘శ్రీ’ కారమే.

‘అనసూయా’ అనే పదానికి అమ్మ – ‘అసూయకు తావులేనిది’ రాగద్వేషాలను పారద్రోలేది అనసూయ, అన్నది. అది అమ్మతత్వం. నిజానికి అసూయకు అవకాశం ఎక్కడ? మీరంతా నేనే, మీదంతా నేనే, మీరు నా అవయవాలు అంటున్న అమ్మ ఎవరి మీద అసూయ చెందాలి ? తనుకాక వేరొకరున్నపుడు కదా ! అసూయకాని, ద్వేషం కాని రావటానికి. “మీరేం చేసినా మీరు కారణం అనుకుంటేగా నాకు కోపం రావటానికి” అంటుంది అమ్మ. అంతేకాదు పురాణాలలో త్రిమూర్తులను పసిపిల్లలను చేసింది అత్రి అనసూయ. కాని మన అమ్మ అందరినీ తన బిడ్డలుగానే భావించింది. నాకంతా శిశువులే కానీ శిష్యులు లేరన్నది.

ఇక ‘రాజరాజేశ్వరి’. రాజ శబ్దానికి మనువు, కుబేరుడు, చంద్రుడు, ప్రభువు అని అర్థాలున్నాయి. రాజరాజు అంటే వీళ్ళందరికీ ప్రభువు. అంటే వీరికి ఆరాధ్యులు త్రిమూర్తులు. రాజరాజేశ్వరి అంటే ఈ త్రిమూర్తులకు కూడా ఆరాధ్యమైన ఈశ్వరి. ఈశ్వరి అంటే సత్వగుణప్రధానమైనది. ఈశ్వరునికి శక్తి చేకూర్చేది. సర్వతంత్ర స్వతంత్రమైనది. అధిపతి. సర్వాంతర్యామిని. రాజరాజేశ్వరి అంటే సర్వసృష్టికీ మూలమైనది. అంటే అన్ని నేనులకూ మూలమైన నేను.

 ఇక శ్రీపరాత్పరి. పరులైన బ్రహ్మ విష్ణు రుద్రుల కంటే శ్రేష్ఠ తరురాలు కనుక పరాత్పరి. బ్రహ్మ ఆయువునుపరం అంటారు. అందులో సగం పరార్థం. అంటే సగంరాత్రి, సగం పగలు. అమ్మ కాలస్వరూపిణి. ఆమె వాటిని ఏర్పరచేది. ఉత్కృష్టమైన వారికంటే ఉత్కృష్టమైనది పరాత్పరి. 

”శ్రీ’ అంటే పూర్వమే చెప్పుకున్నాం. సర్వశ్రేయములను కూర్చేది, సర్వశ్రేయములను, సర్వసంపదలను సర్వులకు ఇవ్వగల శక్తిసంపన్నురాలు, అన్నిటికన్నా అందరికన్నా అతీతురాలు కనుక శ్రీపరాత్పరి.

ఇక ‘స్వాహా ! సు + ఆహా =స్వాహా, చక్కగా ఆహ్వానించుట లేక స్వాగతము పలుకుట. దేవతలకు సమర్పించే హవిస్సు హోమగుండంలో వేసేటప్పుడు ఏ దేవతకు సమర్పిస్తున్నామో చెప్పి, స్వాహా అంటాము. శ్రీ పరాత్పరి స్వాహా అంటే ఇది పరాత్పరికి సమర్పిస్తున్నాను, మమ. ఇది నాది కాదు అంటాము – ముఖావై దేవాః” దేవతలు అగ్నిముఖులు. “స్వాహాంతు దక్షిణే పార్శ్వే” అంటే అగ్నికి కుడివైపున ఉండేది స్వాహా దేవి. తేజఃస్వరూపిణి. అగ్నికి తోడ్పడే సహధర్మచారిణి స్వాహా. అలాగే దేవతలకు హవిస్సును అందించే మంచి మార్గము స్వాహా అని తెలుసుకోవాలి. అంతే కాదు ‘స్వ’ అంటే స్వర్గం లేక ఆత్మ. ‘ఆహ’ అంటే పొందటం. స్వాహా అంటే ఆత్మను పొందేది లేక పొందించేది అని అర్ధం. అమ్మ స్వాత్మ స్వరూపిణికదా !

ఏతా వాతా ఈ మంత్రాన్ని నిశితంగా పరిశీలిస్తే ఇందులోని అన్నిపదాలు శుద్ధచైతన్యానికి ప్రతీకలే. మోక్షసాధనకు మార్గం సుగమం చేసేవే. ‘ఒక్కొక్క పదమే ఒక్కొక్క మంత్రం’ అన్నిపదాలూ కలసి మహామంత్రం. ఈ మంత్రం అర్థం తెలిసి మీరు చెయ్యండి. తరించండి. ఇతరులతో చేయించి తరింపచేయండి. అంతే. ఈ మంత్ర లేఖనం ద్వారా జిల్లెళ్ళమూడిలో నిర్మించబోయే అనసూయాదేవి కోటి నామ స్తంభంలో మీరు వ్రాసిన  గ్రంథాలు ఉంచి పుణ్యమూర్తులై, యశోమూర్తులై అమ్మ   అనుగ్రహపాత్రులు కండి. శ్రీ సూక్త పారాయణము – హోమము

 – పి.యస్.ఆర్.

 

అందరినీ మోసే తల్లి భూదేవి. ఉన్నా పోయినా మోసేది ఆమే.

దేశసేవ, దేవునిసేవ రెండూ వేరు కాదు.

ఎక్కడి కక్కడే తృప్తి. చెట్ల క్రింద వాళ్ళను చూసి తృప్తిచెందాలి, మనం వంటినిండా బట్టలైనా కట్టుకుంటున్నాము.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!