1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సంహారిణీ, రుద్రరూపా

సంహారిణీ, రుద్రరూపా

Mallapragada Srivalli
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : September
Issue Number : 2
Year : 2011

“శివుడు సంహారకార్యం నిర్వహించేటట్లు ప్రేరణ నిచ్చే దేవి “సంహారిణీ”.

ప్రళయకాలంలో రుద్రరూపం ధరించి, సర్వ జగత్తునూ సంహారం చేసే దేవి కనుక “రుద్రరూపా”భారతివ్యాఖ్య. 

సృష్టి, స్థితి, లయాలు అనే మూడు పనులు నిర్వహించే బాధ్యతను వేదత్రయమూర్తులయిన బ్రహ్మవిష్ణు మహేశ్వరులు స్వీకరించారు. సృష్టికర్త బ్రహ్మ అయితే, స్థితిని కలిగించేవాడు శ్రీమహావిష్ణువు. లయకారుడు పరమేశ్వరుడు, ఈ ముగ్గురు ఆయా పనులు నిర్వర్తిస్తున్నట్లు కనిపిస్తున్నా, నిజానికి ఈ పనులను వీరి రూపంలో నెరవేరుస్తున్నది శ్రీమాతే. అందుకే ఆమె సృష్టికర్తీ, బ్రహ్మరూపా, గోపీ, గోవిందరూపిణీ; సంహారిణీ రుద్రరూపా -గా కీర్తింపబడు “తోంది. ఇది ఎలా? అంటే ఆ శ్రీలలిత “విశ్వజనని”. అంటే, ఈ విశ్వమే రూపంగా గల తల్లి. కనుక, ఆమె కాక ఈ ప్రపంచంలో ఇంక ఇతరు లెవరూ లేరు. అందరూ ఆ తల్లి స్వరూపమే. శ్రీమాతకు అభేదమైన ఈ బ్రహ్మాండంలో ఆమె కానిది వేరే ఏదీ లేదు. అందరూ, అంతా ఆమె స్వరూపమే. ఇదే అద్వైత తత్త్వ పరమార్థం. అందుకే, త్రిమూర్తుల రూపాలతో ఆ ఆదిశక్తే సృష్టిస్థితిలయకారిణిగా భాసిస్తోంది. అందుకే ఆమె సంహారిణి, రుద్రరూపగా పూజలు అందుకొంటున్నది.

“అమ్మ” – సంహారిణీ, రుద్రరూపా. “యమదూతలు అమ్మ దూతలు కాకపోతేగా” అనే వాక్యం “అమ్మ” సంహార క్రియా నిర్వహణత్వాన్ని తెలియజేస్తోంది. సంహారిణి అయిన “అమ్మ” ఆజ్ఞ లేనిదే ప్రాణంపోవడం జరుగదు అని ఎన్నో సంఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి.

“అమ్మ” గారి అత్తగారు మరణశయ్యపై ఉన్నారు. నాన్నగారు ఆ సమయంలో పనిమీద బాపట్లలో ఉన్నారు. అందరూ ఆందోళన పడుతుంటే “నాన్నగారు లేకుండా – ఎట్లా పోతుందీ ?” అని, బామ్మగారి పోయే ప్రాణాలను పట్టి ఉంచి, నాలుగురోజుల తరువాత నాన్నగారు వచ్చేవరకు నిలబెట్టింది “అమ్మ”. నాన్నగారు రాగానే బామ్మగారు

మల్లాప్రగడ శ్రీవల్లి, గుంటూరు మరణించారు. ఈ నాలుగు రోజులు ఆమె ప్రాణం ఎలా నిలిచి ఉంది ? అనేది వైద్యులకు చిక్కు ప్రశ్నగా మిగిలింది.

సీతాపతి తాతగారి విషయంలో ఇంకా విచిత్రం చేసి చూపింది “అమ్మ”. తాతగారు మరణించారు అని వైద్యులు ధ్రువపరిచిన తరువాత తాతగారు పునర్జీవితులై, తరువాత నెలరోజులకు మరణించారు.

