వ్యక్తిత్వాల్ని ప్రభావితం చేసి ప్రవర్తనలో పరివర్తన తీసుకు వచ్చే శక్తి మహితాత్ముల త్యాగధనుల ఆచరణకే ఉంటుంది; మాటల వరకే పరిమితమైన సామాన్యుల వాక్చాతుర్యానికి ఉండదు.
‘అమ్మకి ప్రతిబింబం హైమ’ అనే సత్యాన్ని హైమ వేసిన అడుగులలో వీక్షిద్దాం. అమ్మ ఐచ్ఛికంగా ఒక ప్రణాళికతో హైమను కన్నది; సాధకులకు మార్గదర్శకంగా మలిచింది; విశ్వశ్రేయ స్సాధనయజ్ఞంలో సమిధగా అర్పించింది; అఖండ సువర్ణజ్యోతిని వెలిగించింది.
‘గుణాః పూజాస్థానం గుణిషు న చ లింగం న చ వయ:” కనుక హైమలోని త్యాగం, సహనం, కారుణ్యం, ప్రేమ మొదలైన విశిష్ఠగుణసంపదని మననం చేసుకుందాం.
- హైమ దేవకార్య సముద్యత
జ్ఞానవాశిష్ఠంలో ఒక సన్నివేశం ఉన్నది. ఉర్విజనుల సకలదుఃఖనివారణకి ఆత్మజ్ఞాన బోధ ఆవశ్యకమని ఎంచి, దయతో బ్రహ్మదేవుడు ఒక ఆలోచన చేసెను. సంకల్ప మాత్రముననే వశిష్ఠుని సృజించెను. అతనిని చేరదీసి, “కుమారా! నీవు ముహూర్తమాత్రము అజ్ఞానము పొందుదువుగాక” అని శపించెను. ఫలితంగా వశిష్ఠుడు అజ్ఞానవశుడై విలపించెను. అంతట వశిష్ఠునికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి దుఃఖాన్ని పోగొట్టెను.
హైమపట్ల అమ్మ అనుసరించిన విధానం ఇటువంటిదే. హైమ శరీరమూ మనస్సూ రెండూ బలహీనమే. అందరి బాధలు తనవేనని విలవిలలాడేది; అందుకు దృఢచిత్తంతో అమ్మను ఆరాధించేది. సాధన, తపస్సు, దీక్ష, త్యాగం, ఉపాసన, ఆరాధన యొక్క స్వరూపస్వభావాల్ని ఆచరణాత్మకంగా బోధించటానికి అమ్మ చేతిలో పటుతరమైన ఉపకరణం హైమ. అమ్మ అవతారలక్ష్యానికి ప్రతిరూపం హైమ. కనుక హైమ దేవకార్యసముద్యత.
- హైమ- నిర్మల, సిద్ధమాత
“మనశ్శుద్ధే మనస్సిద్ధి” అని అమ్మ ఒక అలౌకిక సత్యాన్ని ఆవిష్కరించింది. మనస్సు నిర్మలంగా ఉంటే సిద్ధి కలది అవుతుంది. అపుడు అది ఏది సంకల్పిస్తే అది సిద్ధిస్తుంది. కావున అష్ట సిద్ధులు అని ఏమిటి? వంద, వేయి ఎన్నైనా ఉండవచ్చు.
మనిషి ఎంత నిర్మలంగా ఉండవచ్చునో ఉండ గల్గునో హైమ ద్వారా అమ్మ నిరూపించింది. హైమకి స్వపరభేదం లేదు. బాధితులకి హైమ పరమ ఆప్తురాలు. ఆ కరుణారస హృదయ స్పందనలే దైవీ విభూతులు.
ఆ మనోనైర్మల్యం మంచి ముత్యాలకి కూడా లేదు;
ఆ మహోన్నత సంస్కారం మానవరూపంలో ఇకరాదు.
హైమ నిర్మల; కావున సిద్ధమాత, సిద్ధులకు మూలం, ఆధారం.
