1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సంపాదకీయము..(సువర్ణపుష్పాలతో పూజ)

సంపాదకీయము..(సువర్ణపుష్పాలతో పూజ)

P S R Anjaneya Prasad
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : September
Issue Number : 2
Year : 2013

సువర్ణమంటే బంగారము. సువర్ణము అంటే మంచి అక్షరము అని, మంచిరంగు అనే అర్థాలు కూడా ఉన్నవి. బంగారము. బంగారం రంగు బహుశా అందరికి ఇష్టం కనుక ఆ రంగుకు సువర్ణం అని పేరు పెట్టారేమో! బంగారం ఎందుకు ఇష్టం అందరికీ? దానిని శరీరం మీద ఆడ మగ తేడా లేకుండా ఏదో రూపంలో ధరిస్తుంటారు గనుక. దాని విలువ అన్నిటికన్నా అధికం గనుక. ఏం బంగారం కన్నా విలువైన వజ్రాలు, వైఢూర్యాలు, ఇప్పుడైతే ప్లాటినం వంటివి ఉన్నాయి. కాని అవి కూడా బంగారంలో పొదిగితే కాని సౌందర్యం రాదే – సరే బంగారం విలువైనదీ, అందరికీ ఆభరణాలుగా ధరించటానికి అనువైనది ఆమోద యోగ్యమైనదీ, శరీరానికి ఆరోగ్యకరమైనది కనుకదానికి మిగతావాటికన్నా లోకంలో గౌరవం బాగా ఉన్నది. సరే పోనీండి బంగారం సంగతి సరే బంగారు పుష్పాలతో అమ్మను పూజ చేయటమెందుకు. సురభిళము, సుకుమారము, సుందరము అయిన పుష్పాలు ఎన్ని లేవు? అమ్మకు పూజచేయటానికి ? ఉన్నాయి ఎన్ని ఉన్నా సువర్ణపుష్పాలతో పూజ చేయటం ఒక గౌరవం, ఒక మర్యాద, ఒక తృప్తి. వాసనలేని సౌకుమార్యం లేని బంగారంతో పూజచేయటం ఎంతృప్తండి? అమ్మ వాటి కంటే వీటిని ఇష్టపడుతుందా?

అమ్మ సంగతి సరే అమ్మదేనినైనా ఇష్టపడుతుంది. పూలేకాదు పల్లేరుకాయలైనా, ఉమ్మెత్తకాయలైనా, రాళ్ళైనా, రప్పలైనా ఒకటేమిటి ? అన్నింటిని పూజాసామాగ్రిగానే భావిస్తుంది. అలా వాటితో పూజ చేసినవారు కూడా ఉన్నారు. అయితే నిజానికి బంగారము అంటే ఇంతేనా? ఇంకేమైనా విశేషార్థముందా ? లేకపోతే జనం అంత ఇష్టం ఎందుకు పడతారు? వాడిది బంగారు మనస్సురా? బంగారం వంటి గుణంరా వాడిది, వాడు బంగారమేరా ! అంటూ ఎందుకంటుంటారు? అంటే బంగారం అంటే ఒక లోహంగానే చూడటం లేదు. విలువైన ధనంగా దాన్ని చూడరని కాదు. దానికన్నా మించిన ఒక విశిష్టమైన మనస్సును, గుణాన్ని విలువైనదిగా భావిస్తున్నారు. వాటికి గుర్తుగా బంగారం అనే పదాన్ని వాడుతున్నారు. అంటే దాని పట్ల ఒక ఉన్నతమైన భావన ఉన్నది, విలువ ఉన్నది.అమ్మ కూడా రాచర్ల లక్ష్మీనారాయణ పెద్దకొడుకుకు ‘బంగారు’ అని పేరు పెట్టింది. లక్ష్మీనారాయణ ఎట్లాగమ్మా అలా పేరు పెడితే పెద్దయిన తర్వాత ఎగతాళి చేస్తారేమో అన్నా అమ్మ మార్చలేదు. అమ్మ మీద ఉన్న గౌరవంతో, విశ్వాసంతో వాళ్ళూ మార్చలేదు. ఇప్పటికీ 50 ఏళ్ళు వస్తున్నా బంగారు తన పేరు బంగారుగానే ఉంచుకున్నాడు. బంగారంగానే ఉన్నాడు.

నిజంగా అసలు పూజ పూలతోనే చేయాలా? వినాయకుడికైతే ఆకులతో, గరికతో పూజచేస్తారు కదా! అలాగే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్కరంగు ఒక్కొక్క రకమైన వస్తువులు ఇష్టం. శివుడికి అభిషేకము, విష్ణువుకు అలంకారము, అమ్మవారికి అర్చన, సూర్యుడికి అర్ఘ్యము, కార్తవీర్యుడికి దీపము ఇలా ఎన్నో చెప్పారు. అవన్నీ ఇప్పుడు చెప్పను. పూర్వం చెప్పాను గనుక.

