(గత సంచిక తరువాయి భాగం)
- దాసోహం :
‘దిగివచ్చినారు’-పాట, సర్వజగద్ధాత్రి అయిన అమ్మ దివ్య దర్శనం కోసం, అమోఘ ఆశీస్సులకోసం దేవతలే స్వయంగా దిగివచ్చి మానవ రూపాల్లో నడయాడుతున్నారు. ఇక మన స్థాయి ఎంత? ఎంతగా మనల్ని అమ్మ ముద్దుచేసినా, గారం చేసినా మానవాళి జగన్మాత దాసదాసాను దాసులే అని స్ఫురింపజేస్తుంది.
- వరదాభవ దేవి:
‘శ్రీకరము శుభకరము’ పాట, అమ్మ అమృతకర స్పర్శ శ్రీకరము, శుభకరము, కళ్యాణకరము అనీ, అమ్మ అందించే గోరుముద్దలు సంతృప్తికరము అనీ, అమ్మ నామం మోక్ష కరము అనీ వర్ణిస్తుంది. మానవాళి, జీవకోటి భాగ్యదేవత అమ్మ అని పరమ సత్యాల్ని ఆవిష్కరిస్తుంది.
‘దీవించు మమ్మా మము’ పాట, మా గండాల్ని తొలగించి, పరమార్థాన్నీ పరమాత్మ యదార్ధ తత్వాన్నీ మాకు తేట తెల్లం చేసి మాకు ఇహపర సౌఖ్యాలను ప్రసాదిస్తావు. నీ దివ్య మంగళరూపం మా హృదయాల్లో ప్రతిష్ఠించి దీవించుమమ్మా మము’ అనే ప్రార్థనను మనోజ్ఞంగా గానం చేస్తుంది.
‘జీవేమ శరదశ్శతం’ పాట, మనందరం అమ్మ సంతానం, ఏకోదరులం. కొండంత అమ్మకోరి మన అండన నిల్చింది. మనకి ఏ లోటూ, చీకూ-చింతాలేదు. మనస్సంతా అమ్మ రూపాన్ని నింపుకుని, నోరారా అమ్మ నామాన్నీ, గుణ వైభవాన్నీ కీర్తిస్తూ నిండు నూరేళ్లు జీవిద్దాం అని ఒక తారక మంత్రాన్ని ఉపదేశిస్తుంది.
‘శ్రీరస్తని శుభమస్తని’ పాట, ఉత్సవాల్లో నిత్యపూజావేళల్లో అక్షరస్వీకార, ఉపనయన, వివాహ, గృహప్రవేశ, వ్యాపారారంభాది శుభసందర్భాల్లో అమ్మ దివ్యాశీస్సుల్ని అభ్యర్థిస్తూ పాడుకోవటానికి నిర్దేశించబడింది. అమ్మయే నిత్యమని బ్రహ్మయే మిథ్య అని వేనోళ్ళ ప్రస్తుతి చేస్తుంది. ఎక్కడున్నా ఎవరన్నా సరే – అంతా హాయిగా ఉండాలనే హైమక్కయ్య విశ్వకళ్యాణ కారక మహదాకాంక్షకు దర్పణం పడుతుంది.
- కైవల్యదాత్రి:
‘అవధులే లేని ప్రేమా’ పాట. ప్రేమకు నిర్వచనం, రూపం హైమ. హైమచల్లని తల్లి, మమతల పాలవెల్లి. మనస్సు ఎంత నిర్మలంగా ఉండవచ్చునో తెలుసుకోవటానికి నిలువెత్తు రూపం హైమ. ‘దయగల హృదయమే దైవనిలయం’ ఒక సత్య ప్రవచనం, ఆ నిలయం హైమాలయం అంటూ హైమక్కయ్యలోని లోకోత్తర దైవీ గుణసంపత్తిని సుబోధకం చేస్తుంది.
