అమ్మవారు షోదశి. అంటే త్రిపురసుందరి. అమ్మషోడశకళాప్రపూర్ణ. లలితాసహస్రనామాల్లో కూడా అమ్మ అష్టమీచంద్ర విభ్రాజ దళికస్థలశోభిత. అమ్మవారి ముఖం చంద్రబింబం, తాటంకయుగళీ భూత తపనోడుప మండల అమ్మవారి తాటంకాలు సూర్య చంద్రులు, అమ్మ చంద్రమండల మధ్యగ, అమ్మది చంద్రవిద్య, అమ్మ చారుచంద్ర కళాధర, అమ్మ భాగ్యాబ్ధి చంద్రిక, శరచ్చంద్ర నిభానన, షోడశి అయిన అమ్మను షోడశోపచారా లతో పూజిస్తుంటాం. ఆవాహనం అంటే ఆహ్వానించటం, ఆసనం సమర్పించటం, పాదాలు కడగటం చేతులు కడగటం, త్రాగటానికి నీరివ్వటం, అభిషేకం చేయటం, వస్త్రాలు సమర్పించటం, యజ్ఞోపవీతం సమర్పించటం, గంధం రాయటం, పుష్పాలతో పూజించటం, ధూపము దీపము, నైవేద్యాలు, తాంబూ లాలు, ప్రదక్షిణం, నమస్కారాలు అనే ఈ పదహారు ఉపచారాలతో అమ్మను పూజించటం కూడా ఒక విశిష్టమైన సేవే.
చంద్రునకు పదహారు కళలున్నట్లుగా, అమ్మవారికి షోడశోపచారాలు చేసినట్లుగా, పదహారు అక్షరాలలో నివసించే అమ్మవారు షోడశిగా ప్రకాశిస్తున్నట్లుగా పదహారు గుణాలతో అమ్మవారు ప్రకాశించటంలో విశేషమేమీ లేదు. ఈలా ఇదివరకు పదహారు గుణాలున్నవారు ఎవరైనా ఉన్నారా ? అని ఆలోచించాను.
నాకు వచ్చిన ఈ అనుమానాన్నే ఆదికవి వాల్మీకి మహర్షికి వచ్చి నారదుని ప్రశ్నించాడు.
ఈ లోకంలో గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్య సంపన్నుడు, దృఢవ్రతుడు, సచ్చరిత్రగలవాడు, సర్వభూతహితం కోరేవాడు, విద్వాంసుడు, సమర్థుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, జితక్రోధుడు, ద్యుతిమంతుడు, అనసూయుడు, దేవతలు సైతం ఎవరిని చూచి భయపడి తమ విధులు నిర్వర్తిస్తారో అటువంటి వాడు ఎవరైనా ఉన్నారా ? అని అడగ్గా ఆలోచించి, ఉన్నాడని చెప్పాడు శ్రీరాముణ్ణి గురించి అలాగే –
అటువంటి వారెవరైనా ఈ కలియుగంలో కనిపించారా అని మనం ప్రశ్నవేసుకొంటే, ఇదుగో మన అదృష్టవశాత్తూ మనల్ని ఉద్ధరించటానికి ద్వంద్వాల కతీతంగా సర్వసృష్టిని తన సంతతిగా భావించిన మాతృ మూర్తి అవతరించింది. ‘కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతిః” తన పది వ్రేళ్ళ నుండి విష్ణుమూర్తి పది అవతారాలను సృష్టించిన లలితాదేవిగానే కాదు తానే సృష్టిగా మారిన చైతన్య స్వరూపిణి, అద్వైతమూర్తి మన కళ్ళముందు నదయాడింది. కనీసం ఆ పదహారు గుణాలు, ఆ పదహారు. కళలుగా అమ్మలోఏలా మూర్తిభవించి ఉన్నాయ్యో చింతన చేద్దాం.
ఎవరు గుణవతియొ ఎవరు వీర్యవతియొ
ధర్మజ్ఞ ఎవరు ? కృతజ్ఞ యెవరు ?
