ఆధారభూత’, ఆధారమునకే ఆధారమైన అమ్మ, ఒకనాడు జిల్లెళ్ళమూడిలో చిన్న పట్టె మంచం మీద కూర్చొని దర్శనం ఇస్తోంది, పూజలందు కుంటోంది, అయాచితంగా అనుగ్రహాన్ని వర్షిస్తోంది.
ఒక సోదరి స్వయంగా తయారు చేసిన తియ్యని బొబ్బట్లని అమ్మకు నివేదన చేసింది. ఆ మహాప్రసాదాన్ని అందరికీ పంచుతున్నది. అమ్మ దివ్యపద సన్నిధిలో ఉన్న రామకృష్ణ అన్నయ్యకు ఒకటి ఇవ్వబోయింది. ‘వద్దు’ నాకు సుగర్ ఉంది కదా!’ అన్నాడు. అందుకు ఆ అక్కయ్య “ఇది ప్రసాదం. ఏం చెయ్యదు. తిను’ అన్నది. వెంటనే అమ్మ, “ఏం చెయ్యకపోతే తినటం ఎందుకు?” అని ప్రశ్నించి ప్రసాదం విలువను చెప్పకనే చెప్పింది. మరుక్షణం అన్నయ్య బొబ్బట్టు అందుకుని తిన్నాడు.
శ్రీ రాజు బావ రచించిన ‘అనుభవసారం’ పాటల పుష్ప గుచ్ఛం అమ్మ ప్రసాదమే. వాటిని రాజా పాటలు (రాయల్ సాంగ్స్) అని అమ్మ సన్మానించింది, అక్షరం మార్పు చేయకుండా యధాతథంగా ఆమోదించింది. స్వీయ జీవిత చరిత్రలోని సన్నివేశాలతో అనుసంధానం చేసింది, పాడుటకు వీలు కానివారికి కనీసం చూసి చదవమని నిర్దేశించింది. కావున ఆ పాటలు వేదాల వలె అపౌరుషేయాలు.
ఆ పాటలు సకలార్ధ సాధకాలు, సకల అభీష్ట ఫలప్రదాలు, భక్తి జ్ఞాన వైరాగ్య మార్గదర్శకాలు, అమ్మ మహత్తత్త్వ దర్శన భాగ్య ప్రాప్తికి సువర్ణసోపానాలు. ఆ దిశగా లక్ష్యసిద్ధికి సముచితమైన గీతాల్ని నాకు అందినంతవరకు వివరిస్తాను.
- ధ్యానం:
‘ఎంత మంచిదానవోయమ్మా’ – పాట, అమ్మ అకారణకారుణ్యానికి విలక్షణమైన అమ్మ అవతార లక్ష్యానికి దర్పణం పడుతుంది. మానవాళి మనోమాలిన్యాలను కడిగివేసి ఉద్ధరించే ఆప్తబాంధవి అమ్మ అనీ, తరింపచేసే తల్తి అని ఎరుకపరుస్తుంది.
-‘దివ్యభువనాలు వదలి’ పాట, మణిద్వీపమో మరి ఏ దివ్య లోకాల నుంచో దిగి వచ్చి అనుగ్రహరూపంగా మనుష్యజనతా భాగ్యరూపిణిగా అమ్మ నిల్చింది అనే వాస్తవాన్ని వేనోళ్ళ చాటుతుంది.
- ఆవాహన:
‘శ్రీరాజరాజేశ్వరి’ పాట (పాట నెం.17. పే॥119) పూజా సమయంలో పాడుకొనుటకు అనుకూలంగా ఉన్నది. ‘కదలిరమ్ము కళ్యాణివై’, ‘విజయము చేయుము విశ్వేశ్వరివై’ అంటూ అమ్మ ఆవాహన చేసేందుకు ఉపకరిస్తుంది.
– ‘ధరవే కదలిరమ్మా!’ పాట, అణువణువునా అమ్మత్వాన్ని నింపుకోవడానికి, అమ్మే మార్గం, గమ్యం, గురువు, దైవం అని తెల్సుకోవడానికి రాచబాట.