‘అందరి హృదయాల వెలుగు హైమా!’- పాట. హైమ నిత్యమైనదీ, సత్యమైనదీ – అంటే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అమ్మ. అమ్మకి ప్రతిరూపమే హైమ. రెండు చేతులా చిన్ముద్రను ధరించి అద్వైతామృత వర్షిణిగా, కైవల్యదాత్రిగా సుప్రతిష్ఠిత అయింది హైమ హైమాలయం దక్షిణామూర్తి తత్త్వానికి నిలయం. అనితర సాధ్యం. జీవకోటికి హైమ దారి, ధృవతార, దిక్కు, ఉపాసకులకు సాధకులకు హైమ ఆదర్శం. అని హైమవతీశ్వరి ప్రాభవాన్నీ వైభవాన్నీ కీర్తిస్తూ మోక్షాన్ని కరతలామలకం చేస్తుంది.
- జగన్మాతృ విశ్వరూప సందర్శనం:
‘వెలలేని నీ గాధ వినిపించెద’ పాట. అమ్మగాథ నిరుపమానమైనది. ఎవ్వరూ అనుసరించలేనిది..
ఒక కోణంలోంచి చూస్తే సకల జగత్తూ, సకల జగదాధార అమ్మే, మరొక కోణంలోంచి చూస్తే అమ్మ ఒక సామాన్య గృహిణిగా ఎన్నో ఆటుపోట్లు, అనుమానాలు, అవమానాలు అగ్ని పరీక్షలను సహించింది. అగ్నికీలలో బంగారు ముద్దలా స్వచ్ఛంగా ప్రకాశించింది.
సకల మానవాళి అమ్మ సంతానమే. కానీ అమ్మకి మనకి ఏ పోలికాలేదు. సూర్యకాంతి వలె అమ్మను ఏ ఒక్కరు చూడజాలరు, అమ్మ సౌశీల్యము, సహనం, అపారమైన ప్రేమ అందుకుకారణం – అని దివ్యదీధితులను ప్రకాశింపచేస్తుంది.
‘ఆధారమెవరమ్మా?’ పాట. అమ్మ మానుషీరూప సంఛన్న, సర్వమంగళ, జగదేకైకశాసని, దీనజనశరణ్య అని తెలియజేస్తూ అమ్మను ప్రార్థించడం, వేడుకోవడం నిమిత్తం ఒక విధానాన్ని నేర్పుతుంది. భక్తి శ్రద్ధలను బోధపరుస్తుంది.
‘ఎవరమ్మా? నీవెవరమ్మా? – పాట. ఈ లోకంలో తల్లి లేని వారెందరో ఉన్నారు. అమ్మా బాల్యంలోనే కన్నతల్లికి దూరమైంది. అందరికీ ఆలోటు తీర్చడానికి అమ్మ, అందరినీ తానే కన్నానని, అందరికీ తానే కన్నతల్లినని సర్వాత్మనా త్రికరణ శుద్ధిగా ప్రకటించింది. ‘మీరు నా బిడ్డలేకాదు, నా అవయవాలు’ అంటూ కన్నబిడ్డలతో తాదాత్మ్యం చెందినది.
దైవం ఒక్కడే. అద్వితీయుడు. కావున అమ్మ ఏకాకి అలా అద్వితీయ వపుష్మతి – అని ఆద్యంతరహిత అమ్మను, అమ్మ సహజప్రేమను అభివ్యక్తం చేస్తుంది.
కాగా అమ్మ ఎవరు? ఏమో! ఎవరికి తెలుసు?
‘సంకల్పమేమిటో’ పాట. “మీరు ఇకపుట్టరు. మంచిపనులే చెయ్యండి. మళ్ళీ పుడతామేమోనని భయపడవద్దు.” అంటూ అమ్మ జన్మలులేవని అభయప్రదానం చేసింది. అట్టి అపూర్వ సంకల్పం, సత్సంకల్పం అమ్మది.