ఎవరు సత్యారాధ్య ఎవరు దృఢవ్రత
ఎవరు సదాచార ఎవరు కాంతి
ఎవరు విద్వాంసయు ఈ జగత్తుకు నెల్ల
సర్వభూతహిత ప్రశాంత ఎవరు
ఎవరు సమర్ధయో ఎవరాత్మ వంతయో
ఎవరు జితక్రోధ మెసగువారు
ఎవరహంకార రహితయొ ఎరుగ గలరే
నేటిలోకాన మాతృత్వ నియతి తోడ
సర్వసృష్టిగా తానైన సాధ్వి యెవరు.
ఆమె ప్రియదర్శినియె ‘అమ్మ’ అరయుడింక
గుణవతి: సమస్త కళ్యాణ గుణములు కలది. కళ్యాణ గుణములేనా ? సర్వగుణసమారాధ్యా అనాలి. అవ్యక్తరూపమైన చైతన్యం, పరమాత్మ వ్యక్తరూపం ధరించటమే గుణము. “అనేన జీవేనాత్మ నాను ప్రవిశ్య నామరూపే వాకరవాణి” నామ రూపాలున్న సర్వజీవులలో ప్రవేశిస్తున్నది. ఆశ్రితులైన వారు పలుమార్లు దేనిని ప్రశంసిస్తారో అది గుణము. అనేకంగా కనిపించినా ఒకటిగా అనిపించేది నిజమైన గుణం. నిర్మలమైన అంతః’ కరణ మానవత్వం కలది గుణవతి. హైదరాబాదు నుండి వచ్చిన గోపాలన్నయ్య వెంకటరత్నం గారు నీకు నమస్కారం చెప్పమన్నారమ్మా! అని చెబితే అవి ఎప్పుడో అందాయి నీవే ఆలస్యంగా వచ్చావు అన్నది అమ్మ. జాతిభేదం, కులభేదం, గుణభేదం కూడా లేకుండా అందరినీ ప్రేమించింది. బెస్తవాడైనా, పాకీవాడైనా, తనను చంపటానికి వచ్చిన నక్సలైట్ అయినా ఎవరినైనా ప్రేమించింది. అది నిజమైన గుణం. అది అమ్మలో చూచాం.
వీర్యవతి : సర్వజీవులు తానైన పరమాత్మ తన ఆత్మతత్వాన్ని మరువకుండ, వదలకుండా ఉండటమే వీరత్వం. అందుకే ‘అజాయమానో బహుధా విజాయతే’ అని స్తుతించింది వేదం. తాను వికారపడక తన నుండి వచ్చిన వారిని కూడ వికారపడకుండ చేసే శక్తి వీర్యవతి. అమ్మ అన్నపూర్ణాలయం ఏర్పాటు చేసింది. మన చేత నడిపిస్తున్నది. తాను చేయలేక మన చేత నడిపిస్తున్నదా? కానే కాదు మనకు ముక్తిని ప్రసాదించా లంటే ఏదో ఒక కార్యం మనచేత చేయించి ఆకారణంతో మనకు కావలసింది ఇవ్వాలి. శ్రీరాముడు కోతుల సహాయం లేకపోతే సముద్రానికి వారధి కట్టలేదా సీతను తేలేదా! తేగలిగినా వారిని ఉద్ధరించాలంటే ఆపనివారి చేత చేయించాలి. అమరకోశంలో కూడా ‘స వీర్యమతి శక్తి ‘భాక్’ అత్యంత శక్తిమంతుడైన వీరునిలో ఉండే ఉత్సాహగుణము. వీరము అనిచెపుతున్నది. వీరులలో దానవీరులు, దయావీరులు అని ఉంటారు. అమ్మ ఈ రెండు గుణములు కలది. ఆశ్రితులనే కాదు బిడ్డలకు ఎవరికి ఎప్పుడు ఏ అవసరమో కనుక్కొని ఇచ్చేది తల్లి. ‘అంఆ’ ఇది ప్రణవము. అందరూ ధ్యానింపదగినది. ఈమంత్రము ఉపాసకులకు కల్పవృక్షము. “ద్యక్షరో మంత్ర రాజోయం సర్వాభీష్ట ప్రదష్టస్తతః” పూర్ణబిందువుతో కూడిన రెండు అక్షరాలు భుక్తి ముక్తులతో పాటు సర్వాభీష్ట ప్రదాయినులు, మనస్సు స్థిరముగా ఉండునది వీర్యవతి. తన కన్న వయస్సులో చిన్నవారు, పెద్దవారు అందరూ తనవారే కనుక అందరినీ తనంత వారిని చేయటమే వీరత్వ లక్షణం. అమ్మ అలా చేసింది. అందుకే హైమను దేవతగా చేసింది, మనలను దేవత అన్నది.
