అద్వితీయ మహనీయ మూర్తి అమ్మ ఈ అవనీ స్థలిపై అవతరించి సరిగ్గా 98 సంవత్సరాలయింది. మరో రెండు సంవత్సరాలలో అమ్మ శతజయంతి వేడుకలు నిర్వహించుకోబోతున్నాం.
ఇంతవరకూ విశ్వచరిత్రలో “దుష్టశిక్షణ, శిష్టరక్షణ” అవతార ధ్యేయంగా వచ్చినవారున్నారు గానీ, గుణభేదమే లేని, మంచీ చెడుల విచక్షణ పరిగణించని, “తల్లికి తప్పే కనపడదు” అనీ, “మీలో తప్పులు ఎంచటం మొదలు పెడితే అది నాతప్పు”నీ, పాప పుణ్యాలకు మీరు బాధ్యులు కారు అని “అందరికీ సుగతే” అని ప్రకటించి, అభయమిచ్చిన వారెవరైనా వున్నారా? అని ప్రశ్నిస్తే చరిత్ర మౌనం దాల్చక తప్పదు. అదీ అమ్మ అవతార ప్రత్యేకత.
ప్రేమామృత స్వరూపంగా అవతరించిన మాతృ మూర్తి మన అమ్మ. నీ వెవరమ్మా? అని ప్రశ్నిస్తే “నేను అమ్మను” అని తప్ప మరో సమాధానం అమ్మ దగ్గర్నించి రాదు. తను ఫలానా దేవతను అని గాని, ఫలానా అవతార స్వరూపమని గానీ అమ్మ ఎప్పుడూ ప్రకటించ లేదు. అమ్మా! నీవు ‘లలితవి’, ‘రాజరాజేశ్వరివి, గాయత్రివి”, ‘రాముడివి’, కృష్ణుడివి అంటే కాదూ అనీ అనలేదు గాని, “అవన్నీ ఎందుకు నాన్నా! అమ్మని అనుకుంటే సరిపోదా”. అని ప్రకటించడంలోనే అమ్మ అవతార విశిష్టత వుంది. ఒకసారి అమ్మను లక్ష్మీదేవి గా అలంకరించినప్పుడు అమ్మ: త్రిశూలం ధరించి దర్శనం ఇచ్చింది. ఎవరో అమ్మతో “లక్ష్మీదేవి త్రిశూలం ధరించదు కదా అమ్మా” అని అడిగితే, ఒకరితో పోలికేమిటి?” అని సమాధానం ఇచ్చింది. సమాధానం లౌక్యంగా వున్నా, అందులో అంతర్లీనంగా, వున్న సత్యాన్ని గమనించాలి. గణాలలో అంగుళాలు వుంటాయి గానీ, అంగుళాలలో గజాలు వుండవు కదా! సర్వం తానైన తల్లికి ఒక పరిమిత రూపంతో పోలికేమిటి మరి!
‘మరుగే నా విధానం’ అని ప్రకటించినా, అమ్మ నిజానికి మన నుంచి దాచిందేమీ లేదు. పసితనంలోనే అయిదారు సంవత్సరాల ప్రాయంలోనే, గంగరాజు పున్నయ్య గారు అమ్మ చెక్కిళ్ళు పుడికి ‘తల్లి లేని తల్లీ!’ అని సంబోధిస్తే, “తల్లి లేని తల్లి అంటే తొలి నేనేననా!” అని ఒక ఆశ్చర్యకర సత్యాన్ని ఆవిష్కరించింది. తానేమిటో, తానెవరో స్పష్టంగానే సూచించింది. అర్థం చేసుకోవటంలో మనకు తేడాలుండవచ్చేమో గాని, చెప్పటంలో అమ్మ ఎప్పుడూ నిర్ద్వంద్వంగానే వుంటుంది. “సృష్టి అనాది”. ఇది మనం చాలా సార్లు విన్నాం. అనాది నుంచీ వింటూనే వున్నాం. ఈ సృష్టిలో వున్న మనం “ఈ ఊరు నాది అనీ, ఈ రాష్ట్రం నాది అనీ, ఈ దేశం నాది అనీ” పరిమితులు పెట్టుకుంటాం. కానీ అమ్మ మాత్రం “ఈ సృష్టి అనాది” అని అంతటితో ఆగకుండా “ఈ సృష్టి అనాది నాది” అన్నది. అలా అనగలగటం జగన్మాత అయిన అమ్మకే సాధ్యం. అలాగే “జగన్మాత అంటే జగత్తుకు మాత కాదు. — జగత్తే మాత” అనే అర్థం ఎవరు చెప్పారు?
అమ్మ అంటే సంపూర్ణావతారం కాదు, అమ్మ అంటే సంపూర్ణత్వం అని మరో సందర్భంలో వివరించింది. భగవంతుడిని చూపించమంటే “కనపడేదంతా అదే అయినప్పుడు ప్రత్యేకించి వేలు పెట్టి, ఇదీ అని దేన్ని చూపించను నాన్నా!” అనే మాట ఎంత విశిష్టంగా వుందో అంత పరమ సత్యం కదూ! సంపూర్ణత్వం అంటే ఇదే.
అందుకేనేమో డా. శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు అన్నారు ఒక సభలో “ఎక్కడైనా నెలవంకలు మీరు చూడవచ్చు గానీ, పూర్ణచంద్రుడిని దర్శించాలంటే జిల్లెళ్ళమూడి రావల్సిందే” అని,
మనం ఎలా జీవించాలో అమ్మ చెప్పింది. “సుఖానికి మార్గం ఒకటే – ఏది జరిగినా దైవం చేశాడనుకోవటమే” అనీ, “తృప్తే ముక్తి” అనీ చెప్పింది. “నా జీవితమే సందేశం అంటూ “నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో” అనే సందేశాన్ని సర్వమానవాళికీ మార్గదర్శకంగా అందించింది.