అమ్మ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లెళ్ళమూడి అమ్మ మాతృశ్రీ అనసూయా దేవి వ్రతములను ఊరూరా నిర్వహించడం, ఆ సందర్భంగా విచ్చేసిన భక్తులకు, అమ్మను గుర్తించిన అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం, తద్వారా అమ్మ తత్త్వమును ప్రచారం చేయడం అనే రీతిలో శ్రీ విశ్వజననీ పరిషత్ టెంపుల్స్ ట్రస్ట్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 8 నాడు, సత్తెనపల్లిలో శ్రీ ఫరేజీ ఋషీంద్రుల వారి ఆశ్రమ ఆవరణలో, శ్రీ వేదగాయత్రీమాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సామూహిక అనసూయా వ్రతములు ఎంతో వైభవోపేతంగా జరిగాయి.
ఈ కార్యక్రమ నిర్వహణకు శ్రీమతి బేబమ్మగారు వారి స్నేహితులు ఎంతగానో సహాయసహకారాలు అందించారు. శ్రీ విశ్వజననీ పరిషత్ టెంపుల్స్ ట్రస్టీలలో ఒకరైన శ్రీ చక్కా శ్రీమన్నారాయణ గారు, ఉభయ పరిషత్తుల సెక్రటరీ శ్రీ లక్కరాజు సత్యనారాయణ (లాలా), మాతృశ్రీ వేదపాఠశాల ప్రిన్సిపాల్ సందీప్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మ ఆచరణాత్మక ప్రబోధాన్ని ప్రేమ తత్త్వాన్ని స్థాపించిన సేవాసంస్థల్నీ వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో స్త్రీలు హాజరవ్వటమే కాకుండా, మూడు గంటలపాటు ఎటూ కదలకుండా శ్రద్ధా భక్తి సమన్వితంగా వ్రతమును, కుంకుమార్చనను నిర్వహించి, అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పాల్గొన్న సోదరీమణులందరికీ అమ్మ ప్రసాదము, అమ్మ ఫోటో, అమ్మ సంక్షిప్త చరిత్ర పుస్తకము అందచేశారు.