ధర్మజ్ఞ: సృష్టి స్థితి లయాలకు కర్తృత్వం వహించటం ధర్మజ్ఞత. “హైమను నేనే కన్నాను, నేనే పెంచాను, నేనే చంపాను” అన్నది అమ్మ. అంటే ఈ మూడు కార్యాలకు కర్త ఎవరు ? తాననేగా. ఉపనిషత్తులు కూడా “యతో వా ఇమాని భూతాని జాయన్తో యేన జాతాని జీవన్తి యత్ప్రయం త్యభి సంవిశంతి – తద్విజిజ్ఞాసస్వ తత్ప్రృహ్మేతి” అన్నది. అంటే ఎవరి వల్ల భూతాలు పుట్టుతున్నవో – ఎవరి వల్ల జీవిస్తున్నవో, ఎవరివల్ల నాశనం చెందుతున్నవో అది బ్రహ్మమే”.
ధర్మాలను ఆచరించటం తెలిసినవారు ధర్మజ్ఞులు. సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలు రెండూ తెలిసిన వారు ధర్మజ్ఞులు. లౌకిక జీవనంలో ధర్మము, అధర్మము అని రెండు కనిపిస్తున్నాయి. కాని నిజానికి లౌకికము పారమార్థికము అని రెండు లేవు. ఉన్నది ఒకటే – అని అమ్మ చెపుతున్నది. ప్రేమ కన్నా ధర్మం గొప్పది. దశరధునకు రామచంద్రునిపై అపారమైన ప్రేమ – కాని కైక కిచ్చిన వరాలు రెండూ ఇవ్వటం ధర్మం. తన తండ్రి ఇచ్చిన మాట నెరవేర్చటానికి ధర్మమార్గాన్ని అవలంబించాడు రాముడు. నిజానికి బాల్యం నుండి కైక ఇంట్లోనే ఎక్కువ కాలం గడిపేవాడు రాముడు. ఒక పుత్రునిగా, అన్నగా, మిత్రునిగా అందరియెడల ఎలా ప్రవర్తించాలో అలా నడుచుకున్న ధర్మాత్ముడు రాముడు.
అలాగే అమ్మ కూడా చాలాదూరం నుండి వచ్చిన ఒక స్త్రీని భర్తవద్దకు పంపుతూ “ప్రేమ ఉన్నా ధర్మానికి కట్టుబడకతప్పలేదు. అది అన్ని వందల మైళ్ళ దూరం నుండి నా కోసం పరుగెత్తుకొని వచ్చినా భర్త దగ్గరకు పంపించటం నా ధర్మం. ప్రేమకన్నా ధర్మం గొప్పదని ఋజువు చేసింది ఈ అర్జంటు ప్రయాణం. కారణం ప్రేమ…. పరిమితమైంది. ధర్మం సర్వవ్యాప్తమై ఉన్నది.
