1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సంపాదకీయ.. (పూర్వతత్వవేత్తలకంటే జిల్లెళ్ళమూడి అమ్మ ప్రత్యేకత ఏమిటి?)

సంపాదకీయ.. (పూర్వతత్వవేత్తలకంటే జిల్లెళ్ళమూడి అమ్మ ప్రత్యేకత ఏమిటి?)

P S R Anjaneya Prasad
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : April
Issue Number : 9
Year : 2012

అమ్మ తన అనుభవం నుండి చెప్పింది ఏం చెప్పినా. అందుకే “అనుభవ వేదాంతనిధులు మాతృశ్రీ సూక్తిసుధలు” అని చెప్పాను చిన్నప్పుడే. నాకు తెలియకుండానే నా నుండి అమ్మ పలికించిన పలుకులివి. బాగుంది. అమ్మ అనుభవజ్ఞురాలంటున్నారు కదా! పూర్వం తత్వవేత్తల కంటే భిన్నమైన, విశిష్టమైన కొత్తమార్గం ఏమైనా చెప్పారా? పూర్వులు కూడా వారు జ్ఞానాన్ని దర్శించామని చెప్పిన వారే కదా ! వారి వారి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారే కదా ! ప్రధానంగా అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత మార్గాలున్నాయి కదా ! అంతకు ముందే జైన, బౌద్ధ మతాలున్నాయి కదా ! అంతేకాక వీటన్నిటికీ మూలమైన దని చెపుతున్న సనాతన ధర్మమున్నదని చెపుతున్నారు కదా! వీటన్నిటి విషయమేమిటి? వీటికన్నా భిన్నంగా అమ్మ ఏమి చెప్పింది ? ఆలోచిద్దాం.

అమ్మ ఏం చెప్పింది అనే ఆలోచనలకు మూలంగా ముందుగా పూర్వ తత్వవేత్తలు చెప్పింది సూక్ష్మంగా చూద్దాం. సనాతనధర్మము ఒక మతము కాదు. హిందూ మతము అని తర్వాత వచ్చిన పేరు. హిందువులకు వేదములు ప్రామాణిక గ్రంథాలు. వేదసత్యాలను అనుభవ పూర్వకంగా నిరూపింపబడినప్పుడే వానిని నమ్ముతున్నాము. భగవంతుని గూర్చిన పారమార్థిక విద్యయే నిజమైన విద్య అనీ, దానిని ‘బ్రహ్మవిద్య’ అన్నారు. వేదములు కర్మకాండ, జ్ఞానకాండలని చెప్పాయి. కర్మకాండలో యజ్ఞయాగాదులు, నిష్కామకర్మ లౌకిక సేవ చెప్పగా, జ్ఞానకాండలో ఉపనిషత్తులు ప్రధానము. పరమాత్మతత్వమును నిరూపిస్తాయి. స్వయముగా బ్రహ్మానుభూతిని పొందునట్లు చేస్తాయి.

ఇక అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత, శుద్ధాద్వైత, అచిన్య భేదాభేద, ద్వైతాద్వైత సిద్ధాంత ప్రతిపాదకులున్నారు. వీరంతా వేదములను నమ్మినవారే – బౌద్ధులు, జైనులు వేదాలను ప్రమాణంగా స్వీకరించలేదు. కానీ తురీయావస్థలో సాక్షాత్కరించే విజ్ఞానాన్నీ, భావాతీతాను భవాలనూ అంగీకరించారు. బుద్ధుడు వేదాలలోని తత్వజ్ఞానాన్ని స్వీకరించి తన శిష్యులకు వేదసారాన్ని బోధించాడు.

ఆదిశంకరులు తాను చెప్పదలచుకొన్న బోధ సారాంశాన్ని “బ్రహ్మ సత్యం జగన్మిధ్య జీవో బ్రహ్మైవ నాపరః” అని చెప్పారు. అంటే బ్రహ్మము మాత్రమే సత్యము. ఈ కనిపించే ప్రపంచము అసత్యము (మిధ్య). ఆత్మ పరమాత్మలకు భేదము లేదు. ఇది వారి సిద్ధాంతము. దీనిని అద్వైతము అన్నారు.

రామానుజాచార్యుల వారు భగవంతుడు అద్వయుడే, కాని విశేషణములతో కూడియున్నాడు. కనుక వీరి సిద్ధాంతము విశిష్టాద్వైతము. ప్రపంచము, జీవాత్మలు శ్రీమన్నారాయణుని అవిభాజ్య విశేషణములు. ఆత్మకు దేహములేని భగవంతునితో సంబంధమున్నది. ప్రత్యేక అస్తిత్వము వాటికి లేదు. భగవానుడు, జీవాత్మ, ప్రకృతి ఈ మూడు నిత్యమైనవి అని రామానుజుల భావన.