ఇక సువర్ణాలు అంటే మంచి అక్షరాలు అని చెప్పుకున్నాం. అమంత్రమక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధం” అన్నారు. అలాగే. మహత్తరమైన మంత్రబద్ధమైన కవితలలో అమ్మను పూజించినవారున్నారు. కనుక వాటి జోలి కూడా ఇప్పుడు పోను. పూలపూజను గూర్చి ఆలోచిద్దాం.

పూలంటే దేవతలకేమోగాని ఆడవాళ్ళకు మహాఇష్టం. సువాసినులు నిత్యం అలంకరించుకోవాలనే అనుకుంటారు. ఈ పూలకోసం పురాణాలలో యుద్ధాలు జరిగిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. పాండవులు అరణ్యవాసం చేస్తుండగా ద్రౌపది భీముడు గంధమాదన పర్వతం వద్ద విహరిస్తుండగా గాలిపాటున వారి ముందు సౌగంధిక పుష్పం ఒకటి వచ్చిపడ్డది. దాని సుకుమారత, వాసన మునుపెన్నడు ద్రౌపది చూడలేదు. ఏదో దేవలోకపుష్పం అనిపించింది. వేయిరేకులు గల ఆ పుష్పాన్ని చూచి ద్రౌపది మోజుపడ్డది. ఈలాంటి పుష్పాలు ఎక్కడైనా దొరికితే తెచ్చిపెట్టమని భీముని కోరింది. భీముడు దౌపది కోర్కె తీర్చటానికి ఆ గంధమాదన పర్వతం మీదకు వెళ్ళి ఆ పువ్వును తెచ్చిన గాలి ఎటునుండి వచ్చిందో అటువైపు ప్రయాణం చేశాడు. వెళ్ళగా వెళ్ళగా త్రోవకు అడ్డంగా ఒక పెద్ద కోతి పడుకొని ఉన్నాడు. ప్రక్కకు తప్పుకోమని భీమసేనుడనగా పెద్దవాడ్ని ఆ తోక కొంచెం తప్పించి వెళ్ళమన్నాడు. ఆ తోకను తప్పించటం భీమసేనుని వల్ల కాలేదు. ఆ కోతికి నమస్కరించి తన విషయం చెప్పి తామెవరో చెప్పమన్నాడు. అప్పుడు హనుమంతుడు తన కథ చెప్పి ఆశీర్వదించి పంపాడు. ఆ గంధమాదన పర్వతంలో కుబేరుని ఆధీనంలో ఉన్న ఒక కొలనులో ఉన్న ఆ సౌగంధిక పుష్పాలను కోస్తుండగా రాక్షసులు, యక్షులు అడ్డుపడ్డారు. వారిని జయించి కుబేరుని మెప్పించి ఆపుష్పాలను తెచ్చి ద్రౌపదికి ఇచ్చాడు.

ఇక సుప్రసిద్ధమైన పారిజాత పుష్పపు కథ. ఈ కథ తెలియనివాళ్ళు సామాన్యంగా తెలుగుదేశంలో ఉండరు. ఎందుకంటే ఇది శ్రీకృష్ణునితో ముడిపడి ఉన్నది కనుక. నారదుడు ఒకరోజు రుక్మిణీదేవి ఇంట్లో ఉన్న శ్రీకృష్ణుని వద్దకు వచ్చి తాను దేవలోకంనుండి తెచ్చిన పారిజాత పుష్పాన్ని సమర్పించాడు. శ్రీకృష్ణుడు ప్రక్కనే ఉన్న రుక్మిణీదేవికి ఇచ్చాడు. ఆ పారిజాతపుష్పం సామాన్యమైంది కాదనీ, భూలోకంలో ఎవరికైనా దొరకటం కష్టమనీ, పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి నిత్యం తలపై దీనిని అలంకరించుకుంటారనీ, సుగంధభరితమైన యీ వాసన ఎన్నటికీ తగ్గదనీ, దాని వికాసం కోల్పోదనీ అంటే వాడిపోవనీ పుష్పాలలో కెల్ల ఇది చాల శ్రేష్ఠమైనదనీ, ఈ పుష్పం ధరించటం వల్ల ధరించిన వారితో సమానులెవ్వరూ ఉండరనీ ఎన్నో చెప్పాడు.

