1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సద్యః ప్రసాదిన

సద్యః ప్రసాదిన

Mallapragada Srivalli
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 10
Month : July
Issue Number : 12
Year : 2011

“సాధకులను వెంటనే అనుగ్రహించే దేవి సద్యః ప్రసాదిని.

శ్రీ లలిత క్షిప్రప్రసాదిని. క్షిప్రం అంటే శీఘ్రం. ప్రసాదమంటే అనుగ్రహం. పరాశక్తిని ప్రార్థించినవారు వెంటనే అమ్మ అనుగ్రహాన్ని అందుకోగలరు” భారతీవ్యాఖ్య.

సద్యః, క్షిప్తం అనే పదాలకు “వెంటనే” అని అర్థం. శ్రీలలితాదేవిని ఆరాధించిన వారికి అమ్మ అనుగ్రహం వెంటనే లభిస్తుందని ఈ నామాలు తెలియజేస్తున్నాయి. మానవులమైన మనకు కోరికలు అనంతం. ఆ కోరికలు తీరడం కోసం మనం మనకు ఇష్టమైన దైవాన్ని ఆరాధిస్తూ ఉంటాం. కొందరు ఏడుకొండలవాడిని వేడుకుంటే, మరికొందరు కాశీ విశ్వేశ్వరుని ఆశ్రయిస్తారు. ఒకరు శ్రీరామచంద్రమూర్తిని శరణుకోరితే, ఇంకొకరు శ్రీకృష్ణపరమాత్మను నమ్ము కుంటారు. ఇలా ఎవరికి ఇష్టమైన దేవతను వారు తమ కోరికలను తీర్చమని ప్రార్థిస్తూ, ఆ దేవుళ్ళకు ముడుపులు చెల్లించుకుంటూ, తమ భక్తిని ప్రకటించుకుంటారు. అయితే, ముక్కోటి దేవతలకు అధిష్ఠానదేవత శ్రీ లలితాపరాభట్టారిక. ఆ శ్రీమాతను ఆశ్రయించామా, అమ్మ అనుగ్రహం వెంటనే లభిస్తుంది. అందువల్లనే శ్రీలలిత సద్యః ప్రసాదిని,

“అమ్మ” సద్యః ప్రసాదిని, క్షిప్రప్రసాదిని. “అమ్మ” సన్నిధిలోని సోదరీసోదరులందరికీ ఈ విషయం అనుభవంలోనిదే. ఎందరెందరికో వారు వాచ్యం చేయక పోయినా, వారి మనస్సులోని కోరికలను గ్రహించిన “అమ్మ” తన కృపాకటాక్ష వీక్షణాలతో, తన అమృత వాక్కులతో, తన దివ్యకరస్పర్శతో రకరకాలుగా వారిని అనుగ్రహించిన తీరు మనలను అబ్బురపరుస్తుంది.

సద్యః ప్రసాదినిగా “అమ్మ”ను దర్శించిన అదృష్ట వంతుడు శ్రీ శంకరం అన్నయ్య. అది 1968 సంవత్సరం జూన్ నెల రాత్రి 12 గంటల సమయం. 104 డిగ్రీల జ్వరంతో, ఒళ్ళునొప్పులతో, జ్వరతీవ్రతవల్ల కలుగుతున్న రకరకాల భయాలతో, భ్రమలతో శంకరం అన్నయ్య బాధపడుతున్నారు. అంత బాధలోనూ తన్ను కాపాడమని ముక్కోటిదేవతలను ప్రార్థిస్తున్నారు. అంతలోనే అన్నయ్య మనస్సు “అమ్మ” మీదకు మళ్ళింది. “అమ్మ” దేవుడని అందరం భావిస్తున్నాం కదా! ఈ విషయంలో ఎవరికైనా, ఏదైనా నిదర్శనం కనిపించిందా ? వారికి నిదర్శనం కనిపిస్తే తనకు మాత్రం ఎందుకు కనిపించదు? అని తలపోస్తూ, “ఈ బాధను భరించలేను తల్లీ! నాకు భయంగా ఉంది. నిజంగా నీవు దేవుడైతే అందరికీ నిదర్శనం ఇస్తున్నావన్నది నిజమైతే, తెల్లని చీరతో, చల్లని చిరునవ్వుతో వచ్చి, నా పక్కలో కూర్చుని నా ఒళ్ళు నిమరాలి. నాకు ఈ రాత్రి హాయిగా నిద్రపట్టాలి” – అని తన మనస్సులో ఏవేవో వరాలు కోరుకుంటున్నారు.