కృతజ్ఞ: ఇతరులు తనకు చేసిన ఉపకారము చిన్నదైనా, తక్కువదైనా దానిని గొప్పగా భావించి జ్ఞప్తిలో ఉంచుకొన్నవారు కృతజ్ఞులు. ఒకవేళ ఎవరైనా అపకారం చేసినా దానిని లెక్కించకుండా అవసరమైన ఉపకారం చేసేవారు. భగవంతునకు అపకారం చేస్తే వాటికి ఆయన మనల్ని శిక్షించాలనుకుంటే రక్షించేదెవరు ? శ్రీరామ చంద్రునకు జటాయువు సీతాదేవి జాడ చెప్పాడు. ఆ చిన్న సాయానికే ఉత్తమలోకప్రాప్తి అనుగ్రహించాడు. రాముడు. అమ్మ కూడా అందరింటికి సహాయం తెలిసి చేసినా తెలియకచేసినా వారికి ఇబ్బడిముబ్బడిగా ప్రసాదించేది. తన చిన్నతనంలో తెనాలిలో తన పినతల్లి దాచి పెట్టి అమ్మకు ఏదైనా చిరుతిండి పెట్టేది. దానిని గుర్తుంచుకొని ఆమె మనుమరాలిని తన పెద్దకోడలిగా చేసుకొన్నది. జగదేకారాధ్యయైన భగవతికి ఎవరైనా ఉపకారం చేయటమేమిటండీ ? అనవచ్చు. ఇతరుల సాయము ఉపకారము ఆశించని భగవతికి కృతజ్ఞత ఏమిటి ? అనవచ్చు. ఏమీ ఉపకారం చేయకపోయినా అమ్మ నాకు జపం చేస్తుంటే చాలు అవసరమైనపుడు వీడేం కోరలేదే అని మోక్ష సుఖాన్ని ఇస్తుంది అని “జీవన్ జపత్యనుదినం మరణే ఋణీవ పాషాణ కాష్ఠ సదృశాయ దదామి ముక్తిమ్” అనే వాక్యంచెపుతున్నది.
సత్యవాక్యః సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యశబ్దం పరమాత్మ వాచకం. ‘సత్ అంటే ఆత్మ ‘అ’ అనగా ప్రకృతి ‘యమ్’ అంటే పై రెంటినీ నియమించేది. ఎంత కష్టం వచ్చినా, సంకట పరిస్థితులలోనూ అసత్యం పలుకని వారు సత్యవాక్యులు. బలిచక్రవర్తి ఆత్మబలం కలవాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అమ్మ కూడా ఎప్పుడో మన్నవ హరగోపాల్కు ఆయన అభ్యర్థనపై మాట ఇచ్చింది నీ పెళ్ళికి వస్తానురా అని. అలాగే ఎంత అనారోగ్యంలో ఉన్నా నరసరావుపేటలో వివాహానికి వెళ్ళి ఆశీర్వదించి వచ్చింది.
దృఢవ్రతః శరణు వేడిన వారిని రక్షించటంలో దృఢంగా ఉండటం. నిశ్చలమైన సంకల్పం కలిగి ఉండటం దృఢనిష్ఠ, చంచలచిత్తం లేకుండా ఉండటం. శ్రీరాముడు పట్టాభిషేకం వనవాసాలకు వెళ్ళాలని తెలిసిన తర్వాత తాను వచ్చిన రాజరధాన్ని వదిలి కాలనడకన కౌసల్య మందిరానికి వెళ్ళాడు. అక్కడ నుండి కౌసల్య ఎంత వారించినా అడవులకు వెళ్ళాడు. అది దృఢవ్రతం. అలాగే అమ్మ కూడా తాను సర్వులకూ, స్వతంత్రమైన సత్రం, అన్నపూర్ణాలయం పెట్టాలనుకున్నది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా దానిని నెరవేర్చింది అది దృఢవ్రతం.
సంతత అనుష్ఠిత చారిత్ర : అరిషడ్వర్గాలకు (కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు) లోను కాకుండా ఉన్న వ్యక్తులు నిజమైన చరిత్ర సంపన్నులు. ధనలోభం లేకుండా ఉన్నవారు చరిత్ర కలవారు. అమ్మ కున్న కోరిక చిత్రమైనది. ఇంకా బిడ్డలను కనాలనే కోరిక, వారికి ఇంకా బాగా పెట్టుకోవాలనే చింత నాకూ ఉన్నాయి అన్నది. అలాంటి అమ్మను అరిషడ్వర్గాలేం చేస్తాయి. అంతేకాదు “భావం తెలుసుకొని ప్రవర్తించేది భార్య. బాధ్యత తీసుకొని భరించేవాడు భర్త” అన్న అమ్మ యీ రెండు పనులూ ఇతరులకు ఆదర్శంగానే నిర్వర్తించి చారిత్రక సంపన్న అయింది. నాన్నగారి పాదాల శబ్దం కూడా ఎక్కడున్నా వినిపించేది. వసుంధరకు భర్తగానే కాదు లోకాన్నంతా పురుషోత్తమునిగా భరించింది.
