ఆగష్టు 15వ తారీకున అందరింటి ఆవరణ ముందు అమ్మ పతాకం ఆవిష్కరింపబడింది. ఆ విషయం నేను చెపితే గుంటూరులో ఒక బాధ్యత గల సోదరుడు ‘అమ్మ పతాకం కూడా ఉన్నదా ?’ అని ఆశ్చర్యపోయాడు. అప్పుడనిపించింది – అమ్మ పతాకము, దాని విశిష్టతను గూర్చి సోదరీసోదరులకు వివరించాలి అని. లేకపోతే ఇలాగే చాలామందికి తెలియకుండా ఉండిపోతుందేమోనని.
ఆగష్టు 15 భారతీయులకు అధునాతన కాలంలో స్వాతంత్య్రం వచ్చినరోజు. అయితే, అది జిల్లెళ్ళమూడిలో అందరింటిలో అమ్మ అందరికీ స్వతంత్రమైన సత్రం అంటే అన్నపూర్ణాలయం నెలకొల్పిన పవిత్ర పర్వదినం. కులమత జాతి వర్గ వర్ణ విచక్షణ లేకుండా సర్వులూ కలసి మెలసి ఆకలే అర్హతగా (ఆకలి తీర్చుకోవటానికి) భోజనం చేయటానికి ఏర్పాటు చేసిన మహత్తర స్వతంత్ర దినం, అది జగన్నాధ రధచక్రాలలాగా నిరంతరం సాగుతూనే ఉన్నది. అమ్మ దానికి మాతృయజ్ఞం, అన్నయజ్ఞం అని పేర్లు పెట్టింది. అటువంటి స్థలానికి అమ్మ అన్నపూర్ణాలయం అని పేరు పెట్టింది. ప్రతి ఆలయానికి, అంటే ప్రతిదేవతకు, దేవునకు ఒక ధ్వజం అంటే పతాకం ఉంటుంది. అలాగే అన్నపూర్ణాలయానికి అనసూయేశ్వరాలయానికి అమ్మ పకం ఉన్నది. దానిని భగవధ్వజం అంటారు. ప్రతి దేవాలయం ముందు ‘ధ్వజస్తంభం’ ఉంటుంది. అలాగే అనసూయేశ్వరాలయం ముందు, హైమాలయం ముందు కూడా ధ్వజ స్తంభాలున్నాయి. ధ్వజం లేకుండా స్తంభం ఉండదు కదా! దేవాలయానికి ముందు స్తంభానికి గంటలు ఏర్పాటు చేస్తారు. బ్రహ్మోత్సవాలప్పుడు ధ్వజస్తంభం దగ్గర గరుడధ్వజం ఏర్పాటు చేయటం ఉంటుంది. సరే, వీటి సంగతి అలా ఉంచిఅమ్మ పతాకం సంగతికి వద్దాం.
అమ్మ 1973లో లక్షమందికి ఒకే పంక్తిన భోజనం పెట్టిన తర్వాత ఒక కోటిమందికి దర్శనం ఇవ్వాలని అనే దానికంటే కోటి మంది బిడ్డలను చూడాలనే కోరికతో రాష్ట్ర రాష్టేతర ప్రాంతాలలో చాలా చోట్ల పర్యటించింది. అమ్మ ఆ సందర్భంగా సోదరులు అమ్మ వాహనానికి అమ్మ పతాకాన్ని కట్టి రెపరెపలాడించారు. అది కాషాయ రంగు గల ధ్వజం మీద ‘అంఆ’ అనే రెండక్షరాలు కలిగి ఉన్నది. జిల్లెళ్ళమూడిలో ఏది జరిగినా అమ్మ ఇచ్ఛ వల్లే జరుగుతుందని మన నమ్మకం. జిల్లెళ్ళమూడి అనేకాదు ఎక్కడైనా అంతే. కాని మన పరిధిలో ఆలోచన ఇలాగే ఉంటుంది కదా ! ఆ పతాకాన్ని అమ్మే మనకు ప్రసాదించింది అనుకున్నాం. ఆ పతాకాన్నే మనం వాడుకుంటున్నాం అమ్మ పతాకంగా. దీని విశిష్టత తెలుసుకుందాం.