సంకల్ప రహిత అయిన అమ్మ అసంకల్పజాత అయిందనీ, నామ రూపగుణ రహిత నామరూపగుణ సహిత అయిందనీ- సృష్టిరచనావైచిత్రిని విశ్లేషిస్తుంది, శ్లాఘిస్తుంది.
‘అవనే నోచిన నోముల పంటై’ పాట. అమ్మ విశేష తత్వానికి నిలువెత్తు దర్పణం పడుతుంది. సరస్వతీ దేవికి చదువుల సారాన్నీ, లక్ష్మీదేవికి సమతాగుణాన్నీ, పార్వతీ దేవికి పాపపుణ్యాల లెక్కల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందనీ, అందుకు త్రిమాతలు అమ్మ వద్దకు వచ్చి నేర్చుకోవాలని నిజాన్ని నిర్భయంగా చాటుతుంది.
‘సర్వం ఖల్విదం అమ్మ’ పాట. ‘సర్వ ఖల్విదం బ్రహ్మ’ అని ప్రవచిస్తుంది. ఆర్షసంస్కృతి. ఆ బ్రహ్మని మనం చూడలేదు. పదార్థము శక్తి, దేహము జీవము, సృష్టి- సృష్టికర్త తానే అయిన అమ్మను మనం చూశాం. కావున సర్వం ఖల్విదం అమ్మ- అంటూ అమ్మే బ్రహ్మ… అని నిరూపిస్తుంది.
‘అనుభవసారము నీవమ్మా’ పాట. కృపతో అమ్మ అనుగ్రహించిన విశ్వరూపసందర్శనాన్ని, సర్వత్రా పరివ్యాప్తమైన అమ్మ మమకార మధురిమను, జగత్తునందు దశదిశలా అమ్మ పరచిన శాంతి స్వేచ్ఛా వాయువుల్ని, సుప్తమానసాల్ని జాగృతం చేసే అమ్మ విలక్షణ మార్గాన్ని, అమ్మ ఎంచుకున్న అనన్య సామాన్య సముద్ధరణ విధానాన్ని అవ్యక్త మధురంగా వినిపించే వంశీనాదం.
‘అమ్మల మరపించు’-పాట. అమ్మ నమ్మలేని అమ్మలేని అమ్మ అని అంటే ఆద్యంతరహిత అని విపులీకరిస్తుంది. మధుర మాతృప్రేమాతిశయంతో విరించీకరణము, విపంచీకరణము, పంచీకరణము, ప్రపంచీకరణములను బోధిస్తుంది అని వ్యక్తపరుస్తుంది.
‘చూశాను ఆనాడు’ పాట. ఒక నాణానికి బొమ్మ బొరుసు మాదిరిగ అందరిని కన్న అమ్మ-అందరిని ఏలే బ్రహ్మ అవిభాజ్యంగా దీపిస్తున్నారనీ, అమ్మ సర్వజగద్ధాత్రి, మోక్షప్రదాత్రి అనీ, అమ్మ దివ్యాశీస్సులే సకల జగతికి శ్రీరామరక్ష అని అభివర్ణిస్తుంది.
సామాన్యంగా తల్లి-బిడ్డ రెండు విభిన్న రూపాలు, మూర్తులు. కానీ సకల జీవకోటి అమ్మ బొజ్జలోనే ఉద్భవించి, కన్నులు తెరచి, శ్వాసించి, జీవించి, తుదకు అమ్మలోనే లీనమౌతుందనే మహత్తర సత్యాన్నీ నిస్పష్టంగా చాటుతుంది.
‘ఎందుకో? నీ కెందుకో?’ పాట. సృష్టిలో అగ్నిపర్వతాలున్నాయి, మంచుకొండలున్నాయి. కొన్ని విషాదకరమైనవి, కొన్ని ఆహ్లాదకరమైనవి. కొన్ని అమూల్యమైనవి, కొన్ని నిరుపయోగమైనవి. “నాదృష్టిలో ‘వేస్ట్’ అనే పదం లేదు” అన్నది అమ్మ యదార్ధం. నడక అంటే ఒక అడుగు ముందు, ఒక అడుగు వెనుక. సృష్టి అంతే. ద్వంద్వాలే సృష్టి నడకకి ఆధారం.