రుక్మిణీదేవికి నారదుడు చెప్పిన ఈ మాటలు సత్యభామ చెలికత్తె విని సత్యభామకు చెప్పింది. సత్యభామ తానే శ్రీకృష్ణునకు ఇష్టురాలననుకుంటున్నందున ఈ పుష్పం ధరించటం వల్ల రుక్మిణిని జయించగలవారు శ్రీకృష్ణునకు దగ్గరివారు మరెవ్వరు ఉండరని భావించి కృష్ణుడు వచ్చినపుడు అలుకబూని ఏమైనా సరే తనకా పుష్పం తెచ్చి పెట్టాల్సిందేనన్నది. ఏం చేస్తాడు పాపం కృష్ణస్వామి ఒక్క పువ్వేమిటి పారిజాతవృక్షాన్నే తెచ్చి నీ పెరట్లో పాతిపెట్టిస్తానని దేవలోకంలోకి వెళ్ళి ఇంద్రునితో యుద్ధం చేసి పారిజాత వృక్షాన్ని తెచ్చి సత్యభామ ఇంటి పెరట్లో నాటాడు.

ఇలా ఆపుష్పాల కోసం పూర్వకావ్యాలలో ఎన్నో గాథలున్నాయి. ఏదైనా ఇప్పుడు మనకు స్వర్ణపుష్పాలతో అమ్మకు నాన్నగారికి పూజ విషయంలో ఇన్ని కథలు వచ్చాయి జ్ఞప్తికి. అంతేకాదు అమ్మ లలితాదేవియే అని మనలో చాలామంది విశ్వాసం. అమ్మ కూడా లలితా సహస్రనామ పారాయణలు బాగా చేయించింది. అందులో లలితాదేవి చేతులలో బంగారు పద్మం ఉన్నదనీ, పద్మనయనాలు కలిగినదనీ, పద్మాసన అనీ, సహస్రదళపద్మస్థ అనీ, పద్మము వంటి ముఖం కలిగినదనీ, జపాకుసుమభాసురమైనదనీ, చంపక అశోక, పున్నాగ, సౌగంధికాలు తన జడలో ధరించేదనీ, పాదాలు పద్మాలు వంటివనీ, చాంపేయ కుసుమాలను ఇష్టపడుతుందనీ ఇంకా ఎన్నో ఎన్నో చెప్పారు. అంటే లలితాదేవి ఇన్నిపూలతో పూజింపబడేది. అసలు తానే పూలుగా మారిందేమోకూడా. ఏమైనా బంగారు పద్మం చేతిలో ధరించింది కదా ! చైతన్యవంతమైన కుసుమాలను ఇష్టపడేది కదా! చైతన్యవంతమైన పుష్పాలంటే ఒక శ్లోకం జ్ఞాపకం వచ్చింది.

“అహింసా ప్రథమం పుష్పం పుష్ప మింద్రియనిగ్రహః

సర్వభూతదయాపుష్పం క్షమాపుష్పం విశేషతః

శాంతిః పుష్పం తపః పుష్పం ధాన్యపుష్పం తధైవచ

సత్యం అష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్ అని విష్ణుపురాణంలో అన్నారు. నిజానికి అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వభూతదయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానము, సత్యపాలన మించిన పుష్పాలేముంటాయి? పూజకు. మనం ఎలాగూ మన ఎదుట ఉన్నది విగ్రహం అనుకోము కనుక అమ్మే మన పూజలు గ్రహిస్తున్నది అనే విశ్వాసం కలవారం కనుక. అమ్మ మన చేత యీ షష్టవిధ పుష్పాలచేత పూజ చేయించుకోవాలి. తప్పక చేయించుకుంటుంది. దేనికైనా సమర్పణ భావన కావాలి. ముందు కామినీ కాంచనాలను జయించాలి. జయింప చేస్తుంది మనచేత. అందుకే ముందు స్వర్ణపుష్పాలతో పూజ చేద్దాం అనే ఆలోచనను ప్రసాదించింది. మీలోని ‘ప్రేరణ’ నేనే అని అమ్మ స్పష్టంగా చెప్పింది కదా.

ప్రేరణ ఇచ్చిన అమ్మ మన చేత సువర్ణ పుష్పాల పూజ చేయించుకుంటుంది. పూర్వం సోదరుడు కేశవశర్మ తానొక్కడే సువర్ణపుష్పాలు చేయించి తెచ్చి మన చేత పూజ జరిపించాడు. అమ్మ సిద్ధాంతం ప్రకారం ఏపనికైనా ప్రతివాడి మనస్సు ధనము అందులో పడాలి. కనీసం ఒక్క పూవు సమర్పించి దాంట్లో, పూజలో పాల్గొనండి. అమ్మ నాన్నగార్లకు సువర్ణపుష్పాల పూజ చేసి తృప్తజీవనులు కండి – అంతేకాదు మీ హృదయపుష్పాన్ని సమర్పించండి. మీరే పుష్పాలై ఆ ఆదిదంపతుల పాదాలపై పడి ధన్యులు కండి.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!