మోక్షానికి శంకరులు జ్ఞాన యోగాన్ని, రామానుజులు భక్తి యోగాన్ని నిర్దేశించారు. ఇద్దరూ భక్తిజ్ఞానాలను అంగీకరించినా, శంకరులు భక్తి, ప్రేమ జ్ఞానోపార్జనకు సాధనలు అన్నారు. రామానుజులు జ్ఞానము భక్తికి సాధనము అని నమ్మారు. కర్మ, జ్ఞానము భక్తికి సాధనాలు మాత్రమే అని రామానుజుల మతము.

మధ్వాచార్యులవారు పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి వేరు వేరు. వాటిలో ఏకాత్మత లేదు అన్నారు. మోక్షానంతరము కూడా జీవాత్మ పరమాత్మతో సమానము కాజాలాడు. పరమాత్మసేవలో మాత్రమే ఉంటాడు. భగవత్కృప వల్లనే మోక్షం వస్తుంది. దానికి భగవదారాధన, భజన, కీర్తన, కథాశ్రవణముల ద్వారా భక్తి వస్తుంది. ధార్మిక నైతిక జీవనము, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము, శరణాగతి మోక్షానికి ఆవశ్యకము. ధ్యానము ద్వారా కూడా భవగదనుభూతిపొందవచ్చు. దీని ద్వైతమతము అన్నారు.

-నింబాచార్యుల వారి భగవంతుడు నిర్గుణుడు, సగుణుడు. బ్రహ్మము విశ్వమును సృష్టించిన పిదప కూడా అనంతుడు గానే, శేషించే ఉంటాడు అని వారి సిద్ధాంతము. దీనిని ద్వైతాద్వైత సిద్ధాంతము అన్నారు.

వల్లభాచార్యుల వారి సిద్ధాంతము ప్రకారము ప్రపంచము సత్యము నిత్యము. కాలము ప్రకృతి నిత్యము. సృష్టి భగవంతుని వినోదమే – ప్రతిదీ బ్రహ్మ స్వరూపమే. జీవాత్మలు చేసే పాపపుణ్యాలు బ్రహ్మమునకు అంటవు. జీవాత్మ భగవత్కృపవల్ల మాత్రమే మోక్షాన్ని పొందుతాడు. కర్మ, జ్ఞాన, శాస్త్రీయ భక్తియోగాలకు మించిన మార్గమున్నది అని చెప్పారు. దానినే ‘పుష్టి మార్గము’ అని చెప్పారు.

చైతన్య మహాప్రభువు ‘అచిన్య భేదాభేదము’ అని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారము ప్రపంచము, జీవాత్మలు భగవంతుని నుండి వేరై ఉన్నా చూద్దాం. భగవంతునిపైనే ఆధారపడి ఉన్నాయి. వాటికి స్వతంత్ర అస్తిత్వం లేదు. భగవంతుని పూర్తిగా వదిలీ లేవు. వదలకుండానూ లేవు. వాటికీ భగవంతునికీ మధ్య అనూహ్యమూ అస్పష్టమూ అయిన భేదమూ అభేదమూ ఉన్నది అనివారు సిద్ధాంతీకరించారు.

ఋషభదేవుని జైనమతము కూడ పురాతనమైనదే – జిన అనే పదము నుండి జైనము ఉద్భవించినది. జిన అనగా జయించినవాడు. మనోవికారములను అరిష్వదర్గాలను జయించినవాడు జినుడు. 24 తీర్థంకరులలో చివరివాడు వర్థమాన మహావీరుడు. జైనుల పరమాత్మ-పూర్ణత్వము సాధించిన మానవుడు. నైతిక ఆధ్యాత్మిక జీవనం ద్వారా ప్రతి ఆత్మ పరిపూర్ణత పొందవచ్చును అన్నది వారి సిద్ధాంతం. మోక్షము అకుంఠిత విశ్వాసము, సదసద్వివేకము, సదాచారములను త్రిరత్నముల ద్వారా పొందవచ్చునని చెప్పబడింది.

గౌతమబుద్ధుడు బౌద్ధమతాన్ని స్థాపించాడు. హృదయ నైర్మల్యము, సదాచారము వల్లనే బ్రహ్మానుభూతి లేక మోక్షప్రాప్తికలుగుతుందని సనాతన ధర్మాన్నే పునః చైతన్యవంతం చేశాడు. జీవహింసను నిరసించి అహింసా పరమోధర్మః అనే సూత్రాన్ని ప్రధానంగా స్వీకరించాడు. దానికి ఆధారంగా పంచశీల, అష్టాంగమార్గము, దశపారామితల ద్వారా జీవితాలను ఆచరణయుక్తంగా, సదాచార సచ్ఛీల సంపన్నులను చేశాడు.