- ఆసనం:
-కదలి రావమ్మా! అమ్మా! నను వదలి పోకమ్మా పాట, మనమనోమందిరాల్లో ఉన్నతాసనమే అమ్మకు రత్నసింహాసనం. అమ్మదేవతలకు దేవత అని ఈ పాట నిసర్గసుందరంగా ప్రబోధిస్తుంది.
- ప్రార్ధన:
– ‘నిను పూజింతుము ఈశ్వరీ కనికరించు కామేశ్వరీ’ పాట, ‘అవిశ్వాసి జనాగ్రాహ్య (విశ్వాసము లేని వారికి అర్థంకానిది) అనన్యభక్తి పూర్ణాత్మ సుగ్రాహ్య’ (శాస్త్ర జ్ఞానం లేశమైనా లేకున్నను విశ్వాసము గల వారికి తెలియబడునది) అమ్మ అని గుర్తింపచేస్తుంది.
-‘హే అఖండ దివ్యజ్యోతి’ పాట పంచభూత తత్వమే అమ్మ అనీ, ద్వంద్వాతీత అమ్మ అనీ తెలియ జేస్తుంది.
– ‘ఎప్పుడో, ఎప్పుడో – పాట అమ్మతో తాదాత్మ్య స్థితిని పొందాలనే అభ్యర్థన. అమ్మ అడుగులు వేయటానికి నేలగా, వండుటకు అగ్నిగా, స్నానము చేయుటకు నీరుగా అవ్వాలి అనే లోకోత్తరమైన ఆకాంక్షను వ్యక్తం చేస్తుంది.
- అర్చన:
– ‘అమ్మా! స్థిరోభవ!’ – పాట, కోరికలు కోరేటి కోరికే లేనట్టి నిష్కామకర్మయోగ సిద్ధిని, కర్త ృత్వ రహిత భావన ప్రాప్తిని, ‘సర్వేజనా స్సుఖినో భవన్తు’ అనే ఆర్షకామనని కలిగించమని మన హృదయ సింహాసనేశ్వరి అయిన అమ్మను ప్రార్ధనా పూర్వకంగా అర్చిస్తుంది.
– ఏ పూజనే చేతును? – పాట, సంప్రదాయబద్ధమైన షోడశోపచారములలో ధూపం, దీపం, నైవేద్యం, నీరాజనం… కు బదులుగా విశ్వాసము, జ్ఞానము, జీవితము, హృదయములను సమర్పించవలెనని తత్వతః వాస్తవికతను చాటి చెపుతుంది.
ఓం క్లీం హ్రీం శ్రీం ఓం’ – పాట, అమ్మ మనస్సు, మాట, నవ్వు, నగుమోము సర్వం మధురమని మాతృత్వ మధురిమను ఒకింత రుచిచూపిస్తుంది. అమ్మను లలితా పరమేశ్వరిగా సాక్షాత్కరింప చేస్తుంది.
- అమ్మ కళ్యాణగుణ వర్ణనాత్మక వందనం:
‘వినరమ్మా! వినరయ్యా ఈ గాధా – పాట అమ్మ తల్లులకు తల్లి అనీ, రాగద్వేషాసూయలను పారద్రోలే అనసూయ అనీ, అఖండ ఆనంద స్వరూప పరబ్రహ్మమనీ విశదీకరిస్తుంది.
పాడుచు, పాడుచు- పాట, సర్వ దంద్వాలకు మూలకారణమైన నిర్గుణ తత్వం అమ్మ అనీ, సర్వము అమ్మ, సమతయు అమ్మ కనుక సగుణతత్వమూ అమ్మే అనీ మృదుమధురంగా వినిపిస్తుంది.
అందాల లీలలలో- పాట, దృశ్యాదృశ్య సకల జగత్తూ అమ్మ ఓరిమిలో, కారుణ్యంలో, అవలోకనలో నిలచియుండి, తన్మయమైనదని గానం చేస్తుంది.
‘జీవన అమవసలో జాబిల్లీ’ పాట, క్రమాలంకార సంశోభితం. పరస్త్రీని తల్లివలె చూడటం అమ్మ కృప వల్ల సాధ్యమనీ, అమ్మ వాక్కు, ఋక్కు, అమ్మస్వరూపం- సంకల్ప వికల్పాత్మక నిఖిల జగత్తు అని బోధిస్తుంది.