సర్వభూతహిత: సమస్త ప్రాణులకు హితము కూర్చునది అంటే మేలు చేయునది. తనవారు – పెరవారు అనే తేడా లేదు, అపరాధం చేసిన వారికి కూడా మేలు చేయటమే లక్ష్యం. సంజీవ పర్వతం ఆంజనేయుడు తెస్తే బ్రతికేది లక్ష్మణుడొకడే కాదు వానరులు. రాక్షసులు కూడా. అలాగే అమ్మ ఆకలికి పెట్టే అన్నం మంచి వారికే కాదు నక్సలైట్లకైనా – స్వర్ణోత్సవంలో అన్నం లక్షమంది మానవులకే గాదు జలచరాలకు జంతుజాలానికి చరాచర జీవకోటికి వెదజల్లింది.
విద్వాంసః: పరమాత్మ సర్వవిదుడు. కళ్ళులేకుండా చూడగలడు. సమస్త శాస్త్రములు తెలిసినవారు విద్వాంసులు. విద్ అంటే తెలిసికొనుట. దేనినితెలుసుకుంటే తాను కాకుండా ఏదీ లేదనే స్థితి. అంతా తానైనవాడు ప్రాపంచికం వేరు పారమార్థికం వేరు అనుకోని వారు విద్వాంసులు. అమ్మ అటువంటి విద్వాంసురాలు.
సమర్ధ: సంపూర్ణ విశ్వాన్నీ సృష్టించగల సామర్థ్యం గలవారు సమర్థులు. అనన్య సామర్థ్యం కలవారు సమర్థులు. “మహాబుద్ధి. మహాసిద్ధిః మహావీర్యో మహాబలః” అని లలితా సహస్రనామం చెపుతున్నది. 14 రోజులలో సముద్రానికి వారధి కట్టాడు రాముడు. శివుని విల్లు ఎక్కు బెట్టితే చాలు అంటే విరగ్గొట్టాడు రాముడు. అందువల్ల సమర్ధుడు.
అలాగే అమ్మ లక్షమందికి ఒకే పంక్తిని భోజనం పెట్టించింది. ఎంతటి తుపాను భీభత్యాలు ఎదురైనా ఎన్నో పెళ్ళిళ్ళలో వర్షం రాకుండా అడ్డుకున్నది. ఎందరి ప్రాణాలనో రక్షించింది. కొన్ని రోజులు చావును పొడిగించింది. ప్రత్యక్షంగా దర్శించాం.
ప్రియదర్శన: సాలోక్య, సామీప్య, సాయుజ్య దశల ద్వారా ఆనందాన్ని కలిగించే అనిర్వచనీయమైన అభుభూతిని ప్రాప్తింప చేసేవారు ప్రియదర్శనులు. మిత్రులచేత శత్రువులచేత కూడా ప్రేమింపబడేవారు ప్రియదర్శనులు. శ్రీరాముడు పురుషులచేత కూడా ప్రేమింపబడేవాడట. అందుకే ‘పుంసాం మోహనరూపాయ’ అన్నారు. ఎవరి దర్శనం లోకాలకు ప్రియమో వారు ప్రియదర్శనులు. ఒకరి సుఖం కలిగించేది వేరొకరికి దుఃఖం కలిగించవచ్చు. అలాకాక సర్వులకూ నిమిష నిమిషానికి రమణీయంగా కనిపించేవారు ప్రియదర్శనులు. ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపించేవారు. ప్రియదర్శనులు. సామాన్యంగా స్త్రీలు మరొకస్త్రీని మెచ్చరు. అలా కాకుండా అమ్మ స్త్రీల చేత, పురుషుల చేత అందరిచేత ఆరాధనీయమైన ప్రియదర్శిని.
