అధ్యాత్మకు మతం లేదు. మతానికి అధ్యాత్మ ఉండాలి. మతం అంటే మార్గమే! జీవితాన్ని పండించుకోవడానికి, ఉన్నంత కాలమూ హాయిగా, శాంతిగా ఉండటానికి ఏర్పడిన రాజమార్గమే మతం. మతానికి నమ్మకం పునాది. మతంలో దాగిన రసయోగం.. ప్రేమ. ఆ విధంగా ధర్మం విశ్వజనీనం, సార్వకాలికం, మతాతీతం. ఎవరు ఏ మార్గంలో పయనించినా లక్ష్యం, గమ్యాలలో తేడా లేదు. సన్మార్గాన్ని మించిన మతం లేదు. ఏది స్వార్థ రహితమో, ఏది సమాజ హితమో, ఏది అవ్యాజ ప్రేమను నిష్పాక్షికంగా పంచే స్వభావాన్ని పెంచుతుందో, ఏది సమతా వాదంగా ప్రపంచాన్ని నడిపిస్తుందో అదే మతం. అది సర్వ సమ్మతం. సర్వమతాల మధ్య సమన్వయం శ్రేయోమార్గం. అదే జిల్లెళ్లమూడి అమ్మ సమస్త మానవాళికీ అనుగ్రహించిన రుజుమార్గం.
మతం మౌఢ్యం కాకూడదు. మతం కారణంగా ప్రపంచం విడిపోకూడదు. కానీ, చరిత్రగతి కేవలం ఆదర్శాలను అనుసరించి సాగదు. అవసరాలు చరిత్రను ప్రభావితం చేస్తాయి. అవసరాలు దురాశ వైపు నడిపిస్తున్నప్పుడు, దుర్దశ ఏర్పడుతున్నప్పుడు, మహాత్ములు మానవజాతిని సన్మార్గంలో నడిపించి, జగత్తును మరమ్మతు చేస్తారు. మానవతే అసలు మతమని, మానవుడి ఆకలి, నిద్ర, మైథునాలు మత విషయాలు కావని, సహజ అవసరాలని తేల్చి చెప్పే ప్రవక్తలు వస్తారు. బోధిస్తారు. ఇతరులకు చెప్పేముందు, తాము జీవించి, తమ బోధనలకు ప్రామాణికతను కల్పిస్తారు. అటువంటివారు ప్రాజ్ఞులు కాబట్టి కుల, మత, వర్గ, వర్ణ భేదం లేకుండా అందరినీ అక్కున చేర్చుకుంటారు. ఆ ఆదరణ వెనుక ఉండే ఒకే ఒక పరమార్ధం. మనిషిని మనిషిగా జీవించమనే సత్యబోధ!
మతాల మధ్య స్పర్థలేదు. సంఘర్షణ, విభేదం అంతా మతామయాయుల మధ్యే. ఈ పరిస్థితిని చక్కదిద్ది సరిదిద్ది, తీర్చిదిద్దే… విశ్వప్రణాళికలో, అవనిపై జరిగిన ప్రభావమే…. జిల్లెళ్లమూడి అమ్మ! ఆకలి తీర్చుకోవటానికి అన్నం తినాలి. పరిమితంగా తినాలి. అపరిమితం అయినపుడు అంతా అనర్ధమే. మతమూ అంతే! సంస్కారాన్ని పెంచుకోవటానికి, మానవ ధర్మంతో జీవించటానికి మతం అవసరం. మానవ జీవితం కాగితం అయితే, మతం ఒక పేపర్ వెయిట్ లాంటిది. అటూఇటూ చెదరకుండా మనసును సక్రమంగా, క్రమంగా అంటే అందంగా నడిపించే శక్తి మతానికి ఉన్నది. సత్యం ఒకటే! మహాత్ములు దానిని భిన్నకోణాలలో ఆవిష్కరిస్తారు. ఎవరెన్ని విధాల బోధించినా, బోధిస్తున్నా వారి లక్ష్యం ఒకటే!