అమ్మ ఏం చెప్పిందో ఆలోచిద్దాం. అమ్మ చెప్పే దానిలో విశేషమేమిటో విశ్లేషిద్దాం. అమ్మది ‘సరే’ మంత్రం. అమ్మ దేనికీ ఎవరికీ భిన్నంకాదు. అమ్మది సంపూర్ణతత్వం – సర్వసమ్మతమైన మతం. మిగతావారు చెప్పినవి పాక్షిక సత్యాలు అని నేను చెప్పటం సాహసం కావచ్చు కాని అమ్మది సంపూర్ణ సత్యం. సత్యం సత్యం పునఃసత్యం సత్యమేవ పునః పునః’ అని ఢంకా బజాయించి చెప్పగలను. అమ్మ ఏం చెప్పిందో చూడండి. అమ్మది ‘వల్లకాని మిట్టప్రదేశం’. అమ్మే తాను ఉన్నచోటికి మనల్ని ఎక్కించాలి. దానికి అమ్మ చెప్పిన మాటలే అమ్మ అనుగ్రహ సోపానాలై మనల్ని అమ్మ దగ్గరకు చేరుస్తాయి. అమ్మ ‘నేను కనిపిస్తేనే మీరు చూడగలరు. మీరు చూడాలను కుంటే నన్ను చూడలేరు’ అన్నది గదా! అమ్మ అమ్మ కదా ! మనల్ని కరుణిస్తుంది చూద్దాం. 

అమ్మ సృష్టి అనాది-నాది’ అంటే తాను సృష్టి కార్యం చేసినట్లు చెప్పింది. అంతేకాక తనను గూర్చి చెపుతూ అంతులేని, అడ్డులేని అంతటికీ ఆధారమైనదానిని అన్నది. సృష్టికి పూర్వము ఏమీ లేదన్నది. సర్వమూ నిర్ణయంలో భాగమే. ప్రధమస్పందనే అనేక రూపాలైంది అన్నది. ఈ కనిపించే జగత్తు సర్వమూ ఈశ్వరుడే. చీమలో దోమలో భగవంతుడు ఉండటం కాదు చీమగా దోమగా ఉన్నాడు. అన్నది. ‘ఎప్పుడున్న దైనా అంతా తానయిన ఒకటే” అన్నది. అమ్మకు సర్వముతో తాదాత్యమే అందుకే అమ్మ ‘మీరంతా నేనే, మీదంతా నేనే, ఇదంతానేనే’ అన్నది.

భగవంతుని నాకు చూపించమ్మా? అని అడిగితే కనిపించేదంతా వాడే అయినప్పుడు దేనినని ప్రత్యేకించి వేలు పెట్టి చూపించమన్నావు నాన్నా! అన్నది. భగవంతుడు సృష్టి ఎందుకు చేశాడమ్మా ? అని అడిగితే భగవంతుడు, సృష్టి వేరు కాదు. ఇంక ఎప్పుడు ఎలా దేనితో అనే ప్రశ్న పుట్టదు అన్నది. జగత్తు నశించేది శాశ్వతంకాదు అని కొందరంటే అమ్మ జగత్తే అనాది, పరిణామమే గాని వినాశము లేదు అన్నది. ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా వస్తువుగాని, తేజస్సు గాని మారతాయిగాని నశించవు అంటున్నది. భగవంతుడు నిరాకారుడు, నిర్గుణుడు అంటే, అమ్మ అన్నిరూపాలూవాడివే గనుక నిరాకారుడు, అన్ని గుణాలూ వాడివే గనుక నిర్గుణుడు అన్నది. ఉన్నదేదో అన్ని రూపాలుగా ఉన్నది గనుక నామ రూపరహితుడే కాదు, సహితుడు కూడా అని చెప్పటానికి అవకాశం రూపం అన్నది. అన్నిరూపాలూ ఆయనవే కనుక ఏ రూపం. దేవుడిది కాకపోతుంది ? అన్నది.

