సర్వ సిద్ధాంతమంటే అనేక సిద్ధాంతాల కదంబం కాదు. ‘సర్వ’ అంటే కర్త: ఆయనే ఈశ్వరుడు. సృష్టి, స్థితి, లయలు కర్తకున్న విధులు. అవి కాలబద్ధం. ఏ ఒక్కరి యందు పక్షపాత మెరుగని సైద్ధాంతిక భూమికలు. కర్త, తాను సృష్టించిన సృష్టినంతటినీ ఋతువు వెంట ఋతువునూ, క్షణం వెంట క్షణాన్నీ నడిపించటం ఒక సిద్ధాంతం. పైకి పరస్పర విరుద్ధంగా తోచినా, నడుస్తున్నదంతా ఒక పద్ధతి ప్రకారం నడుస్తూనే వుంది, అదీ స్వధర్మంగా, స్వభావంగా, సగుణాత్మకంగా. దాని గమనం దానిది. కాకపోతే మనమనుకున్నట్లుగా కాదు. అసమానత, వైరుధ్యం, అసమగ్రత దాని లక్షణాలు. సుఖదుఃఖాలు, చీకటి వెలుగులు, ఆశనిరాశలు, ఎత్తుపల్లాలు, జనన మరణాలు సృష్టిలో వున్న, సృష్టిని నడిపిస్తున్నట్లున్న, పైకి కనిపిస్తున్న సిద్ధాంతమంతా కర్తవ్య నిర్వహణకు మూలకందం.
ఇంతకీ అమ్మ సిద్ధాంతమేమిటి? అన్నంపెట్టి పంపటమేనా? ఆకలి తీర్చటమేనా? ఆపై యింకేమీ లేదా?
“ఏ ఒక్క వ్యక్తయినా ఆకలితో అలమటిస్తుంటే, కన్నీరు ఆగదు నాన్నా! ” అన్న అమ్మ ఆవేదనలో మనిషి భాగం కాగలిగితే, ఆకలికి ఈ లోకంలో చోటుండదు.
ప్రపంచమంతా అన్నదానం చేస్తున్నపుడు, అమ్మ అందరికీ అన్నం పెట్టుకున్నది, తల్లిప్రేమను, ముద్దలుగా!
అన్న మెరుగని వ్యక్తి, అన్యమెరిగే ప్రయత్నం చేయడు.
కడుపు నిండిన వ్యక్తి, అంతవరకు తనకు అనుభవంలోకి రాని సంగతులను కనుక్కునే ప్రయత్నం చేస్తాడు.
ఇతరుల పట్ల మమతానురాగాలను పెంచుకుంటాడు. జీవితాన్ని ప్రేమించటం మొదలు పెడతాడు. సమాజం పట్ల అప్పటివరకూ పెంచుకున్న పగ, ద్వేషం, నిర్లక్ష్యం తొలగి సామరస్య ధోరణిని అలవాటు చేసుకుంటాడు. ఆలోచనలన్నీ ఒక సిద్ధాంత భూమికలో ఒదిగి, తనలోని మానవత్వ పరిమళాన్ని అనుభవించటం ఆరంభించి, క్రమంగా మామూలు మనిషివలె ప్రవర్తించటం ప్రారంభిస్తాడు. జీవించటం హక్కుగా, యితరుల కోసమూ జీవించగలగటం బాధ్యతగా, సంఘనీతిగా మలుచుకుంటాడు. అంతవరకు అనుభవంలోకి రాని పాపభీతి మనసును తాకుతుండగా, జీవిత చక్రంలో యిమిడిన మంచిని చూడటం, మంచిగా మసలటం మొదలు పెడతాడు. అసంతృప్తి అంతరించి, మనసును, తృప్తి నడిపిస్తుండగా తనకు తెలియకుండానే దైవం వైపు నడక సాగిస్తాడు. ఇక, ఆపై జరిగేదంతా సహజ జీవయాత్రే! అమ్మ సాధించింది యిదే!
సమతా సిద్ధాంతం, సర్వ సమ్మత మార్గం. అప్పటికే సాధనామార్గంలో ఒక స్థితినందుకున్న వ్యక్తి అమ్మ దగ్గరకు వచ్చినపుడు, ఆ వ్యక్తికి అమ్మ అందించినదేమి? సాధనను తీవ్రతరం చేసుకోవటానికో, సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటానికో, సరళమార్గం నిర్దేశనం చెయ్యటం, ఆ విధంగా సాధన స్థితి వడివడిగా అనుభవ సిద్ధం చేయటం, అమ్మ అందించిన అనుగ్రహం. అంతటి మహత్తర స్థితినందుకున్న వారికి అమ్మ యిచ్చిన సాధనోపదేశం ఒక్కటే! సాక్షీభూతంగా వుండగలిగిన స్థితి!
ఒక మహా పండితుడితో ‘సాహిత్యంతో రాహిత్యం రాదు’ అని అంటూ ‘రాహిత్యంలోంచి పుట్టిందే అసలు సాహిత్యం’ అని పరిష్కారం చూపిస్తుంది.
ఒక తార్కికుడు “అంతా భగవంతుడే చేస్తే, చేయటానికి మనకేం లేదా?” అని ప్రశ్నించినపుడు “నువు చేయాలనుకున్నది చేయవేమో కానీ, చేయవలసినది చేస్తూనే వున్నావుగా. ఇక చేయక పోవటమంటూ ఎక్కడుంది?” అన్నది అమ్మ.
సాధారణ వ్యక్తులనుద్దేశించి “సాధ్యమైనవన్నీ సాధనలే. చేయవలసిన అన్ని అవకాశాలను సద్వినియోగపరచుకోవటమూ సాధనే. ఇదీ అధ్యాత్మ సాధనే ” అని మార్గం సుగమం చేస్తుంది.
ఒక హేతువాది “మనిషికి సంకల్పాలు లేవా?” అని అడిగినపుడు “ఎందుకు లేవు; వికల్పాలూ వున్నయ్. సంకల్పాలు వున్నవనుకున్నంత కాలం అవీ బంధనలే. బంధన వున్నపుడు బాధ అనివార్యం. ఎవరిదో సంకల్పం అనుకున్నపుడు ఆతృతలేదు. యాతనా లేదు” అని సమన్వయం చేసి సమాధానపరుస్తుంది.
“లింగ, రూప, స్పర్శా భావం లేకపోవటమే బ్రహ్మచర్యం, ఆత్మ భావనలో నిలకడ చెందటం బ్రహ్మచర్యం, మనసును క్షాళన చేసుకోవటమే బ్రహ్మచర్యం” అంటూ సిద్ధాంతీకరిస్తుంది. “మనోబలమే ధైర్యం. శరీరపరంగా బలమే ధైర్యం.”
“కావాలనుకోవటమే కోరిక కాదు. వద్దనుకోవటమూ కోరికే.”
“మనిషికి సుఖపడటమే తెలుసు. ఎవరూ, మరొకరిని ఎప్పటికీ సుఖపెట్టలేరు.”
మానవత్వాన్ని మించిన సిద్ధాంతం లేదు.
మమతను మించిన సుందర భావన లేదు.
సహనాన్ని మించిన బలం లేదు.
శాంతిని మించిన సుఖం లేదు.
తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు.
ప్రేమను మించిన దైవం లేదు.
ఉండవలసినదంతా యిక్కడే ఉంది.
మనిషి మనిషిగా బతకటమే జీవితం!
అమ్మ అన్నదీ యిదే! ఆచరించిందీ యిదే!!