ప్రయోజకత్వం, అప్రయోజకత్వం మానవ దృష్టిలో మాత్రమే ఉంటాయి. ఓడిపోయే వ్యక్తీ లేకుంటే విజేతకి చిరునామాయే లేదు. ప్రతి గుండ్రాయీ శివలింగం అనిపించుకోదు, ప్రతి గులకరాయీ సాలగ్రామ శిలగా పూజలందు
కానీ అమ్మ దృష్టిలో అందరూ కారణజన్ములే, అన్నీ ఉత్కృష్టమైనవే అంటూ అసలు ముక్కను అందంగా ఆవిష్కరిస్తుంది.
‘తీయ తీయని గాధలే తుదకు తీరని బాధలా’ పాట. వృద్ధిక్షయాలు లేని వస్తువులు, పొరపాట్లు లేని వ్యక్తులు లేనే లేవు, లేరు. దేనికీ నిరాటంకమైన అభివృద్ధి లేదు. సుకుమార గులాబీ కుసుమానికి ముళ్ళు, సుగంధభరిత మొగలిపొదకు విషసర్పాలు సహజం. వెలుగు, రాగం, శబ్దంతో చీకటి, త్యాగం, నిశ్శబ్దం జతకడతాయి అని సృష్టికర్త స్వరూప, స్వభావాల్ని రమణీయంగా చిత్రీకరిస్తుంది.
‘నా హృదయవీణా- ఆలావనా’ పాట. అమ్మ మార్గం విలక్షణమైనది, దుర్నిరీక్ష్యమైనది, భయానకమైనది అమ్మకి సుఖం అక్కరలేదు, కానీ తన బిడ్డలకి కావాలని కోరుకుంటుంది. పూలబాట కావాలి తనకి కాదు మనకి. తాను అగ్నిగుండంలో ఆడుకోవాలని, పాము పడగ, నీడన కాపురం చేయాలని కోరుకుంటుంది అంటూ అమ్మ మార్గాన్నీ, జీవన సరళిని దర్శింపజేస్తుంది. కనీసం చూసే సత్తా ఎవరికీ ఉండదు.
అమ్మే సద్గురువు, అమ్మ చరిత్ర పవిత్రమైనది, అమ్మ కీర్తి కోటి సూర్య ప్రభాభాసమైనది. అమ్మ సంతానం – మనుష్యులు, జంతువులు, పక్షులు, మొక్కలు, గాలి, నీరు గ్రహాలు, గ్రహరాజులు. సమస్తమూ అట్టి అమ్మే ‘సర్వం ఖల్విదం బ్రహ్మ : అని సిద్ధాంతీకరిస్తుంది.
- నీరాజనం:
‘పరమాత్మవైన నా అమ్మా
నీరాజనమ్ము గై కొమ్మా’ పాట.
నిత్య పూజానంతరం కర్పూర ఆనంద నీరాజనాన్ని సమర్పించిన తర్వాత పాడుకోవటానికి రసరమ్యంగా ఉంటుంది. అమ్మకి ఆశ్రిత పక్షపాతం లేదు, స్వపరభేదం లేదు, మ్రొక్కిన వారనీ, మ్రొక్కని వారని తేడా లేదు.
అమ్మ అనుగ్రహం, కారుణ్యం, ప్రేమ సర్వత్రా వర్షిస్తుంది. అయాచితంగా. బాధితులకు, వేదనా పరితప్తులకు, నిస్సహాయులకు, దైవోపహతులకు, ఆర్తులకు.. అమ్మ ఆశ్రయాన్నిచ్చి సేదదీర్చి గట్టెక్కిస్తుంది. అంటూ వాస్తవానికి అమ్మే మనల్ని ఆరాధిస్తుంది. అనే యదార్ధాన్ని కళ్ళకి కట్టినట్లు చూపిస్తుంది.