- హైమ – ధ్యాన ధ్యాతృధ్యేయరూప
మనస్సు నిలవడం లేదని, ఏకాగ్రత కుదరడం లేదని పరితపించేది హైమ. “ఒక్క నీవే తప్ప ఇంకేమీ లేకుండా ఉండగలనా, అమ్మా!” అనేదే హైమ ఏకైక వాంఛ. ఆస్పత్రిలో ఆఖరి క్షణాల్లో “అమ్మా! నువ్వే కనిపిస్తున్నావు. నీలోకే వస్తున్నాను” అంటూ అంతిమ శ్వాస విడిచింది; అమ్మలో కరిగిపోయింది; మన ఎదుటే కనుమరుగైపోయింది.
హైమ తపనేధ్యానం; హైమధ్యాత; అమ్మధ్యేయం.
తన సాధన పరాకాష్ఠస్థితిలో ధ్యాన ధ్యాతృధ్యేయ రూపంగా ఎదిగి సునాయాసంగా ఆధ్యాత్మిక మహోన్నత శిఖరాలను అధిష్ఠించింది.
- హైమ- దక్షిణామూర్తి రూపిణి
హైమ పాలరాతి విగ్రహాన్ని పరికించి చూస్తే, శ్రీదక్షిణామూర్తి తత్వం కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది. రెండు చేతులలో చిన్ముద్ర లేక అద్వైత ముద్ర విరాజిల్లుతూంటుంది. ‘జీవోబ్రహ్మైవ నాపర:- అనే అద్వైత సిద్ధాంత సారాన్ని ప్రతిబింబిస్తూ బ్రొటనవేలు, చూపుడువేలు కలిసి ఉంటాయి. బ్రొటనవేలు పరమాత్మకి, చూపుడు వేలు జీవాత్మకి సంకేతం. బ్రొటనవ్రేలు క్రిందికి, చూపుడు వేలుపైకి ఉండటంలో అర్థం ఏమంటే- “నన్ను చేదుకో, నన్ను ఉద్ధరించు”- అంటూ ఆర్తితో అసహాయతతో దైవ కరావలంబం కోసం అర్రులు చాస్తూ జీవుడు పైకి దృష్టి సారించి ఎదురు తెన్నులు చూస్తుంటాడు. ప్రేమతో కరుణతో దైవం క్రిందికి వంగి, మాయా శక్తి విలాసకల్పిత మహావ్యామోహాన్ని సంహరించి, భవబంధవిముక్తిని జీవునికి ప్రసాదిస్తాడు- అని.
అత్యంత శ్రేష్ఠమైన అత్యున్నతమైన ఆధ్యాత్మికస్థితిని, ఆముష్మిక ఫలాల్ని అయాచితంగా అందించే హైమాలయం అరుదైనది, అద్వితీయమైనది. కావున హైమ శ్రీగురుమూర్తి – దక్షిణామూర్తి.
- హైమ – వర్ణాశ్రమ విధాయిని
ఆదర్శగృహిణిగా పతివ్రతగా గృహస్థాశ్రమ ధర్మాన్నీ ఔన్నత్యాన్నీ ప్రస్ఫుటం చేసింది అమ్మ. ముగ్గురు బిడ్డల తల్లిగా కనిపిస్తూ దివ్య మాతృవాత్సల్యగంగా ఝరిలో పుష్కరస్నానం చేయించి సృష్టిలోని అణువణువునూ పులకరింపచేసింది, పవిత్రీకృతం చేసింది.
కాగా హైమ బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మానికి ప్రతీకగా నిల్చింది. బ్రహ్మచారి అంటే అవివాహితుడు అని అర్థం కాదు; ఎవరి మనస్సు సర్వకాల సర్వావస్థలలో బ్రహ్మయందే సంచరిస్తూంటుందో వారే బ్రహ్మచారి.
అమ్మను తన మనోమందిరంలో సుప్రతిష్ఠితం చేసికున్నది హైమ. అమ్మ ఫోటో పెట్టుకుని ఒకరు పూజాది కములు నిర్వర్తిస్తూంటే హైమ, “అసలు అమ్మను ఎదురుగా పెట్టుకుని ఫోటోల కెందుకు పూజలు?” అని విచికిత్స చేసింది. “బ్రహ్మ విద్ బ్రహ్మైవ భవతి’- అనే శృతి వాక్యానికి సాకారరూపమైన హైమ వర్ణాశ్రమ విధాయిని.