మృత్యుముఖంలో ఉన్న సోదరుడు పోతుకూచి రవీంద్రనాథ్ను మరొక సోదరుడు వఝ ప్రసాద్ గారి వివాహం జరిగే వరకు బ్రతికించింది. సోదరుడు యార్లగడ్డ వెంకన్న మరణశయ్యపై ఉన్నారు. మహాశివరాత్రి పర్వదినం నాడు రుద్రాభిషేకం, పూజ నిర్విఘ్నంగా పూర్తయినాయి. అందరూ తీర్థప్రసాదాలు, భోజనాలు ముగించిన తర్వాత ఆయన అంతిమశ్వాస వదిలారు. కుమారుడు దగ్గర లేకుండా కన్నుమూసిన సోదరి కటికి హనుమాయమ్మను, కుమారుడు రాగానే “ఒక్కసారి కళ్ళు తెరిచి కోటిని చూడు” అని ఆదేశించింది “అమ్మ”. ఆమె కళ్ళు తెరిచి కుమారుని చూసింది. సోదరి కోన వెంకాయమ్మను “ఇంకా ఏం చూస్తావు? కళ్ళుమూయ్” అని “అమ్మ” చేతితో అదిలించగానే ఆమె కళ్ళుమూసి దీర్ఘనిద్రలోకి జారుకుంది.

“అమ్మ” సంహారిణి అనే విషయం “హైమమ్మ” మరణసమయంలో కూడా స్పష్టమయింది. హైమమ్మను గురించి “అమ్మ” – “25వ సంవత్సరం దాటడం కష్టం” అని ఎప్పుడో ప్రకటించింది. అలా అని హైమమ్మకు వైద్యం చేయించడం మానలేదు. అయితే, చివరిదశలో – హైమమ్మ కష్టాలకు, బాధలకు భరతవాక్యం పలకాలని అనుకుందేమో! ఎంతమంది డాక్టర్లు ఆశాభావం వ్యక్తం చేసినా, గుంటూరు హాస్పిటల్లో చూపిద్దామని అన్నా – “ఉండే రెండు గంటల్లో దాన్ని ఈ ప్రయాణం చేయించి, హైరానా పర్చటమే తప్ప జరిగేదేం లేదు” అని నిశ్చలంగా, నిశ్చయంగా ప్రకటించింది. గుంటూరు చేరాక, హాస్పిటలు లోపలికి తీసుకెళ్ళడానికి రామకృష్ణ అన్నయ్య సిద్ధమవుతుంటే, “ఇంకా ఎందుకు ? అంతా అయిపోయింది.. వెనక్కి వెళ్లాం” అని స్పష్టంగా చెప్పింది “అమ్మ”. అయినా డాక్టర్లు చివరివరకు తమ ప్రయత్నం మానరు కదా ! ఎమర్జెన్సీ వార్డులో హైమమ్మను చేర్చి, ఆక్సిజన్ పెట్టారు. రక్తం కోసం డాక్టర్ జ్యోత్స్న ప్రయత్నించే లోగానే హైమమ్మ “వస్తున్నా అమ్మా” అంటూ “అమ్మ”లో ఐక్యం అయింది. హైమమ్మను గురించి “అమ్మ” – నేను కున్నాను (సృష్టి) నేను పెంచాను (స్థితి), నేనే చంపుకున్నాను (లయం)” అని చెప్పడం ‘సృష్టిస్థితి లయకారిణి’ తానే అనే విషయాన్ని సుస్పష్టం చేస్తోంది.

సంహారిణిగా ఎన్నో సన్నివేశాల్లో సాక్షాత్కరించిన “అమ్మ” “రుద్రరూపా” కూడా. దరహాసవదనంతో, సౌమ్య వాక్కులతో, ప్రసన్నదృక్కులతో ప్రకాశించే “అమ్మ” ఒక్కొక్కసారి తన కన్నుదోయిలో క్రోధారుణిమకాంతులను, కంఠంలో కాఠిన్యాన్ని నింపుకుని అతి సన్నిహితులైన వారిని కూడా భయభ్రాంతులకు లోను చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో వారు “అమ్మ”ను పలుకరించడం కాదు కదా ! ఆమె ముఖంలోకి తేరిపార చూడడానికి, ఆమె సమక్షంలో ఉండడానికి కూడా భయపడే సందర్భాలు ఉన్నాయి. అలాంటి “అమ్మ” రుద్రరూపం ఊహకు కూడా భయాన్ని కలిగించేదిగా ఉంటుంది. అందుకే “అమ్మ” స్వభావమధుర మాత్రమే కాదు- రుద్రరూప కూడా.

“సంహారిణీ, రుద్రరూపా” అయిన అర్కపురీశ్వరి అనసూయా మహాదేవి దివ్యచరణారవిందాలకు సభక్తికంగా ప్రణమిల్లుతూ

మాతృసంహిత, అర్కపురి విశేషాలు రచయితలకు కృతజ్ఞతలు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!