ఆత్మవతి : తనకు స్వాధీనమైన మనస్సు కలవారు ఆత్మవంతులు, నిశ్చలమైన ధైర్యవంతులు. ఆత్మ చేతనే మనస్సు ఏర్పడ్డది. మనస్సు అంటే కదలిక. మనస్సు అంతటా ఉన్నది. రెండుగా చూచినప్పుడు అస్వతంత్ర. ఒకటిగా అయినప్పుడు స్వతంత్ర. మనస్సుతో మనస్సును గుర్తించిన వారు ఆత్మవంతులు. అమ్మ సర్వమూ అయి అందరితో ఒకటిగా వేరొకటి లేకుండా ఆత్మగా ఉన్నది.
జితక్రోధా: ఎవ్వరి మీద ఎట్టి క్రోధం లేకుండటం జితేంద్రియత్వం. ఇది పరమాత్మ లక్షణం. చంపదగిన శత్రువు వచ్చినా ఉదారంగా క్షమించగలగటం జితక్రోధం. అభయమడిగితే రాముడు రావణాసురుని కూడా క్షమిస్తానన్నాడు. కాకాసురుని క్షమించాడు. అలాగే అమ్మను చంపటానికి ప్రయత్నించినవారు, చెరచటానికి ప్రయత్నించిన వారు ఎందరో ఉన్నారు. అమ్మ అందరినీ క్షమించింది. నక్సలైట్లతో సహా అందరినీ తన బిడ్డలుగానే భావించింది.
ద్యుతిమతి : ద్యుతి అంటే వెలుగు, కాంతి. ఉపనిషత్తులలో పరమాత్మను పరంజ్యోతి అన్నారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ ఆ పరంజ్యోతి కారణంగానే ప్రకాశిస్తున్నాయి. సినిమా యాక్టర్లు మద్రాసులో అమ్మ వద్దకు వచ్చి మనం ఎంతగా ముఖానికి క్రీములు పూసుకొని అలంకారాలు చేసుకొన్నా సామాన్యంగా ఉన్న అమ్మ ముఖకాంతి ముందు దిగరుడుపే అనుకున్నారు. అమ్మ ముఖవర్చస్సులో అనిర్వచనీయమైన కాంతి వెల్లువ గోచరిస్తుంది. అది సామాన్య సౌందర్యం. కాదు. ఆత్మ సౌందర్యం.
దేవతలను కూడా శాసించగల తెచ్చుకొన్న రోషం కలది: రోషం గాని, క్రోధంగాని అమ్మకు లేదు. అయితే అమ్మ కన్నులలోని భీకరతచూస్తే దేవతలైనా భయపడతారు. పరమేశ్వరి ఆజ్ఞవల్లనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకార్యాలు చేస్తున్నారు. వాయువు వీస్తున్నాడు.. దిక్పాలకులు తమ విధులు నిర్వర్తిస్తున్నారు. సముద్రుడు రమ్మంటే వచ్చి అమ్మ పాదాలు కడిగాడు. ఎండాకాలంలో ఇప్పుడు గాలివీస్తే బాగుండు అంటే గాలివీచేవాడు – ఎన్నో నిదర్శనాలు.
అనసూయ: గుణాలను దోషాలుగా చిత్రించి చూపటం అసూయ. దోషులలో కూడా గుణాలను పరిశీలించి ఉద్ధరించటం అనసూయ లక్షణం. ఆసుషంగిక, ప్రాసంగిక, యాదృచ్ఛిక, సుకృతములను పరిశీలించి. జీవులను రక్షించటం పరమాత్మ లక్షణం. వరుల గుణములందు దోషబుద్ధి అనూయ లేనిది అనసూయతత్వం. అమ్మకు పరులెవరు? అందరూ బిడ్డలే ఆఖరికి భర్త చేత కూడా తల్లిగా భావింపబడటం పతివ్రతకు పరాకాష్ఠ అనిచెప్పి సాగించుకున్న అమ్మ అనసూయకాక మరెవ్వరు. అమ్మ అంటే సంపూర్ణ అవతారం కాదు సంపూర్ణత్వం. ఏది వచ్చినా బాధ లేకుండా అనుభవించటమే సుగతి. ఆ సుగతిని మనందరికీ ప్రసాదించుగాక.