- పవళింపు సేవ:
‘జో! అమ్మా! జో!జో!! అమ్మా! జోలపాట.
కొండంత దేవుని కొండంత పత్రితో పూజించగలమా? జగములనేలే తల్లిని పసిపాపను చేసి ఊయలలో వేసి లాలి పోయటం సాధ్యమా? కనుకనే.
‘వేయనా బ్రహ్మాండమంత ఉయ్యాల,
పాడనా మురిపాల పవళింపుసేవ- అంటూ పరాత్పరి అమ్మ విరాట్స్వ రూపాన్ని అవ్యక్తమధురంగా శ్లాఘిస్తుంది.
అందరినీ మాతృవాత్సల్యాంబుధిలో ఓలలాడించే అమ్మ, తనుకూడా క్షణమాత్రకాలం తల్లి ప్రేమామృత వృష్టిలో తడిసి ముద్ద కావాలని కోరుకుంటుందేమో! అలసి సొలసిన జగన్మాత ఒక తల్లి ఒడిలో పసిపాపయై సేదతీరాలనుకుంటుందేమో! ఏమో!- అంటూ ఒక కమనీయ భావనని అపూర్వంగా అపురూపంగా ప్రోది చేస్తుంది.
ఒక ముఖ్యాంశము:
‘ఓ దయానిధీ ఓహోదయానిధీ దయాధర్మమే లేనిదా విధీ’ పాటను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలపించవద్దు, ఆలకించవద్దు. కావాలని లౌకిక దృష్టిలో ఒక అశుభాన్ని ఆహ్వానించవద్దు- అనేది. రచయత సెంటిమెంట్.
మలిమాట:
కొన్ని పాటలనే నాకు అందినంతవరకు వర్గీకరణ చేశాను. ఇదే రీతిలో మిగిలిన పాటల్ని అవలోకిస్తే అంతర్వాహినియై ప్రవహించే పరమార్ధఝరిలో తత్త్వతః పుష్కరస్నానం ఆచరించవచ్చును.
సక్కుబాయికి వాతలు పెడితే అవి కృష్ణుని శరీరం మీదకు వచ్చి పడ్డాయి. ఆ మంట ఆయన అనుభవించాడు. అది చరిత్రగా విన్నాం. ఒకనాటి సంగతి. మనం చూడలేదు. కానీ అమ్మ అవతారకాలంలో రెండు కళ్ళతో మనం అట్టి సంఘటనల్ని చూస్తున్నాం. దీనిని అదృష్టం, భాగ్యం, తపఃఫలం… ఏ పేరుతో పిలవాలో తెలియదు. ఒకనాడు సో॥ శ్రీ రామరాజు కృష్ణమూర్తిగారు ఆత్మహత్యా ప్రయత్నంగా బలంగా కరెంటు తీగెల్ని పట్టుకున్నారు. ఆ క్షణంలో జిల్లెళ్ళమూడిలో ఉన్న అమ్మ బలంగా చేయి విదిలించి ప్రాణభిక్ష పెట్టింది, మరెప్పుడు అటువంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని ఆదేశించింది. అమ్మ సన్నిధిలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు.
అట్టి ఆప్తబాంధవి, జగదేకమాత, ప్రేమమూర్తి, అమ్మ అమోఘ ఆశీస్సులు మనందరిపై సదా వర్షించుగాక.
శ్రీరాజుబావగారి ‘అనుభవసారం’ పాటలను ఆయా సన్నివేశాల్లో సందర్భోచితంగా పాడుకుని అమ్మ అనుగ్రహ ప్రసాదాన్ని, ప్రసారాన్ని గ్రహించెదరు గాక! వీక్షించెదరుగాక !!