అమ్మ ఉన్న సమయంలో జిల్లెళ్లమూడి అనే ఒక కుగ్రామం మహా సంస్కరణకు వేదిక అయింది. ఒక శతాబ్దం క్రితం ఉన్న సమాజస్థితులను గమనిస్తే, అమ్మ సంకల్పించిన కార్యక్రమం సాహసోపేతం. ఏ పరిస్థితీ అనుకూలం కాదు. అన్ని అననుకూలాల మధ్య సమతా సముద్ధరణకు శ్రీకారం చుట్టింది అమ్మ. ఆకలి మతాతీతమైన అవసరం. ముందు ఆకలి తీర్చగలిగితే, ఆలోచనలు సక్రమంగా ఉంటాయన్న భావమే దాని వెనుక ఉన్నది. మానవశక్తిని సంఘటితం చేసే ముందు, మనిషిని సంస్కరించాలి. సంస్కరణకు ఎంత సమయం పట్టిందని కాక, ఆ తరుణం వస్తే అన్నీ సర్దుకుని, జరగవలసినవన్నీ జరగవలసిన తీరులో జరిగి తీరుతాయి.
ఎంత సంపద ఉన్నా, ఎంత కీర్తి గడించినా, ఎన్నెన్ని విజయాలు సొంతం చేసుకున్నా, మనిషికి కావలసింది ప్రేమ. ప్రేమరాహిత్యం అన్ని అనర్థాలకు మూలం. అహం వదులుకోగలిగితే, ప్రేమ అనుభవం అవుతుంది. ప్రేమానుభూతిలో అరిషడ్వర్గాలు నెమ్మదిస్తాయి. మానవత్వం మేల్కొంటుంది. అంతరంగ శుద్ధి జరుగుతుంది. పరివర్తన సహజ ప్రక్రియగా సాగుతుంది.
వ్యక్తి ఆరాధన నుంచి వ్యక్తిత్వ ఆరాధన మొదలవుతుంది. ఆచరణీయ, అనుసరణీయ మార్గం తెరుచుకుంటుంది. ఆ ప్రయాణం ఎవరికీ ఇబ్బంది కలిగించని రీతిలో సాగి, పరమచరమ లక్ష్యమైన ఆత్మవిచారం వైపు కదులుతుంటుంది. అందువల్లనే తర్క వితర్కాలకు, వితండవాదాలకు తావులేని విధంగా జిల్లెళ్లమూడి అనే గ్రామాన్ని మానవతా భూమికగా తీర్చిదిద్ది, నూతన వేదికగా మలచింది అమ్మ. అక్కడ స్పర్ధలు, వివాదాలకు అతీతంగా స్త్రీలందరూ అక్కలుగా, పురుషులందరూ అన్నలుగా మెలిగే తీరు అసామాన్యం. అది అమ్మ సంకల్పించిన మతం. అతలాకుతలం అవుతున్న మానవజాతికి అమ్మవేసిన చలువపందిరి జిల్లెళ్లమూడి. ఆమె చూపింది కొత్త మతమూ, మార్గమూ కాదు. కుంచించుకుపోతున్న దారిని విశాలం చేసి, సన్మార్గ పథ నిర్దేశం చేసిన సంస్కారిణి అమ్మ.!
పరివర్తన వేదిక
మంచి మార్గంలో ప్రపంచం నడవటం. ఈ దిశగా అమ్మ, తన అవనీ సంచార సమయంలో సాధించిన విశేషం ఇదే! పాపాత్ముడు, పుణ్యాత్ముడు అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. పరిస్థితులే మంచి, చెడులుగా అనుభవంలోకి వస్తాయి. వర్గం, వర్ణం, కులం ఎవరూ ఎంచుకునే విషయాలు కావు. అందరిలో ఉన్న మానవత్వాన్ని మేల్కొలిపి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా, శక్తిగా తయారుచేయడం అవసరం. అందుకే అమ్మ దగ్గరికి వచ్చినవారు పొందేది అన్నం మాత్రమే కాదు. అన్నం ద్వారా పొందే సహజ ప్రేమ, ఆంతరంగిక పరివర్తన కారణంగా మానసిక స్థాయిలో ఒక విశాలత్వం, సరళత్వం అందుకున్న ప్రతి వ్యక్తీ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటాడు.