పి.యస్.ఆర్. గారు అనగానే మృదు మధురమైన కవితాలహరి, గంభీరమైన గాత్రం, అనురాగం ఆప్యాయతలతో కూడిన పలకరింపు గుర్తుకు వస్తాయి. నా బాల్యం నుంచీ ఎప్పుడు జిల్లెళ్ళమూడి వెళ్ళినా సరదాగా ‘ఏరా’, ‘ఏమోయ్’ అని పలకరిస్తూ కుశలప్రశ్నలు వేస్తూండేవారు. నేను అంచెలంచెలుగా ఎదిగి వస్తుంటే నిండుమనస్సుతో ఎంతో ముచ్చటపడి ‘మా దుర్గపిన్ని కొడుకు’ అని గర్విస్తూ సంతోషపడిన వారిలో వారొకరు. ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ నా చదువులో కానీ నా ప్రాక్టీస్లో కానీ దినదినాభివృద్ధి చెందిన సమయాల్లో అడుగడుగునా ఆయన సంబరపడి ఆనందిస్తూ ఆశీర్వదిస్తూ అభినందిస్తూ శుభాకాంక్షలు అందించే వారు.
వారు రచించిన ‘శ్రీ విశ్వజననీ వీక్షణం’ బృహద్గ్రంధ ప్రచురణ నిమిత్తం అందుకు అవసరమయిన పేపర్ నేను సమకూర్చానని అనేకమార్లు సభల్లో ప్రస్తావించారు. నేను చేసిన కించిత్ సేవను గొప్పగా చాటుతూ వారు ధన్యవాదాలు చెప్పటం నాకు సిగ్గుగా ఉండేది.
మా ఇంట్లో అమ్మపూజలు, SVJP కార్యవర్గ సమావేశాలు జరిగినపుడు వారు స్వయంగా వచ్చి సందర్భోచితంగా చక్కని సందేశం ఇవ్వటం, వారు రచించిన గ్రంథాలను తెచ్చి ఆవిష్కరించటం అనేవి నాకు మధురస్మృతులు, మహోపదేశాలు, మార్గదర్శకాలు. నాకు అర్హత ఉందో లేదో తెలియదు కాని 2018లో శ్రీ పి.యస్.ఆర్. అన్నయ్య రచించిన ‘ఆదర్శమూర్తి – ఆచరణస్ఫూర్తి’ జిల్లెళ్ళమూడి అమ్మ నిత్యపారాయణ గ్రంథా’న్ని వారు నాకు అంకిత మిచ్చారు; ధన్యతను సంతరించారు. అది అమ్మ ఆశీర్వచనం, అనుగ్రహం అని భావిస్తాను.
ఉత్సాహం, చమత్కారం, భావచైతన్యతరంగిత కవితా మాధురి మూడింటిని కలబోసిన త్రివేణీ సంగమం, విద్వన్మణి ఆయన. ఇటీవల డిసెంబర్ 12న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవాల్లో వారు విశేషమైన ఉత్సాహంతో పాల్గొన్నారు, ముందుండి నడిపించారు. వారిని అమ్మ “నువ్వు ఈస్థానకవివి!” అని సమ్మానించిందంటే పి.యస్.ఆర్, అన్నయ్య గారు అర్కపురి ఆస్థానకవులని స్పష్టమవుతోంది.
జగన్మాత అమ్మతోనూ, అమ్మ స్థాపించిన సేవా సంస్థల తోను పెనవేసుకుని నిస్వార్థంగా బహుముఖంగా సేవలనందిస్తూ అనునిత్యం అమ్మ దివ్యనామ స్మరణ, పావన సాన్నిధ్య స్ఫురణలతో తన ఉచ్ఛ్వాన నిశ్వాసాలలో కూడా అమ్మని ఉపాసిస్తూ, కడకు అమ్మలో ఐక్యమైనారు. జిల్లెళ్ళమూడి అందరింటి సోదరీసోదరుల హృదయాలపై చెరగని ముద్రవేశారు. ఆయన లేని లోటు తీర్చలేనిది.
మా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కుటుంబసభ్యులు అందరితోనూ ఆత్మీయతాను బంధాన్ని పెంచిన సౌజన్యమూర్తి ఆయన. మళ్ళీ అటువంటి పరిపూర్ణమూర్తిమత్వం గల వ్యక్తి మనకి లభించటం దుర్లభం.
వారి తపస్సు ఫలించి పరమపదాన్ని, పరమేశ్వరి అమ్మ సాయుజ్యాన్ని పొంది తరించారు – అని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.***