ఏదైనా, ‘ఎవడికైనా తీర్చవలసింది వాడే వాడి చెప్పుకో’ అంటే ద్వైతులూ, ‘ఉన్నదొకటే రెండు లేవు” అన్నప్పుడు అద్వైతులూ, ‘లడ్డుకావటం కంటే తినటం రుచి అన్నపుడు విశిష్టాద్వైతులు సంతోషిస్తారు. నా దృష్టిలో జడమే లేదుఅంతా చైతన్యమే, అందరికీ సుగతే, పాపమైనా పుణ్యమైనా వీడిచేతిలో లేదు చెయ్యటానికి, దేవులాడినా దొరకని వాడే దేవుడు, దైవం తలిస్తేనే నీవు తలిచేది అని అమ్మ ఆయా సందర్భాలకు అనుగుణంగా చెపుతుంటే భుజాలు తడుముకునేవారు ఉన్నారు, భుజాలు ఎగరేసేవారూ ఉంటారు. కొందరికి సమ్మతంగా కొందరికి వ్యతిరేకంగా చెపుతావేమిటమ్మా? అంటే ఉన్నదంతా అదే నాన్నా! అంటుంది. అన్ని మతాల వారూ ఎక్కడో అక్కడ అమ్మతో ఏకీభవిస్తారు. తమ చుట్టూ ఉన్న పరిధులు దాటి రాలేరు. అమ్మది సర్వసమ్మతమైన మతం కనుక అమ్మది సంపూర్ణ మతం. ఒక సోదరుడు అమ్మ మతాన్ని కాదు మానవత్వాన్ని ఉద్ధరించటానికి వచ్చింది అన్నాడు. ఒక్క మానవత్వాన్నే కాదు సృష్టిని ఉద్ధరించటానికి వచ్చింది అంటాను నేను.

అమ్మది విచక్షణ లేని వీక్షణ. శుభములు, సౌఖ్యములే కాదు కష్టనష్టాలు, దారిద్ర్యము కూడా వాడి కరుణ వల్లనే వచ్చేది. ఆస్తికులదేవుని కున్న ప్రత్యేకత అమ్మ చెప్పేదేవునికి లేదు. ఆశ్రితపక్షపాతమూ లేదు. అమ్మదేవుడు సర్వత్రా అనురాగి. తెలిసినవాడికి, తెలియనివాడికి, నమ్మినవానికి నమ్మనివానికి, నమస్కారం చేసిన వానికి, చెయ్యని వానికి అందరికీ ఒకే గతి. మీ చేతలు మీ చేతుల్లో లేవు, మీ చేత పాదాలు పట్టించుకోవాల్సింది నేనే, దేనికైనా ప్రేరణ ఇవ్వాల్సింది నేనే. ఏదైనా చేయించేది దైవమైనప్పుడు ఎవరి గొప్పా తక్కువా ఏం లేదు. చివరకు సాధన కూడా అంతే – నా దృష్టిలో సాధకులు లేరు. ఎవరైనా అది చేయించేది చేసే వాళ్ళే – అందువల్ల పాపపుణ్యాలు నీవి కావు అని కొట్టిపారేసింది.