- హైమ – మరాళీమందగమన
హైమ స్మిత పూర్వాభిభాషిణి. ఏకోదర రక్త సంబంధ స్నిగ్ధబంధానికి అచ్ఛమైన ప్రతిరూపం. ఒకసారి జిల్లెళ్ళమూడి వచ్చినవారు మరల రాకపోతే కనిపించకపోతే బెంగ; వస్తే అపరిమితానందం; తిరిగి వెళ్ళిపోతే మానసికవెత.
ఒకనాడు హైమ మందగమనయై అమ్మ దరి చేరవస్తోంది. నాడు అమ్మ సన్నిధిలో ఆసీనులైన మాన్య సో॥లు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావుగారు, “అమ్మా! దేవత నడచి వస్తున్నట్లు ఉన్నది” అన్నారు. తనను సమీపించిన హైమతో అమ్మ, “అన్నయ్య నిన్ను దేవత అంటున్నాడు-” అన్నది. అన్నయ్య అన్న మాట అక్షరసత్య మైనది; అది అమ్మ సంకల్పం కదా!
స్వరూపలలిత, స్వభావమధుర, మధుర మమకారా కృతి, ఆదరణ ఆప్యాయతలకు నవీన కృతి అయిన హైమ మరాళీమందగమన.
- హైమ – ద్విజబృంద నిషేవిత
అంటే సమస్త జీవకోటిచే ఆరాధించబడేది అని అర్థం. గీర్వాణ విద్యాపారంగతులు వేదాధ్యయన తత్పరులు అయిన శ్రీ భద్రాద్రి తాతగారు నిత్యం తులసీదళాలతో అమ్మ పాదపద్మాలను అర్చించేవారు. ఒకనాడు అమ్మ పాదములు అనుకొని వారు హైమ పాదాలను పూజించారు. “తాతగారూ! ఈ పాదాలు నావి’- అంటూ వెనక్కి తీసుకున్నది హైమ. “ముందు ముందు జరుగనున్నది అదే” అంటూ భవిష్యత్ను సూచించింది అమ్మ.
హైమాలయ ప్రాదుర్భావానంతరం భద్రాద్రి తాతగారే కడునిష్టతో వేదనాదంతో లలితా సహస్ర నామ పూర్వక అర్చనాదులతో హైమను పూజించారు.
కనుక హైమ ద్విజబృందనిషేవిత.
- హైమ – భావనాగమ్య
భావన చేత హైమ సాన్నిధ్యాన్ని చేరుకోగలం, చేరుకోలేం- అని రెండు అర్థాలు చెప్పుకోవచ్చు.
హైమ నామపారాయణ ప్రీత. అభిషేకాలు, ప్రదక్షిణలు, నామసంకీర్తనల వలన సంతుష్ఠాంతరంగయై అభీష్టసిద్ధిని అనుగ్రహిస్తుంది. కనుక భావనాగమ్య.
“మనకి హైమ మీద కంటే, హైమకి మనమీద ప్రేమ ఎక్కువ. హైమ ప్రేమకూ, మన ప్రేమకూ పోలిక ఏమిటి?” – అంటూ హైమ ప్రేమతత్వ గరిమని అభివర్ణించింది అమ్మ. హైమ నిష్కల్మష నిరుపమాన ప్రేమను అర్థం చేసికోవటం అసంభవం. కావున హైమ భావన + అగమ్య; హైమ సాన్నిధ్యం భావన చేత చేరుకోలేనిది.
- హైమ – సాంద్రకరుణ
దేశకాల వర్ణవర్గ విభేద రహితంగా సోదరీ సోదరులపై అపారమైన దయకలది హైమ; ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా అందరూ హాయిగా ఉండాలని అమ్మను ప్రార్థించేది; అమ్మతో పోట్లాడేది. హైమ హృదయం దయకు స్వర్ణ దేవాలయం.
ఆచార్య ఎక్కిరాల భరద్వాజ బాల్యంలోనే కన్నతల్లికి దూరమైనారు. ఆ కారణంగా తన హృదయంలో ఒక వెలితి, వేదన, అఖాతం ఏర్పడ్డాయి. కానీ ఆవాస్తవం వారికి తెలియదు. సో॥ భరద్వాజను చూడగానే హైమ వారికళ్ళలో ఈదైన్యాన్ని స్పష్టంగా గుర్తించింది. వారిని తన కన్నబిడ్డగా పసిబిడ్డగా ఎంచి మాతృవాత్సల్యాన్ని మమకారాన్ని పంచింది; ఆదుకున్నది – ఆదరించింది. కనుకనే హైమ శరీరత్యాగం చేసిననాడు శ్రీభరద్వాజ రెండవసారి తాను మాతృదేవతను కోల్పోయానని కంటతడి పెట్టారు.