ఇంతలో చల్లని చేయి తలనిమరుతున్నట్లు అనిపించి, కళ్ళు తెరిచారు. ఎదురుగా తెల్లని చీరతో, మెల్లగా నవ్వుతూ “అమ్మ”. అతని మనను మూగపోయింది. నోటమాట రాలేదు”. “ఇది కలా, నిజమా, లేక నా భ్రమా?” అనుకుంటూ, “అమ్మ”ను తదేకంగా చూస్తున్నారు. “నాయనా, పిలిచావా” అంటూ, “నొప్పులుగా ఉన్నాయా నాన్నా” అంటూ, ఒళ్ళంతా మెత్తగా నిమరసాగింది “అమ్మ”. దాహంగా ఉంది అని అన్నయ్య. చెప్పేలోగానే “దాహంగా ఉన్నదా నాన్నా! మంచినీళ్ళు తెస్తానుండు” అంటూ బయలుదేరింది. ఎవరో తెచ్చిన మంచినీళ్ళు అన్నయ్యకు పట్టి, అతనికి తృప్తి కలిగేలా కాసేపు అతని పక్కమీద కూర్చుని వెళ్ళింది, సద్యప్రసాదిని – “అమ్మ”.

వరండాలో పడుకున్న “అమ్మ”, ఒకరాత్రివేళ లేచి, గబగబా మందిరంలోకి రావడం, అక్కడ జ్వరంతో బాధపడుతున్న అన్నయ్యను సేదతీర్చడం ఆశ్చర్యం. అన్నయ్య మనస్సులోని మాటను గ్రహించి వచ్చినట్లుగా ఉన్నది అమ్మరాక. సద్యఃప్రసాదిని అయిన “అమ్మ”, ఆ విధంగా అన్నయ్యకు శారీరక ఉపశాంతిని, మానసిక శాంతిని అనుగ్రహించింది.

“అమ్మ” క్షిప్రప్రసాదిని. అది 1978 ఆగష్టు 9వ తేది. ఆనాడు జిల్లెళ్ళమూడిలో “అమ్మ సన్నిధిలో మేడమీద రెండు వివాహాలు జరుగవలసి ఉన్నాయి. లగ్నసమయం మధ్యాహ్నం గం. 1-00 -2.00ల మధ్య. రెండు పెళ్ళిళ్ళకు సంబంధించిన బంధుబలగమంతా జిల్లెళ్ళమూడికి చేరుకున్నారు. కాని, వాయుగుండం కారణంగా 8వతేది అర్థరాత్రి నుంచే కుండపోతగా వాన. వర్షం కురుస్తుంటే మేడ మీద పెళ్ళిళ్ళు జరగడం కష్టం. క్రింద మందిరంలో వేదికపైన చేద్దామా అంటే “అమ్మ”కు ఆరోగ్యం బాగా లేనందున “అమ్మ” క్రిందకు దిగిరాలేదు. పెళ్ళివారికి “అమ్మ” సమక్షంలోనే పెళ్ళిళ్లు జరగాలని కోరిక. మధ్యాహ్నం గం. 12-00లకు కూడా ఎడతెరిపిలేకుండా ఒకటే వాన. అందరి మనస్సుల్లో ఆందోళన. ఆ జడివాన తెచ్చిన అలజడితో అందరూ ఏం చేయాలోపాలుబోక,  “అమ్మ” పై భారం వేసి, ఏం జరుగుతుందా అని ఎదురుచూస్తున్నారు. “అమ్మ” మాత్రం వీటితో సంబంధం లేకుండా వివాహవేదికపైకి రావడానికి సన్నద్ధమవుతోంది. ఆశ్చర్యం. వర్షపుధారలు చినుకులుగా, చినులుకు తుంపరగా మారి, ముహూర్తం సమయానికి వాన పూర్తిగా వెలిసింది. అందరి హృదయాల్లో ఆనందం వెల్లువ అయింది. క్షణాల్లో పెళ్ళికి ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. “అమ్మ” సమక్షంలో నిర్విఘ్నంగా, దిగ్విజయంగా అనుకున్న సమయానికి పెళ్ళిళ్ళు, భోజనాలు కూడా పూర్తి అయ్యాయి. అంతే, మళ్ళీ తిరిగి వర్షం ప్రారంభమైంది. క్షిప్రప్రసాదిని అయిన “అమ్మ” అనుగ్రహంవల్లనే ముహూర్త సమయంలో మాత్రం, వరుణదేవుడు ఆ రెండు జంటలపై తన కరుణామృతవృష్టిని కురిపించి, తాను కనుమరుగైనాడు.

అర్కపురిలో వెలసిన అనసూయామాతను సద్యః ప్రసాదినిగా, క్షిప్రప్రసాదినిగా దర్శించి, సేవించడం కంటే ఈ జీవితానికి తరణోపాయం మరేముంటుంది ?

(కీ॥శే॥ కొండముది రామకృష్ణ అన్నయ్య, కీ॥శే॥భవానీకుమారిలకు కృతజ్ఞతలతో)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!