సమానత్వం అంటే అమ్మ నిర్వచనం విశిష్టంగా వుంటుంది. “ఎవరికి ఏది, ఎంత సరిపోతుందో అది ఇవ్వటం సమానత్వం గాని, ఒకే రకంగా పంచి పెట్టటం కాదు” అంటుంది. శరన్నవరాత్రులలో జిల్లెళ్ళమూడిలో త్రికాల పూజలు జరగటం సాధారణం. ఆ తొమ్మిది రోజులూ చాలామంది సోదరీ సోదరులు నియమ నిష్ఠలతో పూజలలో పాల్గొంటారు. రోజుల్లో ముఖ్యంగా జన్నాభట్ల వీరభద్ర శాస్త్రి, నేను, ధర్మసూరి, రామకృష్ణ ఆ మొదలైన వారమంతా తంగిరాల కేశవశర్మ అన్నయ్య, రాచర్ల లక్ష్మీనారాయణ అన్నయ్యల నేతృత్వంలో, వారి మార్గదర్శకత్వంలో వారిని ఆదర్శంగా తీసుకుంటూ పూజా కార్యక్రమాల్లో పాల్గొనటం జరుగుతూ వుండేది. నా మటుకు నాకు ఇప్పటికీ వారే ఆదర్శం.
ఆ నియమ నిష్ఠలతోపాటు వారు ఏకభుక్తంగా, పగలంతా కఠిన ఉపవాసం చేస్తూ, రాత్రి మూడవ పూజ అయిపోయిన తరువాత మాత్రమే భోజనం చేసేవారు. మేమందరం కూడా ఆవిధంగానే వారిని అనుసరిస్తూ వుండేవారం. ముందు ఒకటి రెండు రోజులు కష్టం అనిపించినా తరువాత అలవాటయిపోయేది. ఒకరోజు మధ్యాహ్నం పూజ అయిపోగానే అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మ నన్ను నిశితంగా చూస్తూ “వాళ్ళు ఉంటే వుంటారు. నువ్వు ఉపవాసం ఉండవద్దు. హాయిగా తిని, పూజ చేసుకో! తెలిసిందా?” అని వాత్సల్యపూరితంగా, ఒకింత ఆజ్ఞాపూర్వకంగా, విస్పష్టంగా చెప్పింది అపురూప ప్రేమస్వరూపిణి అమ్మ.