కనుక హైమ సాంద్రకరుణ.
- హైమ – శివారాధ్య
సోదరి రావూరి శ్రేషప్రభావతికి తొలిచూరి కానుపు కష్టమైనపుడు సో॥ రావూరి ప్రసాద్ తరపున హైమకు 1000 కొబ్బరికాయలు కొడతానని మ్రొక్కుకున్నది అమ్మ. అలా ఎందరికో మార్గదర్శనం చేసింది. అమ్మకి ఆరాధ్య మూర్తులు తన సంతానమే. జగన్మాత అమ్మ హైమా లయానికి, తన కన్నీటి కాసారానికి వెళ్ళేది. హైమ గళ సీమలో సుమనోహారాన్ని వేసి, నుదుట కళ్యాణ తిలకం దిద్ది, పాదాలపై పూలు చల్లి నమస్కరించి, రక్తమాంసా దులతో ఎదుటనిలిచిన తన తనూజగా ఎంచి విగ్రహంలోని అణువణువునూ స్పృశించి, ఆప్యాయంగా నిమిరి, నివేదన నోటికి అందించి, హారతి ఇచ్చేది.
సర్వమంగళ అమ్మచే ఆరాధించబడిన హైమ శివారాధ్య.
- హైమ – క్షిప్రప్రసాదిని
హైమను అర్చించి కోరిన కోరికలకు ఫలం తక్షణమే లభిస్తుంది. అలా ఎందరో సంతానవంతులు, సౌభాగ్య వంతులు, విద్వాంసులు, కవితావతంసులు, కళాకారులు, న్యాయశాస్త్ర వైద్యశాస్త్ర పారంగతులు అయ్యారు. గండాలు, సమస్యలను అధిగమించి అనేక శుభాలనూ లాభాలనూ పొందారు. శారీరక మానసిక రుగ్మతల నుంచి విముక్తి పొందారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఐశ్వర్యం, బలం, కీర్తి, సంపద, జ్ఞానం, వైరాగ్యం వంటి భాగ్యాల్ని హైమవతీశ్వరి ఆశ్రితులకు అనుగ్రహిస్తోంది.
కనుక హైమ క్షిప్రప్రసాదిని.
హైమ కన్నుల్లో వాత్సల్య తరంగాలు, హస్తాల్లో ఆర్తత్రాణ పరాయణత్వం, హృదయంలో మమకారపు వెల్లువ, పావన పాదయుగళిలో సకలసిద్ధులు సంతోషంతో లాస్యం చేస్తాయి. ఆ ఆలయంలో అడుగిడినంతనే మేనుకు చల్లన, మనస్సుకు శాంతి లభిస్తాయి.
ఇంతవరకు శ్రీలలితా సహస్రనామ పరంగా కొంతవరకు హైమక్కయ్య గుణవైభవాన్ని వర్ణించుకున్నాం. ఈ ఏడాది ది. 12-11-14 తేదీన జిల్లెళ్ళమూడిలో శ్రీ హైమవతీ జన్మదినోత్సవ సందర్భంగా సామూహికంగా శ్రీలలితా కోటినామ పారాయణని శ్రీ విశ్వజననీ పరిషత్ నిర్వహిస్తోంది. అందరికీ సాదరంగా ఆహ్వానం పలికి, సమర్ధవంతంగా అన్ని ఏర్పాట్లూ చేస్తోంది.
ఒక వ్యక్తి చేసుకునే ప్రార్థన కంటే, వేయి మంది ముక్తకంఠంతో చేసే అభ్యర్థన బలవత్తరమైనది; సద్యః ఫలప్రదాయకమైనది. శ్రీలలితా కోటి నామపారాయణలో అందరం భాగస్వాములవుదాం. అనురాగరూపము, అద్వైతదీపము అయిన హైమమ్మ అమోఘ ఆశీస్సుల్ని ప్రసాదాన్నీ స్వీకరిద్దాం. శ్రీలలితా పరమేశ్వరిగా హైమవతీశ్వరిని దర్శిద్దాం.