కాషాయం త్యాగానికి ప్రతీక. ప్రకాశమానుడైన సూర్యుడు చీకటిని చీల్చుకొని సప్తాశ్వరథం పైన ఉషః కాలంలో బంగారు కాంతి కలిసిన లేత ఎరుపురంగులో వెలుగులు ప్రసరిస్తుంటాడు. దానినే కాషాయం అంటారు. తనను తాను జ్వలింప చేసుకుంటూ లోకానికి వెలుగును ప్రసాదించే త్యాగమయ జీవి ఆ మహానుభావుడు. అందుకే ఆయనను ప్రత్యక్ష భగవానుడు అంటారు. ఆయన చిహ్నం కనుక భగవద్ద్వజం అంటారు. ప్రకాశమానమైన జ్ఞానధ్వజం అంటారు. యజ్ఞంలో అగ్నిని ప్రజ్వలింప చేస్తారు. ఆయన సప్తజిహ్యుడు. ఆయన రంగు కూడా కాషాయమే. పవిత్రతకు, సుచిత్వానికి చిహ్నమైన అతని కాంతి కూడా కాషాయమే కనుక ఆ కాషాయ వర్ణాన్నే తరతరాలుగా పరంపరాగతంగా భారతీయులు దేవతల ధ్వజంగానూ, తర్వాత తర్వాత రాజులు, చక్రవర్తులు తమధ్యజ చిహ్నాలుగానూ ఎంచుకున్నారు. అందువల్ల ఆ ధ్వజాన్ని, ఆ పతాకాన్ని, ఆ జెండాను, ఆ కేతనాన్ని గౌరవ చిహ్నంగా, మాసనీయంగా భావించటం జరిగింది. విచిత్రం ఏమిటంటే ఈ భూభాగంపై ఎందరో దేవతలున్నారు. ఎందరో రాజులు ఎన్నో రాజ్యాలను స్థాపించుకున్నారు. అందరూ తమ తమ ధ్వజాలను ఏర్పాటు చేసుకొన్నారు. అన్నీ కాషాయధ్వజాలే. కాకపోతే వాళ్ళు వాళ్లు తమ ప్రత్యేకత కోసం మత్స్యదేశం వాళ్ళు మత్స్యాన్నీ, కళింగదేశం వాళ్ళు గజాన్నీ, అలాగే రాజులు తమ తమ మనస్తత్వానికి తగినట్లు నాగుపామును, తాటి చెట్టును, హనుమంతుని రకరకాల చిహ్నాలు పెట్టుకున్నారు. ఎన్ని ఎందరు పెట్టుకున్నా అందరూ కాషాయాధ్వజాల మీదనే వాటిని పెట్టుకున్నారు. భారతంలో అర్జునుడు ఉత్తర కుమారునకు కౌరవులవైపున ఉన్న వీరుల రధకేతనాలను బట్టి అవి ఎవరివో చెప్పాడు. “బంగారు వేదిక గుర్తిగా ఎగిరే జెండా ద్రోణుడికి, జెండాపై సింహము తోక ఉన్నవాడు అశ్వత్థామ, బంగారు ఆవు ఎద్దుజెండా ఉన్న వాడు కృపాచార్యుడు, జెండాపై తెల్లని శంఖకాంతులు వెదజల్లుతున్నవాడు కర్ణుడు, మణులు పొదిగిన పాము జెండా కలవాడు దుర్యోధనుడు, పెద్దభయంకరమయిన తాటిచెట్టు జెండా కలవాడు భీష్ముడు అంటూ వివరించాడు. అన్ని గుర్తులు కాషాయ జెండాపైనే ఉన్నాయి. ఇది భారతీయుల ప్రత్యేకత. వీటన్నింటి వెనుక భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. సర్వసమాశ్రయ భావం కనిపిస్తుంది. అవసరమైతే జాతి మొత్తం ఒకటే అవుతుంది. భిన్నత్వం ఉంటుంది. ఆచార్య శంకరులు సంప్రదాయాల మధ్య ఘర్షణలు తొలగించటానికే పంచాయతన పద్ధతిని ఏర్పాటు చేశారు. సనాతన ధర్మం చిరంజీవమైనది. ఎల్లలు లేనిది. అటువంటి ఏకత్వాన్ని ప్రతిపాదించేది కాషాయ కేతనం. సర్వసంగపరిత్యాగులు, త్యాగమూర్తులు, తపస్వులు అయిన సన్యాసులు కూడా ఈ కాషాయాన్నే తమ వస్త్రాలుగా ధరిస్తున్నారు. అందుకే వారిని లోకం పూజ్యభావంతో చూస్తున్నది. అందువల్లనే స్ఫూర్తిప్రదము, సరిపూర్ణము అయిన ఈ పతాకాన్నే మన ధర్మానికి, సంస్కృతికి అక్షరాలకూ ప్రతీకగా అందరూ అంగీకరించారు. ఆరాధించారు. అదే భౌతిక, ఆధ్యాత్మిక సాధనలకు మార్గదర్శనం చేస్తున్నది. జెండా జాతికి జీవ గడ్డ, సమతాచిహ్నమ్ము” అన్నారొకరు.