‘మేదినీ స్వరూపిణీ!’ పాట, ద్వంద్వాలకు ఆధారమైన సర్వసృష్టి కారిణి అమ్మ అనీ, అమ్మమాట, అమ్మబాట, అమ్మ రూపం అమ్మను అణువణువునా దర్శింపచేస్తాయని దర్శింపచేస్తుంది.
‘బ్రహ్మాండ వంశాబ్ది తిలకా!’ పాట, జగత్పిత నాన్నగారి, జగన్మాత అమ్మ యొక్క లోకోత్తర ధర్మ పరిపాలనని, కర్తవ్యాన్ని అభివర్ణిస్తుంది.
‘అమ్మా! అమ్మా! ఆదిజననీ – పాట, అమ్మ సర్వజీవ జీవన సంజీవని అనీ, స్వయంప్రకాశమానమూర్తి, జగదేకపావని అని కీర్తిస్తుంది.
‘అమ్మ కధే అవని గాధా! -పాట, సహనంలో అమ్మ గోమాత, భూమాత అనీ, సహజసహనమే అమ్మ స్వభావమనీ అమ్మ అతిలోక గుణవైభవాన్ని ప్రస్తుతిస్తుంది.
- లావొక్కింతయులేదు:
‘ఒక్కసారి మావైపు చూడు’ పాట, మనస్సుకి మాటకి తాళం పడి ప్రమాదం ముంచుకొచ్చినపుడు, కత్తి మెడమీద పెట్టినపుడు, చేతులకు చేతలకు సంకెళ్ళు పడ్డప్పుడు, కంటకావృతమూ అంధకార పరీవృతమూ అయిన జీవనయానంలో పయనించాల్సిన క్లిష్టపరిస్థితుల్లో ‘అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం ‘మమ’ అంటూ ‘అంఆ’ కరావలంబనకోసం అర్థించటానికి పటుతరమైన సాధనం.
‘మోయలేని భారమమ్మా
భారమైన బ్రతుకు గాధా’ పాట కష్టాల సుడిగుండాల్లో పడి, దిక్కులేక దిక్కుతోచక కొట్టుకు పోయే సమయంలో పాడుకుంటే అవ్యక్తంగా అమ్మ రక్షిస్తుంది, భరించలేని స్థితినుంచి పొదివి పట్టుకుని గట్టుమీద పడవేస్తుంది.
‘ఎంతదూరమమ్మా ఈ పయనం?’- పాట, అమ్మ యొక్క సముద్రమంత గంభీరమైన, ఆకాశమంత విశాలమైన మనస్సును, నిజస్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. భయంకరమైన జనన మరణ ఆవర్తన చక్రం నుంచి విడుదల చేయమని అంజలిఘటించి ప్రార్ధించమని సందేశాన్నిస్తుంది.
- పరిపాలయ మాం:
దిగులొందనేల వెతచెందనేల?
సాగిలరాదా యీ తల్లి మ్రోల?- పాట, యుగయుగాలుగా తరతరాలుగా నాటుకుపోయిన అంధవిశ్వాసాల్ని, మూఢనమ్మకాల్ని సమూలంగా పెకలించి వేసి నవజీవన యానానికి శ్రీకారం చుట్టిన అమ్మే ఏకైకశరణ్య అని మార్గదర్శనం చేస్తుంది.
‘ఒక్కక్షణము’ – పాట, అమ్మదయతో ఒక్క క్షణమైనా ఆత్మ సందర్శన భాగ్యం అనీ, అనితర సాధ్యమైనది అమ్మకే సాధ్యమని స్పష్టంచేస్తుంది.
‘ఏమీ! ఇదే!’ పాట, అమ్మ ఆశ్చర్యకర వాత్సల్యాన్నీ, ప్రేమామృతరూపమైన అమ్మచేతి గోరుముద్ద ప్రభావాన్నీ వైభవాన్నీ హృదయంగమంగా శ్లాఘిస్తుంది.
- మాతుః పవిత్ర చరణా శరణం ప్రపద్యే:
‘నీచరణాలు నే విడువనమ్మా’ పాట, అమ్మ పాద పద్మాలు సుందర మందార కుసుమ మంజులాలు, సర్వదేవతలకు నివాస మందిరాలు. అవి పరితప్త హృదయాలకు చల్లని నీడపట్టు, దైవోపహతులకు పునరుజ్జీవన కేంద్రాలు, తెలుసుకోవాల్సిన దానిని తెలుసుకోలేక దిక్కు తెలియని దిక్కుతోచని సాధకులకు లక్ష్యము లక్షణములు అని ప్రస్తుతిస్తుంది.
‘నీచరణములే శరణంబు’ పాట, అమ్మను ఆశ్రయించినందు వలన కలిగే పరమ ప్రయోజనాన్ని వర్ణిస్తుంది. మాటలు లేని మంత్రము ఉపదేశించి పరమును చూపిస్తుంది, సారహీనముగా కనబడుతున్న సంసారములోని సారాన్ని తెలిపి ఒడ్డుకు చేరవేస్తుంది. ‘కర్మ సిద్ధాంతాన్ని’ సహేతుకంగా ప్రక్కకు నెట్టి చేతలు చేతుల్లో లేవని, కరృత్వభావన, ‘స్వయంకృతాపరాధము’ వంటి అపోహలనుంచి విముక్తుల్ని చేస్తుంది, స్వేచ్ఛావాయువులను వీస్తుంది, లాలించి పాలిస్తుందని విశదీకరిస్తుంది.
‘అమ్మా! మాఅమ్మా!’-పాట, ‘నీచరణములే నిరతము నమ్మితినంటూ అనన్య శరణాగతి అవశ్యకతని వైశిష్ట్యాన్ని విశదపరుస్తుంది.
- వినైవానసూయాం నమాతా న మాతా:
‘నీకు నీవేను సాటి’- పాట, గగనం గగనాకారం సాగరస్సాగరోపమః’ అన్నట్లు అమ్మను అమ్మతోనే పోల్చ సాధ్యము అని వివరిస్తుంది. మనుషులందరూ మంచి వాళ్ళే నని ఎవరు నిర్ధారించారు? అందరికీ సుగతే అని బేషరతుగా ఎవరు తీర్మానించారు? సృష్టే దైవం అని ఎవరు విస్పష్టం చేశారు? ‘తరింపచేసేదే తల్లి’ అని మాతృధర్మ పరిరక్షణే తన అవతార లక్ష్యంగా ఎవరు ఎంచుకున్నారు? అట్టి అమ్మకు అమ్మే సాటి. అనన్య సామాన్య కారుణ్య రాశి అమ్మ. ‘మనశ్శుద్ధే మనస్సిద్ధి’ – అనేది అమ్మ ఆచరణాత్మక ప్రబోధం. త్వయి రక్షతి రక్షకై: కిం అన్యైః త్వయిచారక్షతి రక్షకైః కిం అన్యైః (అమ్మా! నువ్వు రక్షిస్తే ఇతర రక్షకులతో పనిలేదు, నువ్వు కూడా రక్షించకపోతే ఇతర రక్షకులతో పనిలేదు) అని అనన్య శరణాగతిని చాటారు డా॥పన్నాల రాధాకృష్ణశర్మ గారు.
‘నీ నామమే పావనం’ పాట, మాతృప్రేమామృత రసాన్ని రుచి చూపిస్తుంది. శిశువులు, పశువులు, తాపసులు, తామసులు అందరూ అమ్మా అనీ, అంబా అనీ, శ్రీమాత్రేనమః అనీ ఏ పేరుతో పిలిచినా ఏ నామాన్ని ఉచ్ఛరించినా ఏ రూపాన్ని ఆరాధించినా అది అమ్మ కళ్యాణరూపమే- అని అభివర్ణిస్తుంది.
‘భావనకే అందని’ పాట, సకలకార్యాలకూ కారణమై అకారణంగా సకల కార్యాలను నడిపే సగుణమూర్తి అమ్మ అని గుర్తింపచేస్తుంది. అది జ్ఞానజ్యోతి, వేదాలు వర్ణించే సువర్ణజ్యోతి, అజ్ఞానం లౌకిక భావనకి అందదు. ఆ జ్యోతి ఈ కళ్ళకి కన్పించదు.
(సశేషం)