అయితే ఏది మాత్రం మనమెందుకు చెయ్యాలి ? అని ఊరికే ఉండాలి అంటే – “కూర్చో చేతనయితే – కూర్చోనివ్వడు. కనుక వాడు తోపించింది నేనే చేశాననుకుంటూ చేస్తూ, వచ్చిన అనుభవాలు వాడిచ్చినవే అనుకుంటూ అనుభవించడమే. ఇదే వైకల్యం లేని కైవల్యం” అంటుంది అమ్మ. అయితే అమ్మ సందర్భవశంగా ఎన్నో చెప్పింది. ‘తెలిసినా తెలియకపోయినా, చూసినా చూడక పోయినా, నమ్మినా నమ్మకపోయినా, ఈ ద్వంద్వాలూ, ద్వంద్వాలకాధారమైన శక్తి ఒకటి ఉన్నదనీ, సర్వమూ తానే జరుపుకుంటున్నదని తెలుసుకోవాలి. నివేదన అంటే నీవిచ్చిన తిండి, నీవిచ్చిన మనస్సు, అన్నీ నీ విచ్చినవే అని గుర్తించడం అన్నది. ఆత్మకు మనస్సుకు తేడా లేదు. భగవంతుడంటే మనస్సే – మనస్సుకు వైకల్యం లేని స్థితి కైవల్యం. ‘ముక్తి అంటే ఏది చేస్తున్నా ఏది చూస్తున్నా అన్ని వేళల్లో తృప్తి కలిగితే అదే ముక్తి. శాంతి ఎప్పుడు అంటే ద్వంద్వాలు సహజమనిపించినప్పుడు. కడతేర్చేది సత్యాచరణమే కాని మాటలు కావు. హింస అంటే సహించలేనిది. ఎవరు ఏది సహించలేరో అది హింస. దానిని మానుకుంటే సరిపోతుంది అదీ మానుకోగలిగితే అవకాశాన్ని గమనించడం సాధన. అంటే తాను చేస్తున్నాననుకోవడమే. నా చేత సరిపోతుంది, అదీ మానుకో గలిగితే – అవకాశాన్ని గమనించడం సాధన. అంటే తాను చేస్తున్నాననుకోవడమే – నాచేత ఈ పని వాడు చేయిస్తున్నాడు అనుకున్నప్పుడు అదే సాధన, అదే యోగం, అదే తపస్సు అవుతుంది. పురుషకారము, దైవసహాయము రెండూ ఒకదానివే – ప్రారబ్ధము ఇచ్చింది వాడే. ఎవరికి ఏ రూపంగా ఇచ్చినా ఇచ్చేది ఒక్కడే. అందరికీ తలో రకంగా, నీవు నమ్మినశక్తే మంచి చెడూ అన్నీ చేయిస్తున్నది. కర్మవేరు, శక్తి వేరు కాదు. సముద్రంలోని అలలు లాగానే జన్మలు. జన్మలు లేవు. తిధులు విధిని మార్చలేవు. తప్పు అని తెలిసి తప్పించుకోలేక చేస్తారు. కాలమే కాని నీవు కారణంకాదు. కాలమంటే దైవమే. ఒకటిగా ఉండి ఒకటిగా కనిపించకపోవడం మాయ. వాడే అన్నీ చేయిస్తున్నాడని తెలియకపోవడమే మాయ. జగత్తు స్వప్నం అంటారు. స్వప్నం మారుతున్నదిగా. ఏరకంగా చూచినా పరిణామమే – పరమాత్మస్థితి అంటే తాను కాకుండా ఇంకొకటి లేదనే స్థితి. సంకల్పరాహిత్య మంటే ప్రతి సంకల్పమూ నాది కాదు, వాడిది అనుకోవడమే – కారణం లేకుండా అన్నీ తానే అయి అన్ని కారణాలూ తానే అయి, తనకై వచ్చిందే సంపూర్ణ అవతారం.

అవయవాలచేత మనస్సు కట్టుబడేది ప్రాణాయామం. మనస్సు చేత అవయవాలు కట్టుబడేది భక్తి, ఎప్పుడెక్కడ ఎట్లా ఉన్నా ఒకే లక్ష్యం మీద మనస్సు ఉండటం ఏకాగ్రత. మమకారం అందరికీ ఉంటుంది. భగవంతుడి యందుంటే భక్తుడంటున్నారు. తృప్తి అంటే ఇంతకన్నా మరొకటి లేదనే స్థితి. ద్వంద్వాలు బ్రహ్మగా గుర్తించిందే బ్రహ్మానందం. ఏదీ కావాలని లేకపోవడమే ఆనందం అన్నది అమ్మ.

సత్యం తెలిసినవాడికి జన్మలు లేవు. కొంచెం తెలిసి తెలియనప్పుడు జన్మలు ఉన్నాయనడం తప్పుకాదు. తప్పనగా ఆ స్థితి వ్యత్యాసమే – జన్మకు, కర్మకు, క్రియకు, వాడే కారణమైనప్పుడు వీడు చేసిన కర్మలను బట్టి జన్మకాదు కదా! పోనీ మీరనుకున్నట్లు జన్మపరంపర కారణమయినా ప్రధమజన్మకు వీడు కారణం కాదు గదా ! ఏ మంచి కర్మ చేస్తే యీ ఆలోచన వచ్చింది.

ఆయా సమయాల్లో ఆయా పనులు చేయించడమే అమ్మలోని ప్రత్యేకత. కరుణ. రూపం పరిమితం, శక్తి అనంతం. తెలియనిది తెలియ చెప్పటానికే ఈ రాక. సందేహ నివృత్తి చేసేదే సందేశం. ఉపదేశమంటే దైవసన్నిధికి చేర్చటం. గుర్తుచెప్పేవాడే గురువు. కాలువ నిండుగా ప్రవహిస్తున్నా దాహమైతే దిగటానికి రేవు కావాలిగా. ఆ రేవు జిల్లెళ్ళమూడిలో ఉన్న అమ్మ. అమ్మ అన్నీ తానే అయి ఆ అనుభవస్థితిలో ఉండి చెప్పింది. మిగతావారు శాస్త్రాలు చదివి తమ అనుభవంలోకి వచ్చింది చెప్పారు. అనుభవమే తానైంది అమ్మ. అదే మిగతా తత్వవేత్తలకు అమ్మకూ ఉన్న తేడాగా మనకు కన్పిస్తుంది. ఆ తేడా అమ్మకు లేదు. అదే

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!