అందుకే అమ్మకు పతాకంగా మనం కాషాయ ధ్వజంపైన అమ్మ అనే అక్షరాలు చిత్రించుకున్నాం. అమ్మను గూర్చి చెప్పేదేముంది. వాత్సల్యము. ప్రేమ అమ్మకు సహజం. పిల్లలపట్ల ఉండే ప్రేమభావమే వాత్సల్యం. తల్లి బిడ్డలను ప్రేమించడానికి కారణం లేదు. అది అవ్యాజము. ప్రతిఫలాపేక్ష లేనిది. శంకరులు ‘కుపుత్రోజాయేత క్వచిదపి కుమాతా న భవతి’ అన్నారు. చెడ్డకొడుకు ఉండవచ్చు. గాని చెడ్డతల్లి ఉండదు, పుత్రవాత్సల్యము, శిష్యవాత్సల్యము, భ్రాతృవాత్సల్యము అంటారు. అలాగే భక్తవత్సలుడు అంటారు భగవంతుడిని. ఈ వాత్సల్యాలన్నీ ఆకృతి దాల్చిందే మాతృమూర్తి తల్లి అంటే తొలి ఏదో అది అనీ, తల్లి అంటే తనలో లీనం చేసుకొనేదనీ, తల్లికి తప్పులే కనిపించ వనీ, తల్లి కడుపుని చూస్తుందని ఎన్నో చెప్పింది అమ్మ. అమ్మ అంటే అంతులేనిది, అడ్డులేనిది, అంతకూ ఆధారమైనది అని చెప్పింది. దైవానికి వేరే రూపం లేక తల్లి రూపాన్ని ధరించింది అని’ అనే మాట ఎంత సత్యమో! ప్రతి ఇంట్లోనూ తల్లి ఉంది. ప్రతి జీవికీ తల్లి ఉంది – తల్లి లేకుండా సృష్టిలేదు. అమ్మ అనే అక్షరాలలో అందరమే మన కళ్ళముందు కదులుతుంది. త్యాగమూర్తి, వాత్సల్యమూర్తి అయిన అమ్మ మనకు కనిపిస్తుంది. “ఉపాధ్యాయాన్ దశాచార్య – ఆచార్యాణాం శతం పితా సహస్రంతు పితౄన్ మాతా గౌరవేణాతిరిచ్యతే”
పదిమంది ఉపాధ్యాయులకంటే ఒక ఆచార్యుడు, నూరుగురు ఆచార్యుల కంటే ఒక తండ్రి, వేయి మంది తండ్రుల కంటే ఒక తల్లి గొప్పదని మనుస్మృతిలో చెప్పారు. సూర్యుడు ఎలా ప్రత్యక్షదైవమో అలాగే తల్లి కూడా ప్రత్యక్షదైవం. అందుకే పతాకంపై అమ్మ అనే అక్షరాలు ఏర్పాటు చేసుకున్నాం. అందువల్ల అమ్మ పతాకము అమ్మ వేరు కాదు, ఒకటే. అర్తో జిజ్ఞాసు రర్ధార్దీ జ్ఞానీచ భరతరభ అన్నాడు గీతాచార్యుడు. ఆర్తితో, అర్ధాన్ని అర్థించి, జిజ్ఞాసతో, జ్ఞాని కావటానికి భగవంతుని కోరతారు. ప్రార్థిస్తారు. శ్రీ విశ్వజననీపరిషత్ అమ్మపతాకాన్ని గౌరవించంటలో ఔచిత్యమున్నది. అర్కపురి వినువీధులలో ఆ జెండా ఎప్పుడూ ఎగురుతూనే ఉండాలి..
అమ్మ జెండా
ఎగురుతోంది ఎగురుతోంది రెపరెప అమ్మ ధ్వజం
పదిలంగా కుదురుకొంది ఎదలలోన అమ్మ నిజం
విజ్ఞాన శిఖరాన వెలుగొందు జెండా
అజ్ఞాన తిమిరాన్ని అదలించు జెండా
ఆకాశమార్గాన విహరించు జెండా
ఆహారమందించి పోషించు జెండా !
ఉభయ సంధ్యారాగ మొలికించు జెండా
త్యాగభావమ్మునే తలపించు జెండా
ప్రేమయోగమ్మునే పలికించు జెండా
కారుణ్యవర్షాలు కురిపించు జెండా ॥
ఆ పతాకము నుండి అలలు అలలుగ లేచి
వేదాలు నాదాలు కదలి వస్తున్నాయి
అనురాగ రాగాలు ఆలపిస్తున్నాయి.
వాత్సల్య వీచికలు హాయినిస్తున్నాయి |
విశ్వ సౌభ్రాత్రమే విలువ లొలికిస్తోంది.
శాంతి సౌఖ్యాలనే వీచికలు వీస్తోంది.
ధర్మమార్గాలనే ఇలపై పరుస్తోంది.
జీవన ధ్యేయమౌ తృప్తి కలిగిస్తోంది. ॥